నిజాయితీ ప్రదర్శించారు...ప్రశంసలు అందుకొంటున్నారు


నిజాయితీ కనుమరుగవుతున్న ఈ తరుణంలో ఓ రజక సోదరుడు నిజాయితీ చాటాడు...పలువురి ప్రశంసలు పొందాడు. డా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాచ్‌మన్ దంపతులు నిజాయితీ చాటుకున్నారు. తమకు దొరికిన బంగారాన్న తిరిగి అప్పగించి శభాష్ అనిపించుకున్నారు. అమలాపురం స్థానిక భూపయ్య అగ్రహారం మహానంద అపార్ట్‌మెంట్‌లో మల్లేశ్వరరావు దంపతులు వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రుద్రరాజు నానిరాజు కుమార్తె డాక్టర్‌ ఆర్‌.సాయిశిల్ప పట్టణంలో సాయి సంజీవిని ఆస్పత్రి నిర్వహిస్తున్నారు.

శిల్ప తన మాసిన వస్త్రాలను ఉతికి ఇస్త్రీ చేసేందుకు రజకులైన మల్లేశ్వరరావు దంపతులకు ఇస్తుంటారు. ఎప్పటిలాగే రెండు రోజుల క్రితం డాక్టర్‌ సాయిశిల్ప మాసిన వస్త్రాలను ఓ బ్యాగ్‌లో ఉంచి మల్లేశ్వరరావు దంపతులకు ఇచ్చారు. గతంలో శిల్ప అదే బ్యాగ్‌తో ఊరెళ్లొచ్చారు. అయితే రూ.4 లక్షల విలువైన బంగారు నగ ఉన్న కవర్‌ను పొరపాటున బ్యాగ్‌లో మరచిపోయారు. మాసిన వస్త్రాలను అదే బ్యాగ్‌లో ఉంచి మల్లేశ్వరరావు దంపతులకు ఇచ్చారు. నగ సంగతి మర్చిపోయారు. ఇంతలో బంగారు నగ కనిపించకపోవడంతో డాక్టర్‌ శిల్ప కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు.

ఈలోపు ఆ బ్యాగ్‌లో మాసిన వస్త్రాలను ఉతికేందుకు బయటకు తీసిన మల్లేశ్వరరావు దంపతులకు బంగారు నగ కనిపించింది. వెంటనే ఆ బంగారు నగను దంపతులు నిజాయితీగా తీసుకువెళ్లి డాక్టర్‌ సాయిశిల్పకు అందజేశారు. భార్యాభర్తల నిజాయితీకి మెచ్చిన సాయిశిల్ప తల్లిదండ్రులైన మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రుద్రరాజు నానిరాజు, ఉషాకుమారి.. మల్లేశ్వరరావు దంపతులను సత్కరించారు. అంతేకాదు రూ.5 వేల నగదు బహుమతి అందజేశారు. మల్లేశ్వరరావు దంపతుల నిజాయితీని చాటుకున్నారని స్థానికులు అభినందించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: