ఆ వివాహం భలే విచిత్రం...స్వీయ వివాహానికి సిద్దపడ్డ యువతి


మారుతున్న కాలంలో  వివాహాలు విషయంలో అనేక చిత్ర, విచిత్రాలను చూస్తున్నాం. కానీ ఈ వివాహం భలే విచిత్రమైంది. ఇక్కడ మనం వినబోయే పెళ్లి వేడుక చాలా ప్రత్యేకమైనది. ఎప్పుడూ విని ఉండం. గుజరాత్ లోని వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమాబిందు పెళ్లి చేసుకుంటోంది. ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా..? ఉందండి. ఆమె తనకు నచ్చినవాడినో, లేదా పెద్దలు కుదర్చిన వ్యక్తినో పెళ్లి చేసుకుని వైవాహిక బంధాన్ని ప్రారంభించడం లేదు. తనను తానే పెళ్లాడుతోంది. విచిత్రంగా అనిపించినా ఇది ముమ్మాటికి నిజం. ముహూర్తం జూన్ 11. 

ప్రకృతి విరుద్ధమైన పెళ్లి అయినా ఆమె సంప్రదాయబద్దంగానే చేసుకోవాలని నిర్ణయించుకుంది. గుజరాత్ లో ఇదే తొలి స్వీయ వివాహం (సోలోగమీ) కానుంది. ‘‘నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు. అయినా కానీ, వధువుగా మారాలని అనుకుంటున్నాను. అందుకే స్వీయ వివాహం. నేను దీనికి సంబంధించి ఆన్ లైన్ లో కూడా శోధించాను. దేశంలో ఏ మహిళ అయినా తనను తానే పెళ్లి చేసుకుందా అని పరిశీలించాను. కానీ, ఎవరూ లేరని తెలిసింది. కనుక దేశంలో తనను తాను ప్రేమించి పెళ్లి చేసుకునే మొదటి వ్యక్తిని నేను ’’ అని క్షమాబిందు ప్రకటించింది.

‘‘స్వీయ వివాహం అంటే నీ పట్ల నువ్వు అంకిత భావం కలిగి ఉండడం. ఎటువంటి షరతుల్లేని ప్రేమకు నిదర్శనం. తనను తాను స్వీకరించడం ఇది. ప్రజలు తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటారు. నన్ను నేనే ప్రేమించాను’’ అందుకే ఈ పెళ్లి అని బిందు వింత వాదన వినిపించింది. తన తల్లిదండ్రులు స్వేచ్ఛావాదులంటూ, తన పెళ్లికి దీవెనలు అందించినట్టు చెప్పింది. గోత్రిలోని ఆలయంలో వివాహం చేసుకున్న తర్వాత హనీమూన్ కోసం గోవా వెళ్లాలన్నది క్షమాబిందు ప్రణాళికల్లో భాగం. అప్పుడప్పుడు ఇలాంటి అరుదైన విషయాలు వినాల్సి వస్తుంది తప్పదు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: