టమాటాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా..పోలీసుల బందోబస్తు

 టమాటాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా..పోలీసుల బందోబస్తు


టమాటాల లోడుతో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడింది. టమాటాలు పెద్ద సంఖ్యలో రోడ్డు పక్కన పడిపోయాయి. 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో మావల వద్ద శనివారం (జూలై 15) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. టమాటల లారీ బోల్తా పడిన విషయం తెలిసి, జనం అక్కడికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కొంత మంది కొన్ని టమాటాలను తీసుకెళ్లారు. అయితే, అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. యజమాని అభ్యర్థన మేరకు టమాటాలు ఎత్తుకెళ్లకుండా రక్షణ కల్పించారు.


కర్ణాటకలోని కోలార్ ప్రాంతం నుంచి టమాటలను ఢిల్లీకి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీలో తరలిస్తున్న టమాటల విలువ రూ. 22 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా టమాటాల ధర మండిపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కిలో రూ. 120 నుంచి రూ. 180 వరకూ విక్రయిస్తున్నారు. ఢిల్లీ, గుర్గావ్, లక్నో లాంటి నగరాల్లో కిలో టమాటా రూ. 250 వరకూ పలుకుతోంది.


టమాటా లేనిదే చాలా కూరలు వండలేం. ధరలు పెరగడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టమాటాలు విరివిగా లభిస్తున్న కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి నాఫెడ్ ద్వారా టమాటాలను కొనుగోలు చేసి ఢిల్లీ సహా పలు నగరాలకు సరఫరా చేస్తోంది. సామాన్యులకు తక్కువ ధరకు టమాటాలను అందించే ఏర్పాట్లు చేసింది.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: