గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా విక్రమ్ గౌడ్..జహీరాబాద్ నుంచి లోక్‌సభ బరిలో రాజాసింగ్

 జహీరాబాద్ నుంచి లోక్‌సభ బరిలో రాజాసింగ్

గోషామహల్  నియోజకవర్గ టికెట్‌ను మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌కు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఝలక్ ఇచ్చిన కాషాయ పార్టీ.. ఇప్పుడు తన నియోజకవర్గ టికెట్‌ను విక్రమ్‌గౌడ్‌కు ఖరారు చేసి త్వరలో మరో షాక్ ఇవ్వనుందని సమాచారం. ఇప్పటికే గోషామహల్ నియోజకవర్గంలో విక్రమ్ గౌడ్ యాక్టివ్‌గా తిరుగుతున్నారు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి తానేనని ఇప్పటికే పలుమార్లు బాహటంగానే విక్రమ్ గౌడ్ ప్రకటించారు.

జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని రాజాసింగ్‌ను బీజేపీ కోరుతోంది. కానీ రాజాసింగ్ అందుకు సముఖంగా లేరని తెలుస్తోంది. దీంతో ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించడంపై ఇంకా జాప్యం జరుగుతోంది. గోషామహల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా కూడా వ్యవహరించారు. తన సొంత నియోజకవర్గమైన గోషామహల్ సెగ్మెంట్‌ను వదిలిపెట్టుకుని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రాజాసింగ్ విముఖత వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఆయనపై బీజేపీ సస్పెన్షన్ విధించి ఏడాది దాటింది.

అయితే ఇప్పటివరకు తనపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించడంపై నిర్ణయం తీసుకోకపోవడం, ఎంపీగా పోటీ చేయాలని సూచించడంతో గత కొంతకాలంగా రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విక్రమ్ గౌడ్‌ తండ్రి ముకేష్ గౌడ్ గతంలో గోషామహల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 214,2018 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి ఓటమి పాలయ్యారు. విక్రమ్ గౌడ్ కూడా 2020 వరకు కాంగ్రెస్ పార్టీలో అనేక పదవుల్లో కొనసాగారు. 2016 నుంచి 2020 వరకు గోషామహల్ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా వ్యవహరించారు. కానీ కాంగ్రెస్‌పై అసంతృప్తితో రెండు సంవత్సరాల క్రితం కాషాయ కండువా కప్పుకున్నారు.

విక్రమ్ గౌడ్ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో ఆ పార్టీ నుంచి మేయర్ అభ్యర్ధిగా కూడా పోటీ చేశారు. యూత్ కాంగ్రెస్‌లో పలు పదవులను చేపట్టారు. దీంతో నగరవ్యాప్తంగా విక్రమ్ గౌడ్‌కు అనుచరులు ఉన్నారు. అంతేకాకుండా ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలను నిర్మించారు. దీంతో బలమైన క్యాండిడేట్ అయిన విక్రమ్ గౌడ్‌కే టికెట్ ఇవ్వాలని బీజేపీ చూస్తోంది. దీంతో రాజాసింగ్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయినా రాజాసింగ్ మాత్రం తాను బీజేపీలోనే ఉంటానని, వేరే పార్టీలోకి వెళ్లేది లేదని చెబుతున్నారు. దీంతో రాజాసింగ్ విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: