ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం,,,, ఓటు నమోదు అవగాహన సదస్సులో స్వీప్ అధికారులు

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం

ఓటు నమోదు అవగాహన సదస్సులో స్వీప్ అధికారులు 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన దేశపౌరులందరికీ కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష భేదం లేకుండా కల్పించిన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకొని మెరుగైన సమాజం కోసం యువత కృషి చేయాలని జిహెచ్ఎంసి చార్మినార్, మలక్ పేట్ స్వీప్ (సిస్టమాటిక్ వోటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) నోడల్ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, రామచందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ సిటీ కళాశాల సోషల్ సైన్సెస్ విభాగాలు ఓటు నమోదు, వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని, భారత ఎలక్షన్ కమిషన్ ఇటీవల సాంకేతికతను వినియోగించి స్కానర్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా ఓటు హక్కును ఎలా నమోదు చేసుకోవచ్చో వివరించారు. ఓటు హక్కు అవగాహన, నమోదు కోసం ప్రతి కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులతో ఒక క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైస్ ప్రిన్సిపాల్ డా.ఐజాజ్ సుల్తానా మాట్లాడుతూ


రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు వలననే ప్రజాస్వామ్యపాలన ఏర్పడిందని, ఆ హక్కును ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా ఉపయోగించుకోవాలని అన్నారు. మనం ఎన్నుకునే నాయకులను బట్టి మన భవిష్యత్తు బాగోగులు ఉంటాయని, అందువలన విద్యార్థులు ప్రజాస్వామ్య పరిరక్షణ చోదకులు కావాలని అన్నారు. ప్రతి కుటుంబంలోని వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందని అన్నారు. డా.ఏ.శంకర్ కుమార్,  డా.కృష్ణవేణి నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా.రత్న ప్రభాకర్, డా.భాస్కర్, లతారాణి, పి.శాంతి, డా.తిరుపతి, డా.ఝాన్సీరాణి, డా.జయా కాగడా, డా.రవికుమార్, ఎన్ సిసి కాడెట్లు, ఎన్ఎస్ఎస్ వలంటీర్స్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: