బైక్‌ ఇంజన్ లో దూరిన పాము,,మెకానిక్ షాక్

బైక్‌ ఇంజన్ లో దూరిన పాము,,మెకానిక్ షాక్


సాధారణంగా బైకులు, కార్లు రాత్రి సమయాల్లో ఇంటి ముందు లేదా ఖాళీ స్థలాల్లో పార్క్ చేస్తూ ఉంటాం. ఉదయాన్నే పార్క్ చేసిన వెహికల్స్ వద్దకు వెళ్లి వాటిని స్టార్ట్ చేసి మన పనులకు వెళ్లిపోతుంటాం. కానీ రాత్రి సమయాల్లో లేదా ఎక్కువ సేపు ఒకే చోట వాహనాలు పార్క్ చేసిన వాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. అలా పార్క్ చేసిన వాహనాల్లకి పాములు, తేళ్లు వంటి విషపూరిత జీవులు దూరే ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంటుంది. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు.

తాజాగా.. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్‌లో ఇలాగే ఓ పాము కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. రైతు లింగన్న రాత్రి తన ఇంటి మందు బైక్‌ను పార్క్ చేశాడు. ఉదయం పొలం పనులకు వెళ్లేందుకు బండి స్టార్ట్ చేయగా.. అది స్టార్ట్ అవ్వలేదు. చాలాసేపు ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. పెట్రోల్ చెక్ చేయగా.. ట్యాంక్ ఫుల్‌గా ఉంది. ఇక లాభం లేదనుకున్న రైతు తన బండిని నడిపించుకుంటూ మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు.

బండిని మిడిల్ స్టాండ్ వేసిన మెకానిక్.. కిక్ కొట్టి చూడగా బైక్ స్టార్ట్ అవ్వలేదు. తన వద్ద ఉన్న రించ్‌లతో బైక్ పార్టులు ఒక్కొక్కటిగా ఊడదీస్తు్న్నాడు. ఇంతలో అతడికి షాకింగ్ సీన్ కనబడింది. అందులో ఓ నాగు పాము దూరగా.. అది చూసిన మెకానిక్, రైతు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఎయిర్ ఫిల్టర్ లోపల పాము చుట్టచుట్టుకొని పడుకొని ఉంది. బైక్‌లో దూరిన పామును సుమారు గంటపాటు శ్రమించి బయటకు తీశారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఇంటి ఆవరణలో లేదా ఖాళీ స్థలాలలో వాహనాలు పార్క్ చేసేవాళ్లు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఇది వర్షాకాలం కాబట్టి పాములు, విషపూరిత జీవులు వాహనాల్లోకి దూరే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వాహనాలు స్టార్ట్ చేసే ముందు చెక్ చేసుకొని ప్రయాణాలు మెుదలు పెడితే మంచిది. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: