అడవి నుంచి జనవాసాల్లోకి వచ్చి దాడి


అడవి నుంచి చీమలు జనవాసాల్లోకి వచ్చి మరీ దాడి చేస్తున్నాయి.  ఇదేక్కడో కాదండోయ్ మన పక్కనున్న తమిళనాడులోనే. బలవంతమైన సర్పము.. చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ!.. ఇది సుమతీ శతకకారుడి పద్యం. ఆయన చెప్పింది అక్షరాలా నిజం.  అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది చలి చీమల గురించి కాదు. ఎర్రటి చీమలు అడవి నుంచి జనవాసాల్లోకి వచ్చి దాడి చేస్తున్నాయి. కలసికట్టుగా కీటకాలు, పాములు, జంతువులను తినేస్తున్నాయి. ఇది ఆఫ్రికా దేశంలో అని అనుకోవద్దు. తమిళనాడులోని దిండిగల్ జిల్లా కరతమలై అటవీ పరిసర గ్రామాల్లో ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితి.

వీటి పేరు ఎల్లో క్రేజీ యాంట్స్. ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాల్లో ఇవి కనిపిస్తుంటాయి. మన దగ్గర కొత్తగా వీటి అస్తిత్వం బయటకు వచ్చింది. ఈ చీమల వల్ల పశువులకు కంటి చూపు పోతోంది. పంటలకు నష్టం కలుగుతోంది. పాములు, కుందేళ్లు, ఇతర చిన్న పాటి జంతువులను ఈ చీమల దండు దాడి చేసి తినేస్తోంది. వీటికంటూ ఫలానా ఆహారం ఏదీ లేదని, కనిపించిన దేన్నయినా తినేస్తాయని ఎల్లో క్రేజీ యాంట్స్ పై పరిశోధన చేసిన ఎంటమాలజిస్ట్ డాక్టర్ ప్రణయ్ బైద్య తెలిపారు.

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన 100 జాతుల్లో ఎల్లో క్రేజీ యాంట్స్ కూడా ఒకటి. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ చెబుతోంది. చీమ అంటే కుడుతుంది. కానీ, ఎల్లో క్రేజీ యాంట్స్ కుట్టవు. ఫార్మిక్ యాసిడ్ ను చిమ్ముతాయి. ఇది కళ్లల్లో పడితే కంటి చూపు పోతుంది. ఒక్కో చీమ 4ఎఎం పొడువు ఉంటుంది. పొడవాటి కాళ్లు ఉంటాయి. తలపై పొడవాటి యాంటెన్నాలా ఉంటుంది. 

ఈ చీమల దాడి, పంటల నష్టంతో దిండిగల్ జిల్లాలోని గ్రామాల నుంచి ప్రజలు వలసపోతున్నారు. కొన్నేళ్ల క్రితం నుంచి ఈ చీమలను తాము సమీప అడవుల్లో చూస్తున్నామని.. కానీ, పెద్ద సంఖ్యలో గుంపులుగా గ్రామాల్లోకి రావడం ఇదే మొదటిసారిగా స్థానికులు చెబుతున్నారు. చీమల మందు చల్లినా కానీ వాటిని నియంత్రించలేకపోతున్నారు. పైగా వాటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉందంటున్నారు. ప్రజల వినతి మేరకు అటవీ అధికారులు నిపుణుల సాయం కోరారు. 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: