హైదరాబాద్‌లో భారీ మోసం,,,ఫేస్‌బుక్‌లో పరిచయమై రూ. 10 లక్షలు కాజేసిన యువతి

 ఫేస్‌బుక్‌లో పరిచయం....రూ. 10 లక్షలు కాజేసిన యువతి


సోషల్ మీడియా వచ్చాక ముక్కుమొహం తెలియని పరిచయాలు జరిగిపోతున్నాయి. దీంతో ఇటీవల కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈజీమనీకి అలవాటు పడిన కొందరు మోసాలకు తెరలేపుతున్నారు. ఈ కేవైసీ, గిఫ్ట్‌లు, లాటరీలు, ఆన్‌లైన్ ట్రేడింగ్, బంపర్ డ్రాలు ఇలా సైబర్ మోసాలతో పాటు హానీట్రాప్‌ వ్యవహారాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా అందమైన అమ్మాయిల ఫోటోలను డీపీలుగా పెట్టుకొని అమాయకపు యువకులను మోసం చేస్తున్నారు. వృద్దులను సైతం టార్గెట్ చేసి వారి నుంచి లక్షల్లో వసూలు చేసిన ఘటనలు అనేకం.

తాజాగా.. హైదరాబాద్‌లో మరో హానీ ట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తికి ఫేస్‌బుక్ ద్వారా హాయ్ అంటూ పరిచయం చేసుకున్న కిలాడీ అతని వద్ద నుంచి రూ. 10 లక్షలు తీసుకొని మోసం చేసింది. తల్లికి అనారోగ్యం అంటూ నమ్మంచి అతడి వద్ద నుంచి డబ్బులు తీసుకొని బురిడీ కొట్టించింది. తిరిగి తన డబ్బులు ఇవ్వాలని కోరితే.. రౌడీలతో కొట్టిస్తానని బెదిరింపులకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉండే ఓ యువకుడికి అశ్రుతారెడ్డి అనే పేరుతో ఓ యువతి ఫేస్‌బుక్‌లో హాయ్ అని మేసెజ్ పెట్టింది. దానికి సదరు యువకుడు రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. సదరు యువతి తనకు తాను ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా పరిచయం చేసుకుంది.

ఓ అందమైన అమ్మాయి ఫొటో పంపి.. తన ఫొటోగా నమ్మించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహాన్ని సదరు యువతి తనకు అనుకూలంగా మార్చుకుంది. అతడి వద్ద నుంచి డబ్బులు లాగడానికి ఫ్లాన్ వేసింది. తన తల్లికి ఆరోగ్యం బాగా లేదని ఆమెకు ట్రీట్‌మెంట్ చేయించాల్సి ఉందని అందుకు డబ్బులు అసరమని చెప్పింది. తప్పుడు మెడికల్‌ రిపోర్టులను బాధితుడికి పంపి.. ట్రీట్‌మెంట్ పేరిట ముందుగా కొంత నగదును తీసుకుంది. ఆ తర్వాత వివిధ కారణాలు చెబుతూ.. విడతల వారీగా సుమారు రూ.10 లక్షలు యువకుడి నుంచి లాగేసింది.

ఇటీవల బాధితుడు తన డబ్బులు ఇవ్వాలని యువతిని కోరగా.. ఆమె బెదిరింపులకు దిగింది. ఛాటింగ్‌ చేసిన మేసేజ్‌లను తన తల్లిదండ్రులకు చూపెడతానని బెదరించింది. డబ్బులు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని..రౌడీలతో కొట్టిస్తానని.. కేసు పెట్టి జైలుకు పంపుతానని పలు రకాలుగా బాధితుడని బెదిరింపులకు పాల్పడింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన యువకుడు పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు మధురానగర్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మెుత్తానికి ఫేస్‌బుక్‌లో హాయ్ అనే మెసేజ్ ఖరీదు రూ. 10 లక్షలు. బాగా చదువుకున్న వారు, ఉన్నత ఉద్యోగాలు చేసే వారు కూడా ఇలాంటి మోసాల బారిన పడటం పట్ల పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏదైనా అనుమానం ఉంటే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: