పామును తన గూడులో బంధించిన సాలె పురుగు

 పామును తన గూడులో బంధించిన సాలె పురుగు


పాములు కోడి పిల్లలను, కప్పలను పట్టుకొని తినడం కామన్. తమ కంటే పెద్ద జంతువులను కూడా పాములు ఒడుపుగా పట్టుకొని మింగేస్తాయి. కానీ పాములను సాలెపురుగులు తినడం మీరెప్పుడైనా చూశారా..? మన దగ్గర అలాంటి సాలెపురుగులు లేవు గానీ.. ఆస్ట్రేలియాలో రెడ్ బ్యాక్ స్పైడర్ అనే విషపూరితమైన సాలెపురుగులు ఉన్నాయి. ఈ జాతి సాలెపురుగులు తమ కంటే 50 రెట్లు పెద్దవైన పాములను సైతం తమ సాలె గూడులో బంధించి, పట్టుకొని తినేస్తాయి. విషపూరితమైన పాములను సైతం ఈ సాలెపురుగులు తినేస్తాయి.

విక్టోరియాలోని వినిఫెరా ఏరియాలో.. ఓ షట్టర్ కింద ఉన్న గ్యాప్‌లో నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ పాము.. రెడ్ బ్యాక్ స్పైడర్ అల్లిన సాలె గూడులో చిక్కుకుంది. అది తప్పించుకోవడానికి విఫల ప్రయత్నం చేయగా.. స్పైడర్ దాని శరీరంలోకి విషాన్ని జొప్పించి హతమార్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రెడ్‌బ్యాక్ స్పైడర్ పామును తింటుండగా.. చాలాసార్లు కెమెరాకు చిక్కాయి. ఈ భూమ్మీద అత్యంత విషపూరితమైన సర్పాల్లో రెండో స్థానం ఈస్ట్రన్ బ్రౌన్ పాములది. ఆస్ట్రేలియాలో ఎక్కువ పాముకాటు మరణాలకు ఇవి కారణం అవుతున్నాయి. అలాంటి ఈస్ట్రన్ బ్రౌన్ పామును సైతం ఓ రెడ్‌బ్యాక్ సాలెపురుగు తన వలలో బంధించి మెల్లమెల్లగా తినేసింది. 2019 ఫిబ్రవరిలో ఈ ఘటన జరగ్గా.. ‘ఫీల్డ్ నేచురలిస్ట్ క్లబ్ ఆఫ్ విక్టోరియా’ అనే ఫేస్ బుక్ గ్రూపులో ఈ ఫొటోలను పోస్ట్ చేశారు. ఆ పాము సైజ్‌కు.. దాన్ని పట్టుకొని తింటున్న సాలెపురుగు సైజ్‌కు ఏమాత్రం పొంతన లేకపోవడం గమనార్హం.

రెడ్ బ్యాక్ స్పైడర్లలో ఆడ సాలెపురుగులు విషపూరితమైనవి. తమ ఒంట్లోని శక్తివంతమైన విషం సాయంతో పెద్ద జీవులను సైతం ఇవి వేటాడగలవు. తమ వలలో పాము లేదా ఏదైనా జీవి చిక్కిన తర్వాత.. జిగట లాంటి పదార్థం ద్వారా అవి కదలకుండా చేస్తాయి. తర్వాత తమ రెండు కోరల నుంచి ఆల్ఫా-లాట్రోటాక్సిన్ అనే విషాన్ని వాటి శరీరంలోకి పంపించి చంపేస్తాయి. ఆ విషం వల్ల పాము శరీరం లోపలి భాగాలు ద్రవంలా మారతాయి. అప్పుడు సాలెపురుగు దాన్ని పీల్చి తినేస్తుంది. ఆడ సాలెపురుగులు ఇలా పెద్ద జీవులను చంపేశాక.. మగవి వచ్చి కడుపు నింపుకుంటాయి.

ఈ రెడ్ బ్యాక్ స్పైడర్లకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. మగ సాలెపురుగుతో జత కట్టిన తర్వాత ఆడ సాలెపురుగులు తమ శరీరంలోని పునరుత్పత్తి మార్గంలో రెండేళ్లపాటు వీర్యాన్ని నిల్వ ఉంచుకోగలవు. ఆ తర్వాత ఆ వీర్యం సాయంతో ఫలదీకరణం జరిపి గుడ్లను పెడతాయి. ఆహార సేకరణ తేలికవుతుందనే ఉద్దేశంతో ఇవి ఎక్కువ ఇళ్లు, ఇతర నివాస ప్రాంతాల్లోనే ఉంటాయి. దీంతో మనుషులు సైతం తరచుగా ఈ సాలెపురుగుల కాటు బారిన పడతారు. ఇవి కరిస్తే తీవ్రమైన నొప్పి రావడంతో.. వాంతులవుతాయి. తలనొప్పి, మగత ఉండటం లాంటి లక్షణాలుంటాయి. ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు. అయితే 1956 నుంచే వీటి విషానికి విరుగుడు అందుబాటులో ఉంది.

ఈ భూమ్మీద అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలోనూ పాములు, సాలెపురుగులను మనం చూడొచ్చు. సాలెపురుగులు సాధారణంగా చిన్న చిన్న కీటకాలు, ఇతర సాలెపురుగులను ఆహారంగా తీసుకుంటాయి. కొన్ని పెద్ద సాలెపురుగులు మాత్రం బల్లులు, కప్పలు, చేపలు, చిన్న పాములను తినగలవు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: