జులై 7 నుండి లాల్ దర్వాజా బోనాలు ప్రారంభం

ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముసాబవుతున్న దేవాలయం

సింహ వాహిని మహంకాళి దేవాలయం లాల్ దర్వాజ కమిటీ వెల్లడి 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత వైభవంగా, ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజ శ్రీ మహాంకాళి బోనాల జాతర ఉత్సవాలు జులై 7 నుండి ప్రారంభం కానున్నాయని సింహ వాహిని మహంకాళి దేవాలయం లాల్ దర్వాజ కమిటీ వెల్లడించింది. ఈ సందర్భంగా సింహ వాహిని మహంకాళి దేవాలయం లాల్ దర్వాజ కమిటి ఛైర్మన్ రాజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మారుతీ  యాదవ్, కో శాధికారి పోసాని సదానంద్ ముదిరాజ్,  ఢిల్లీ బోనాల కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..


ఈ సంవత్సరం 115వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుటకుగాను దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేస్తున్నదని వారు వెల్లడించారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయానికి రంగులు వేయడంతోపాటు, రంగురంగుల విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు.


జులై 7 నుండి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలలో తొలిరోజైన శుక్రవారం ఉదయం గణపతి హోమం, సప్తశతి పారాయణం దేవి అభిషేకం, ద్వజారోహణ, శిఖరపూజ, సాయంత్రం కలశ స్థాపనతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. జులై 9వ తేదిన ఆదివారం సాయంత్రం షాలిబండ కాశీవిశ్వనాథ స్వామి దేవాలయం నుండి అమ్మవారి ఘటాన్ని భాజా భజంత్రీలు, డప్పు వాయిధ్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టిస్తారు.

ఆ తరువాత 9రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. జులై 16వ తేదిన అమ్మవారికి బోనాలు సమర్పన, రాత్రికి ప్రపంచ శాంతిని కోరుతూ శాంతి కళ్యాణము నిర్వహిస్తారు. జులై 17వ తేదిన పోతరాజు స్వాగతం, భవిష్యవాణిని వినిపించే రంగం, అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఢిల్లిలో లాల్ దర్వాజ బోనాలు

లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహాంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 19, 20, 21 తేదీలలో బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. జూన్ 19వ తేదీన సోమవారము సాయంత్రం 5 గం||లకు తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఫోటో ఎగ్జిబిషన్ను పలువురు ప్రముఖులు విచ్చేసి ప్రారంభిస్తారు. మంగళవారం 20వ తేదీన సా॥ 5 గం॥లకు ఇండియా గేట్ నుండి అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకుని వచ్చి తెలంగాణ భవన్ లో ప్రతిష్టాపన చేస్తాము. బుధవారం 21వ తేదీన ఉదయం 11 గం॥ లకు పోతరాజు స్వాగతం బోనాల సమర్పణ, పలువురు ప్రముఖులు విచ్చేసి, అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పిస్తారు.


తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 100 మంది సాంస్కృతిక కళాకారులచే వివిధ కళారూపాలను ప్రదర్శించనున్నారు. సాయంత్రం  6గం||లకు అంబేడ్కర్ ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమము జరుగును అని వారు వెల్లడించారు.




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: