తరగతి గదిలో చొక్కాలు విప్పాలని,,,విద్యార్థినులపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి వారిని జీవితంలో ప్రయోజకులు చేసే వారే ఉపాధ్యాయులు. అలాంటి పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అయితే కొంతమంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు చేసే పనులు.. మొత్తం ఆ వృత్తికే మచ్చ తెచ్చేలా ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థినులపై.. ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఓ కాలేజీలో విద్యార్థినులను వేధించిన ప్రొఫెసర్ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ కాలేజీ యాజమాన్యం అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించింది.

అమెరికాలోని మేరీలాండ్‌లో ఉన్న ఓ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ కాలేజీ ప్రొఫెసర్‌.. తరగతి గదిలోనే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని కొంత మంది స్టూడెంట్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఇద్దరు విద్యార్థినులు సదరు ప్రొఫెసర్‌ చేస్తున్న లైంగిక వేధింపులను స్థానిక విద్యాశాఖ అధికారులకు మొర పెట్టుకున్నారు. దీంతో వారు ఆఫీస్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ అధికారులతో దర్యాప్తు చేయించారు. దర్యాప్తు తర్వాత వారు ఒక నివేదికను సిద్ధం చేశారు. ఆ ప్రొఫెసర్ తరగతి గదిలోనే విద్యార్థులను అందరి ముందు షర్ట్‌లు విప్పి నిలబడాలని బెదిరించే వాడని చెప్పారు. వారు షర్ట్‌లు విప్పితే తాను వారి శరీర భాగాలను పరిశీలిస్తానని చెప్పేవాడని ఫిర్యాదు చేశారు. పాఠాలు చెప్పడంలో భాగంగా శరీర భాగాల గురించి వివరించడానికి అవసరం లేకున్నా సరే దుస్తులను తొలగించాలని ఆదేశించే వాడని పేర్కొన్నారు. వాటన్నింటి ఆధారంగా ఆఫీస్ ఆఫ్ సివిల్ రైట్స్ నివేదిక తయారు చేసింది. 2019 లో మొదలైన ప్రొఫెసర్ వేధింపులు, అసభ్య ప్రవర్తన కొన్ని సంవత్సరాల పాటు జరిగిందని వారు ఆరోపించారు. ఆ ప్రొఫెసర్ దాదాపు చాలా మంది విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు గుర్తించారు.

స్టూడెంట్స్ ఇచ్చిన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న సదరు కాలేజీ యాజమాన్యం.. ప్రొఫెసర్‌కు సెలవులు ఇచ్చింది. ప్రొఫెసర్ లేని సమయంలో 3 నెలల పాటు సుదీర్ఘంగా ఆఫీస్ ఆఫ్ సివిల్ రైట్స్ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో సదరు ప్రొఫెసర్.. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడింది నిజమేనని తేలింది. దీంతో ఆ ప్రొఫెసర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు సదరు కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. ఆ ప్రొఫెసర్‌పై తదుపరి చట్టపరమైన చర్యలు కూడా చేపడతామని స్పష్టం చేసింది.

సదరు ప్రొఫెసర్ చేసిన లైంగిక వేధింపుల కారణంగా బాధితులుగా మారిన స్టూడెంట్స్‌కు కాలేజీ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. బాధిత యువతులు మానసికంగా వేదనకు గురై పరీక్షల్లో ఫెయిల్‌ అయిన వారికి కోర్సు ఫీజు తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. వాళ్లు మళ్లీ కోర్సు పూర్తిచేసేందుకు అవకాశం కల్పిస్తామని కూడా కళాశాల యాజమాన్యం వెల్లడించింది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: