ఏపీలో సినిమా షూటింగ్స్,,,ముందుగా సీఎం కేసీఆర్‌ను ఒప్పించాలి:  పోసాని కృష్ణ మురళి


సీనియర్ రచయిత, దర్శకుడు, నిర్మాత, నటుడు పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వ్యంగ్యంగా మాట్లాడడంలో ఆయన స్టైలే వేరు. అలా మాట్లాడి పలు సందర్భాల్లో వివాదాల్లోనూ చిక్కుకున్నారు. సీని పరిశ్రమతో పాటు రాజకీయ పరమైన అంశాలపైనా పోసాని కామెంట్లు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. మంగళవారం ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన పోసాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలి వెళ్లాలని ఏపీలోనూ షూటింగ్స్, సినిమా నిర్మాణాలు లాంటి కార్యకలాపాలు చేపట్టాలని సీఎం జగన్ ఎప్పటినుంచో కోరుతున్నారు. కాగా, ప్రస్తుతం టాలీవుడ్ కార్యక్రమాలు, సినిమా నిర్మాణాలు మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. ఆ అంశంపై మాట్లాడిన పోసాని.. ఏపీలో సినిమా షూటింగ్స్ చేయాలంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌ని ఒప్పించాలి అన్నారు. ఏపీలో ఉచితంగా సినిమాలు తీసుకోవచ్చునని.. అలాగని చిత్రీకరిస్తే తెలంగాణలో స్థలాలిచ్చాం కదా ? అక్కడకు ఎందుకు వెళ్లారని తెలంగాణలో ప్రశ్నిస్తారని అన్నారు.

తెలంగాణలోనే ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో స్థలాలు ఇస్తామన్నా.. ఎందుకు ఉండరని ఏపీలో ప్రశ్నిస్తారని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితి తెలుగు సినీ పరిశ్రమకు కటింగ్‌, ఫిటింగ్‌ అయిపోయిందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకుంటేనే సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. హృదయపూర్వకంగా కోరితే కేసీఆర్‌ సాయం చేస్తారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కేసీఆర్‌, తర్వాత వాళ్లబ్బాయి కేటీఆర్, ఆ తర్వాత రేవంత్‌రెడ్డి ఇలా వ్యవస్థ జరిగిపోతూనే ఉంటుందన్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్‌తో ముడిపడి ఉందన్న పోసాని.. ఆయనకు సాధకబాధకాలు చెప్పి ఒప్పించాలన్నారు. తాను ఎలాగైనా కేసీఆర్ కాళ్ళు పట్టుకుని అడుగుదామనుకుంటున్నానని పోసాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఆ వర్గానికో ఈ వర్గానికో కాకుండా అర్హులైన వారికే నంది అవార్డులు ఇస్తామని పోసాని కృష్ణ మరళి స్పష్టం చేశారు. పద్యనాటకాలు ఏపీ ప్రాంతానికే ప్రత్యేకమని అందుకే వాటికి కూడా నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అర్హులైన వారికి నంది అవార్డులు ఇవ్వలేదని తేలితే తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని పోసాని వ్యాఖ్యనించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: