100 ఎకరాల్లో పొంగులేటి చేరిక సభ,,,నేడు భట్టితో మాణిక్ రావు ఠాక్రే భేటీ

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జులై 2న కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా రానుండగా.. ఈ సందర్భంగా లక్షలాది మంది ప్రజల సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సభకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎస్ఆర్ గార్డెన్స్ పక్కన ఉన్న వంద ఎకరాల స్థలంలో సభకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సభకు జనగర్జనగా నామకరణం చేశారు. 5 లక్షలకుపైగా ప్రజలను ఈ సభకు తరలించేందుకు పొంగులేటితో పాటు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. చాలాకాలం తర్వాత తెలంగాణలో రాహుల్ గాంధీ బహిరంగ సభలో పాల్గొననుండటం, ఎన్నికలు సమీపిస్తుండటంతో.. దీనిని గ్రాండ్ సక్సెస్ చేయాలని భావిస్తున్నారు. సభకు వచ్చే ప్రజల కోసం 50 ఎకరాల స్థలాన్ని పార్కింగ్‌కు కేటాయించారు. ఈ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు రేపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు రానున్నారు. సభా స్థలాన్ని పరిశీలించి పలు కీలక సూచనలు చేయనున్నారు.

ఈ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు నేడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే భేటీ కానున్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో సభ విధివిధానాలపై చర్చించేందుకు భట్టితో ఆయన భేటీ కానున్నారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణ, ఇతర అంశాలపై మాట్లాడనున్నారు. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేతలతో పాటు రాష్ట్ర ముఖ్యనేతలందరూ హాజరుకానున్నారు. ఈ సభ ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. పొంగులేటి, జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ సభలో హస్తం గూటికి చేరనున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: