పట్టాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ గృహాలు నిర్మించుకోవాలి

నంద్యాల ఎంపీ,ఎమ్మెల్యే,జాయింట్ కలెక్టర్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు పొందిన ప్రతి ఒక్కరు గృహాలు నిర్మించుకుని సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే,జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి లబ్ధిదారులకు సూచించారు. కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాలులో పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి,నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తోందని, ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలోని నూనెపల్లి, హరిజనవాడ, విజయపురి కాలనీ, మూలసాగరం, షాదిక్ నగర్ తదితర ప్రాంతాల్లోని అర్హులైన 255 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామని, పట్టాలు పొందిన ప్రతి ఒక్కరూ గృహాలు నిర్మించుకొని తన సొంత ఇంటికల సాకారం చేసుకోవాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బొమ్మల సత్రం నుండి నూనెపల్లె వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేసి పంపిణీ చేస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించి ఏవైనా సమస్యలు తలెత్తితే గృహ నిర్మాణ శాఖ,మున్సిపల్ అధికారులను సంప్రదించి పూర్తి చేసుకోవాలని, కొత్త ఇంటిని నిర్మించుకొని కొత్త జీవితం ప్రారంభించాలని, పిల్లలందరినీ బాగా చదివించి పేదరికం నుండి బయట పడాలని,


ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు నేడు,అమ్మబడి తదితర సంక్షేమ కార్యక్రమాల ఫలాల లబ్ధిని సద్వినియోగం చేసుకోవాలని, నంద్యాల జిల్లా అయిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతోందని కొత్త కొత్త పరిశ్రమలు కూడా జిల్లాలో నెలకొల్పడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని జెసి వివరించారు. నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల నిరంతర సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తోందని, ఇందులో భాగంగానే అర్హులైన ప్రతి పేదవాని సొంత ఇంటికల నెరవేర్చాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ఇంటిపట్టాతో పాటు గృహాన్ని కూడా నిర్మించి ఇస్తోందని, పట్టాలు పొందిన ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకోవడంతో పాటు పిల్లలను కూడా బాగా చదివించి ఉన్నత స్థాయిలో జీవించాలని ఆకాంక్షించారు.నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంతో పాటు నివసించే కాలనీకి జగనన్న కాలనీ అని నామకరణం చేస్తున్నామని, పేదలు నిర్మించుకునే ప్రతి ఇంటికి ప్రభుత్వము 1,80,000  రూపాయలు ఉచితంగా అందజేస్తుందని, కాలనీలో త్రాగునీటి వసతి,డ్రైనేజీ కాలువలు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు అన్నిటిని సమకూరుస్తున్నామని, పొదుపు లక్ష్మి సభ్యులు ఉంటే వారికి కూడా అదనంగా మరో 35,000 రూపాయల రుణం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపిన అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, రాష్ట్ర హస్త కళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, బెస్త సంఘం రాష్ట్ర డైరెక్టర్ చంద్రశేఖర్,మున్సిపల్ వైస్ చైర్మన్ పాము షావలి, కౌన్సిలర్ అనురాధ, వైసిపి నాయకులు అనిల్ అమృతరాజు, కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: