బాలుడి కడుపులో నాలుగు అయస్కాంతాలు,,,గుంటూరులో అరుదైన ఘటన
వైద్యులు ఆపరేషన్ చేసి ప్రమాదవశాత్తూ కడుపులోకి వెళ్లిన వాటిని బయటకు తీస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఆపరేషన్ చేసి కడుపులో మర్చిపోయిన సర్జరీ కత్తెరలు, కత్తులు వంటి వాటిని బయటకు తీసిన ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. అలాగే కడుపునొప్పి తోహాస్పిటల్‌కు వచ్చిన రోగుల కడుపులోనుంచి వివిధ వస్తువులు, ప్లాస్టిక్, ఇతర పదార్థాలను ఆపరేషన్ చేసి బయటకు తీస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.
కడుపునొప్పి, పసరు వాంతులతో హాస్పిటల్‌కి వచ్చిన ఒక బాలుడికి సర్జరీ నిర్వహించి కడుపులోనుంచి నాలుగు అయస్కాంతాలను వైద్యులు బయటకు తీశారు. ఈ సంఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన షేక్ మహహ్మద్ రఫీ(9) అనే బాలుడు గత కొద్దిరోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. అలాగే పసరు వాంతులు తరచూ వస్తున్నాయి. దీంతో కుటుంబసభ్యులు ఈ నెల 8న బాలుడిని గుంటూరులో ఉన్న యర్రాస్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు, స్కానింగ్ నిర్వహించిన డాక్టర్లు.. కడుపులో నాలుగు అయస్కాంతాలు అతుక్కుని ఉన్నట్లు గుర్తించారు.
అంతేకాకుండా అయస్కాంతాల ఆకర్షణ వల్ల చిన్న, పెద్ద పేగుల్లో పలుచోట్ల రంధ్రాలతో పాటు విత్తనాలు, రబ్బర్, ప్లాస్టిక్ వస్తువులను వైద్యులు గుర్తించారు. దీంతో బాలుడికి ఆపరేషన్ చేసి కడుపులోని అయస్కాంతాలతో పాటు వ్యర్థ పదార్థాలను తొలగించారు. అలాగే పాడైన పేగులకు చికిత్స చేసి సాధారణ స్థితికి తీసుకొచ్చారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన నుంచి బయటపడ్డారు. ఇలాంటి కేసులను తాము చూడటం ఇదే తొలిసారి అని, కడుపులో ఆయస్కాంతాలు చూసి ఆశ్చర్యపోయినట్లు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. అయితే పిల్లలు వస్తువులను నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో వస్తువులు జారి నోటి ద్వారా కడుపులోకి వెళతాయి. ఈ బాలుడికి కూడా అదే జరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, వారిని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఆటబొమ్మలు ఇచ్చేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని, వాటిని నోట్లో పెట్టుకోకుండా చూసుకోవాలని అంటున్నారు.
బాలుడి కడుపులో నాలుగు అయస్కాంతాలు,,,గుంటూరులో అరుదైన ఘటన
Post A Comment:
0 comments: