అలా చేయడం అంబేద్కర్ ను అవమానించడమే


అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం  పేరు మార్చడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విదేశీ విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారమే అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ తన పేరు చేర్చడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరును తొలగించడం ఆయనను అవమానించడమే అన్నారు. ఇది జగన్ అహంకారమే అంటూ ధ్వజమెత్తారు. అంతేకాదు అంబేద్కర్ ను దైవంగా భావించే వారందరినీ కూడా అవమానించినట్టేనని.. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేద్కర్ పేరును చేర్చమని ప్రభుత్వాన్ని టీడీపీ డిమాండ్ చేస్తోంది అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో "అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం" కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించామని గుర్తు చేశారు.

అలాగే "ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ" పథకం కింద బీసీ, మైనారిటీ విధ్యార్థులకైతే రూ.15 లక్షలు.. ఈబీసీ, కాపు విద్యార్థులైతే రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారన్నారు. ఈ రకంగా ఐదేళ్ల తెలుగుదేశం హయాంలో మొత్తం 4528 మంది విద్యార్థుల విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించామన్నారు. మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. ఇప్పుడు "అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం"  పేరు నుంచి అంబేద్కర్ పేరును తొలగించింది అన్నారు.

గతంలో ఉన్న ఏపీ అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకాన్ని.. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంగా ఏపీ ప్రభుత్వం మార్చింది. గత ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో చదువుకునే ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఇప్పుడు ఆ పథకానికి కొన్ని మార్పులు చేసింది.. ఇటీవలే మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే.

క్యూఎస్‌ ర్యాంకు 200లోపున్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన పేద విద్యార్థులకే ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పథకానికి రూ.6 లక్షల వరకు ఆదాయ పరిమితి ఉండగా.. దీన్ని రూ.8 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. గత ప్రభుత్వంలో ఈ పథకానికి ఉన్న అంబేద్కర్ పేరు తొలగించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా చంద్రబాబు కూడా పథకం పేరు మార్పు వ్యవహారంపై స్పందించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: