పర్యటకులను ఆకర్షించేందుకు..సింగపూర్ లో కొత్త వీసా విధానం

పర్యటకులను పెంచుకోవడమే ధ్యేయంగా సింగపూర్ కొత్త వీసా నిబంధనలు ప్రకటించింది. దేశంలోకి విదేశీ నిపుణులు, వ్యాపారవేత్తల వలసను పెంచేలా వీసా నిబంధనలను సడలిస్తూ నూతన వీసా విధానానికి రూపకల్పన చేసింది. కరోనా సంక్షోభం కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించే చర్యల్లో భాగంగా వర్క్ వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలతో ఓ ప్రకటన జారీ చేసింది. 

తాజా నిబంధనల ప్రకారం.... నెలకు కనీసం రూ.17 లక్షలు సంపాదించే విదేశీయులకు ఐదేళ్ల వర్క్ వీసా పొందే వీలుంటుంది. అంతేకాదు, వారిపై ఆధారపడినవారు కూడా సింగపూర్ లో ఉపాధి వెదుక్కునేందుకు అర్హులవుతారు. క్రీడలు, కళలు, శాస్త్ర, విద్యా రంగాలకు చెందిన వారు వేతనాలతో సంబంధం లేకుండా ఈ దీర్ఘకాలిక వీసాకు అర్హులవుతారని సింగపూర్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 


ఈ ఐదేళ్ల వర్క్ వీసా విధానానికి సింగపూర్ ప్రభుత్వం వన్ (ONE) అని నామకరణం చేసింది. ONE అంటే Overseas Networks and Expertise అని అర్థం. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.  దీనిపై సింగపూర్ మానవ వనరుల శాఖ మంత్రి తాన్ సీ లెంగ్ స్పందిస్తూ... "వ్యాపారవేత్తలు, నిపుణులు తమ పెట్టుబడులకు, ఉపాధికి, జీవనానికి సురక్షితమైన, సుస్థిరమైన ప్రదేశాలను వెదుకుతుంటారు. సింగపూర్ అలాంటి ప్రదేశమే. ప్రతిభకు పట్టం కట్టే ప్రపంచ కేంద్రంగా సింగపూర్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాం" అని వివరించారు. సింగపూర్ ప్రధానంగా నగర ఆధారిత ఆర్థిక కేంద్రంగా విలసిల్లుతోంది. ఈ కేటగిరీలో ప్రధానంగా హాంకాంగ్, యూఏఈ నుంచి సింగపూర్ కు పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోనూ, కొత్త వర్క్ వీసా విధానం తమకు సత్ఫలితాలు అందిస్తుందని సింగపూర్ ప్రభుత్వం ఆశాభావంతో ఉంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: