జూన్ 2022

 ఓమ్నీ ఛానెల్‌ వినియోగదారుల అనుభవాలనందించేందుకు

జినెసిస్‌ ఒన్‌తో భావితరపు రిటైల్‌బ్రాండ్లకు శక్తినందిస్తోన్న జినెసిస్‌ 

ఓమ్నీ ఛానెల్‌ సామర్థ్యంలను సంతరించుకోవడంలో  సమస్యలనెదుర్కొంటున్న  రిటైలర్లకు సహాయపడటంతో  పాటుగా నూతన తరపు వినియోగదారులకు  సేవలనందించడంలో తోడ్పడేందుకు  జినెసిస్‌ కనెక్ట్‌ను  జినెసిస్‌  ప్రారంభించింది.

ఈ జినెసిస్‌ కనెక్ట్‌ కార్యక్రమం ద్వారా రిటైల్‌ కమ్యూనిటీని ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటుగా వారికి అత్యాధునిక డిజిటల్‌ పరిష్కారాలను సైతం అందించి  లీనమయ్యే, ఓమ్నీ ఛానెల్‌ అనుభవాలను సైతం అందించనుంది.  హైదరాబాద్‌లో జరిగిన తొలి  కార్యక్రమంలో బిగ్‌ సీ మొబైల్‌ డైరెక్టర్‌ స్వప్నకుమార్‌ ;  కంకటాల డైరెక్టన్‌ అనిరుధ్‌ కంకటాల ;  నీమన్స్‌ డైరెక్టర్‌ తరణ్‌ చాబ్రా మరియు హోమ్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ నీరజ్‌ హార్ర్కుత్‌ లు సాంకేతికత వల్ల లభించే అవకాశాలు,  ఎదురవుతున్న సవాళ్లు, భారతదేశంలో రిటైల్‌ పరిశ్రమ బలోపేతం కావడానికి అవసరమైన ఆవిష్కరణలను గురించి చర్చించారు.

ఈ సదస్సుకు సంధానకర్తగా  స్టార్ట్‌క్యాప్‌ ఎడ్వైజరీ  అభిజీత్‌ బెనర్జీ వ్యవహరించారు. ఈ కార్యక్రమం లో అందుకున్న అభిప్రాయాల ప్రకారం 40% మంది హైదరాబాద్‌ రిటైలర్లు తమ ఈ–కామర్స్‌, వేర్‌హౌస్‌ మరియు రిటైల్‌ కార్యక్రమాలను సైతం నిర్వహించగల సమగ్రమైన పరిష్కారాల కోసం చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ నుంచి 50 కు పైగా రిటైల్‌ బ్రాండ్ల సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఓమ్నీ ఛానెల్‌ లక్ష్యాలను  చేరుకోవడంలో సాంకేతిక పాత్ర గురించి జినెసిస్‌  సీఓఓ హర్ష్‌ నహతా  మాట్లాడుతూ ‘‘ఓమ్నీ ఛానెల్‌ మోడల్స్‌ వైపు రిటైలర్లు మారుతున్న వేళ,  సౌకర్యవంతమైన అనుభవాలను అందించడం అత్యంత ప్రాధాన్యతగా పరిశ్రమకు మారతాయి. మరీ ముఖ్యంగా క్లౌడ్‌ మరియు ఏఐ సాంకేతికతలు అతి సాధారణంంగా మారిన వేళ ఇది మరీ ముఖ్యమైంది. రిటైలర్లందరూ ఒకే తరహా సమాచారం పొందాలని ఏమీలేదు. జినెసిస్‌  కనెక్ట్‌తో మేము ఆ తరహా సమాచారం అందించాలనుకోవడంతో పాటుగా కేస్‌స్టడీస్‌, అత్యుత్తమ ప్రక్రియలను పంచాలనుకుంటున్నాము. భవిష్యత్‌కు అవసరమైన సాంకేతిక తను జినెసిస్‌  అందించనున్నప్పటికీ, ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన సూచనలు దీనిని మరింతగా మెరుగుపరచనున్నాయి’’ అని అన్నారు

 చాక్లెట్ రూమ్' కేఫ్ లాంజ్ స్టోర్ ప్రారంభం

(జానో జాగో వెబ్ న్యూస్- బిజినెస్ బ్యూరో)

భారతదేశంలోని ప్రసిద్ధ చాక్లెట్ కేఫ్ 'చాక్లెట్ రూమ్' ను‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దా, చిన్నా తేడా లేకుండా అందరూ చాక్లెటులంటే ఇష్టపడతారని పేర్కొన్నారు. హైదరాబాదులోని ఈ వైపు ఈ బ్రాంచ్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. మరింతగా విస్తరించి నగర వాసుల ఆదరాభిమానాలు పొందాలని‌ అభిలషించారు. 


     ‌‌‌  బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి మాట్లాడుతూ చాక్లెట్ లు అంటే ఇష్టపడని‌ వారు ఎవరూ ఉండరన్నారు. నాకు కూడా చాక్లెట్ లు అంటే అమితమైన ఇష్టమన్నారు. ఈ చాక్లెట్ రూమ్ ఎంతగానో వృద్ధి చెందాలని కోరారు. లాంచింగ్కు రావడం చాలా‌ ఆనందంగా ఉందన్నారు. 


      ది చాక్లెట్ రూమ్ కో - ఫౌండర్, సీఎండీ ఎల్ చైతన్య కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన కేఫ్ లాంజ్‌లో వంద సీటింగ్ కెపాసిటీతో ప్రారంభించామన్నారు. ఫ్రాంచైస్ ఓన‌ర్ స‌చిన్ మోహ‌రిల్‌ మాట్లాడుతూ వినియోగదారుల మ‌న్న‌న‌లు పొందె విధంగా సేవ‌లందిస్తామ‌ని అన్నారు. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద స్టోర్ను బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 14 లో ప్రారంభించామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 4200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది 300వ స్టోర్‌ అన్నారు. మెక్సికన్, ఇటాలియన్ తో పాటు అనేక‌ రకాల కొత్త వంటకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. ఇందులో ఇటాలియన్ హాట్ చాక్లెట్, చాక్లెట్ ఫాండ్యులు, చాక్లెట్ మెల్టింగ్ పాట్స్, మెక్సికన్, ఇటాలియన్ వంటకాల్లో అనేక రకాలైన చాక్లెట్ కేకులు, వాఫ్ఫల్స్, బెల్జియన్ చాక్లెట్‌లతో వివిధ రుచులను అందిస్తోందని పేర్కొన్నారు. 

       కస్టమర్లకు ప్రత్యేకమైన చాక్లెట్ అనుభవాన్ని అందించే ప్రత్యేక చాక్లెట్ ఇండల్జెన్స్ కేఫ్‌గా ప్రసిద్ధి చెందిందన్నారు. 15 ఏళ్లుగా అత్యంత ప్రసిద్ధ చాక్లెట్ కేఫ్ తన వినియోగదారులను తిరుగులేని ట్రీట్‌లతో ఆహ్లాదపరుస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ సంస్కృతిలో కొత్త తరంగాన్ని సృష్టిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లో మా స్టోర్‌ను ప్రారంభించినందుకు చాలా సంతోషిస్తున్నామన్నారు. 2007లో మొదటి స్టోర్‌ను ప్రారంభించినప్పటి నుంచి మేము సాటిలేని చాక్లెట్ అనుభవాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చాక్లెట్ ప్రియుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. మా లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం, మా కస్టమర్‌లు మా స్టోర్‌లను సందర్శించిన ప్రతిసారీ ప్రత్యేకమైన చాక్లెట్ క్షణాన్ని అందించడమేనని పేర్కొన్నారు. 

      అన్ని వయసుల.. ఆహార ప్రియులందరికీ ఒక ట్రీట్ అన్నారు. చాక్లెట్ రూమ్ అనేది చాక్లెట్ మాత్రమే కాకుండా చాక్లెట్ బాంబ్, బ్రౌనీ సండే, మెక్సికన్ బెల్స్, ఫ్యూజన్ శాండ్‌విచ్‌లు, బర్గర్‌లు, మౌత్ వాటర్ పాన్‌కేక్‌లు వంటి నోరూరించే ఆఫర్లపై మక్కువ ఉన్న ప్రతి ఒక్కరికీ ఆదర్శవంతమైన కేఫ్ అన్నారు. కాఫీ, ఫ్రూట్ ఫ్రాప్పర్స్, చాక్‌టెయిల్స్, సైడ్ సర్వ్‌లు, సండేస్, కొలాడా, ఐస్‌డ్ టీ, వాఫిల్ వండర్స్, అఫోగాటో, పేస్ట్రీస్, డెజర్ట్‌లు ఉన్నాయని తెలిపారు.

 ఎస్టీ మహిళ ఆత్మహత్యాయత్నం

పోలీసుల దాస్టికం వల్లేనని ఆరోపణలు గుప్పించిన బంధువులు


(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

గడివేముల మండల పరిధిలోని ఎల్ కె తాండకు చెందిన శోభారాణి భాయి అనే మహిళ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. ఆమెపై పోలీసులు జులుం ప్రదర్శించారని, ఆ అవమానం తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందని బాధితురాలి బంధువులు ఆరోపించారు. సారా కేసు విషయంలో రేషన్ డీలర్ గా పని చేస్తున్న బాధితురాలి ఇంటి నుంచి రేషన్ నిల్వల్ని స్వాధీనం చేసుకోవటానికి పోలీసు, రెవిన్యూ సిబ్బంది గ్రామానికి వెళ్లారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, పీసీ తేజానందరెడ్డి, మరో మహిళా కానిస్టేబుల్ సహా శ్రీనివాసులు స్టాకును స్వాధీనం చేసుకునే క్రమంలో బాధితురాలితో నీచంగా ప్రవర్తించినట్లు ఆమె బంధువులు శివుడు నాయక్, గోబ్రియా నాయక్, శంకర్ నాయక్ తదితరులు ఆరోపించారు. దీంతో అవమాన భారంతో సదరు మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం గని గ్రామంలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో పోలీసు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 వధూవరులను ఆశీర్వదించిన...గౌరు వెంకటరెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల గ్రామం లోని ఓ వివాహానికి కార్యక్రమానికి నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి హాజరయ్యారు. గడివేముల గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్త గపూర్ కుమార్తె వివాహనికి గౌరు వెంకటరెడ్డి హాజరై వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ


గత మూడు సంవత్సరాల నుండి డిగ్రీ చదువుకొన్న నిరుద్యోగ యువకులు ఇంటి వద్దనే ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి పరిశ్రమలు రాకుండా ఉండడంతో ఉపాధి లేక యువకులు నిరుత్సాహానికి గురి అవుతున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి అని చెప్పి మోసం చేస్తున్నారు అని, గ్రామాలలో '"గడప గడపకు మన ప్రభుత్వం" అని గ్రామాలలో పర్యటిస్తున్న  వైఎస్ఆర్సిపి నాయకులకు ప్రతి గ్రామంలోని సమస్యలను తెలుపుతున్న వారిపై, సమస్యలను  ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి  ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజా సమస్యలపై మాట్లాడిన అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చడం వైసీపీ నాయకుల దౌర్జన్యం లకు నిదర్శనమని,

గడివేముల మండలంలోని అలగనూరు రిజర్వాయరు ప్రజలకు తాగు సాగు నీరు అందించే రిజర్వాయరు కట్ట కూలిపోయి మూడు సంవత్సరాలు అయినా ఇంత వరకూ ఎటువంటి మరమ్మతూ చర్యలకు నోచుకోలేదని , అలగనూరు రిజర్వాయర్ కేవలం గడివేముల, నంద్యాల ప్రాంతాలలో ని ప్రజలకు మాత్రమే కాకుండా కడప జిల్లా ప్రజలకు కూడా తాగు, సాగునీరు అందుతుంది అని అలాంటి అలగనూరు రిజర్వాయర్ కుఎలాంటి మరమ్మతు చర్యలు చేపట్టడం లేదని  ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  గడివేముల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేశం సత్యనారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు సీతారామి రెడ్డి, నారాయణ రెడ్డి , శ్రీనివాస రెడ్డి , రమణారెడ్డి, రామచంద్రారెడ్డి , శ్రీకాంత్, సుబ్బారెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

 విద్యార్థుల  జీవితాలతో చెలగాటమాడుతున్న...ప్రైవేట్ కాలేజీలు

ఆ కళాశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థి యువజన సంఘం డిమాండ్ 


(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

 నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా లో వుండే విజయవాడ నలంద జూనియర్ కళాశాల,నలంద జూనియర్ కళాశాల,భువన విజయం జూనియర్ కళాశాల,డాక్టర్ రామలింగారెడ్డి జూనియర్ కళాశాల,సిఫాస్ జూనియర్ కళాశాల,కర్నూలు మాస్టర్ మైండ్స్ జూనియర్ కళాశాలలు,  2022 -2023 సంవత్సరానికి విద్యా సంవత్సరానికి సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రద్దు చేసిన కూడా కళాశాలల యాజమాన్యాలు అక్రమ అడ్మిషన్లు చేసుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి. రామచంద్రుడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్.రియాజ్ డిమాండ్.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర డబ్బే ధనార్జనే ధ్యేయంగా అనేక రూపాల్లో డబ్బులు వసూలుచేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ వేలకు వేలు ఫీజులు వసూలు చేసిన జూనియర్ కళాశాల యాజమాన్యల పై అధికారులు  క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ 2022-2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇలాంటి జూనియర్ కళాశాలలో విద్యార్థులు చేరకూడదని  విద్యాశాఖ అధికారులు తేల్చి చెప్పడం జరిగిందిని విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి ఇటువంటి కళాశాలలో చేరి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు

 యోగా తో ఆరోగ్య సమస్యలకు చెక్

యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు


(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

అంతర్జాతీయ 8 వ యోగా దినోత్సవం సందర్భంగా  కర్నూలు జిల్లా,లోని, స్టేడియంలో  అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పాణ్యం ఎమ్యెల్యే మరియు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి,కర్నూలు పార్లమెంట్ సభ్యులు ఎస్.సంజీవ్ కుమార్ ,నగర మేయర్.బీవై.రామయ్య,,కమీషనర్ భార్గవ్ తేజ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు యోగాసనాలు చేయడం వల్ల బిపి మరియు మధుమేహం (షుగర్ )వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యాన్ని అదుపులోనే ఉంచుకొని, మరియు మానసిక ప్రశాంతత పొందవచ్చని తెలిపారు. అనంతరం అందరితో కలసి యోగాసనాలు  ప్రజాప్రతినిధులు చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు యోగా అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు


 భారత్ లోనే ఇంటర్నేట్ డేటా చౌకా


ప్రపంచ సగటుతో పోల్చితే భారత్ లో డేటా ధరలు గణనీయంగా తక్కువ అని అశ్విని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. డేటా ధరల ప్రపంచ సగటు 25 డాలర్లు ఉంటే, భారత్ లో అది 2 డాలర్లు మాత్రమేనని తెలిపారు. మిగతా దేశాలతో పోల్చితే భారత్ లో డేటా 10 రెట్లు చవక అని అన్నారు. దేశంలో 5జీ ధరలు ఎలా ఉండబోతున్నాయన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా జవాబిచ్చారు.  

మొబైల్ టెలికాం రంగంలో 4జీ ఓ విప్లవం అనుకుంటే, దాన్ని మించి 5జీ వస్తోంది. భారత్ లోనూ 5జీ సేవలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. భారత్ లో మొదట 20 నుంచి 25 నగరాల్లో 5జీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి ఆయా నగరాల్లో 5జీ సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. అందుకోసం ఆగస్టు, సెప్టెంబరు నుంచి ఏర్పాట్లు షురూ అవుతాయని వివరించారు. 

4జీ, 5జీ అభివృద్ధి నేపథ్యంలో, డిజిటల్ నెట్వర్కుల ఏర్పాటులో నమ్మకమైన వనరుగా భారత్ తన స్థానాన్ని మరింత పదిలపరుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ లో అభివృద్ధి చెందుతున్న 4జీ, 5జీ ఉత్పాదనలు, సాంకేతికతల వినియోగానికి అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. అంతేగాకుండా, కొత్త నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కాలర్ పేరు కూడా ప్రదర్శితమయ్యేలా నిబంధన తీసుకువచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు.

 నాడు పెగాసస్...నేడు స్పై వేర్


వ్యక్తుల సమాచారం అక్రమంగా తీసుకొంటున్నారంటూ నాడు పెగాసస్ పై చెలరేగిన మంటలు ఇంకా చల్లారకముందే మన దేశంలో మరో స్పై వేర్ పేరుతో సమాచారం తస్కరించేది వచ్చేసింది. ఈ వార్త ప్రస్తుతం దేశంలో చర్చాంశనీయంగా మారుతోంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత నిఘా సాఫ్ట్ వేర్. వ్యాపారవేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, విద్యారంగ నిపుణులు, ఉన్నతాధికారులపై నిఘా వేసేందుకు ప్రభుత్వాలు హెర్మిట్ ను కూడా ఉపయోగిస్తాయన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్సెమ్మెస్ ల ద్వారా ఈ స్పైవేర్ ను లక్షిత వ్యక్తుల ఫోన్లలోకి చొప్పిస్తారు. గతంలో పెగాసస్ స్పై సాఫ్ట్ వేర్ సృష్టించిన కలకలం అంతాఇంతా కాదు. పార్లమెంటులోనూ దీని ప్రకంపనలు వినిపించాయి. ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ దీని సృష్టికర్త. తాజాగా, సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెర్మిట్ అనే మరో స్పై వేర్ గురించి అప్రమత్తం చేశారు.

కజకిస్థాన్ ప్రభుత్వం హెర్మిట్ స్పైవేర్ ను ఉపయోగిస్తున్న విషయాన్ని లాకౌట్ త్రెట్ ల్యాబ్ అనే సైబర్ భద్రతా సంస్థ నిపుణులు గత ఏప్రిల్ లో గుర్తించారు. దాంతో కజకిస్థాన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టగా, పోలీసులు ఉక్కుపాదం మోపారు. హెర్మిట్ స్పైవేర్ ను ఇటలీకి చెందిన ఆర్సీఎస్ ల్యాబ్ అభివృద్ధి చేయగా, టైకెలాబ్ ఎస్సారెల్ అనే టెలికాం సంస్థ దీన్ని ఆపరేట్ చేస్తోందని భావిస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. హెర్మిట్ ప్రస్తావన ఇదే తొలిసారి కాదు. 2019లో ఓ అవినీతి ఆపరేషన్ కోసం ఇటలీ అధికారులు ఈ స్పైవేర్ ను ఉపయోగించినట్టు వెల్లడైంది. అంతేకాదు, కల్లోలభరితంగా ఉండే ఉత్తర సిరియాలో ఓ నటుడు కూడా ఈ హెర్మిట్ స్పైవేర్ ను వాడుతున్న విషయం గుర్తించినట్టు లాకౌట్ త్రెట్ ల్యాబ్ బృందం తెలిపింది. 

హెర్మిట్ స్పైవేర్ సృష్టికర్త ఆర్సీఎస్ ల్యాబ్ కు పాకిస్థాన్, చిలీ, మంగోలియా, బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్, తుర్క్ మెనిస్థాన్ సైన్యాలు, నిఘా సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నారు.

 జిల్లాలోని 171 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుల్ లకు,,, స్థానచలనం

నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి వెల్లడి


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో  పోలీస్ శాఖలో సాధారణ బదిలీలలో భాగంగా ఒకే పోలీస్ స్టేషన్ లో ఐదు సంవత్సరాలకు పైబడి ఉన్న  171  మంది పోలీస్ కానిస్టేబుల బదీలు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి.  ఈ బదిలీల్లో జిల్లాలోని ప్రతి  పోలీస్ స్టేషన్ నుండి ఎంత మంది వచ్చారు ఎన్ని ఖాళీలు ఉన్నాయని తెలుసుకొని వాటి ఆధారంగా బదిలీలు చేశారు.

ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ  కె.రఘువీర్ రెడ్డి  మాట్లాడుతూ సొంత గ్రామం,మండలం మరియు ఇంతకు ముందు పనిచేసిన పోలీస్ స్టేషన్ సర్కిల్ కాకుండా వేరే సర్కిల్ లోని పోలీస్ స్టేషన్ లలో ఖాళీలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా చూసి పోలీస్ స్టేషన్ ఎంచుకోవాలని, సీసీటీఎన్ఎస్ చేసే వారికి, స్టేషన్ రైటర్ లకు  వేరే పోలీస్ స్టేషన్ లో సీసీటీఎన్ఎస్ రైటర్స్ గా ఖాళీల ఆధారంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందని,అనారోగ్యంతో బాధపడే వారికి మరియు స్పోజ్ వారికి ప్రాధాన్యతనిస్తూ వారి విజ్ఞప్తి మేరకు పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని,ఈ  బదిలీలలో పాల్గొన్న సిబ్బంది అందరూ తమ సంతృప్తిని వ్యక్తపరిచారని జిల్లా ఎస్పీ గారు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పి అడ్మిన్ ఆర్. రమణ, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి, ఏఏఓ దేవి, డీపీఓ సూపరింటెండెంట్ ఖాదర్ వలి, డీజీఓ సిబ్బంది పాల్గొన్నారు.


 పోలవరానికి నిపుణుల బృందం రాక...పనుల నాణ్యతపై ఆరా


పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును న్యూఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం పరిశీలించింది. కేంద్ర జలశక్తి సంఘం సభ్యులు కె.వోహ్రా, సిన్హా, కృష్ణా గోదావరి రివర్ బోర్డు అధికారి డి.రంగారెడ్డి సహా ఉన్నతాధికారులు బృందం రాష్ట్రానికి వచ్చారు. ఈ బృందానికి పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సి.నారాయణ రెడ్డి, సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి సంబంధిత వివరాలను మ్యాప్ ద్వారా వివరించారు.

తొలుత పోలవరం ప్రాజెక్టు గేట్లను పరిశీలించిన బృందం.. అనంతరం స్పిల్‌వే గేట్లను కదిలించేందుకు ఉపయోగించే పవర్ ప్యాక్, సిలిండర్ల అమరిక, స్పిల్వేలో ఎడమ వైపు 560 మీటర్ల పొడవునా నిర్మిస్తున్న ఎడమ గైడ్ వాల్ బండ్ పనులు, గ్యాప్ 3 నిర్మాణంలో 53.320 మీటర్ల పొడవునా నిర్మించిన కాంక్రీట్ వాల్‌ను పరిశీలించారు.

అనంతరం ఎగువ కాఫర్ డ్యాం, పవర్ హౌస్ ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు, డయా ఫ్రం వాల్ ప్రాంతాన్ని పరిశీలించారు. తర్వాత ఎడమ ప్రధాన కాలువ కనెక్టివిటీ పనులను బృందం పరిశీలించింది. ఈ టీం వెంట ఈఈలు బాలకృష్ణ, ఆదిరెడ్డి, మల్లికార్జున రావు, ప్రాజెక్టు సీఐ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

 అగ్నిపథ్ అల్లర్లు...ఓ వ్యక్తి మరణానికి కారణమైంది


తమ హక్కుల కోసం చేసే ఆందోళనలు ఒక్కోసారి హింసాత్మకంగా మారుతాయి. అనేక సందర్భాలలో ప్రజా జీవితాన్ని అతలాకుతలం కూడా చేస్తుంటాయి. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సాగిన ఆందోళన ఓ విషాదానికి కారణమైంది. విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ నియామకాలకు సంబంధింది కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో రైలు నిలిచిపోవడంతో సకాలంలో వైద్యం అందక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కోర్బా- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ను కొత్తవలసలో నిలిపివేయడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన జోగేష్‌ బెహరా (70) అనే వృద్ధుడు కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు.

ఈ క్రమంలోనే చికిత్స కోసం ఒడిశా నుంచి విశాఖపట్నంకు బయల్దేరారు. కుటుంబ సభ్యులతో కలిసి కోర్బా- విశాఖ ఎక్స్‌ప్రెస్‌‌‌లో పయనమయ్యారు. అయితే, అగ్నిపథ్ అల్లర్లతో విశాఖపట్నం వెళ్లాల్సిన రైలును కొత్తవలసలోనే నిలిపివేశారు. ఈ సమయంలోనే బెహరాకు ఒక్కసారిగా గుండెనొప్పి వచ్చింది. సమయానికి అంబులెన్స్ కూడా లేక చాలాసేపు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇక చేసేది లేక, కొత్తవలసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రాథమిక చికిత్స చేస్తుండగానే జోగేష్ బెహరా మృతి చెందారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

 మహానంది క్షేత్రంలో అభివృద్ధి పనులను ,,,

పరిశీలించిన ఎమ్మెల్యే శిల్పా, చక్రపాణి రెడ్డి


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా,మహానంది క్షేత్రం లో  రెండు కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పరిశీలించారు.పనులను త్వరగా పూర్తి చేసి భక్తులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొని రావాలని ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డిని  ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు,పాటించాలని ,భక్తులకు క్షేత్రంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఈవో కు  సూచించారు.టిటిడి వారు నిధులు విడుదల చేసిన వెంటనే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మహానంది క్షేత్రంలో చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో  మహానంది దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి, దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ కొమ్మ మహేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 పదవుల కోసం కాంగ్రెస్ లోకి రావడంలేదు: విజయా రెడ్డి


‘పదవుల కోసం నేను కాంగ్రెస్‌లో చేరడంలేదని పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్‌ విజయా రెడ్డి స్పష్టంచేశారు. నాకెలాంటి గాడ్ ఫాదర్ లేడు. నాన్నగారు మా మధ్యలోంచి సడెన్‌గా వెళ్లిపోయారు. పీజేఆర్ బిడ్డగా మీ ప్రేమ, మద్దతు ఎప్పటిలాగే ఉంటుందని భావిస్తున్నా’ అని విజయారెడ్డి అన్నారు. ఈ నెల 23న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు విజయారెడ్డి ప్రకటించారు. పీజేఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని ఆమె గుర్తు చేశారు. సోనియాగాంధీ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

‘టీఆర్‌ఎస్ కార్పొరేటర్‌గా అవకాశం వచ్చినంత వరకు ప్రజాసేవ కోసం పనిచేశా. పీజేఆర్ బిడ్డగా నన్ను ఇప్పటికీ ఎక్కువ మంది కాంగ్రెస్ నేతగానే చూస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరాలని కొంత కాలంగా భావిస్తున్నా. కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు అందరితో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని విజయారెడ్డి అన్నారు.

తమ కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్‌లోనే ఉందని విజయారెడ్డి గుర్తు చేశారు. ఆ పార్టీలో సాగితేనే బాగుంటుందని భావిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్‌లో తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని విజయారెడ్డి అన్నారు.


 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: కోదండ రామ్


నిరుద్యోగ సమస్యను గుర్తించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విమర్శించారు. నిరుద్యోగం కారణంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కోదండరామ్ మీడియాతో మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం తక్షణమే అగ్నిపథ్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. అగ్నిపథ్ పనికిరాని విధానమని.. ఈ విధానం సుశిక్షితులైన సైనికులను తయారు చేయదని ఆయన అన్నారు. పింఛన్లు లాంటివి తప్పించుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘అగ్నిపథ్‌’ను తీసుకొచ్చిందని కోదండరామ్ ఆరోపించారు. ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించకపోతే దేశ యువత శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం అవుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆందోళన చేప్పట్టిన యువకులపై కేసులు పెట్టి వేధించవద్దని కోదండరామ్ కోరారు. ప్రభుత్వం కుట్ర సిద్ధాంతాన్ని పక్కనపెట్టి యువకుల ఆగ్రహాన్ని గుర్తించాలని అన్నారు. శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని.. రాజకీయంగా మల్చుకోవడాన్ని ఆపాలని కోదండరామ్‌ సూచించారు. ప్రభుత్వం యువకుల ఆందోళనను పట్టించుకోకుండా.. సికింద్రాబాద్‌లో కాల్పులు జరిపిందని అన్నారు. అల్లర్లలో మృతి చెందిన యువకుడు రాకేష్ కుటుంబానికి పార్టీ తరఫున సాయం అందిస్తామని ప్రకటించారు.

‘కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆర్మీ నియామక పరీక్షను వాయిదా వేస్తూ వచ్చింది. కేంద్రానికి అర్థం కావాలనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద యువకులు ఆందోళన చేపట్టారు. టియర్ గ్యాస్‌, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించకుండా.. కాల్పులు ఎలా జరిపారు?’ అని కోదండరామ్ ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లో జరిగిన పరిణామాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

 ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చేస్తోంది


రంగులు మార్చడంలో దిట్టా ఊసరవెల్లి అని మనందరికీ తెలుసు. కానీ దానికంటే వేగంగా రంగులు మార్చేది మరోటి ఉందని మీకు తెలుసా. ఊసరవెల్లి గురించి మనకు తెలుసు.. అదీ ఎక్కడ అలా రంగులు మారుతుంది. మరీ హమ్మింగ్ బర్డ్ నో.. అలా అదీ రంగులు మార్చేది దాదాపు చూసి ఉండం. కానీ అదీ కనిపించింది. ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి. దానిని చూసిన వెంటన చాలా థ్రిల్ అవుతారు. నిమిషం నిడివి గల వీడియో ఆకట్టుకుంటుంది.

ఆ వీడియోను వైరల్ హగ్ షేర్ చేశారు. అందులో హమ్మింగ్ బర్డ్ రంగులను మార్చివేసింది. ఆ చిన్న పక్షి ఒకతని చేతిలో ఉంది. అదీ అలా రంగులను మార్చివేస్తోంది. ఆకు పచ్చ రంగు నుంచి నల్ల రంగుకు.. తర్వాత పింక్ కలర్ మారుతుంది. దాని తలను తిప్పితేనే రంగు మారుతుంది. ఇదీ చూసి నెటిజన్లు ఫిదా అవతున్నారు. ఆ వీడియోను ఇప్పటికే 24 వేల 400 సార్లు చేశారు. చాలా మంది షేర్ కూడా చేశారు. ఒక్కో నెటిజన్ ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. తాము ఇలాంటి అద్భుతం ఎప్పుడూ చూడలేదని ఒకరు కామెంట్ చేశారు. చాలా బాగుందని మరొకరు కామెంట్ చేశారు.

ఒరెగాన్‌లో ఒకతను పెరటిలో నేలపై పడి ఉన్న పక్షి ఉంది. అతను చేతిలోకి తీసుకుని పట్టుకున్నాడు. అతను స్వతగహా ఫోటోగ్రాఫర్.. చేతిలో ఉండగా వీడియో తీశాడు. నిమిషం పాటు పక్షి ఉండగా.. అదీ రంగులను మార్చుకుంది. తర్వాత పక్షి ఎగిరిపోయింది. తన మొహంపై నుంచి వెళ్లిపోయిందని.. ఇదీ తన జీవితకాలం గుర్తుంచుకుంటానని తెలిపారు. హమ్మింగ్ బర్డర్స్ థిక్ కలర్‌లో ఉంటాయని సైన్స్ డైలీ పేర్కొంది. రెయిన్ బో కలర్‌లో ఉంటాయని తెలిపింది.

 అదిరేటి ఆఫర్లు ఇస్తున్న బిఎస్ఎన్ఎల్


బిఎస్ఎన్ఎల్ అంటే అదో పాత  సాంకేతిక విభాదం అన్న భావన మనలో ఉంది. కానీ  నేడు అన్ని టెలికాం సంస్థలతో పోటీపడి మరీ దూసుకెళ్తోంది. ప్రభుత్వ టెలికం సంస్థ భారత్‌ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఆకర్షణీయమైన ధరతో కొన్ని ప్లాన్‌లను యూజర్లకు అందిస్తోంది. ముఖ్యంగా ఎక్కువ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్‌లను అందుబాటు ధరల్లోనే ఇస్తోంది. సాధారణంగా ప్రైవేట్ టెలికం సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే ప్లాన్‌లను బిఎస్ఎన్ఎల్ ఇస్తుంటుంది. ఇదే రీతిలో 90 రోజుల వ్యాలిడిటీతో ఉండే రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లు బీఎస్ఎన్ఎల్‌లో ప్రయోజనకరంగా ఉన్నాయి. రూ.500లోపు ధరలోనే వీటిని బిఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ప్రతీ రోజు డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు సహా కొన్ని అదనపు బెనిఫిట్స్ ఈ ప్లాన్‌ల ద్వారా దక్కుతాయి. మ

రూ.500లోపు ప్లాన్‌ కావాలనుకుంటే బీఎస్ఎన్ఎల్‌లో ఇది బెస్ట్‌ ప్లాన్‌గా చెప్పవచ్చు.బిఎస్ఎన్ఎల్ రూ.499 (ఎస్టీవీ_499) ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. వీటితో పాటు బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ జింగ్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

బీఎస్ఎన్ఎల్ రూ.485 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ దక్కుతుంది. ప్రతీ రోజు 1.5జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లలో రోజువారి డేటా అయిపోయాక 40కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు.

ఈ రెండు ప్లాన్‌లను పరిశీలిస్తే రూ.499 ప్లాన్‌ బెస్ట్‌గా ఉంది. రూ.485 ప్లాన్‌తో పోలిస్తే రూ.15లే తేడా అయినా రోజుకు 0.5 జీబీ అధికంగా లభిస్తోంది. వినియోగించుకుంటే జింగ్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా దక్కుతుంది. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ బెనిఫిట్ కూడా దక్కుతుంది.

ప్రస్తుతం దేశంలో బీఎస్ఎన్ఎల్ 3జీ నెట్‌వర్క్ మాత్రమే అందుబాటులో ఉంది. నెట్‌వర్క్ అత్యుత్తమంగా ప్రాంతాల్లో ఈ ప్లాన్‌లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే త్వరలోనే దేశంలో 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు బిఎస్ఎన్ఎల్ సిద్ధమవుతోంది. 4జీ సర్వీస్‌లు వచ్చాక ఈ ప్లాన్‌లు మరింత బెస్ట్‌గా ఉపయోగపడతాయి.

 తయారీ రంగం నుంచి అపూర్వమైన స్పందన అందుకున్న,,,

అతిపెద్ద మెషీన్‌ టూల్‌, ఫార్మింగ్‌ టెక్నాలజీ షో – ఇమ్టెక్స్‌ ఫార్మింగ్‌ 2022


(జానో జాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

ఫార్మింగ్‌ టెక్నాలజీలపై  ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఎగ్జిబిషన్‌  ఇమ్టెక్స్‌ ఫార్మింగ్‌ 2022 తో పాటుగా టూల్‌టెక్‌ అండ్‌ డిజిటల్‌ మాన్యుఫాక్చరింగ్‌ను బెంగళూరులోని  ఇంటర్నేషనల్‌  ఎగ్జిబిషన్‌ సెంటర్‌ (బీఐఈసీ) వద్ద నిర్వహిస్తున్నారు.

కోవిడ్‌ కారణంగా 30 నెలల విరామం తరువాత ఇమెక్ట్స్‌ను భౌతికంగా నిర్వహిస్తున్నారు.  ఫార్మింగ్‌ సాంకేతికతలైనటువంటి  ప్రెసెస్‌, వెల్డింగ్‌, జాయినింగ్‌, హై స్పీడ్‌ లేజర్‌ మెషీన్లు, రోబోటిక్స్‌, షీట్‌ మెటల్‌ వర్కింగ్‌తో ఆటోమేషన్‌, ఎడిటివ్‌ తయారీ, మెట్రాలజీ,  క్యాడ్‌/క్యామ్‌ వంటి వాటిని ఎగ్జిబిటర్లు ప్రదర్శిస్తున్నారు.

ఈ ప్రదర్శనను కర్నాటక ఉన్నత విద్య, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖామంత్రి  డాక్టర్‌ అశ్వత్‌ నారాయణ్‌ సీ ఎన్‌ ; పూర్వ ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ కె శివన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఎంటీఎంఏ అధ్యక్షులు రవి రాఘవన్‌ ; వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేంద్ర రాజమణి, ముఖ్య సలహాదారు పీజె మోహన్‌రామ్‌ పాల్గొన్నారు.

దాదాపు 50% మెషీన్‌ టూల్స్‌ కర్నాటకలోనే ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించిన డాక్టర్‌ అశ్వత్‌ నారాయణ్‌ మాట్లాడుతూ నైపుణ్యంతో కూడిన మానవ వనరులను పెంచాల్సి ఉందన్నారు. ఐటీ, తయారీ రంగాల సమ్మేళనం కారణంగానే డిజిటల్‌ తయారీ సాంకేతికతలలో  కర్నాటక అగ్రగామిగా నిలిచిందన్నారు.

ఇస్రోలో తన ప్రయాణం గురించి వెల్లడించిన డాక్టర్‌  శివన్‌,  అంతరిక్షం, వ్యూహాత్మక రంగాలకు అవసరమైన అత్యంత ఖచ్చితత్త్వంతో కూడిన, క్లిష్టమైన భాగాల తయారీకి  మెషీన్‌ టూల్‌ ఇండస్ట్రీ తయారీ రంగంలో అతి కీలకమైన పాత్రను పోషించిందన్నారు. ఇన్‌స్పేస్‌ కార్యక్రమం ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందన్న శివన్‌ ఇస్రో కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా ప్రైవేట్‌ పరిశ్రమలను కోరారు.

అంతకు ముందు తన స్వాగతోపన్యాసంలో  రాఘవన్‌ మాట్లాడుతూ భారతీయ మెషీన్‌ టూల్‌ పరిశ్రమ 2022–23లో దాదాపు 9500–10వేల కోట్ల రూపాయలకు చేరనుంది అని అన్నారు.

ప్రదర్శనలో భాగంగా తొలిరోజు  ఇండియన్‌ మెటల్‌ ఫార్మింగ్‌ మెషీన్‌ టూల్‌  పరిశ్రమ 2022 తో పాటుగా ఇమ్టెక్స్‌ ఫార్మింగ్‌ 2022 ప్రదర్శన కేటలాగ్‌ విడుదల చేశారు.

ఈ ప్రదర్శన జూన్‌ 21వ తేదీ వరకూ జరుగనుంది.  దాదాపు  19 దేశాల నుంచి 350 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్న ఈ ప్రదర్శనకు 40వేల మంది సందర్శకులు వస్తారని అంచనా.

 ఆగస్టు - సెప్టెంబర్ మధ్య దేశంలో 5జీ సేవలు


వచ్చే ఆగస్టు - సెప్టెంబర్ మధ్య దేశంలో 5జీ ఇంటర్నేట్ సేవలు మన దేశంలో ప్రారంభంకానున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలావుంటే ప్రస్తుతం దేశమంతా 5జీ నెట్‌వర్క్ కోసం ఎదురుచూస్తోంది. ఐదో తరం హైస్పీడ్ సర్వీస్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయి.. వేగం ఎలా ఉంటుందనే ఆసక్తి చాలా మందిలో ఉంది. టెలికం సంస్థలు కూడా ట్రయల్స్ పూర్తి చేశాయి. తాజాగా 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వేగవంతమైన 5జీ నెట్‌వర్క్ రాక సమీపిస్తున్నట్టే కనిపిస్తున్నది. ఈ తరుణంలో కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్  కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం ఆగస్టు - సెప్టెంబర్ మధ్య దేశంలో 5జీ నెట్‌వర్క్ మొలవుతాయని చెప్పారు. పారిస్‌లో జరుగుతున్న ఓ టెక్నాలజీ ఈవెంట్‌లో పాల్గొన్న మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.

సెప్టెంబర్‌ ముగిసేలా భారత్‌లో 5జీ సేవలు ( 5G Services ) ప్రారంభమవుతాయని మంత్రి వైష్ణవ్ స్పష్టంగా చెప్పారు. “5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ నేడే ప్రారంభమైంది. జూలై ముగిసేనాటికి వేలం ప్రాసెస్ మొత్తం పూర్తవుతుంది. అదే మేం నిర్దేశించుకున్న లక్ష్యం. 5జీ కోసం కావాల్సిన మొత్తం మౌలిక సదుపాయాలను టెలికం సంస్థలు ఇప్పటికే సమకూర్చుకుంటున్నాయి” అని మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆగస్టు - సెప్టెంబర్ మధ్య 5జీ సేవలు మొదలవుతాయన్నారు. 5జీ స్పెక్ట్రమ్ వేలం (5G spectrum auction) జూలై 26న మొదలయ్యేలా టెలికం శాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, షెడ్యూల్ ప్రకారమే అంతా జరుగుతుందని మంత్రి వైష్ణవ్ కూడా స్పష్టం చేశారు.

4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 5జీ 10రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ ఇస్తుందని తెలుస్తోంది. పీఐబీ ఈ విషయాన్ని చెప్పింది. “5జీ టెక్నాలజీ బేస్ట్ సర్వీస్‌లను తెచ్చేందుకు టెలికం సర్వీస్ సంస్థలు హై, మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ వినియోగిస్తాయని అంచనా. ఇదే జరిగితే, ప్రస్తుత 4జీ సర్వీస్ ఇంటర్నెట్ కంటే 10 రెట్ల వేగం ఇచ్చే సామర్థ్యం ఉంటుంది” అని వెల్లడించింది.

మరోవైపు 5జీ నెట్‌వర్క్‌ను తీసుకొచ్చేందుకు ప్రైవేట్ టెలికం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా సిద్ధంగా ఉన్నాయి. కొన్ని నగరాల్లో ఇప్పటికే ట్రయల్స్ నిర్వహించాయి. విభిన్నమైన టెక్నాలజీల ఆధారంగా 5జీని పరీక్షిస్తున్నాయి. దేశంలో ముందుగా 13 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమవుతాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఆ తర్వాత క్రమంగా దశలవారీగా దేశమంతా 5జీ సేవలను విస్తరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

 లోదుస్తుల్లో బంగారు..పట్టుకొన్న కస్టమ్స్ అధికార్లు


ఎయిర్ పోర్ట్ లో డేగా కన్నులతో నిఘా పెట్టినా బంగారు అక్రమ రవాణాదార్లలో మార్పు రావడంలేదు. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. బంగారం, డ్రగ్స్‌, విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. కువైట్ నుంచి వచ్చిన ఓ మహిళ.. బంగారాన్ని పేస్టులా మార్చి లోదుస్తులు (ఇన్నర్స్), షూ సాక్సులలో దాచుకొని వచ్చింది. శంషాబాద్‌ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్‌ అధికారులు ఆమెను గుర్తించి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.86 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

నిందితురాలు సుమారు1.646 కిలోల బంగారాన్ని పేస్టులా మార్చి కవర్లలో పెట్టి ఇన్నర్స్‌లో దాచుకొని తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఆ మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికురాలి కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని తనిఖీలు నిర్వహించినట్లు కస్టమ్స్ అధికారులు వివరించారు..


 దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో,,,

అతిపెద్ద డాటా సైన్స్‌ ఫ్యాకల్టీగా నిలిచిన అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌

(జానో జాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

“ భారతదేశంలో అగ్రగామి డాటా సైన్స్‌ ఇనిస్టిట్యూట్‌ కావడంతో పాటుగా ఎడ్‌టెక్‌ అగ్రగామి అప్‌గ్రాడ్‌కు 100% అనుబంధ సంస్ధ అయిన అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌ (ఠఞఎట్చఛీ ఐూఖిౖఊఉ) ఇప్పుడు ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఎడ్‌టెక్‌ సంస్ధగా డాటా సైన్స్‌ మరియు ఏఐ డిపార్ట్‌మెంట్‌లలో పూర్తిగా అంకితం చేయబడిన ఫ్యాకల్టీతో నిలిచింది.

పూర్తిగా అంకితం చేయబడిన 40కు పైగా మెషీన్‌ లెర్నింగ్‌ సైంటిస్ట్‌లతో పాటుగా 80కు పైగా ఫ్యాకల్టీ సభ్యులను సంస్థ కలిగి ఉంది. డాటా సైన్స్‌, ఆర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌ మరియు మెషీన్‌ లెర్నింగ్‌ విభాగాలలో అపారమైన అనుభవం వీరికి ఉంది.

‘‘ఈ అత్యాధునిక సాంకేతికతలలో శిక్షణను అందించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థాయి విశ్వవిద్యాలయాల నుంచి పీహెచ్‌డీలతో పాటుగా దశాబ్దాల  అంతర్జాతీయ పరిశ్రమ, ఆర్‌ అండ్‌ డీ అనుభవం, అంకిత భావం కలిగిన అధ్యాపకులను పెద్ద సంఖ్యలో కలిగి ఉండటం అవసరం. శక్తివంతమైన అంతర్గత నైపుణ్యంతో పాటుగా, పరిశ్రమ, అకాడెమియా, ఆర్‌ అండ్‌  డీ, వ్యవస్ధాపకత మరియు ఉత్పత్తి పరిజ్ఞానాన్ని మా కరిక్యులమ్‌, బోధనా  విధానంలో జోడించడానికి, అభ్యాసకులకు పూర్తి అంకితభావంతో మద్దతునందించడానికి ఇది మాకు సహాయపడుతుంది’’ అని అప్‌గ్రాడ్‌ ఇన్సోఫీ అధ్యక్షుడు డాక్టర్‌ వెంకటష్‌ సుంకడ్‌ అన్నారు.


‘‘నేడు అందుబాటులో ఉన్న చాలా సాంకేతికతలు సంప్రదాయ పాఠ్యపుస్తకాలలో  భాగం కాదు. అందువల్ల, బల్క్‌ డాటాను విశ్లేషించడానికి మరియు వ్యాపార నిర్ణయాలను ప్రభావితం చేయడానికి అప్లయ్డ్‌ సైన్స్‌ను ఉపయోగించడానికి శిక్షణ పొందిన నిపుణుల అంతరం వేగంగా పెరుగుతుంది. అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌ స్థిరంగా తమ ఫ్యాకల్టీని  డాటా సైన్స్‌, ఏఐ, ఎంఎల్‌ విభాగాలలో విస్తరిస్తోంది. వీరు అభ్యాసకులకు అత్యంత క్లిష్టమైన కోడింగ్‌, డాటా ఛాలెంజస్‌లో ప్రాక్టికల్‌ అప్లికేషన్‌ల ద్వారా సహాయపడుతున్నారు’’ అని డాక్టర్‌ దక్షిణామూర్తి వి కొల్లూరు, కో–ఫౌండర్‌ అండ్‌ సీఈవో– అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌ అన్నారు.

‘‘అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌ ద్వారా మేము విస్తృత స్ధాయిలో మా అభ్యాసకులకు స్పెషలైజేషన్స్‌ను తీసుకురావడంతో పాటుగా వారి డొమైన్‌ ఫౌండేషన్‌ బలోపేతం చేసుకోవడంలో సహాయపడుతున్నాము. ఏఐ, ఎంఎల్‌, డాటా సైన్స్‌లో ఇంజినీరింగ్‌ నైపుణ్యాలకు సంబంధించిన నేపథ్యాలను నేవిగేట్‌ చేయడంలో  నిపుణులకు సహాయం చేయడానికి నాణ్యమైన ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ బోధనా విధానాన్ని మెరుగుపరిచే విద్యావేత్తలతో  త్వరలోనే మేము అంతర్జాతీయంగా అగ్రగామి కాగలము’’అని  అప్‌గ్రాడ్‌ కో–ఫౌండర్‌ అండ్‌ ఎండీ మయాంక్‌ కుమార్‌ అన్నారు.

 మార్కెట్ లోకి 1.75 ఇంచుల టచ్ డిస్‌ప్లేతో స్మార్ట్ వాచ్


ప్రస్తుతం ప్రతి దాంట్లో స్మార్ట్ టెక్నాలజీ వస్తోంది. బడ్జెట్ రేంజ్‌లో స్మార్ట్‌వాచ్‌లు వస్తూనే ఉన్నాయి. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉండే స్మార్ట్‌వాచ్‌లు కూడా తక్కువ ధరల్లోనే లాంచ్ అవుతున్నాయి. ఇదే క్రమంలో ఫైర్ బోల్ట్ రింగ్ ప్రో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ విడుదలైంది. ఇప్పటికే బడ్జెట్ రేంజ్‌లో ఫైర్ బోల్డ్ నుంచి చాలా ఆప్షన్లు ఉండగా.. ఇప్పుడు రింగ్ సిరీస్‌లో ప్రో పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 1.75 ఇంచుల టచ్ డిస్‌ప్లేతో ఇది వస్తోంది. డయల్ స్క్వేర్ షేర్‌లో ఉంది. హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, SpO2 మానిటరింగ్ లాంటి ముఖ్యమైన హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. 25 స్పోర్ట్స్ మోడ్స్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ కాలింగ్ కోసం ఇన్‌బుల్ట్ మైక్, స్పీకర్ ఉన్నాయి. ఫైర్ బోల్ట్ రింగ్ ప్రో స్మార్ట్‌వాచ్‌ పూర్తి ఫీచర్లు, ధర, సేల్ వివరాలు ఇక్కడ చూడండి.

ఫైర్-బోల్ట్ రింగ్ ప్రో స్మార్ట్‌వాచ్‌ ధర రూ.3,999గా ఉంది. నేడు (జూన్ 16) ఈ వాచ్‌ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌‌తో పాటు ఫైర్-బోల్ట్ వెబ్‌సైట్‌లో కూడా సేల్‌కు వస్తుంది. బ్లాక్, గ్రీన్, బ్లూ, గ్రే, రెడ్, వైట్ కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతుంది. 320x385 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉన్న 1.75 ఇంచుల డిస్‌ప్లేను ఫైర్ బోల్ట్ రింగ్ ప్రో స్మార్ట్‌వాచ్‌ కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఈ వాచ్‌ వస్తోంది. ఇందుకోసం ఇన్‌బుల్ట్‌గా మైక్, స్పీక్‌ను ఫైర్ బోల్ట్ పొందుపరిచింది. స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయిన సమయంలో దాని వచ్చే కాల్స్‌కు ఈ వాచ్‌లోనే ఆన్సర్ చేయవచ్చు. కాల్స్ కూడా వాచ్‌ ద్వారానే చేసి మాట్లాడవచ్చు. డయల్ ప్యాడ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇక పవర్‌ను తక్కువగా వినియోగించుకునే డ్యుయల్ మోడ్ బ్లూటూత్‌ను ఫైర్ బోల్ట్ రింగ్ ప్రో స్మార్ట్‌వాచ్‌ కలిగి ఉంది.

వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, హైకింగ్, పుట్‌బాల్ సహా మొత్తంగా 25 స్పోర్ట్స్ మోడ్స్‌కు సపోర్ట్ సపోర్ట్ చేస్తుంది. హార్ట్‌రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ (Spo2), స్లీప్ ట్రాకింగ్, మెడిటేటివ్ బ్రీథింగ్ హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే పిన్ లాక్ సిస్టమ్ ఫీచర్ కూడా ఉంది. అంటే సెక్యూరిటీ కోసం పిన్‌ను సెట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కాలింగ్ మాత్రమే కాకుండా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయినప్పుడు మెసేజ్‌లు, సోషల్ మీడియా నోటిఫికేషన్ల అలెర్ట్‌లను కూడా ఈ వాచ్‌లో పొందవచ్చు. మ్యూజిక్, కెమెరాను కంట్రోల్ చేయవచ్చు. రెండు బుల్ట్ ఇన్‌గేమ్స్ కూడా ఈ వాచ్‌లో ఉంటాయి.

ఫుల్ చార్జ్‌పై ఫైర్ బోల్ట్ రింగ్ ప్రో స్మార్ట్‌వాచ్‌ 5 రోజుల బ్లాటరీ లైఫ్ ఇస్తుంది. స్టాండ్‌బై మోడ్‌లో 28 రోజుల వరకు ఉండగలదు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ మొబైళ్లకు ఈ స్మార్ట్‌వాచ్‌ను కనెక్ట్ చేసుకోచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో డా ఫిట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని సింక్ చేసుకోవచ్చు.

 సకాలంలో స్పందించి...40 మంది ప్రాణాలను కాపాడారు


నిత్యం ప్రజా సేవలో పోలీసులు అని మరోసారి నిరూపించుకొన్నారు. ఇదిలావుంటే అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. రైళ్లకు నిప్పుపెట్టడంతోపాటు రైల్వే స్టేషన్‌లో ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ నిరసనకారుడు మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు. నిరసనకారుల రాళ్ల దాడుల్లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

కనీసం 5,000 మంది ఆందోళనకారులు సికింద్రాబాద్‌లోని రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి దాదాపు 40 మంది ప్రయాణికులతో ఉన్న ప్యాసింజర్ రైలు కోచ్‌కు నిప్పుపెట్టడానికి ప్రయత్నించారు. ప్రయాణికులు, వారిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నారు. నిప్పుపెట్టిన సమయంలో రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి వారందరినీ పక్కనే ఉన్న కోచ్‌లోకి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఏ1 కోచ్‌పై నిరసనకారులు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సమయంలో కనీసం 40 మంది ప్రయాణికులు లోపల ఉన్నారని ఏసీ పవర్ కార్ మెకానిక్ అయిన సుమన్ కుమార్ శర్మ మీడియాకు తెలిపారు. "ఇక్కడ (కోచ్ లోపల) సుమారు 40 మంది ఉన్నారు, కానీ నేరం చేసిన వారిని నేను లెక్కించలేదు. వారిలో 5,000 మందికి పైగా ఉన్నారు" అని అతను కోచ్ లోపల ఉన్న శిధిలాలను చూపిస్తూ పేర్కొన్నాడు.

ఆందోళనకారులు కోచ్‌కు నిప్పంటించే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది ఆ కోచ్ లోని 40 మంది ప్రయాణికులను వేరే కోచ్ లోకి తరలించి కాపాడారు. హింసాత్మక ఘటనల మధ్య ప్రయాణీకులను కోచ్ నుంచి బయటికి ఎలా తరలించారో చెబుతూ.. రెండు గేట్లు తెరిచి ఉన్నాయి, కాబట్టి తాము ప్రయాణీకులను ఒక వైపు నుంచి తరలించామన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మిమ్మల్ని(ప్రయాణికులను) సురక్షితంగా తరలిస్తుందని వారికి చెప్పామని తెలిపారు. కాగా, అగ్నిపథ్ నిరసనకారులు 4-5 రైలు ఇంజన్లు, 2-3 కోచ్‌లకు నిప్పు పెట్టారు. నష్టం ఎంత ఉందో విశ్లేషిస్తాం. ఒక వ్యక్తి గాయపడినట్లు సమాచారం. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైలు సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఏకే గుప్తా తెలిపారు.

 బిల్డప్ బాబాయ్ గెటప్ శీను గాడు గుర్తొస్తున్నాడు సుమీ: నాగబాబు


మిమ్మల్ని చూస్తుంటే జబర్దస్త్ బిల్డప్ బాబాయ్ గెటప్ శీను గాడు గుర్తొస్తున్నాడు సుమీ' అంటూ  మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి జనసేన నేత నాగబాబు ఎద్దేవా చేశారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతు ఉందా? లేదా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. స్పష్టంగా చెప్పకపోయారా... రాజకీయంగా తుడిచిపెట్టుకుపోతారు అని హెచ్చరించారు. 

దీనిపై నాగబాబు బదులిస్తూ... 'అయినా ప్రతిదానికీ ఆ కంగారేంటండీ రాంబాబు గారూ' అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 'రాంబాబు గారూ... మిమ్మల్ని చూస్తుంటే జబర్దస్త్ బిల్డప్ బాబాయ్ గెటప్ శీను గాడు గుర్తొస్తున్నాడు సుమీ' అంటూ ఎద్దేవా చేశారు. 'అయినా ఈ శాపనార్థాలేంటండీ బాబూ... మీరూ, అపరిపక్వత కాకపోతేనూ' అంటూ నాగబాటు ట్విట్టర్ వేదికగా విమర్శించారు.


 బేయర్ భారతదేశంలోని ప్రపంచ నంబర్ -1..

యాంటీ ఫంగల్ బ్రాండ్ Canesten®తో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది

(జానో జాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

బేయర్ యొక్క కన్స్యూమర్ హెల్త్ విభాగం వారి డెర్మటాలజీ పోర్ట్‌ఫోలియోను Canesten® పేరుతో వారి యాంటీ ఫంగల్ సొల్యూషన్‌లను భారతదేశానికి తీసుకురావడం ద్వారా దాని విస్తరణను ప్రకటించింది. పౌడర్ మరియు క్రీమ్ ఫార్మాట్లలో అందుబాటులో ఉంటుంది, ఇది యాంటీ ఫంగల్ లక్షణాలను అందిస్తూ, చర్మ వ్యాధులను నివారించడంలో మరియు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. సులభంగా ఉపయోగించగల పరిష్కారం, Canesten® అనేది దురద నుండి ఉపశమనాన్ని అందించే మరియు సంక్రమణ వ్యాప్తిని నిలిపివేసే ఫుల్-సైకిల్ చర్మ సంక్రమణ నియంత్రణ సూత్రీకరణ.

