తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్ మూర్తి దంపతుల బంగారు కానుక

 తిరుమల శ్రీవారిని దర్శంచుకొన్న ఇన్ఫోసిస్ మూర్తి దంపతులు

బంగారు  కానుక అందజేత


ఇన్ఫోసిస్ వ్యవస్థాపక ఛైర్మన్ నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. వేంకటేశ్వర స్వామికి బంగారు ఆభరణాలు కానుకగా అందించారు. బంగారు తాబేలు, బంగారు శంకును కానుకగా ఇచ్చారు. గత 70 ఏళ్లుగా తిరుమల కొండకు వస్తున్నానని సుధామూర్తి తెలిపారు.

ఇన్ఫోసిస్ వ్యవస్థాపక ఛైర్మన్ నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతులు.. తిరుమల శ్రీవారికి బంగారు ఆభరణాలు కానుకగా అందజేశారు. తిరుమల క్షేత్రానికి వచ్చిన మూర్తి దంపతులు ఆదివారం (జూలై 16) ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో బంగారు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి బంగారు ఆభరణాలను అందజేశారు. బంగారు తాబేలు, బంగారు శంఖువుని శ్రీవారికి కానుకగా అందజేశారు. వీటిని ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలుస్తోంది. దర్శనం అనంతరం తిరుమల వేద పండితులు.. వారికి వేద ఆశీర్వాదం అందించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి శేషవస్త్రంతో మూర్తి దంపతులను సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని బహుకరించారు.

తిరుమల వేంకటేశ్వర స్వామిని సుధామూర్తి ఇష్టదైవంగా భావిస్తారు. ఏటా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. 70 ఏళ్లుగా తిరుమల కొండకు వస్తున్నానని సుధామూర్తి తెలిపారు. తొలిసారి తాను 1953లో తిరుమల కొండకు వచ్చానని ఆమె చెప్పారు. కోరుకున్న కోరికలు తీరడంతో అందరి భక్తుల మాదిరిగానే ఏటా శ్రీవారి దర్శనానికి వస్తున్నానని ఆమె చెప్పారు. పవిత్రమైన తిరుమల కొండకు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని నారాయణమూర్తి అన్నారు.

శ్రీవారికి కానుకగా మూర్తి దంపతులు అందించిన బంగారు ఆభరణాల విలువ ఎంతో తెలియాల్సి ఉంది. ఆ ఆభరణాల గురించి ప్రశ్నించగా.. సుధామూర్తి స్పందించేందుకు నిరాకరించారు. ‘ఆ ఆభరణాలను స్వామి వారికి కానుకగా ఇచ్చేశాం. ఇక వాటి గురించి మాట్లాడకూడదు’ అంటూ ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారు. సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే సుధామూర్తి.. ప్రస్తుతం టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యురాలిగానూ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

మూర్తి దంపతుల వెంట కొంత మంది బంధువులు ఉన్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన మూర్తి దంపతులను చూసి కొంత మంది భక్తులు నమస్కారం పెట్టి పలుకరించారు. టీటీడీ సిబ్బందిని సుధామూర్తి ఆప్యాయంగా పలుకరించారు. కొంత మంది భక్తులు మూర్తి దంపతులతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. సుధామూర్తి వారికి ఓపికగా సెల్ఫీలు ఇచ్చారు. ఓ చిన్నారిని దగ్గరికి తీసుకొని ముద్దాడారు. త్వరగా వెళ్లిపోతున్న నారాయణమూర్తిని కూడా పిలిచి సెల్ఫీలకు ఫోజిలివ్వడం వివేషం.




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: