తలలో దిగిన మేకును బయటికి తీసిన డాక్టర్లు,,,అరుదైన ఆపరేషన్ చేసిన ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు

 తలలో దిగిన మేకును బయటికి తీసిన డాక్టర్లు


రోజు రోజుకూ పెరుగుతున్న టెక్నాలజీ వినియోగం అన్ని రంగాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వైద్య రంగంలో ఎన్నో కొత్త కొత్త ఆపరేషన్లు చేయడానికి తోడ్పడుతోంది. ఇంకా మరెన్నో దీర్ఘ కాలిక, అరుదైన వ్యాధుల నుంచి నూతన టెక్నాలజీ, అత్యాధునికి యంత్రాలతో రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి తలలో దిగిన మేకును వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారు. ఆ మేకును తీసేందుకు దాదాపు 6 గంటల పాటు శ్రమించారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ఆపరేషన్ తర్వాత బాధితుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు వెల్లడించారు.

తమిళనాడులోని చెన్నైలో ఉన్న రేలా ఆస్పత్రి వైద్యులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మచ్చలిగావ్ గ్రామానికి చెందిన బ్రహ్మ అనే 23 ఏళ్ల వలస కూలీ.. చెన్నైలోని నవలూరులో ఉన్న ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఒకరోజు తాను పనిచేసే ప్రాంతంలో జులై 4 వ తేదీన అతనికి ప్రమాదం జరిగింది. బ్రహ్మ అక్కడ ఫ్లోర్ శుభ్రం చేస్తుండగా.. అక్కడ చెక్క బాక్సులకు మెషీన్ సాయంతో మిగితా వారు మేకులు కొడుతున్నారు. అయితే అదే సమయంలో ఒక్కసారిగా మేకు వచ్చి తలలో దిగింది. దీంతో బ్రహ్మ తల నుంచి రక్తం ధార లాగా కారుతోంది. ఏం జరుగుతుందో అర్థం కాక ఉన్న బ్రహ్మకు.. తలలో మేకు దిగిందని తోటి కార్మికులు తెలిపారు. అతనికి మెడ, తల మధ్య భాగంలో తీవ్రమైన నొప్పి ప్రారంభమైంది. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న రేలా ఆస్పత్రికి తరలించారు.

బ్రహ్మ పరిస్థితిని రేలా ఆస్పత్రి వైద్యులు పరిశీలించారు. అతడి తల, మెడ భాగంలో మాత్రమే తీవ్ర గాయం అయిందని.. మిగితా శరీరం అంతా బాగానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. కాళ్లు, చేతులు బాగానే పనిచేస్తున్నాయని.. అతడు ఆస్పత్రికి వచ్చినపుడు స్పృహతోనే ఉన్నాడని తెలిపారు. వెంటనే అతడికి ఆపరేషన్ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీని కోసం ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత తల నుంచి విజయవంతంగా రెండు ఇంచుల మేకును బయటికి తీసినట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్ కోసం రేలా ఆస్పత్రి వైద్యుల బృందం దాదాపు 6 గంటలపాటు శ్రమించినట్లు డాక్టర్ అన్బుసెల్వం వివరించారు. బాధితుడు కేవలం 23 ఏళ్లు ఉండటంతో.. అతని వయసు కూడా ఆపరేషన్‌కు సహకరించినట్లు తెలిపారు.

ఇక కోలుకున్న తర్వాత ఆస్పత్రిలో నిర్వహించిన సమావేశంలో డాక్టర్లతోపాటు బాధితుడు బ్రహ్మ మీడియాతో మాట్లాడారు. తనకు ఇలాంటి ఆపరేషన్ చేసిన డాక్టర్ల బృందం, ఆస్పత్రికి ధన్యవాదాలు తెలిపారు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపాడు. ఇప్పుడు నడుస్తున్నానని.. తింటున్నానని చెప్పాడు. త్వరలోనే మళ్లీ పనికి వెళ్తానని వివరించాడు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: