ఉపాధ్యాయుడు కృష్ణను అలా చంపడం ఘోరం: చంద్రబాబు

ఉపాధ్యాయుడు కృష్ణను అలా చంపడం ఘోరం

విజయనగరం జిల్లా రాజాంలో ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఈ మేరకు ఆదివారం చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ కారణాలతో ఒక ఉపాధ్యాయుడిని చంపడం దారుణమన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ (58) దారుణ హత్యను తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కారణాలతో ఒక టీచర్‌ను చంపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఉదాసీన వైఖరే కారణమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

రాజాంలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ శనివారం ఉదయం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఉపాధ్యాయుడు కృష్ణను ప్రత్యర్థి వర్గం బొలెరో వాహనంతో ఢీకొట్టి హతమార్చి.. తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అక్కడి పరిస్థితులను చూసి ఇది హత్యేనని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంఘటనా స్థలం వద్దనే బైఠాయించి ఆందోళనకు దిగారు.

దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా, హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని నిర్ధారణ అయింది. మృతుడి కుమారుడు శ్రావణ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన మరడాన వెంకటనాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్‌ వెల్లడించారు.

ఉపాధ్యాయుడు కృష్ణ (58) అంత్యక్రియలు ఆదివారం ఉదయం ఉద్దవోలులో ముగిశాయి. మరోవైపు కృష్ణ స్వగ్రామమైన ఉద్దవోలులో పోలీసు పికెటింగ్‌ కొనసాగుతోంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: