బంగాళాఖాతంలో అల్పపీడనం,,రెండ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా జులై 4,5 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జూలై 4న ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట సహా ఉత్తరాది జిల్లాల్లో జూలై 5న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని చెప్పారు. రాబోయే 48 గంటల్లో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్ మరియు 24 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే ఛాన్స్ ఉందన్నారు. రేపు (మంగళవారం) నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం తర్వాత మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ శాఖ అధికారులు తెలిపారు.

గడిచిన 24 గంటల్లో వికారాబాద్‌లో అత్యధికంగా 163.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 28.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. భారీ వర్ష సూచనల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: