స్కాన్ చేయండి.. కేసీఆర్ గొప్పతనం తెలుస్కోండి,,,గద్వాల జిల్లాలో వెలసిన పోస్టర్లు

రాజకీయ ప్రచారం కొత్త పంథాను తొక్కుతోంది. తాజాగా తెలంగాణలో అదే జరుగుతోంది. స్కాన్ చేయండి.. చెల్లించండి.. అంటూ డిజిటల్ చెల్లింపుల గురించి విన్నాం. ఓ క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేసి.. ఓ వ్యక్తి గురించి గానీ... ఓ పార్టీ గురించి గానీ.. తెలుసుకోండి అన్న స్మార్ట్ ఆలోచన ఇప్పటివరకు చూడలేదు. అయితే.. స్కాన్ చేయండి.. బీఆర్ఎస్, కేసీఆర్ గొప్పతనాలు తెలుసుకోండి అంటూ జోగులాంబ గద్వాల జిల్లాలోని పల్లెల్లో క్యూ ఆర్ కోడ్‌తో స్మార్ట్ పోస్టర్లు వెలవటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. అయితే.. గొప్పతానాలు అంటే.. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు వేశారనుకుంటే మాత్రం పొరపాటే. కేసీఆర్, బీఆర్ఎస్ వైఫల్యాలను జనాలకు తెలియజేయటమే లక్ష్యంగా ఈ స్మార్ట్ పోస్టర్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే.. రేపు గద్వాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో.. ఈ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. వీటిని ఎవరు వేశారన్నది మాత్రం తెలియరాలేదు.

అయితే.. మారుతున్న కాలానికి మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటం సహజమే. ఏదైనా కొన్నప్పుడు.. డిజిటల్ రూపంలో చెల్లింపు ప్రక్రియలో భాగంగా.. ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే వంటి వాటి క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి.. లావాదేవీలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు తెలుసుకునేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే.. ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ వైఫల్యాలు ముద్రించడానికి పోస్టర్లలో ప్లేస్ సరిపోక.. ఏకంగా ఇలా స్కాన్ చేసి.. కేసీఆర్, బీఆర్ఎస్ గొప్పతనాలు చదువుకోండి అని పోస్టర్లు వెలవటం.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పల్లెల్లోని గోడలపై ఎటు చూసిన ఈ స్కానర్ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో కేసీఆర్ చిత్రపటంతో కూడిన క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్లందరూ తమ మొబైల్‌తో పోస్టర్లలో ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు బీఆర్ఎస్ ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలు, వాటి వైఫల్యాలు ఏమిటో తెలుసుకునేలా సవివర విశ్లేషణ రూపొందించారు. అందులో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, ఢిల్లీ లిక్కర్ స్కాం, రైతుల ఆత్మహత్యలు, కాళేశ్వరం కుంభకోణం ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై కార్టూన్లు చిత్రించి పీడీఎఫ్ దస్త్రాన్ని ఏర్పాటు చేశారు.  అయితే.. రేపు గద్వాల జిల్లాలో సీఎం పర్యటించనున్న నేపథ్యంలో.. ప్రధానంగా అలంపూర్ చౌరస్తా, ఎర్రవెల్లి చౌరస్తాతో పాటు పలు గ్రామాల్లో ఈ పోస్టర్లు వెలవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: