ఇస్లామ్ వెలుగు అందరికోసం

ఇస్లామ్ వెలుగు... ఈ పుస్తకంలోని కథనాలు కేవలం ధార్మికత చింతనను మాత్రమే వివరించలేదు. ప్రతీ వ్యాసంలో సామాజిక వ్యవహార సరళి ఎలా ఉండాలో తెలియజేసే విలువల వాచకమని చెప్పవచ్చు. జీవన విధానాన్ని విడమర్చి చెప్పే గ్రంథమే ఇస్లామ్ వెలుగు పుస్తకం. 

ఇస్లామ్ అందరి ధర్మమని చెప్పే ప్రయత్నమే : ముహమ్మద్ ముజాహిద్

తెలుగులో ఇస్లామ్ సాహిత్యాన్ని అత్యంత సులువుగా చదువుకోగలిగేలా రాయదగ్గవారిలో ముహమ్మద్ ముజాహిద్ పేరు ముందువరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. పలు పత్రికల్లో అచ్చయిన వ్యాసాల  సంకలనం ‘ఇస్లామ్ వెలుగు’ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. 

ఖుర్ఆన్, ప్రవక్త బోధనల్ని తేట తెలుగులో విశ్లేషించి రాయడంలో ముజాహిద్ ది అందెవేసిన చెయ్యి. ఆయన వ్యాసాలు చదివితే ఇస్లామ్ ధర్మ బోధనలు కేవలం ముస్లిములకే కాదు అందరి కోసం అనే ఆలోచన కలిగిస్తాయి. ఇప్పటి వరకూ తెలుగులో వస్తున్న ఇస్లామ్ సాహిత్యానికి కాస్తంత భిన్నంగా రాయడం అలవర్చుకున్న ముజాహిద్ రచనలు అనతికాలంలోనే పాఠకాదరణ పొందాయి. ఆదరణతోపాటు ఎంతోమందిని శత్రువులనీ సంపాదించిపెట్టాయి. అందరికీ అర్థం కాకుండా గ్రాంధిక భాషలో రాయడం వల్ల ఒరిగేదేముంది. ఖుర్ఆన్ గ్రంథం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ గ్రంథ బోధనలు ప్రతీ గుండె వరకూ చేరాలన్న ప్రవక్త ఆదేశమే ముజాహిద్ రచనలకు ప్రేరణ అని చెబుతారాయన. ఇస్లామ్ లోని జీవన విధానం అందిరికీ బోధపడాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారాయన. 


పుస్తకానికి ప్రేరణ ఇలా...

నేను ప్రతీ వారం ప్రముఖ తెలుగు దినపత్రికల్లో ఇస్లామ్ సందేశం శీర్షికన వ్యాసాలు అందించేవాడిని. వారం వారం వచ్చే కథనాలకు పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చేది. కులమతాల కతీతంగా నా వ్యాసాలను చదివేవారని నాకప్పుడు అర్థమయింది. ఇస్లామ్ లో తల్లిదండ్రుల హక్కులు, సామాజిక వ్యవహార సరళి, ఇలా ఎన్నో అంశాలపై ఖుర్ఆన్ సందేశాన్ని జోడించి రాసే వ్యాసాలకు ఎంతోమంది నుంచి ప్రశంసలందుకునేవాడిని. ఒకరోజు వెంకట్రామయ్య అనే పేరుగల ఓ రిటైర్డు ఇంజనీరు నాకు ఫోన్ చేసి ‘బాబూ మీ ఫోన్ నెంబరు అతి కష్టం మీద సంపాదించాను. ఎంతోకాలంగా మీ వ్యాసాలు చదువుతున్నాను. ఈ వ్యాసాలన్నీ సంకలనం చేసి ఒక గ్రంథంగా తీసుకురండి’ అని చెప్పాడు. అప్పటిదాకా నాకా ఆలోచన కూడా రాలేదు. ఆ తరువాత అడపాదడపా చాలామంది ఫోన్ చేసి చెప్పడంతో పుస్తకం తీసుకురావాలని సంకల్పం చేసుకున్నాను. కానీ పుస్తక ముద్రణ అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. లాక్ డౌన్ లో అల్లాహ్ పేరుతో పుస్తక ప్రచురణ పనులు ప్రారంభించాను. తెలిసిన శ్రేయోభిలాషులతో చర్చించాను. సానుకూలత వచ్చింది. అందరి సాకారంతో పుస్తక ముద్రణ పూర్తయింది. ఆరు నెలల్లోనే మూడుసార్లు ముద్రణ జరగడాన్ని నమ్మలేకపోయాను. ప్రజల్లో ఇస్లామ్ వెలుగులు విరజిమ్మడంలో నా వంతు కృషి చేశాను. అల్లాహ్ నాపై చూపిన కారుణ్యానికి చిహ్నంగా భావిస్తున్నాను. 

ఇందులో ఉన్న ప్రతీ వ్యాసం పేజీ, పేజినర్నరకు మించి ఉండవు కానీ, ఎంతో భావార్థంతో కూడుకున్నవని చాలామంది సీనియర్ రచయితలు, మిత్రులు చెబుతుంటే చాలా సంతృప్తి కలుగుతుంది. ఇస్లామ్ వెలుగు పుస్తకం నా పరలోక సాఫల్యానికి తోడ్పడుతుందని భావిస్తున్నాను. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: