కిషన్ రెడ్డితో కలిసి పనిచేస్తా: ఈటల రాజేందర్

బీజేపీ వ్యవస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ బీజేపీలోనూ నూతన నియామకాలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. తన నియామకం పట్ల ఈటల రాజేందర్ స్పందించారు. 

బీజేపీ జాతీయ నాయకత్వం తనకు అప్పగించిన నూతన బాధ్యతలను సంపూర్ణంగా, చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. 

తెలంగాణ అంతరంగం, సమస్యలు తెలిసిన వాడిని... కేసీఆర్ బలం, బలహీనతలు తెలిసిన వాడిని అని ఈటల స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కిషన్ రెడ్డితో కలిసి పనిచేస్తానని చెప్పారు.  కిషన్ రెడ్డి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బీజేపీ చీఫ్ గా వ్యవహరించారని తెలిపారు. 

కేసీఆర్ ను ఓడించడం ఒక్క బీజేపీతోనే సాధ్యమని ఈటల ఉద్ఘాటించారు. కేసీఆర్ అహంకారాన్ని మట్టికరిపించేది బీజేపీయేనని తెలిపారు. బండి సంజయ్ నాయకత్వంలో నాలుగు ఎన్నికల్లో గెలిచామని ఈటల వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోరు అనే స్థాయికి తీసుకువచ్చామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ ఎన్నికలోనూ గెలవలేదని వెల్లడించారు. 

తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే ఒక కుటుంబానికి మాత్రమే లాభదాయకం అని, బీజేపీ గెలిస్తే ప్రజలకే లాభం అని అన్నారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: