సెప్టెంబర్ 2022

 గాంధీలు ఎక్స్‌పైర్ అయిపోయిన మందులులాంటి వారు

గాంధీలు ఎక్స్‌పైర్ అయిపోయిన మందులులాంటి వారని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా గాంధీ కుటుంబంపై ఘాటైన విమర్శలు చేశారు. వారు కనీసం ప్రతిపక్ష పాత్రను కూడా నిర్వహించలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దేశంలో అధికార పార్టీ అని భావిస్తోందని, బీజేపీ ఎప్పడో అధికారాన్ని చేజిక్కించుకుందని ఆయన అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విమర్శలు చేశారు.

నిజానికి గాంధీ కుటుంబాన్ని అసలు ప్రతిపక్షంగా చూడకూడదని, కాలం చెల్లిన మందులని అన్నారు. కాంగ్రెస్ నేతలు కనీసం ప్రతిపక్ష పాత్రను కూడా సరిగ్గా నిర్వర్తించలేరు.. తామే అధికార పార్టీ అని వారి మనస్సులో ఉందని ఆయన అన్నారు. "నరేంద్ర మోదీ బలవంతంగా ప్రధాని పీఠంపై ఉన్నారని, ఆ సీటు తమకే చెందుతుందని వారు ఎక్కడో భావిస్తున్నారు. వారు విపరీతమైన కోపంతో ఉన్నారు." అని హిమాంత బిశ్వా అభిప్రాయపడ్డారు. అంతేకాదు రాహుల్ గాంధీ రాజకీయాలకు అనర్హుడని అన్నారు. ఆయనకసలు సీరియస్‌నెసే లేదని హిమంతా బిశ్వ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ప్రభుత్వాలను బర్తరఫ్ చేసేందుకు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసిందని హిమంతా బిశ్వా ఆరోపించారు. "నరేంద్ర మోదీ ఆ ఏకపార్టీ వ్యవస్థను సవాల్ చేసే వ్యక్తి.. కాంగ్రెస్‌ ఆధిపత్యాన్ని ఆయన సవాల్‌ చేస్తున్నారు. వారు దేశంలో ఒక కుటుంబ పాలన సృష్టించారు." అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ మరింత మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


 ఇది భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే మరి

భారత్ భిన్నత్వంలో ఏకత్వం అన్నది మరో సారి రుజువైంది. ఇలాంటి ఘటనలు మనదేశంలో ఎన్నో ఉన్నాయి. ఇకపై కూడా ఉంటాయి. దసరా పండుగ హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ. జరుపుకునే విధానాలు వేరైనా.. చాలా రాష్ట్రాల్లో నవరాత్రుల అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇప్పటికే ఈ సందడి మొదలైపోయింది. కోల్‌కతాలో దసరా కోలాహాలం మామూలుగా లేదు. ప్రతి వీధిలోని దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల దగ్గర గర్బా డ్యాన్స్‌తో మహిళలు అదరగొడుతున్నారు.

ఈ తరుణంలో మతసామరస్యానికి అద్దం పట్టే ఓ ఘటన గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. కోల్‌కతాలో ఒకే ఒక కుటుంబం కోసం.. ముస్లింలు ఎక్కువగా ఉండే వీధిలో దుర్గాపూజ నిర్వహిస్తారు. అలీముద్దీన్ స్ట్రీట్‌లోని 13/A షరీఫ్ లైన్‌లో ఏకైక హిందూ కుటుంబం నివసిస్తుంది. ఆ ఒకే ఒక హిందూ కుటుంబం కోసం అక్కడ ముస్లింలు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. నిజానికి గత ఏడాది నుంచే ఈ సంప్రదాయాన్ని మొదలు పెట్టారు.

నిజానికి అక్కడ చాలా హిందూ కుటుంబాలు ఉండేవి. కానీ పోను పోను అక్కడ నుంచి హిందూ కుటుంబాలు వెళ్లిపోయాయి. ప్రస్తుతం అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. సయంత సేన్ అనే ఒకే ఒక హిందూ బెంగాలీ కుటుంబం మాత్రమే అక్కడ నివసిస్తుంది. పెద్దగా హిందువులు ఎవరూ లేకపోవడంతో 16 ఏళ్ల నుంచి దుర్గాపూజ వేడుకలను నిర్వహించడం లేదు. కానీ గత ఏడాది అక్కడున్న ముస్లిం యువకులు తమ వీధిలో దుర్గాపూజను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో హిందూ కుటుంబం ఎంతగానో ఆనందపడుతుంది.

తమ కాలనీలో నవరాత్రి ఉత్సవాలు మళ్లీ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని సయంత సేన్ కుటుంబం అంటుంది. అసలు ఆ వీధిలో ఎప్పుడో నవరాత్రి వేడుకలు ఆగిపోయాయని, దశాబ్దాల నాటి సంప్రదాయాన్ని ముస్లింలు మళ్లీ పునరుద్ధరించడం ఎంతో ఆనందంగా ఉందని సయంత సేన్ చెప్పారు. దీనిపై అక్కడి ముస్లింలు కూడా స్పందించారు. వీధిలో దుర్గా పూజ జరగక్కపోవడంతో.. హిందూ కుటుంబ వాసులు కలత చెందారని ముస్లిం వ్యక్తి తౌసాఫ్ రెహమాన్ అన్నారు.

గత ఏడాది సేన్ కుటుంబం తమను సంప్రదించడంతో మళ్లీ ఇక్కడ ఆ వేడుకలను చేయాలని నిర్ణయం తీసుకున్నామని రెహమాన్ చెప్పారు. తామంతా పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని, మిగతా ఆచారాలను సేన్ కుటుంబం నిర్వహిస్తోందని అన్నారు. "ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలోని ఏకైక హిందూ కుటుంబం హక్కుల గురించి కూడా మనం ఆలోచించాలి" అని 2021లో పూజను ప్రారంభించిన రెహమాన్ అన్నారు. ఇలా ఒకరి సంప్రదాయాలను మరొకరు గౌరవించుకోవడం.. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. కాగా ఒడిశాలో 30 ఏళ్లుగా ముస్లిం మతానికి చెందిన వ్యక్తే నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నాడు.


 భారీ వాహనాలను అనుమతించకండి

గడివేముల గ్రామ ప్రజలు విన్నపం

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

గడివేముల గ్రామంలో అనునిత్యం జిందాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన భారీ వాహనాల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. వివరాల్లోకి వెళితే  గడివేముల గ్రామం మీదుగా నంద్యాలకు , నందికొట్కూరు మరియు కర్నూలు కు ఈ రహదారిలో అధికారులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రయాణికులు బస్సులల్లో, ద్విచక్ర వాహనాలపై, అనునిత్యం గడివేముల గ్రామం మీదుగా వెళుతుంటారు, అయితే జిందాల్ ఫ్యాక్టరీ భారీ వాహనాల వల్ల ట్రాఫిక్ అంతరాయం కావడం వల్ల వాహనదారులు, అధికారులు గంటల కొద్ది వేచి ఉండవలసిన పరిస్థితి కనిపిస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం భారీ వాహనాల రాకలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, గడివేముల రహదారిలో వాహనాల కింద పడి కొంతమంది చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయని,అలా ప్రవేశించిన వాహనాలకు గతంలో పనిచేసిన గడివేముల ఎస్సై హుస్సేన్ భాష భారీ జరిమానాలు విధించి జిందాల్ వాహనాలు రాకుండా అరికట్టారని,


కానీ ఇప్పుడు ఏదేచ్ఛగా పగలనక రాత్రి అనక తిరుగుతున్న జిందల్ భారీ వాహనాల రాకపోకలను అరికట్టడం లేదని గడివేముల గ్రామం లోనికి జిందాల్ ఫ్యాక్టరీ సిమెంటుకు సంబంధించిన భారీ వాహనాలు వస్తున్నాయనీ, భారీ వాహనాలు రావడం వల్ల వాహనదారులు ప్రయాణం చేసే రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, రహదారిలో ప్రయాణం చేయాలంటే వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉందని, భారీ వాహనాల కిందపడి చాలా మంది వాహనదారులకు గాయాలు అయ్యారని,

 ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందనీ. జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ భారీ వాహనాలకు రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకే తిరగడానికి జిందాల్ ఫ్యాక్టరీ  ట్రాన్స్ పోర్ట్ యాజమాన్యం తో సంప్రదించి భారీ వాహనాలు తిరగకుండా అధికారులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది చర్యలు తీసుకోవాలని గడివేముల గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.


 దసరా ఆఫర్ ప్రకటించిన ఎమ్మెల్యే


ఈ నవరాత్రుల్లో చంద్రపూర్ నగరంలో ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వెండి నాణేలు ఇస్తానని ఎమ్మెల్యే కిషోర్ జార్గేవార్ ప్రకటించారు. ఇదిలావుంటే వాడవాడలా దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించి.. ఇప్పటికే ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ అవతారాల్లో అలంకరిస్తారు. మహిళలు నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. నవరాత్రి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో మహిళలు గర్బా డ్యాన్స్‌తో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో ఓ ఎమ్మెల్యే భక్తులకు బంపరాఫర్ ప్రకటించారు.

ఈ నవరాత్రుల్లో చంద్రపూర్ నగరంలో ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వెండి నాణేలు ఇస్తానని ఎమ్మెల్యే కిషోర్ జార్గేవార్ ప్రకటించారు. సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చంద్రాపూర్‌లో అక్టోబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకు జన్మించిన ఆడపిల్లల తల్లిదండ్రులు సిల్వర్ కాయిన్స్ అందించనున్నారు. దీనికోసం తల్లిదండ్రులు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు తల్లిదండ్రులు మహాకాళి ఆలయ కార్యాలయంలో లేదా మహంకాళి మహోత్సవ్ సేవా సమితి పెవిలియన్‌లో సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు.

చంద్రాపూర్‌లోని మహంకాళి దేవి కీర్తిని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి మహాకాళి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీనికోసం అక్టోబరు 1న చంద్రాపూర్ ఎమ్మెల్యే కిషోర్ జోర్గేవార్ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలను పంతగాన మాతా మహంకాళి ఆలయంలో నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. గాయకులు, భజన బృందాలు ఈ ఉత్సవంలో పాల్గోనున్నారు. అయితే అమ్మవారిపై ఉన్న భక్తితో పాటు.. బేటీ బచావో సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే అమ్మాయిల కన్న తల్లిదండ్రులకు మాతా మహంకాళి సేవా సమితి తరపున వెండి నాణెం బహుమతిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వెండి నాణేలను అందించే బాధ్యతను మహేశ్వరి సేవాసమితి అధ్యక్షుడు సి.ఎ. దామోదర్ శారదకు అప్పగించారు. ఈ నాణేలను మహాకాళి మహోత్సవం సందర్భంగా ప్రముఖుల చేతుల మీదుగా అందజేయనున్నారు.

 ఇదేనా సామాన్యుడి సర్కార్

పంజాబ్ లో సామాన్యుడి సర్కార్ అంటే ఇదేనా అని ఆ రాష్ట్ర సీఎం కాన్వాయ్ తీరుపై అక్కడి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. వీఐపీ సంస్కృతికి స్వస్తి చెబుతామని ఎన్నికలకు ముందు ప్రకటనలతో ఊదరగొట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మరిచిపోయారంటూ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మాన్‌కి ముందున్న ముగ్గురు ముఖ్యమంత్రుల కాన్వాయ్‌‌లో వాహనాలు కంటే ఆయనే ఎక్కువ ఉపయోగిస్తున్నట్టు ఉన్నట్టు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడయ్యింది. దీంతో ఆప్ సీఎంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికి, మాయ మాట‌లు చెప్పిన సీఎం కాన్వాయ్‌లో 42 వాహ‌నాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా మండిపడ్డారు.

ప‌న్ను చెల్లింపుదారులైన ప్ర‌జ‌ల సొమ్మును ఇలా దుర్వినియోగం చేయడానికి మీకు ఎవ‌రు అనుమ‌తి ఇచ్చారంటూ ఆయన నిలదీశారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాట‌ల‌న్నీ అబ‌ద్దాలేనంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బాధ్య‌త లేకుండా పాల‌న సాగిస్తున్న భ‌గ‌వంత్ మాన్‌కు త‌మ‌ను విమ‌ర్శించే నైతిక హ‌క్కు లేద‌ని అన్నారు. గతంలో పంజాబ్ సీఎంలుగా పనిచేసిన ప్రకాశ్ సింగ్ బాదల్, కెప్టెన్ అమరీందర్ సింగ్‌ల కాన్వాయ్‌లో 33 వాహనాలే ఉండగా.. భగవంత్ మాన్ మాత్రం 42 వాహనాలను వాడుతున్నట్టు ఆర్టీఐ స్పష్టం చేసింది.

దీని ద్వారా ఏం చెప్పాల‌ని అనుకుంటున్నారంటూ ఆయన ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెడుతున్న ముఖ్యమంత్రికి త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లు బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌ని, కాన్వాయ్ విష‌యంలో స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ‘‘2007 నుంచి 2017 వరకూ సీఎంగా ఉన్న ప్రకాశ్ సింగ్ బాదల్ తన కాన్వాయ్‌లో 33 వాహనాలు ఉన్నాయి.. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం అయిన తర్వాత వాహనాల సంఖ్య పెరగలేదు.. కానీ సామాన్యుల సీఎంగా చెప్పుకునే భగవంత్ మాన్ 42 వాహనాలతో భారీ కాన్వాయ్‌లో వెళుతున్నట్టు ఆర్టీఐ ద్వారా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది’’ అని ప్రతాప్ సింగ్ బజ్వా ట్వీట్ చేశారు.

‘‘భగవంత్ మాన్ సీఎం కాకముందు చేసిన వాగ్దానాలకు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరించేవాటికి పొంతనలేదు.. ఇలాంటి విషయాలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భగవంత్ మాన్ అధికార పార్టీపై విరుచుకుపడేవారు’’ అని బజ్వా విమర్శించారు. కాన్వాయ్‌లో ఇంత భారీగా వాహనాలు ఎందుకు వినియోగిస్తున్నారో పంజాబ్ ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెప్టన్ అమరీందర్ సింగ్ తర్వాత చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ సెప్టెంబరు 20, 2021 నుంచి మార్చి 16, 2022 మధ్య సీఎంగా ఉన్నప్పుడు తన కాన్వాయ్‌లో 39 వాహనాలను వినియోగించినట్టు ఆర్టీఐ ప్రశ్నకు రాష్ట్ర రవాణా కమిషనర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.


 ఈ ధారుణమైన భోజనం ఎలా తింటారు సీఎం యోగిజీ


యూపీలోని విద్యార్థుల దుస్థితిపై ఓ వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. స్కూల్లో పిల్లలకు ఉప్పు కలిపిన అన్నాన్ని పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ రెండు నిమిషాల వీడియోలో పాఠశాలలో పిల్లలు నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. అందులో పిల్లలు కేవలం ఉప్పు, అన్నం.. తింటున్నట్టు తెలుస్తుంది.

దీనిని ఓ విద్యార్థి తల్లిదండ్రులు ప్రాథమిక పాఠశాలలో రికార్డ్ చేశారు. తర్వాత "ఈ పిల్లలందరూ అన్నం, ఉప్పు తింటున్నారు. తమ పిల్లలను ఇలాంటి పాఠశాలకు పంపాలని ఎవరు కోరుకుంటున్నారు..? యోగి బాబా (ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్) ఈ వీడియో చూడాలి." అని రాసి.. పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పిల్లలు భోజనం చేయడమే కాదు.. మిడ్ డే మీల్ మెనూను రాసిన గోడను కూడా షూట్ చేశారు. అందులో పాలు, రోటీలు, పప్పు, కూరగాయలు, బియ్యం ఉన్నాయి. కానీ పిల్లలకు మాత్రం.. అన్నం, ఉప్పు మాత్రమే పెడుతున్న వాస్తవం బట్టబయలైంది.

ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ పరిణామంతో ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని, అనంతరం సమగ్ర విచారణ జరుపుతామని అధికారులు అన్నారు.

ఈ సంఘటనపై అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్ స్పందించారు. "ఈ సంఘటన మంగళవారం జరిగింది. ఈ సంఘటనపై నేను విచారణకు ఆదేశించాను. బేసిక్ శిక్షా అధికారి విచారణ నిర్వహిస్తుంది. ప్రధానోపాధ్యాయుడిని కూడా సస్పెండ్ చేశారు.'' అని నితీష్ కుమార్ చెప్పారు. కాగా మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులను బలవంతంగా బస్తాలపై కూర్చోబెడుతున్నారని కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 సమయపాలన పాటించాలి

ఎంపీడీవో విజయసింహారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ గారి ఆదేశాల మేరకు గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయ నరసింహారెడ్డి గడివేముల మండల పరిధిలోని బిలకలగూడూరు, బూజునూరు గ్రామ సచివాలయాలను సందర్శించి సిబ్బంది తో సమావేశం ఏర్పాటు చేసి బయో మెట్రిక్ అటెండెన్స్ తనిఖీ నిర్వహించి, సచివాలయం నందు అందరు తప్పకుండా మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించాలని, సచివాలయ సిబ్బంది అందరు తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాలని, సచివాలయం సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. SWMP షేడ్ లను సందర్శించి గ్రీన్ అంబాసిడర్ సిబ్బంది కి సేంద్రియ ఎరువుల తయారీ విధానం పై,పలు అంశాలపై అవగాహన కల్పించి, ప్రతి రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీకు కేటాయించిన ఇళ్ళ నుండి తడి మరియు పొడి చెత్త తప్పనిసరిగా సేకరించాలని ఆదేశించారు.
 వైద్య భీమా లేకపోవడంతో

క్రౌడ్‌ ఫండింగ్‌ పై ఆధారపడుతున్న 67%మంది భారతీయులు

(జానో జాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

క్రౌడ్‌ఫండింగ్‌ ఇప్పుడు ఆధారపడతగిన అవకాశంగా ఎక్కువ  మంది చూస్తున్నారిప్పుడు, దీనికి 67% మంది భారతీయులకు  వైద్య భీమా లేకపోవడం ఓ కారణం అని మిలాప్‌ వెల్లడించింది.  భీమా కవరేజీ ఉన్నప్పటికీ, వైద్యపరంగా ఖర్చులు చాలామందికి ఆర్థికంగా భారంగా ఉన్నాయి. ఆఖరకు ప్రభుత్వ భీమా పథకాలు పొందడం కూడా సామాన్య ప్రజలకు కష్టంగానే ఉందని మిలాప్‌ వెల్లడించింది.

ప్రతి ఏటా భారతదేశంలో 5.5 మిలియన్ల మంది అప్పుల్లో కూరుకుపోవడానికి  ఊహించని వైద్య ఖర్చులు కారణమవుతున్నాయి. 2022 సంవత్సరంలోనే భారతదేశంలో ప్రజా ఆరోగ్యం కోసం జీడీపీలో దాదాపు  1.6% ఖర్చు చేసినట్లు అంచనా. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో  భారతదేశంలో ఐసీయులో చేరిన రోగికి అయ్యే సరాసరి ఖర్చు రోజువారీ కార్మికుని 16 నెలల జీతంతో సమానంగా, అలాగే ఓ సగటు ఉద్యోగి 10 నెలల జీతంతో సమానంగా ఉందని మిలాప్‌ వెల్లడిచించింది.


ప్రజలు తరచుగా ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ను తమ చివరి అవకాశంగా వినియోగించుకుంటున్నారు. తద్వారా తమ వైద్య ఖర్చులకు చెల్లింపులనూ చేస్తున్నారని మిలాప్‌ వెల్లడించింది. మిలాప్‌ లాంటి వేదికలు  నిధుల సేకరణ వేదికలుగా ఉపయోగపడటంతో పాటుగా దాతలలో విశ్వసనీయతనూ పొందుతున్నాయి.

భారతదేశపు వైద్య సంరక్షణ వ్యవస్ధ భవిష్యత్‌ లో క్రౌడ్‌ ఫండింగ్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని మిలాప్‌ వెల్లడిస్తూ  తమ ప్లాట్‌ఫామ్‌పై 72 లక్షల ఖాతాలున్నాయని వెల్లడించింది. దేశీయంగా 46 లక్షల మంది దాతలు ఉండగా, విదేశాలలో  లక్షల మంది దాతల ఉన్నారని వెల్లడించింది.

‘‘డబ్బుకోసం స్నేహితులు, కుటుంబసభ్యులను అడిగి కష్టపడుతున్న ఎంతోమంది ఇప్పుడు క్రౌడ్‌ఫండింగ్‌ అతి సులభమైన అవకాశంగా గుర్తిస్తున్నారు. మా ప్లాట్‌ఫామ్‌ పారదర్శక,  సౌకర్యవంతమైన అనుభవాలను అందించడంతో పాటుగా డిజిటల్‌గా దానం చేసే అవకాశం కల్పిస్తుంది’’ అని అనోజ్‌ విశ్వనాథన్‌, ప్రెసిడెంట్‌, కో–ఫౌండర్‌, మిలాప్‌ అన్నారు.

మిలాప్‌పై 90% ఫండ్‌రైజర్లు వైద్య విభాగానికి చెందినవి ఉంటున్నాయని  ఆయన వెల్లడించారు. ఎవరైనా మిలాప్‌పై ఫండ్‌ రైజర్‌ ప్రారంభించవచ్చంటూ  ఇప్పటి వరకూ  2 లక్షల మెడికల్‌ క్యాంపెయ్లిను మిలాప్‌పై  చేయడం ద్వారా 1250 కోట్ల రూపాయలను సేకరించి 3.8 లక్షలమందికి ప్రయోజనం కలిగించడం జరిగిందని మిలాప్‌ వెల్లడించింది.


 గూగుల్ కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసింది..కానీ ఇపుడు

గూగుల్ లో ఉద్యోగం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.అలాంటి గూగుల్ కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసుకొని ఆ సంస్థలో చేరి వాటిని కూడా వదిలేశారు ఓ ఉద్యోగి. గూగుల్ ఇండియా గవర్నమెంట్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీ హెడ్ పదవికి అర్చనా గులాటీ రాజీనామా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ఆమె ఐదు నెలల క్రితం గూగుల్ లో చేరారు. నీతి ఆయోగ్ జాయింట్ సెక్రటరీ (డిజిటల్ కమ్యూనికేషన్స్) ఉద్యోగానికి రాజీనామా చేసి గూగుల్ లో పాలసీ హెడ్ గా బాధ్యతలను స్వీకరించారు.

ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన అర్చన ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్డీ చేశారు. అయితే గూగుల్ కు ఆమె ఎందుకు రాజీనామా చేశారనే కారణం మాత్రం తెలియరాలేదు. ఈ అంశంపై అర్చన కానీ, గూగుల్ ఇండియా కానీ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మీడియా, వారిని కాంటాక్ట్ చేసినప్పటికీ... స్పందించేందుకు తిరస్కరించారు. 

ఇండియాలో యాంటీ ట్రస్టు కేసులతో పాటు టెక్ సెక్టార్ రెగ్యులేషన్స్ కు సంబంధించిన సమస్యలను గూగుల్ ఎదుర్కొంటున్న సమయంలో అర్చన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. 2019 ఆగస్ట్ నుంచి 2021 మార్చ్ వరకు అర్చన నీతి ఆయోగ్ లో పని చేశారు. ఈ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఏడాది పాటు ఫ్రీలాన్సర్ గా పని చేశారు. అనంతరం గూగుల్ లో చేరారు.

 విలేకరులపై దాడులు..హే మమైన చర్య

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని విలేకరులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ విలేకరులపై దాడులు చేయడం సమంజసం కాదని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే విలేకరులపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు తెలిపారు నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తే విలేకరులపై దాడులు చేసి గాయపరచడం సమంజసం కాదని వారు తెలిపారు.


విలేకరులకు మద్దతుగా విలేకరులపై దాడులను ఖండిస్తూ పాణ్యం శాసనసభ మాజీ సభ్యురాలు గౌరు చరిత్ర రెడ్డి, గడివేముల మండలం టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గడివేముల లో పాదయాత్ర నిర్వహిస్తున్న ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ తెలుగుదేశం పార్టీ అభిమానులు విలేకరులు మద్దతుగా నిలిచారు.

 అవి రెండు వేర్వేరు

క్రెడిట్ కార్డ్ అంటేనే ఎవరైనా అపు చేసి మ‌ళ్లీ కట్టే అవకాశమున్న కార్డు అని ఎవరైనా చెబుతారు. క్రెడిట్ కార్డ్, క్రెడిట్ లైన్ అనేవి ఇప్పుడు చాలామందికి అనుభవంలోకి వస్తున్నవే. అయితే, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ రెండూ తక్షణ రుణ సదుపాయాలే అయినప్పటికీ వాస్తవానికి వేర్వేరు సాధనాలు. క్రెడిట్ కార్డ్ ను ఒక వ్యక్తి ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. వినియోగించుకున్నంత మాత్రాన అది రుణం కాదు. రుణ సదుపాయం మాత్రమే. వడ్డీ లేకుండా ఈ సదుపాయాన్ని 45 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. నిర్ణీత గడువు లోపు తిరిగి చెల్లించకపోతే అప్పుడు వినియోగించుకున్న మొత్తంపై వడ్డీ, లేట్ ఫీజు పడతాయి. 

క్రెడిట్ లైన్ అలా కాదు. ఫ్లిప్ కార్ట్ పే లేటర్, అమెజాన్ పే లేటర్, బై నౌ పే లేటర్ ఈ తరహా సదుపాయాలన్నీ కూడా క్రెడిట్ లైన్ కిందకు వస్తాయి. వీటిని రుణాలుగా పరిగణిస్తారు. ఈ సదుపాయాన్ని వాడుకుంటేనే వడ్డీ పడుతుంది. వాడుకున్న మొత్తంపై వడ్డీ విధిస్తారు. అయితే, ఈ క్రెడిట్ లైన్ లోనూ కొన్ని సంస్థలు 15-30 రోజుల వరకు వడ్డీ లేకుండా చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

ఈ రెండింటి మధ్య వడ్డీ విధింపులో వ్యత్యాసం కనిపిస్తుంది. క్రెడిట్ కార్డు వినియోగంపై 20-42 శాతం వరకు వడ్డీ పడితే.. క్రెడిట్ లైన్ పై 16-35 శాతం మధ్య వడ్డీ విధిస్తారు. అంతేకాదు, వీటి చార్జీల్లోనూ వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక ఈ రెండు సదుపాయాలకు ఎటువంటి హామీ అవసరం లేదు.  క్రెడిట్ కార్డ్ వినియోగించుకుని గడువులోపు చెల్లిస్తే క్రెడిట్ రిపోర్ట్ లో కనిపించదు. కానీ, క్రెడిట్ లైన్ అలా కాదు. ఈ సదుపాయం వాడుకున్నా, వాడుకోకపోయినా యాక్టివ్ లోన్ గా కనిపిస్తుంది.


 హీరో ప్రీమియం శ్రేణి వాహనాలపై రూ.5,000 ఎక్చేంజ్ బోనస్

దసరా వచ్చేస్తోంది...వస్తూ వస్తూ వివిధ కంపెనీల బంపర్ ఆఫర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ దసరా పండుగ ఆఫర్లను తీసుకొచ్చింది. గ్రాండ్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫ్ ట్రస్ట్ పేరుతో ప్రచారాన్ని మొదలు పెట్టింది. హీరో ప్రీమియం శ్రేణి వాహనాలపై రూ.5,000 ఎక్చేంజ్ బోనస్ ఇస్తోంది. త్వరలోనే కంపెనీ వివిధ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎనిమిది కొత్త  మోడళ్లను విడుదల చేయనుంది. 

హీరో మోటోకార్ప్ స్కూటర్లు ‘సూపర్ 6 ధమాకా’ ప్యాకేజీతో వస్తాయి. దీని కింద రూ.13,500 ప్రయోజనాలను ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఏడాది పాటు ఉచిత బీమా, రెండేళ్ల పాటు ఉచిత మెయింటెనెన్స్, రూ.3,000 ఎక్చేంజ్ బోనస్, రూ.4,000 గుడ్ లైఫ్ గిఫ్ట్ వోచర్లు, ఐదేళ్ల వారంటీ, ఆరు నెలల పాటు సున్నా వడ్డీకే ఈఎంఐ సదుపాయాలను ఇస్తోంది. ‘ఇప్పుడు కొను తర్వాత చెల్లించు’ ఆఫర్ ను కూడా అందిస్తోంది. ఆఫర్లకు సంబంధించి మరిన్ని వివరాల కోసం కస్టమర్లు కంపెనీని సంప్రదించొచ్చు.

 అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా చూడడమే ఎంపీజే లక్ష్యం

ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ 

(జానో జాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

 రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూడడమే ఎంపీజే ముఖ్య ఉద్దేశమని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. ఆది వారం ఖమ్మం  ఎంపిజే కార్యాలయంలో  ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, దళిత, గిరిజన, బందు తరహాలోనే ముస్లిం బందును కూడా ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ప్రత్యేకంగా ముస్లిం సబ్ ప్లాన్ అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాసిమ్ మాట్లాడుతూ ఎంపిజే లక్ష్యం సమాజ సంక్షేమం. శాంతి, న్యాయం నెలకొల్పడం, దేశం నుండి పేదరికం, అజ్ఞానం, మతవివక్ష, పరస్పర విద్వేషాలను పారద్రోలడం, మానవ హక్కులను కాపాడడం, మహిళా హక్కులను పరిరక్షించడం, పిల్లల మరియు బలహీన వర్గాలకు రాజ్యాంగ హక్కులు కల్పించడం తదితరమైనవి.


శాంతి, న్యాయం కోసం పోరాడుతూ రాజకీయేతర, ప్రభుత్వేతర సామాజిక సంస్థ. దేశంలో శాంతిని, న్యాయాన్ని పెంపొందించడం కోసం‌, కులమతాల కతీతంగా అన్ని వర్గాల నుండి సహాయం పొందుతుంది. అంతేగాక ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రారంభించిన పధకాల సద్వినియోగం, ప్రభుత్వం వాటిని సక్రమంగా అమలు జరిపే విషయంలో ఎంపిజే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సమావేశంలో ఎంపీజె రాష్ట్ర ఉపాధ్యక్షులు అహ్మద్ అబ్దుల్ నయీమ్, ప్రధాన కార్యదర్శి సలీమ్ అల్- హింది, కార్యదర్శి ఎం.ఏ. సత్తార్ షారూఖీ, కోశాధికారి అహ్మద్ హెచ్. షకీల్ లు అతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రముఖ డాక్టర్ ఖలీఖుర్ రహ్మాన్, జహీర్, నాసర్ అహ్మద్, హకీమ్, సతీష్, రజబాలి, రఫీఖ్, జమీల్, అజీజ్, గఫార్, రాజారావు, చక్రవర్తి, నయీమ్, అస్రీన్, అబ్బాస్, జాని, షర్ఫుద్దీన్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


 ‘వివో ఎక్స్ ఫోల్డ్ ప్లస్’ ధర వింటే గుండె గుబ్బులే


మార్కెట్ లోకి వివో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. దాని ధర కూడా చర్చాంశనీయంగా మారింది. చైనా కంపెనీ వివో తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ‘వివో ఎక్స్ ఫోల్డ్ ప్లస్’ ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఏడాది మొదట్లో స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్ సెట్ తో కూడిన వివో ఎక్స్ ఫోల్డ్ విడుదల కావడం తెలిసిందే. ప్రస్తుత ఎక్స్ ఫోల్డ్ ప్లస్ అన్నది దానికి అప్ గ్రేడెడ్ వెర్షన్. ఇందులోనూ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 చిప్ సెట్ ఉంటుంది. 4,730 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 

కాకపోతే దీని ధర ఐఫోన్ కంటే ఎక్కువగా ఉంది. ఎక్స్ ఫోల్డ్ ప్లస్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ ప్రారంభ ధర చైనాలో రూ.1,15,000. 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీ ధర రూ.1,25,000. ఫోన్ తెరిచినప్పుడు 8.3 అంగుళాల పెద్ద పరిమాణంతో కూడిన అమోలెడ్ డిస్ ప్లే, 2కే రిజల్యూషన్, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. ఫోన్ క్లోజ్ చేసినప్పుడు 6.53 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కనిపిస్తుంది. ఈ ఫోన్ ను నోట్ బుక్ గానూ వాడుకునేందుకు వీలుంటుంది. దీని బరువు 311 గ్రాములు.


 ఓలా ఎలక్ట్రిక్ దసరా ఆఫర్


దసరా పండుగను పురష్కరించుకొని ఓలా ఎలక్ట్రిక్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్ కొనుగోలు చేసిన వారికి రూ.10,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఓలా ఎస్ 1 ప్రో ఎక్స్ షోరూమ్ ధర రూ.1,29,999కు తగ్గిపోయింది. అక్టోబర్ 5 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. నూతన కొనుగోళ్లపైనే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. 

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు విషయంలో మనకు కనిపించని ఇతర ధరలు కూడా ఉన్నాయి. హోమ్ చార్జర్ ధర రూ.15,000. ఈ స్కూటర్ కు 8.5 కిలోవాట్ మోటార్, 4 కిలోవాట్ బ్యాటరీ ఉన్నాయి. దీనిపై గరిష్ఠంగా 116 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చని ఓలా చెబుతోంది. పూర్తి చార్జింగ్ కు 6 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఇక నవరాత్రి పర్వదిం సందర్భంగా వాహన కొనుగోలుకు రుణాన్ని సున్నా వడ్డీపై పొందొచ్చు. రుణాలపై వడ్డీ రేటును 8.99 శాతానికి తగ్గించింది. ఐదేళ్ల ఎక్స్ టెండెడ్ వారంటీపై రూ.1,500 డిస్కౌంట్ ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.

 ఉద్యోగాల్లో స్థానికులకే 75శాతం రిజర్వేషన్

ఉద్యోగాల్లో 75 శాతం తప్పనిసరిగా స్థానికులకు అవకాశం ఇవ్వాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీలన్నీ ఈ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. అయితే, వీటికి కొన్ని పరిమితులు కూడా విధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే అవకాశం కల్పించాలని చట్టం చేసింది. తాజాగా స్థానికులకు పెద్ద పీట వేయాలని నిర్ణయం తీసుకున్న రెండో రాష్ట్రంగా జార్ఖండ్ నిలిచింది.

యువకులకు ఉపాధి కల్పించే విషయంలో వైఎస్ జగన్ తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ బిల్లుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. అయితే, స్థానికులకు 75 శాతం ఉద్యోగాల కల్పన అంశం సాధ్యాసాధ్యాలపై నిపుణులు, పారిశ్రామిక వర్గాలు కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఏ పరిశ్రమ స్థాపించినా.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. దీనివల్ల నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. దేశవ్యాప్తంగా నైపుణ్యం ఉన్న ఉద్యోగులు ఎక్కడున్నా సరే వారిని తమ సంస్థల్లో చేర్చుకుంటున్నారు. తమ ఉత్సాదనకు వారి సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రైవేట్ సంస్థలు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపరు అనే వాదన ఉంది.

ఇక ఈ నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని మరికొందరి వాదన. చట్టం అమల్లో చాలా రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయని.. అంతిమంగా ఇది పారిశ్రామిక ప్రగతికి విఘాతం కలిగిస్తుందనే అనుమానాలు పారిశ్రామిక వర్గాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. ఈ విధానంపై మరింత క్లారిటీ ఇచ్చారు. కొన్ని పరిమితులను కల్పించారు.

నెలవారీ వేతనం రూ.40 వేల లోపు గల ఉద్యోగుల విషయంలోనే ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలి. రూ.40 వేలు, అంతకంటే ఎక్కువ వేతనం పొందే ఉద్యోగులు, ప్రత్యేక నైపుణ్యాలు అవసరం ఉన్న ఉద్యోగాలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. 10 వేలు, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు ఈ నిబంధనను అమలు చేయాలి. ప్రస్తుతం ఉన్న కంపెనీలు వచ్చే మూడేళ్లలో క్రమంగా ఈ లక్ష్యాన్ని అందుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని సమీక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఉంటుంది. కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటారు. ప్లానింగ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్, లేబర్ కమిషనర్, ఇండస్ట్రీ డైరెక్టర్, చీఫ్ ఫ్యాక్టరీ ఇన్స్‌స్పెక్టర్ సహా మరికొంత మంది ఉన్నతాధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పష్టం చేశారు. వాస్తవానికి దీనికి సంబంధించిన ఉత్తర్వులను జులై 29వ తేదీనే జారీ చేశారు. మంగళవారం (సెప్టెంబర్ 20) మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సోరెన్ దీనిపై సమీక్ష నిర్వహించారు. అమలు చేసే అంశానికి సంబంధించి పలు సూచనలు జారీ చేశారు. జగన్ సర్కార్ బాటలో జార్ఖండ్ ప్రభుత్వం ఇప్పటికే 4 రాజధానుల అంశాన్ని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రాంచీని రాష్ట్ర రాజధానిగా కొనసాగిస్తూ.. రాష్ట్రంలోని మరో 3 నగరాలను సబ్-క్యాపిటల్స్‌గా ఏర్పాటు చేయాలని జార్ఖండ్ ప్రభుత్వం భావిస్తోంది. జాన్ అబ్రహంతో సర్వోజాన్ భాగస్వామ్యం 

(జానో జాగో వెబ్  న్యూస్-బిజినెస్ బ్యూరో)

ఇండియన్ ఆయిల్ కొత్తగా ప్రారంభించిన సర్వో4T ఎక్స్ట్రా ప్రమోట్ చేయడానికి ప్రముఖ నటుడిని ఎంపికచేసుకుంది. సర్వోస్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా,ప్రముఖ భారతీయ నటుడు జాన్ అబ్రహం ఇటీవల ముంబైలో జరిగిన వేడుకలో మోటార్‌బైక్‌ల కోసం ప్రత్యేకంగా ఇంజినీరింగ్ చేసిన లూబ్రికెంట్, సర్వో4T ఎక్స్ట్రాను ప్రవేశపెట్టడంజరిగింది.  “మన దేశానికి ఒక గొప్ప రేపటికి శక్తినిచ్చే అత్యుత్తమ బ్రాండ్‌లైన ఇండియన్ ఆయిల్ మరియు సర్వోతో భాగస్వామ్యం చేసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మేము కలిసి దేశంలోని ప్రతి బైక్ వినియోగదారునికి సర్వోను పూర్తిగా చేర్చగలమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, అని మిస్టర్ జాన్ అబ్రహం అన్నారు. దాని కోర్ వద్ద అధునాతన 3P (పెర్ఫార్మెన్స్, పవర్, ప్రొటెక్షన్) టెక్ ఫార్ములా, సుపీరియర్ ఇంధన ఆర్థిక వ్యవస్థ మరియు 6000 కిమీల వరకు ఎక్కువ డ్రెయిన్ విరామంతో,కొత్తగా ప్రారంభించబడిన సర్వో4T ఎక్స్ట్రాఅనేది మోషన్ ప్రతిపాదనలో నిజంగా ఇన్నోవేషన్.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మిస్టర్ ఎస్‌ఎం వైద్య ఇండియన్‌ ఆయిల్‌ చైర్మన్‌, ఇలా అన్నారు,  “మిలియన్ల కొద్దీ భారతీయుల హృదయాల్లో సర్వోప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది మరియు ఈ స్వదేశీయంగా అభివృద్ధి చెందిన బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించడానికి జాన్ అబ్రహం మాకు ప్రత్యేక ఎంపిక. నిజమైన మార్కెట్ లీడర్‌గా ముందుకు దూసుకెళ్తున్న సర్వోతోభాగస్వామ్యం కావటం నాకు సంతోషంగా ఉంది,పర్యావరణ అనుకూలంగా మరియు సుస్థిరమైన లూబ్రికేటింగ్ ఆయిల్‌తో మారుతున్న మార్కెట్ డైనమిక్స్‌తో వేగాన్ని కొనసాగించింది, ఇది భారతదేశం పచ్చని భవిష్యత్తు వైపు పయనించడానికి సహాయం చేస్తుంది. 2046 నాటికి ఇండియన్ ఆయిల్ యొక్క నికర జీరో ఉద్గార లక్ష్యానికి అనుగుణంగా,శక్తి-సమర్థవంతమైన, బయో-డిగ్రేడబుల్, లాంగ్ డ్రెయిన్ మరియు సింథటిక్ లూబ్రికెంట్‌లతో సర్వోసాంకేతిక మార్పులకు మార్గదర్శకత్వం వహిస్తుంది.


“బ్రాండ్ సర్వోను పర్యావరణానికి మొదటి స్థానంలో ఉంచే ఇంధన-సమర్థవంతమైన లూబ్రికెంట్‌గా బలోపేతం చేయడానికి మేము కొన్ని ప్రతిష్టాత్మక ప్రణాళికలను కలిగి ఉన్నామని చెప్పడానికినేను సంతోషిస్తున్నాను. “బ్రాండ్ సర్వోను మొదటి స్థానంలో ఉంచే ఇంధన-సమర్థవంతమైన లూబ్రికెంట్‌గా బలోపేతం చేయడానికి మేము కొన్ని ప్రతిష్టాత్మక ప్రణాళికలను కలిగి ఉన్నామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.మా సర్వోగ్రీన్ లూబ్రికెంట్ల శ్రేణి సుస్థిరమైన భవిష్యత్తు అవసరాన్ని తెలియజేస్తుంది. మేము BS VI వాహనాల కోసం లూబ్‌లతో పాటు EV మరియు విండ్‌మిల్స్ కోసం లూబ్రికెంట్లను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉన్నాము,” అని ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ (మార్కెటింగ్) మిస్టర్ వి.సతీష్ కుమార్ అన్నారు.

సర్వోగ్రీన్ బాస్కెట్‌లో సర్వో4T గ్రీన్, సర్వో ట్రాక్టర్ గ్రీన్, సర్వో గ్రీన్‌మైల్ మరియు సర్వో రాఫ్తార్ ఉన్నాయి. సర్క్యులర్ ఎకానమీ పట్ల ఇండియన్ ఆయిల్ యొక్క నిబద్ధతకు అనుగుణంగా మరియు రెడ్యూజ్- రీయూజ్- రీసైకిల్ భావనను పునరుద్ఘాటించడంతో పాటు,30% పోస్ట్-కన్సూమర్ రీసైకిల్ రెసిన్ (PCR)తో కూడిన కంటైనర్‌లు కూడా ప్రవేశపెట్టబడ్డాయి.

ఇండియన్ ఆయిల్యొక్క లూబ్రికెంట్ బ్రాండ్ తన వాటాదారులకు అత్యుత్తమ తరగతి మరియు ప్రామాణిక సేవలను అందించడానికి సాంకేతికతతో వేగాన్ని కొనసాగించింది. కార్పొరేషన్ ప్రతి ట్రేసింగ్ మరియు ట్రాకింగ్ కోసం QR కోడ్‌లతో కూడిన సర్వోప్యాక్ లేబుల్‌ల రోల్-అవుట్‌ను ప్రారంభించింది.కస్టమర్‌లు లాయల్టీ పాయింట్‌లను సులువుగా మరియు సజావుగా రీడీమ్ చేసుకోవడంలో సహాయపడటానికి సర్వోదోస్త్ యాప్ కూడా అభివృద్ధి చేయబడింది.

సర్వో, భారతదేశం యొక్క నంబర్ 1 లూబ్రికెంట్ బ్రాండ్, ఇండియన్ ఆయిల్ ద్వారా 1972లో ప్రారంభించబడింది. పెట్రోలియం రంగంలో భారతదేశ స్వదేశీ ప్రయత్నాలకు సర్వోనిదర్శనం,ఆసియాలోనే అత్యంత అధునాతన సౌకర్యాలలో ఒకటైన ఫరీదాబాద్‌లోని ఇండియన్ ఆయిల్యొక్క R&D సెంటర్‌లో రూపొందించబడింది.దశాబ్దాలుగా, సర్వో1,000 క్రియాశీల లూబ్రికెంట్ గ్రేడ్‌ల విస్తృత శ్రేణిని ఉత్పత్తి చేయడానికి మరియు మార్కెటింగ్ చేయడానికి అభివృద్ధి చెందింది మరియు 37 దేశాలలో దాని ఉనికిని కలిగి ఉండి, అంతర్జాతీయంగా విస్తరించింది.

సర్వో, ఒక సూపర్ బ్రాండ్, తిరుగులేని ప్రముఖ సంస్థగా ముందుకు దూసుకెళ్తుంది మరియు రక్షణ, రైల్వేలు, రవాణా, విద్యుత్, బొగ్గు, మైనింగ్, ఆటోమొబైల్స్ మరియు ఉక్కుతో సహా చాలాప్రధానపరశ్రమలలోఇదివాడబడుతుంది.మారుతీ సుజుకి, హ్యుండయ్, టాటా మోటార్స్, మరియు అశోక్ లేలాండ్ మరియు మహీంద్రాతో సహాచాలాOEMల ద్వారా సర్వోలూబ్రికెంట్‌ ఛాయిస్ గా ఆమోదించబడింది.


 జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి

మ్మార్వోకు ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ వినతిపత్రం

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

గడివేముల మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పిలుపుమేరకు గడివేముల మండలంలో పనిచేస్తున్న విలేకరుల సమస్యలపై ఎమ్మార్వో శ్రీనివాసులుకు సత్యనారాయణ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ,ఎల్ల సుబ్బయ్యలు మాట్లాడుతూ ప్రజలకు వారధిగా పనిచేసే విలేకరులకు ఆరోగ్య భీమా నిలిపివేయడానికి, ఇళ్ల స్థలాలు మరియు బస్ లో ప్రయాణం చేయడానికి అక్రిడేషన్లు మధ్యలో ఆపివేయడం, విలేకరులకు జీఎస్టీ సాకుగా చూపి  నిలిపివేయడం శోచనీయం మనీ, విలేకరులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పటిష్టమైన కమిటీని ఏర్పాటు చేయాలని తాసిల్దార్ శ్రీనివాసులు గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, ఎల్ల సుబ్బయ్య, ఇబ్రహీం, శ్రీధర్ బాబు, చెన్నయ్య,మస్తాన్, రసూల్, చంద్రబాబు గడివేముల మండలం విలేకరులు పాల్గొన్నారు.

 ఆ నిర్మాణాలను కూల్చేయండి


బాంబే హైకోర్టు తాజాగా ఓ‌ కేంద్ర మంత్రి కేసు విషయంలో కీలక తీర్పు వెలువరించింది. అక్రమ నిర్మాణం విషయంలో కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు బాంబే హైకోర్టులో ఝలక్ తగిలింది. జుహూలోని అక్రమంగా నిర్మించిన ఆయన బంగ్లాను కూల్చివేయాలని ఆదేశించింది. అలాగే, రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. బంగ్లా నిర్మాణంలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఆర్డీ ధనూక, జస్టిస్ కమల్ ఖాటాల ద్విసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.

‘‘హోల్‌సేల్‌గా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ అనధికార నిర్మాణాన్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ రాణే కుటుంబం నడుపుతున్న సంస్థ దాఖలు చేసిన రెండో దరఖాస్తును బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలించదు, అనుమతించదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బంగ్లాలోని అక్రమ నిర్మాణాలను రెండు వారాల్లోగా కూల్చివేయాలని, అనంతరం వారం రోజుల్లోగా నివేదికను సమర్పించాలని బీఎంసీని ఆదేశించింది.

అక్రమ నిర్మాణాన్ని చేపట్టినందుకు రూ.10 లక్షలు జరిమానా విధించిన హైకోర్టు.. ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా మహారాష్ట్ర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాలని సూచించింది. సుప్రీంకోర్టులో అప్పీలుకు ఈ ఉత్తర్వులను ఆరు వారాల పాటు నిలిపివేయాలన్న రాణే తరఫు లాయర్ శార్దూల్ సింగ్ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.

గతంలో బీఎంసీ జారీచేసిన ఆదేశాలను పక్కనబెట్టి తమ రెండో దరఖాస్తుపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ కేంద్ర మంత్రి రాణే కుటుంబానికి చెందిన కాల్కా రియల్ ఎస్టేట్స్ దాఖలుచేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. బంగ్లా నిర్మాణం అక్రమని పేర్కొంటూ కాల్కా రియల్ ఎస్టేట్స్ క్రమబద్దీకరణ కోసం చేసిన దరఖాస్తును ఈ ఏడాది జూన్‌లో బీఎంసీ తిరస్కరించింది. మళ్లీ జులైలోనూ రెండో దరఖాస్తును చేసింది. డెవలప్‌మెంట్ అండ్ ప్రమోషన్ రెగ్యులేషన్ 2034లోని కొత్త నిబంధనల ప్రకారం గతంలో పేర్కొన్న దానితో పోలిస్తే చిన్న భాగాన్ని క్రమబద్ధీకరించాలని కోరింది. అయితే, దీనిపై బీఎంసీ నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టుకు వెళ్లగా అక్కడ ఎదురుదెబ్బ తగిలింది.

 రేషన్ బియ్యం పట్టివేత...కేసు నమోదు

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండల పరిధిలోని  మంచాల కట్ట గ్రామ సమీపంలో ఉన్న ఎస్ఆర్బీసీ కెనాల్ బ్రిడ్జి వద్ద డోన్ పట్టణానికి చెందిన గొల్ల జయన్న (49) , కురుకుంద గ్రామం ఆత్మకూరు మండలానికి చెందిన సయ్యద్ ఖలీల్( 27), నంద్యాల పట్టణానికి చెందిన దూదేకుల దస్తగిరి ( 32)  ముగ్గురు వ్యక్తులు ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యాన్ని (పీడీఎస్) ప్రజల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఏపీ 39 డబ్ల్యూ 6610 ఐచర్ వాహనం లో సుమారు 160 బస్తాలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని  (పీడీఎస్) తరలిస్తున్నారని, ఒక్కొక్క బస్తాలో  సుమారు 50 కేజీలు ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యాన్ని నంద్యాల పట్టణానికి చెందిన  నిజాముద్దీన్ అను వ్యక్తికి అధిక ధరకు అమ్మడానికి ప్రభుత్వ బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారం తెలుసుకున్న గడివేముల ఎస్సై బి.టి. వెంకటసుబ్బయ్య తన సహచర సిబ్బందితో అప్రమత్తమై  ఐచర్ వ్యాను ఏపీ 39 డబ్ల్యూ 6610 ను తనిఖీ చేసి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


 క్రీడాకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా

క్రీడాకారులకు యూపీలోని యోగి సర్కార్ ఇచ్చిన గౌరవంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేనా క్రీడాకారులకు ఇచ్చే గౌరవం అని నేటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలావుంటే టాయిలెట్స్‌లో మహిళా ఆటగాళ్లకు భోజనాలు ఏర్పాటుచేసిన దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్‌ నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా టోర్నమెంట్‌లో చోటుచేసుకుంది. బాలికలకు టాయిలెట్లలో భోజనాలు ఏర్పాట్లు చేయడంతో వారు ఇబ్బంది పడుతూనే భోజనం చేసిన వీడియోలు బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, స్థలం లేకపోవడంతోనే ఇలా చేశామని అధికారులు తమ పనిని సమర్దించుకోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు, నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే సహారన్‌పుర్ జిల్లాలో సెప్టెంబరు 16న అండర్‌-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌కు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 మంది క్రీడాకారిణులు హాజరయ్యారు. అయితే, తమకు స్టేడియం టాయిలెట్‌లో భోజనాలు ఏర్పాటు చేశారని కొందరు ఆటగాళ్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఎవరో ఫోన్‌లో రికార్డు చేయడంతో వీడియోలు కూడా బయటికొచ్చాయి. టాయిలెట్‌ గదిలో పాత్రలతో అన్నం, పప్పు, కూరలు ఉండగా అందులో నుంచి అమ్మాయిలు వడ్డించుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఒక చోట అయితే మరీ దారుణంగా పూరీలను నేలపై ఓ పేపర్‌లో వేసి ఉంచారు.

ఒక నిమిషం నిడివి గల వీడియోలో ఒక ఫ్రేమ్‌లో యూరినల్స్, వాష్ బేసిన్‌లు ఉండగా.. గేట్ దగ్గర రైస్, పప్పు, కూరలు పాత్రల్లో ఉండగా.. ఆటగాళ్లు ఆహారం తీసుకొని టాయిలెట్ నుంచి బయటకు వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. స్మిమ్మింగ్ పూల్ సమీపంలో వంటచేస్తున్న దగ్గరకు వర్కర్లు పాత్రలను తీసుకొస్తున్నట్టు మరో వీడియోలో ఉంది.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో యోగి సర్కారుపై విరుచుకుపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంపై సహారన్‌పుర్‌ క్రీడా అధికారి అనిమేశ్‌ సక్సేనా స్పందిస్తూ.. భోజనాలను టాయిలెట్‌లో ఏర్పాటు చేయలేదని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో వంట పాత్రలను ‘ఛేంజింగ్‌ రూం’లో పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

‘‘బాత్‌రూంలో భోజనాలు పెట్టలేదు.. ఆ రోజు వర్షం పడింది. అందుకే స్విమ్మింగ్‌పూల్‌ వద్ద భోజన ఏర్పాట్లు చేశాం.. ప్రస్తుతం స్టేడియం నిర్మాణ దశలో ఉంది. వర్షం కారణంగా వంట పాత్రలు పెట్టేందుకు స్థలం లేకపోవడంతో స్విమ్మింగ్‌ పూల్‌ పక్కనే ఉన్న ఛేంజింగ్‌ రూంలో పెట్టాం’’ అని సక్సేనా చెప్పడం గమనార్హం. దీనిపై సహారన్‌పూర్ కలెక్టర్ అఖిలేశ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఏర్పాట్లుపై ఫిర్యాదులు వచ్చాయి.. జిల్లా క్రీడా అధికారిని సస్పెండ్ చేశాం.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించి, సంబంధిత వ్యక్తి మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాం... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు.

‘‘పలు ప్రచార ఆర్బాటాలకు బీజేపీ కోట్లాది రూపాయలను వెచ్చిస్తోంది.. కానీ, క్రీడాకారులకు కనీస సౌకర్యాలు కల్పించడానికి డబ్బుల్లేవా?’’ అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ‘‘ఉత్తర్ ప్రదేశ్‌లోని కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్‌లో ఆహారం వడ్డించారు.. ఇది ఆటగాళ్లకు బీజేపీ ఇచ్చే గౌరవం.. చాలా సిగ్గుచేటు’’ టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటన చాలా అవమానకరమని రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదురి మండిపడ్డారు. మరోవైపు, ఘటనకు బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్ పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.


 చిచ్చురేపిన టిప్ వ్యవహారం


టిప్ ఇస్తే ఎవరైనా సంతోషిస్తారు. కానీ అమెరికాలో టిప్ వ్యవహారం గొడవకు దారి తీసి కోర్టు దాక పోతోంది. హోటల్స్‌లో, రెస్టారెంట్‌లలో ఫుడ్ సర్వ్ చేసే వాళ్లకు టిప్స్ ఇస్తుంటారు. కస్టమర్లు ఎవరి స్థోమతను బట్టి.. వారు ఇస్తుంటారు. టిప్ ఇవ్వాలనే నిబంధనలు ఏ దేశంలోనూ లేదు. కానీ అదొక ఆనవాయితీగా వస్తుంది. టిప్ ఇస్తే.. వెయిటర్స్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. కోవిడ్ ప్రభంజనం తర్వాత రెస్టారెంట్‌లు, హోటళ్లు తిరిగి ఓపెన్ చేసిన తర్వాత వెయిటర్లకు కస్టమర్లు అధిక మొత్తంలో డబ్బును అందజేసినట్టు అనేక కథనాలు కూడా ఉన్నాయి. అంతేకాదు అమెరికా వంటి దేశాల్లో కస్టమర్లు వెయిటర్లకు భారీ మొత్తంలో టిప్స్ ఇస్తుంటారు. అలాంటి టిప్ ఓ రెస్టారెంట్‌లో పెద్ద చిచ్చు పెట్టింది.

పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్‌ సిటీలో ఈ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. అక్కడ ఆల్ఫ్రెడోస్ పిజ్జా కేఫ్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న అమ్మాయికి కస్టమర్ ఎరిక్ స్మిత్‌ 3,000 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 2.3 లక్షలు ఇచ్చారు. ఎరిక్ కేవలం $13.25కి ఫుడ్ ఆర్డర్ చేశారు. కానీ వెయిట్రెస్ కోసం అదనంగా 3 వేల డాలర్లు తన క్రెడిట్ కార్డ్‌పై చెల్లించారు. తను చేసిన పనికి వేల డాలర్లు ఇచ్చారని తెలుసుకున్నప్పుడు వెయిట్రెస్ మరియానా లాంబెర్ట్ పూర్తిగా ఆశ్చర్యపోయింది. తను చాలా అదృష్టవంతురాలు అనుకుంది.

అయితే ఎరిక్ ఇది సోషల్ మీడియా ఉద్యమంలో భాగమని పేర్కొంటూ బిల్లులో టిప్స్ ఫర్ జీసస్ అని రాశారు. ఇది కాస్తా వివాదాస్పదం అయింది. ఈ క్రమంలో రెస్టారెంట్ ప్రతినిధులు సోషల్ మీడియాలో ద్వారా స్మిత్‌ను కలుసుకున్నారు. ఆ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్మిత్ రెస్టారెంట్ అభ్యర్థనను పట్టించుకోలేదు. పైగా తనపై కేసు వేసుకోమని చెప్పడంతో.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆయనపై దావా వేయాలని రెస్టారెంట్ నిర్ణయించుకుంది. అభ్యంతరాలు ఉంటే.. కేసు పెట్టుకోమని ఆ కస్టమర్ కూడా చెప్పడంతో.. రెస్టారెంట్ ఓనర్ జాకబ్సన్ దావా వేసేందుకు సిద్ధపడ్డారు.

 బూజునూరు గ్రామంలో... వ్యాపారి ఆత్మహత్య

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా,గడివేముల మండల పరిధిలోని బూజునూరు గ్రామంలో చికెన్ మరియు మటన్ సెంటర్ నడిపే వ్యాపారి ఆత్మహత్య వివరాల్లోకి వెళితే చాకలి మధు కుమార్(28) పొట్టేలు మరియు చికెన్ వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగించేవారు వ్యాపారంలో నష్టం రావడంతో తట్టుకోలేక ఇంటిలో ఎవరు లేని సమయంలో చీర తో ఉరి వేసుకొని చనిపోయాడని భార్య నాగలక్ష్మి తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకొని ఏ ఎస్ ఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు ప్రారంభించారు.

 ఎనెర్జియన్ గ్రూవ్ ను ప్రవేశపెట్టిన క్రాంప్టన్

కరెంటు బిల్లుపై 60% దాకా ఆదా 

(జానో జాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ తన తాజా శక్తి సామర్థ్యపూరిత సీలింగ్ ఫ్యాన్ శ్రేణి ఎనెర్జియన్ గ్రూవ్ ను  ప్రవేశపెట్టింది. శక్తి సామర్థ్యంలో అత్యంత అనుభవం కలిగిన బ్రాండ్లలో ఒకటి అని  స‌చిన్ ప‌ర్టియ‌ల్ పేర్కొన్నారు. , నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డును వరుసగా 6 సార్లు గెలిచిన క్రాంప్టన్ సంపూర్ణ మన్నిక, నాణ్యత హామీతో 80 ఏళ్లకు పైగా చరిత్రను కలిగిఉందని ఆయ‌న అన్నారు. . దీని సరికొత్త 5 స్టార్ రేటెడ్ ఫ్యాన్ యాక్టివ్ బీఎల్డీసీ మోటార్ తో శక్తివంతమైంది. 220 సిఎంఎం గాలిని అందించేందుకు వాగ్దానం చేస్తుంది. 70W కు బదులుగా 28W విద్యుత్ ను మాత్రమే ఉపయోగిస్తుంద‌ని తెలిపారు.  తద్వారా 60% ఆదాతో, ప్రామాణిక ఇండక్షన్ ఫ్యాన్ తో పోలిస్తే కరెంట్ బిల్లుపై (నాలుగు ఫ్యాన్లకు కలిపి) ఏటా రూ.7000 దాకా ఆదాను అందిస్తుంది. మీ ఫ్యాన్ వేగం, గాలి ప్రవాహంతో రాజీ పడకుండానే, క్రాంప్టన్ ఎనర్జియన్ అందమైన డిజైన్లలో కూడా లభ్యమవుతుంది. రిమోట్ కంట్రోల్, యాంటీ డస్ట్ టెక్నాలజీ క‌లిగి ఉంద‌ని స‌చిన్ అన్నారు. 


నేడు వినియోగదారులు తమ ఇళ్లలో గణనీయ మార్పులు తీసుకురాగల వాటి కోసం, అదే సమయంలో పర్యా వరణానికి స్నేహపూర్వకంగా ఉండే సుస్థిరదాయక, సామాజిక స్పృహ కలిగిన ఎంపికల కోసం చూస్తున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో వారు తమ పర్యావరణ స్నేహపూర్వక ఉపకరణాల విషయానికి వస్తే నిరాశను ఎదుర్కోవాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా శక్తిసామర్థ్యపూర్వక సీలింగ్ ఫ్యాన్ల విషయానికి వస్తే, గాలి తక్కువగా రావడం, సౌలభ్యం లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. దీన్ని గుర్తించిన క్రాంప్టన్ శక్తి సామర్థ్య పూరిత వినూత్నతలను నూతన శిఖరాలకు తీసుకెళ్లింది.  సంచలనాత్మక రీతిలో సరికొత్త యాక్టివ్ బీఎల్డీసీ శ్రేణికి చెందిన ఫ్యాన్లు – ఎనర్జియన్ గ్రూవ్ ను ప్రవేశపెట్టింది. ఇవి శక్తి వినియోగాన్ని తగ్గించడమే గాకుండా గాలి సౌలభ్యం, బ్రీజ్, డెలివరీలపై రాజీపడకుండానే ఫుల్ స్పీడ్ ఆదాలను గరిష్ఠం చేసేందుకు వీలు కల్పిస్తాయి. యాక్టివ్ – బీఎల్డీసీ మోటార్ టెక్నాలజీతో శక్తివంతం –హై ఫుల్ స్పీడ్ ఆదాలకు కారణం ఇదే

ఎనర్జీ గ్రూవ్ 28W శక్తిని మాత్రమే వినియోగిస్తుంది. ప్రామాణిక ఇండక్షన్ ఫ్యాన్ తో పోలిస్తే కరెంట్ బిల్లుపై ఏటా రూ.7000 దాకా ఆదాను అందించడంలో మీకు తోడ్పడుతుంది. మార్కెట్లో లభ్యమయ్యే రిమోట్ కంట్రోల్డ్ ఫ్యాన్లు చాలా వరకు ఐఆర్ టెక్నాలజీతో ఉంటాయి. దాంతో మీరు వాటిని ఫ్యాన్ దిశగా చూపిస్తూ ఆపరేట్ చేయాలి. మధ్యలో ఏదైనా అడ్డుగా ఉంటే అవి పని చేయవు. క్రాంప్టన్ ఎనర్జియన్ గ్రూవ్ అదనపు సౌలభ్యం కోసం ఆర్ఎఫ్ టెక్నాలజీని వినియోగిస్తుంది. దాంతో మీరు దాన్ని ఫ్యాన్ దిశగా చూపించకుండానే ఆపరేట్ చేయవచ్చు. తద్వారా నిర్వహణను సులభతరం చేస్తుంది.

స్లీప్ టైమర్, స్పీడ్ కంట్రోల్, మల్టీ పెయిరింగ్, ఇంటెలిజెంట్ మెమరీలతో ఈ ఫీచర్లు ఫ్యాన్ సులభ నిర్వహణను మరింత సౌకర్యవంతం చేస్తాయి. సామర్థ్యపూర్వక గృహోపకరణాల వినూత్నతలపై క్రాంప్టన్ నిరంతర ప్రయత్నాలపై క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (అప్లియెన్స్ బిజినెస్) శ్రీ సచిన్ ఫర్టియాల్ మాట్లాడుతూ, ‘‘ప్రతీ ఇంటికీ సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని అందించడమే క్రాంప్టన్ నిరంతర లక్ష్యం.  అది వినియోగదారులు తమ జీవనశైలిపై రాజీ పడాల్సిన అవసరం లేకుండా చేస్తుంది, అదే సమయంలో భూమి రక్షణకు బాధ్యతా యుతంగా మెలిగే అవకాశాన్నీ అందిస్తుంది’’ అని అన్నారు.దీని ధర రూ.6000 నుంచి రూ.6750. అందుబాటులో ఉన్నాయ‌ని స‌చిన్ పార్టియ‌ల్ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.


 వైరల్ అవుతున్నా...ఆ సాలీడు పురుగు  వీడియో


అపుడప్పుడు కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగానే  కాదు వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ సాలీడు పురుగు వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అంతేకాదు దీనిపై నేటిజన్లు వింతవింతగా స్పందిస్తున్నారు. ఏడు దశాబ్దాలకుపైగా బ్రిటన్‌ సహా పలు కామన్వెల్త్‌ దేశాలకు రాణిగా సేవలందించిన ఎలిజబెత్‌-2 అంత్యక్రియలు సోమవారం లక్షల మంది సమక్షంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి 2 వేల మంది దాకా దేశాధినేతలు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. కింగ్‌ చార్లెస్‌-3 ఆధ్వర్యంలో వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో క్యాటఫాక్‌పై నుంచి రాణి శవపేటికను విండర్స్‌ క్యాజిల్‌‌కు తరలించారు. రాణి అంతిమయాత్రలో యావత్‌ రాజ కుటుంబం పాల్గొనగా.. అనుకోని అతిథి కూడా సందడి చేసింది. ఆమెకు వీడ్కోలు పలికేందుకు రాణి శవపేటికపై ఓ సాలీడు వాలింది. దీనిని అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తన తల్లి గురించి కింగ్ ఛార్లెస్-3 స్వయంగా చేతిరాతతో రాసిన నోట్‌‌ను రాణి శవపేటికపై ఉంచగా.. దానిపై సాలీడు వచ్చి వాలింది. అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది ట్విటర్ యూజర్లు ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఇది అత్యంత ప్రసిద్ధ స్పైడర్ అని క్యాప్షన్ పెట్టాడు.

‘‘క్వీన్ ఎలిజబెత్ II శవపేటికపై అందమైన చిన్న సాలీడు కనిపించింది.. అందరితో పాటు రాణికి అది కూడా నివాళులర్పించాలని భావించినట్టు’’ ఉందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ‘ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ సాలీడు ఇదే’ అంటూ మరో ట్విటర్ యూజర్ వీడియోను షేర్ చేశారు. ‘‘క్వీన్ ఎలిజబెత్ II శవపేటికపై సాలీడు సవారీ చేస్తుండగా మరెవరైనా గుర్తించారా?" అని ఒకరు.. ‘‘రాజకుటుంబం, బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని తోట నుంచి కింగ్ చార్లెస్ ఎంచుకున్న పువ్వుల మధ్య క్వీన్ ఎలిజబెత్ II శవపేటికపై సాలీడు ఎంత అందంగా ఉంది?’’ అని మరొకరు ట్వీట్ చేశారు.

ఇదిలావుంటే క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల్లో విధులు నిర్వహిస్తుండగా ఓ పోలీసు అధికారి కుప్పకూలిపోయాడు. ఆ అధికారి స్పృహతప్పి పడిపోవడంతో స్ట్రెచర్‌పై తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. అంత్యక్రియల ఊరేగింపు వేళ పార్లమెంటు స్క్వేర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

 ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన..

నంద్యాలజిల్లా పంచాయయితీ అధికారి శ్రీనివాసులు

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండల పరిధిలోని దుర్వేసి,కొరటమద్ది మరియు గడిగరెవుల వ్యర్థ పదార్థాల కేంద్రాలనులను సందర్శించి తనీఖీ చేసి కేంద్రాలలో పనులు చేస్తున్న సిబ్బందికి కేంద్రాలలో నిర్వహణకు సంబంధించి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచనలు మరియు ఆదేశాలు జారీ చేశారు.  ఈ కార్యక్రమం లో ఇవోఆర్డీ ఖాలిక్ బాషా మూడు గ్రామపంచాయతీల గ్రామ పంచాయతీ కార్యదర్శులు , ఎఫ్ టీ సి  గోపాల్ మరియు  కొరట మద్ది సర్పంచ్ నాగేశ్వర రెడ్డి, దుర్వేసి రమేష్ మరియు  సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ కార్మిక సిబ్బంది (క్లాప్) సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


పార్టీ ఇచ్చిన ప్రతి విషయాన్ని ప్రజలకు చేర్చండి

దేశం సత్యనారాయణ రెడ్డి  పిలుపు

(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

పార్టీ ఇచ్చిన ప్రతి విషయాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు దేశం సత్యనారాయణ రెడ్డి  పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం టిడిపి పార్టీ ఇన్చార్జి మరియు మాజీ శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి ఆదేశాల మేరకు, గడివేముల మండల  కన్వీనర్ దేశం సత్యం రెడ్డి  ఆధ్వర్యంలో మండల ఐటీడీపి టీం మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి  మాట్లాడుతూ


ఐటిడిపి పనితీరు బాగుందని, ఇంకా బాగా పనిచేసి ప్రజల్లోకి మరింత ముందుకు దూసుకెళ్లాలని, పార్టీ ఇచ్చిన ప్రతి విషయాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు సూచించారు. ఐటిడిపి పాణ్యం నియోజకవర్గ అధికార ప్రతినిధి రాజు ఆర్మీ (Retd )మాట్లాడుతూ  సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండాలని, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో కూడా ఐటిడిపి సభ్యులు పాల్గొనాలన్నారు.పార్టీని బలోపేతం చేసి,ఎన్నికలలో గెలవడానికి మన వంతు పాత్ర పోషించాలని, పార్టీ గెలవడానికి సోషల్ మీడియా ఒక పెద్ద ఆయుధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో
 ఐటిడిపి సభ్యులు మతృ నాయక్, పరమేష్ నాయక్, బద్దు నాయక్, సోను బాబు, లోకేష్, నాగేశ్వరరావు, నవీన్ పాల్గొన్నారు.

 వ్యక్తిగతంగా హాజరుకండి

కర్నూలు డీఈఓ రంగారెడ్డికి ఎస్.సి కమీషన్ చైర్మన్ ఆదేశాలు

(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

వ్యక్తిగతంగా హాజరుకండి అంటూ కర్నూలు డీఈఓ రంగారెడ్డికి ఎస్.సి కమీషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ఆదేశాలు జారీచేశారు. ఇదిలావుంటే నంద్యాల జిల్లా, కోవెలకుంట్ల మండలం, రేవనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీ గా పనిచేయుచున్న కె. సతీష్ కుమార్ ను అక్రమంగా, నిబంధనలకు వ్యతిరేకంగా 30.08.2022న సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.


బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు కె. సతీష్ కుమార్ మాట్లాడుతూ తాము విద్యావ్యవస్థ పటిష్ఠతకై చేసిన అనేక లిఖితపూర్వక ఫిర్యాదులు పాఠశాలకు వెళ్లకుండా ఉపాధ్యాయులు, నిధులు స్వాహా చేసే హెచ్.ఎం లు, ఎంఇఓ లు, తప్పుడు సర్టిఫికెట్లతో పదోన్నతులు, తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు, బదిలీలల్లో మోసాలు,నిత్యం తప్పులు చేసిన వారిపై పిర్యాదు చేయగా అధికారులు విచారించి నామమాత్రపు పనిష్మెంట్లు ఇచ్చారని తెలిపారు.భవిష్యత్ లో మరి కొంతమందికి పనిష్మెంట్లు వచ్చే అవకాశం ఉండగా  పనిష్మెంట్లు పొందిన వారు, కొందరు కలిసి ఉపాధ్యాయ సంఘాల జే.ఏ.సి  పేరుతో కడప ఆర్జేడీ వెంకట కృష్ణారెడ్డి గారికి డీఈఓ రంగారెడ్డి గారికి సమాచార హక్కు చట్టం 2005 ను దుర్వినియోగం చేస్తున్నారని పిర్యాదు చేసినట్లు , దానిపై విచారణ చేయకుండానే విచారణ చేసినట్లు ఒక తప్పుడు మోసపూరిత రికార్డ్ సృష్టించి చట్టపరిధిలో క్రైమ్ చేయడమే కాకుండ ఎటువంటి సంజాయిషీ కొరకుండా  సస్పెన్షన్ చేసిన అంశంలో ఏ.పి.ఎస్.సి కమీషన్ చైర్మన్ కు పిర్యాదు చేసినట్లు తెలిపారు. 

అక్రమంగా  సస్పెన్షన్ చేసిన పిర్యాదు అంశంలో స్పందించిన ఎస్.సి కమీషన్ చైర్మన్ 20.09.2022న డీఈఓ రంగారెడ్డిని రికార్డ్స్ తీసుకొని  ఎస్.సి కమిషన్ చైర్మన్ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

అంతేకాకుండా గౌరవ విద్యాశాఖ కమిషనర్ గారికి కూడా అక్రమ సస్పెన్షన్ పై  పిర్యాదు  జాయింట్ కలెక్టర్ చే విచారణ చేయించాలని ,  బహుజన టీచర్స్ ఫెడరేషన్ చేసిన పిర్యాదులన్నింటిపై కూడా బహిరంగ విచారణ చేయించి వాస్తవాలపై న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిటిఎఫ్ నాయకులు వెంకట్, సుబ్బారావు, రఫీ, మౌలిబాషా, కబీర్,  వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.