బాయర్ ఒరిజినల్ రీసెర్చ్ మాలిక్యూల్ క్లోట్రిమాజోల్ ఆధారంగా రూపుదిద్దుకున్న క్యానెస్టెన్ ఎంతో ఉపశమనా న్ని అందిస్తుంది, ఎందుకంటే, ఇది విస్తృత శ్రేణి ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్లను నయం చేయగలుగుతుంది. క్యానెస్టెన్ యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్ అనేది సూపర్ ఫిషియల్ స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ల నిరోధం, థెరపీ, ఫాలో అప్ ట్రీట్ మెంట్ లో ఉపయోగించబడుతుంది. ఇది సాధారణ టాల్కమ్ పౌడర్ తో పోలిస్తే వేడి, ఎర్రబారడం, కందిపోవడం, చర్మం దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి 5 రెట్ల రక్షణను అందిస్తుంది. 


క్యానెస్టెన్ క్రీమ్ అనేది రింగ్ వామ్, జాక్ ఇచ్, స్కిన్ క్యాండిడియాసిస్, అథ్లెట్స్ ఫుట్, ఇరిత్రాస్మా, ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్ తో పాటుగా ఇతర ఫంగల్ స్కిన్ ఇన్ ఫెక్షన్ల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. క్యానెస్టెన్ ఎస్ క్రీమ్ అ నేది ఇన్ ఫ్లమేటరీ లెసియన్స్ తో కూడిన స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించబడుతుంది. క్యానెస్టెన్ వి6 టాబ్లెట్లు సంక్లిష్ల వుల్వోవజినల్ కాండిడోసిస్ థెరపీలో తమ ప్రభావశీలతను నిరూపించుకున్నాయి.

110 దేశాల్లో లభ్యమవుతూ, యాంటీ ఫంగల్ సొల్యూషన్స్ లో మార్కెట్ అగ్రగామిగా ఉన్న క్యానెస్టెన్ భారత దే శంలో ఆవిష్కరించబడడం జీవితంలోని అన్ని దశలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సైన్స్ ఆధారిత పరిష్కారాలను అందించేందుకు దృష్టి పెట్టడంపై బాయర్ కు గల కట్టుబాటును తెలియజేస్తుంది. క్యానె స్టెన్ వంటి సొల్యూషన్స్ తో  బాయర్ మహిళల్లో ఫంగల్ చర్మవ్యాధులను నయం చేయాలని భావిస్తోంది. నిజానికి    ఫంగల్ చర్మవ్యాధులను మహిళలు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు వెలువరించే తొలి సంకేతాలను పట్టించుకోరు. ఆ బాధలను భరిస్తూ, వంటింటి చిట్కాలతో వాటిని నయం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. చెమట, చెమటకాయలు, చర్మం ఎర్రబడడం లాంటివాటికి భారతదేశంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే ప రిష్కారం టాల్కమ్ పౌడర్. అది సరైన విధంగా నయం చేస్తుందా లేదా అనే దాన్ని పట్టించుకోకుండానే మహిళ లు దాన్ని వాడుతుంటారు. నిపుణలు చెప్పే పరిష్కారాలను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ విధ మైన ప్రవర్తనతో పోరాడాలని క్యానెస్టెన్ కన్జ్యూమర్ హెల్త్ డివిజన్ రూపొందించనున్న కమ్యూనికేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. 

ఈ ఆవిష్కరణ గురించి బాయర్ కన్జ్యూమర్ హెల్త్ ఇండియా కంట్రీ హెడ్ సందీప్ వర్మ మాట్లాడుతూ, ‘‘భారతీయు లందరికీ స్వీయ సంరక్షణను అందుబాటులోకి తీసుకురావాలనే మా ఆశయసాధనకు బాయర్ లో మేం నిరంత రం కృషి చేస్తుంటాం. మహిళలు, మరీ ముఖ్యంగా చురుకైన జీవితం గడుపుతున్నవారు భారతదేశపు వేడి పరిస్థి తుల్లో ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. సత్వరమే లక్షణాల గుర్తింపు, నిర్ధారణ, చికిత్స వంటి ఉపశమనం అందిస్తాయి, అవి మళ్లీ మళ్లీ రాకుండా చూస్తాయి, జీవన నాణ్యతను పెంచుతాయి. దీనికి గా ను మేం మా అత్యుత్తమ అంతర్జాతీయ పరిష్కారాన్ని భారతదేశానికి తీసుకువచ్చాం. ప్రపంచవ్యాప్తంగా దాన్ని కో ట్లాది మంది మహిళలు ఇప్పటికే విశ్వసించారు. ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు అసౌకర్యంగా భావించ డం, వాటి గురించి దాచిపెట్టాలనుకోవడం కన్నా కూడా క్యానెస్టెన్ తో నయం చేసుకోవడం, జీవితాలను పూర్తి స్థా యిలో ఆనందంతో గడిపేలా వారిని మేం ప్రోత్సాహించాలనుకుంటున్నాం’’ అని అన్నారు.

‘‘భారతదేశంలో మా డెర్మటాలజీ పోర్ట్ ఫోలియోను పటిష్టం చేసుకోవడంపై మేం దృష్టి పెట్టాం. బాయర్  ఒరిజినల్ రీసెర్చ్ మాలిక్యూల్ క్లొట్రిమాజోల్ ను నూతన శిఖరాలకు చేర్చేందుకు మరియు క్యానెస్టెన్ ను మహిళల చర్మ ఇన్ ఫెక్షన్లకు ఓ పరిష్కారంగా వ్యవస్థీకృతం చేసేందుకు మేం కృతనిశ్చయంతో ఉన్నాం’’ అని అన్నారు.

క్యానెస్టెన్ డస్టింగ్ పౌడర్ 50 గ్రా. మరు 100 గ్రా. ఎస్కేయూ (స్టాక్ కీపింగ్ యూనిట్లు)లలో లభ్యమవుతుంది. క్యానెస్టెన్ క్రీమ్ 30 గ్రా.ట్యూబ్ గా లభ్యం. వీటిని దేశవ్యాప్తంగా ఓటీసీ గా కొనుక్కోవచ్చు. మరో 2 ఎస్కేయూలు క్యానెస్టెన్ ఎస్ క్రీమ్ 15 గ్రా. ట్యూబ్ లో మరియు క్యానెస్టెన్ వి6 మాత్రలు డాక్టర్ సిఫారసుపై కొనుగోలు చేయవచ్చు.

 యూరప్ పర్యటనకు వై.ఎస్.జగన్...కానీ ఈ సారి కూతురు కోసం


కూతురంటే ఏ తండ్రికైనా ఎనలేని అభిమానం. ఆ అభిమానం సామాన్యుడికైనా సీఎం కైనా ఒక్కటే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన కూతురు కోసం విదేశీ  పర్యటనకు వెళ్లనున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనడం కోసం ఇటీవలే దావోస్ వెళ్లొచ్చిన సీఎం జగన్.. మరోసారి యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. జూన్ 28న ఆయన పారిస్ వెళ్లనున్నారు. దావోస్ పర్యటన అధికారికం కాగా వ్యక్తిగత పని మీద ఆయన పారిస్ వెళ్లనున్నారు. ఇదిలావుంటే దావోస్ పర్యటన సందర్భంగా సీఎం జగన్ లండన్ వెళ్లారు. దీంతో ఆయన కుమార్తె కోసమే లండన్ వెళ్లారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాగా ఈ విషయమై మంత్రి బుగ్గన క్లారిటీ ఇచ్చారు. విమానం రీఫిల్ కోసం ఇస్తాంబుల్‌లో ఎక్కువ సేపు ఆపాల్సి వచ్చింది. అప్పటికే రాత్రి 10 గంటలు దాటడంతో జ్యూరిక్‌‌లో విమానం ల్యాండింగ్‌కు నిబంధనలు అడ్డొచ్చాయని.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో లండన్ వెళ్లాల్సి వచ్చిందని బుగ్గన తెలిపారు.

 సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి పారిస్‌లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌లో మాస్టర్స్ చేస్తున్నారు. జూలై 2వ తేదీన స్నాతకోత్సవం నిర్వహిస్తుండటంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం జగన్ పారిస్ వెళ్లనున్నారు.

ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌లో మాస్టర్స్ డిగ్రీ చదవడం కోసం హర్షా రెడ్డి 2020 ఆగష్టు చివర్లో పారిస్ వెళ్లారు. బెంగళూరు నుంచి ఆమె బయల్దేరి వెళ్లగా.. సీఎం జగన్ దంపతులు ఆమెకు సెండాఫ్ ఇచ్చారు. ఇన్సీడ్‌లో చేరడానికి ముందు హర్షా రెడ్డి లండన్ స్కూల్‌ ఆఫ్ ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె స్కూల్ ఎడ్యుకేషన్‌ను బెంగళూరులో పూర్తి చేశారు.

దావోస్ పర్యటన సందర్భంగా సీఎం జగన్ లండన్ వెళ్లారు. దీంతో ఆయన కుమార్తె కోసమే లండన్ వెళ్లారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాగా ఈ విషయమై మంత్రి బుగ్గన క్లారిటీ ఇచ్చారు. విమానం రీఫిల్ కోసం ఇస్తాంబుల్‌లో ఎక్కువ సేపు ఆపాల్సి వచ్చింది. అప్పటికే రాత్రి 10 గంటలు దాటడంతో జ్యూరిక్‌‌లో విమానం ల్యాండింగ్‌కు నిబంధనలు అడ్డొచ్చాయని.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో లండన్ వెళ్లాల్సి వచ్చిందని బుగ్గన తెలిపారు.

 ఏపీ సర్కార్ కీలక నిర్ణయంతో...సచివాలయ ఉద్యోగుల దశ తిరిగింది


గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకొని.. డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో పాసైన ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయనున్నారు. ఈ అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. గురువారమే దీనికి సంబంధించిన దస్త్రంపై సీఎం జగన్ సంతకం చేయగా.. అధికారిక ఉత్తర్వులు శుక్రవారం వెలువడతాయని భావిస్తున్నారు.

దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నూతన పే స్కేల్ ప్రకారం జీతాలు పెరుగుతాయి. డిపార్ట్‌మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ప్రొబేషన్ పూర్తయిన వారికి మాత్రమే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు అందుతాయని తెలుస్తోంది. ఏపీపీస్సీ నిర్వహించిన డిపార్ట్‌మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని వారి కోసం ఈ నెలలోనే మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్సఉడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.

జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్ర స్థాయిలో సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 15 వేలకుపైగా గ్రామ సచివాలయాల్లో 1.15 లక్షల మందికిపైగా ఉద్యోగులను నియమించింది. 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. వారికి రెండేళ్ల పాటు ప్రొబేషన్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ప్రొబేషన్ గడువు పూర్తయ్యాక డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించి పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే 2021 నవంబర్‌లో ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించారు.

 యువకుడి  ఆత్మహత్య


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండల పరిధిలోని చిందుకూరు గ్రామానికి చెందిన కారసాని హుస్సేన్ (23) ఇంటర్మీడియట్ వరకు చదువుకొని జేఎస్వీ సిమెంటు ఫ్యాక్టరీ నందు ఎలక్ట్రిషన్ గా పని చేసుకునేవాడిని, అప్పుడప్పుడు కడుపు నొప్పి తో బాధపడుతూ అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుని కడుపు నొప్పి బాధ తట్టుకోలేక జీవితం పై విరక్తి చెంది  15.06.2022 వ తేదీ రాత్రి సుమారు 11.00  గంటలకు పొలాలకు ఉపయోగించే  పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నంద్యాల లోని ప్రవేట్  హాస్పిటల్ కు తీసుకు పోవడం తో చికిత్స పొందుతూ 16. 06 .2022 వ తేదీ ఉదయం 07.00  గంటలకి కొలుకొన లేక చనిపోయాడని తెలుసుకున్న ఎస్.ఐ. బీ.టీ.వెంకటసుబ్బయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 అరెస్ట్ లు చేసినా...ఆ అధికారిపై మాత్రం ప్రశంసలు కరిపించారు


ఆందోళనలు చేస్తున్నప్పుడు అరెస్ట్ చేయడమే కాదు. అనారోగ్యం బారిన పడితే చికిత్స అందించడం కూడా తెలుసని ఏసీపీ నిరూపించారంటూ ఓ పోలీసు అధికారిపై కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ ప్రశంసలు ఎందుకంటారా...? సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఏపీలోనూ కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపట్టారు. ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజనాథ్ పిలుపు మేరకు రాజభవన్ ఎదుట నిరసన‌ చేపట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో విజయవాడతోపాటు పలు జిల్లాల్లోని కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.

నిరసన ప్రదర్శన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కృష్ణ లంక పోలీస్టేషన్‌‌కు తరలించారు. ఎండ వేడిమి, బీపీ పెరగడంతో శైలజానాథ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు కంగారు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఏసీపీ డాక్టర్ రవి కిరణ్ వెంటనే అక్కడికి బయల్దేరి వెళ్లారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆయన శైలజానాథ్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆయనకు బీపీ చెక్ చేసి ప్రథమ చికిత్స అందించారు.

ఇదిలావుంటే  2004, 2009ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి శింగనమల ఎమ్మెల్యేగా గెలుపొందిన శైలజానాథ్.. ప్రాథమిక విద్యాశాఖ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. రాష్ట్రం విడిపోయాక ఏపీలో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతినడంతో చాలా మంది నేతలు పార్టీని వీడారు. 2020 జనవరిలో సోనియా గాంధీ ఆయన్ను పీసీసీ చీఫ్‌గా నియమించారు.

 ఆమెకు నెలకోసారి...ఏడాది పాటు ఉచితంగా బిర్యానీ


ప్యారడైజ్ ఈ సారి వినూత్నంగా తన వేడుకలు  జరుపుకొంది. తమ కస్టమర్లను ఆకట్టుకొనేలా  ప్రత్యేక రీతిలో కార్యక్రమం చేపట్టింది. హైదరాబాదీ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్యారడైజ్‌ హోటల్ ఓ కస్టమర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. క్యాజువల్‌గా బిర్యానీ తినేందుకు వచ్చిన రక్షితా రెడ్డి అనే మహిళ చేత రెస్టారెంట్‌లో కేక్ కటింగ్ చేయించి వేడుక చేసింది. అంతేకాకుండా ఆమెకు మంచి ఆఫర్‌ను కూడా అందించి ఆశ్చర్యపరిచింది. నెలకొకసారి సంవత్సరం పొడవునా ఆమెకు ఉచితంగా బిర్యానీలను అందించనున్నట్లు తెలిపింది. వినూత్నమైన తమ రుచులను అమితంగా అభిమానించే లాయల్‌ లవర్స్‌ కోసం ‘దిల్‌ సే థాంక్యూ’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్యారడైజ్‌ హోటల్ నిర్వాహకులు తెలిపారు.

ఈ క్యాంపెయిన్‌లో భాగంగా 3.5 మిలియన్ల మంది లాయల్‌ ప్యారడైజ్‌ సర్కిల్‌ సభ్యులకు సేవలు అందించనున్నట్లు తెలిపారు. విజయవంతమైన ‘దిల్‌ సే థాంక్యూ’ ప్రచారం కోసం తొలిసారిగా తమ 50,000వ కస్టమర్‌తో సెలబ్రేషన్స్ చేసినట్లు ప్యారడైజ్ వెల్లడించింది.

హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రాండ్‌గా ప్యారడైజ్‌ బిర్యానీని అందివ్వడంలోని ఆనందాన్ని సెలబ్రేట్ చేస్తూ ఈ సరికొత్త ప్రచారాన్ని మే 2022లో ప్రారంభించారు. దీనికి అన్ని ప్రాంతాల నుంచి అపూర్వ స్పందన వస్తోందని హోటల్ నిర్వాహకులు తెలిపారు. www.paradisefoodcourt.in ద్వారా ప్యారడైజ్‌ సర్కిల్‌ సభ్యుడిగా నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. జూన్‌ 30 లోగా నమోదు చేసుకొని రూ.299 విలువైన బిర్యానీని ఆర్డర్‌ చేసుకుంటే ఆఫర్ పొందొచ్చని తెలిపింది.

నాణ్యమైన బిర్యానీ కోసం ఆసక్తిని పెంచేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు ప్యారడైజ్‌ పేర్కొంది. అత్యుత్తమ ఆహారం, అత్యున్నత సేవలపై ఈ ప్రచారం ఆధారపడి ఉందని తెలిపింది. మాపై అపారమైన ప్రేమ చూపుతున్న ప్యారడైజ్‌ సర్కిల్‌ సభ్యులందరికీ మేము ఉచిత బిర్యానీ అందించడం ద్వారా దిల్‌ సే థాంక్యూ చెబుతున్నందుకు సంతోషిస్తున్నాం అని ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్డ్‌ సీఈవో గౌతమ్‌ గుప్తా వెల్లడించారు.

‘ఒక నెలలోనే 50 వేల మందికి పైగా వినియోగదారులు తమ ఉచిత బిర్యానీని రిడీమ్‌ చేసుకున్నారు. ప్యారడైజ్‌ వినియోగదారులు ఎవరైనా సరే.. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా, బిల్లు చెల్లింపుల సమయంలో తమ మొబైల్‌‌ను చూపించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు. కస్టమర్లు తమకు నచ్చిన ఏదైనా ప్యారడైజ్‌ రెస్టారెంట్‌కు వెళ్లి తమ ఆఫర్‌ రిడీమ్‌ చేసుకోవచ్చు. కొనుగోలు సమయంలో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా బిర్యానీ పొందవచ్చు’ అని ప్యారడైజ్ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్యారడైజ్ అభిమానులు ఈ కార్యక్రమ సభ్యత్వం ద్వారా వినోద్మాక జెమ్‌ ఆధారిత రివార్డ్‌ వ్యవస్థతో పాటుగా ఇతర ప్రయోజనాలనూ పొందారని నిర్వాహకులు తెలిపారు. ఉచిత బిర్యానీలతో పాటు ప్రతి 100 రూపాయల విలువ కలిగిన కొనుగోళ్లపై రెండు జెమ్స్‌ను ప్యారడైజ్‌ సర్కిల్‌ ద్వారా పొందవచ్చని వివరించారు. ఈ జెమ్స్‌ను రివార్డ్స్‌ పాయింట్స్‌గా పంపిణీ చేస్తారు. వీటిని ఏ సమయంలో అయినా రిడీమ్‌ చేసుకోవచ్చు.

 ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన,,,

మండల అభివృద్ధి అధికారి విజయ సింహా రెడ్డి. ఈవో ఆర్ డి ఖాలీక్ బాషా

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల సచివాలయంను ఆకస్మిక తనిఖీలు జరిపారు.ఈ సందర్భంగా గడిగరేవుల సచివాలయం సిబ్బందితో మాట్లాడుతూ  ప్రభుత్వం నుండి ప్రజలకు జరిగే సేవలు ప్రజలకు తెలియజేస్తున్న రా  లేదా అని సచివాలయ సిబ్బందితో ఆరా తీశారు. సచివాలయ సిబ్బంది హాజరు, వివిధ పథకాలకు సంబంధించిన వివరాలు ప్రజలకు తెలియజేస్తున్నారా లేదా అని వాకబు చేశారు. సచివాలయ సిబ్బంది సరి అయిన  సమయ పాలన పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. గడిగరేవుల గ్రామంలో  త్రాగు నీరు పారిశుధ్యంపై సమీక్షా నిర్వహించారు.ప్రజలకు అందుబాటులో ఉండి వారికి తగిన రీతిలో సేవలు అందించాలని సచివాలయ సిబ్బందినీ ఆదేశించారు.