కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: కోదండ రామ్


నిరుద్యోగ సమస్యను గుర్తించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విమర్శించారు. నిరుద్యోగం కారణంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కోదండరామ్ మీడియాతో మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం తక్షణమే అగ్నిపథ్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. అగ్నిపథ్ పనికిరాని విధానమని.. ఈ విధానం సుశిక్షితులైన సైనికులను తయారు చేయదని ఆయన అన్నారు. పింఛన్లు లాంటివి తప్పించుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘అగ్నిపథ్‌’ను తీసుకొచ్చిందని కోదండరామ్ ఆరోపించారు. ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించకపోతే దేశ యువత శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం అవుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆందోళన చేప్పట్టిన యువకులపై కేసులు పెట్టి వేధించవద్దని కోదండరామ్ కోరారు. ప్రభుత్వం కుట్ర సిద్ధాంతాన్ని పక్కనపెట్టి యువకుల ఆగ్రహాన్ని గుర్తించాలని అన్నారు. శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని.. రాజకీయంగా మల్చుకోవడాన్ని ఆపాలని కోదండరామ్‌ సూచించారు. ప్రభుత్వం యువకుల ఆందోళనను పట్టించుకోకుండా.. సికింద్రాబాద్‌లో కాల్పులు జరిపిందని అన్నారు. అల్లర్లలో మృతి చెందిన యువకుడు రాకేష్ కుటుంబానికి పార్టీ తరఫున సాయం అందిస్తామని ప్రకటించారు.

‘కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆర్మీ నియామక పరీక్షను వాయిదా వేస్తూ వచ్చింది. కేంద్రానికి అర్థం కావాలనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద యువకులు ఆందోళన చేపట్టారు. టియర్ గ్యాస్‌, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించకుండా.. కాల్పులు ఎలా జరిపారు?’ అని కోదండరామ్ ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లో జరిగిన పరిణామాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: