కోమటిరెడ్డికి కీలక పదవి,,,బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియామకం


తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అగ్రనాయకత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో విజయం సాధించటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేయగా.. ఆయన్ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక కొత్త సారథిగా కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికి మూడోసారి పగ్గాలు అప్పగించారు. ఇప్పటికే ఆయన రెండు పర్యాయాలు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఈటల రాజేందర్‌కు కూడా బీజేపీ అదిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. తాజాగా మరో అసంతృప్త నేత కోటమిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా బీజేపీ కీలక పదవిని కట్టబెట్టింది. ఆయన్ను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ.. అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. నిన్న పొంగులేటితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కాగా.. ఆ మరుసటి రోజే ఆయనకు కీలక పదవి దక్కటం గమనార్హం.

కాంగ్రెస్ తరపున మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతేడాది చివర్లో ఆ పార్టీకి, తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆయనపై అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే బీజేపీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కటం లేదని.. రాష్ట్ర అధ్యక్షుడి బండి సంజయ్ ఒంటెద్దు పోకడలకు వెళ్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

కోమటిరెడ్డితో పాటు ఈటల రాజేందర్ కూడా అసంతృప్తికిలోను కాగా.. 15 రోజుల క్రితం హైకమాండ్ వీరిద్దరిని ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడింది. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై చర్చించి.. సరైన స్థానం కల్పిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇంతలోనే మంగళవారం రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో పాటు ఈటలకు కీలక పదవిని కట్టబెట్టారు. అయితే కోమటిరెడ్డికి మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఆ వెంటనే రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు భేటీ కావటం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంతకు ముందే పార్టీ వీడిన వారు తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆహ్వానించిన నేపథ్యంలో కోమటిరెడ్డి సైతం సొంత గూటికి వస్తున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఈ పరిణామాలతో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం కోటమిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాలని భావించినట్లు తెలిసింది. అందులో భాగంగా ఆయన్ను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి జి. వివేక్, విజయశాంతి కార్యవర్గంలో ఉండగా.. తాజాగా కోమటిరెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యాడు. ఇక తన అసంతృప్తి బాహాటంగా వెళ్లగక్కిన మరో ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఎలాంటి పదవి కట్టబెడతారో వేచి చూడాలి మరి.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: