తెలంగాణ సమాజ కాంగ్రెస్ పేరుతో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు,,,ప్రకటించిన కేంద్ర మాజీ మంత్రి తనయుడు

 తెలంగాణ సమాజ కాంగ్రెస్ పేరుతో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే గద్దర్ కొత్తపార్టీపై ప్రకటన కూడా చేశారు. గద్దర్ ప్రజా పార్టీ పేరుతో పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు సైతం చేసుకున్నారు. ఇదిలా ఉండగానే తెలంగాణ రాజకీయల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది.

కేంద్ర మాజీ మంత్రి పి. శివశంకర్ తనయుడు డాక్టర్ వినయ్ కుమార్ కొత్త పార్టీని ప్రకటించారు. 'తెలంగాణ సమాజ కాంగ్రెస్' పేరుతో సొంత రాజకీయ పార్టీని స్థాపించారు. శుక్రవారం (జులై 14న) సికింద్రాబాద్‌లోని సిక్కువిలేజ్‌ రాజరాజేశ్వర గార్డెన్స్‌లో పార్టీని ప్రకటించారు. తెలంగాణలోని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తమ పార్టీ అజెండా అని వినయ్ కుమార్ వెల్లడించారు. గత ఎన్నికలకు ముందే తాన పార్టీని ప్రారంభించాలనుకున్నానని.. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ఆకస్మిక నిర్ణయం తీసుకోవటంతో పార్టీ ఏర్పాట్లు ఆలస్యమైందని చెప్పారు.

తమ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం భారత ఎన్నికల కమిషన్‌కు తాము నాలుగు పేర్లను ఇవ్వగా.. చివరకు 'తెలంగాణ సమాజ కాంగ్రెస్' పేరుతో రాజకీయ పార్టీకి ఆమోదం లభించిందని వినయ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో 50 శాతం కంటే ఎక్కువ జనాభా ఉన్న బలహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ వెనకబడిపోయానని చెప్పారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వృద్ధిని సాధించలేకపోతున్నాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో వెనుకబడిన వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాయని.. స్వరాష్ట్రంలో బీసీలు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రస్తుత ముఖ్యమంత్రిని బిక్ష కోరటం కంటే తామే రాజ్యాధికారం సాధించాలనే ఉద్దేశ్యంతో పార్టీ పెట్టినట్లు వినయ్ కుమార్ తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరాలని తనకు చాలా మంది సూచించారని.. కేసీఆర్‌తో చేతులు కలపటం కంటే తల నరికేసుకోవటం ఉత్తమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. మన ఆత్మగౌరవాన్ని మనమే కాపాడుకోవాలని.. ఒకరి చేతుల్లో బానిసల్లా బతకాల్సిన అవసరం లేదని వినయ్ కుమార్ అన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయానని.. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి స్వలాభం కోసం పని చేస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు, వెనకబడిన తరగతులు ఐక్యం కావటం ఖాయమని తామే అధికారాన్ని చేపట్టబోతున్నట్లు డాక్టర్ వినయ్ కుమార్ వెల్లడించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: