ఆ దేశాల్లో వ్యాధుల ప్రభావం ఉండదటా


మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీవితంలో ఆహార శైలీ ప్రాముఖ్యత అంతగా ఉంది. వ్యాధులు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. కానీ, ప్రపంచంలోని కొన్ని దేశాల ప్రజలు ఇప్పటికీ ఆరోగ్యంతో, ఎక్కువ కాలం పాటు చక్కగా జీవిస్తున్నారని తెలుసా..? ప్రపంచంలోని బ్లూజోన్ ప్రాంతాలుగా పరిగణించే నికోయ ( కోస్టారికా), ఇకారియా (గ్రీస్), సార్డినా (ఇటలీ), లోమ లిండా (క్యాలిఫోర్నియా), ఒకినవా (జపాన్) ప్రాంతాల్లో వ్యాధుల రేటు ప్రపంచంలోనే తక్కువగా ఉంది. అందుకే ఇక్కడి వారు శతాయుష్షుతో వర్ధిల్లుతున్నారు. ఆరోగ్య పరంగానే కాదు, శారీరకంగా ఫిట్ గా ఉండడం ఇక్కడి ప్రజల్లో చూడొచ్చు. ఇదంతా వారి జీవనశైలి, ఆహార అలవాట్ల బలమేనని భావిస్తున్నారు. 

పండ్లు, కూరగాయలు

బ్లూజోన్ ప్రాంత వాసులు తమ రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పాలకూర, బ్రకోలీ, బ్రస్సెల్ స్ప్రౌట్స్, బటానీ, క్యాలీఫ్లవర్, చిలగడ దుంపలు తీసుకుంటారు. ఇవన్నీ బరువు నియంత్రణకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో పొటాషియం, ఫైబర్, ఫొలేట్, విటమిన్ ఏ, విటమిన్ సి తగినంత లభిస్తాయి. కనుక ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు స్నాక్స్ కు బదులు పండ్లు, కూరగాయలకు చోటు ఇవ్వాలి.

ముడి ధాన్యాలు

అధిక ఫైబర్ ఉండే ఆహారాన్ని బ్లూజోన్ ప్రాంతంలోని వారు ఎక్కువగా తీసుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఆహారంగా ముడి ధాన్యాన్ని వినియోగిస్తున్నారు. ముడి ధాన్యంలో ఫైబర్, ప్రొటీన్, బీ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం లభిస్తాయి. దీంతో గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం, ఊబకాయం,కొన్ని రకాల కేన్సర్ రిస్క్ లు తగ్గుతాయి.

నీరు తగినంత

మన శరీంలో నీటి పరిమాణమే ఎక్కువ. అందుకని నీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. బ్లూజోన్ వాసులు ఇదే చేస్తున్నారు. నీటి పరిమాణం తగ్గకుండా చూసుకోవడం కూడా ఆయుష్షులో కీలక పాత్ర పోషిస్తుందని తెలిసింది. ముఖ్యంగా కోస్టారికాలోని నికోయ వాసుల ఆరోగ్య రహస్యాల్లో ఇదీ ఒకటి.

పరిమాణం

ఏమి తింటున్నాం, ఎంత తింటున్నామన్నది కీలకం. ఆహారాన్ని కొద్ది మోతాదుల్లో తీసుకోవడం వల్ల శరీరంలో కేలరీలు అధికంగా పోగుపడవు. జపాన్ లోని ఒకినవా వాసులు కడుపునిండా ఆహారం తీసుకోకపోవడాన్ని గమనించాలి. 80 శాతం వరకే ఆహారం తీసుకుని, మిగిలిన 20 శాతాన్ని వారు ఖాళీగా ఉంచేస్తారు.  

శారీరకంగా చురుకుదనం

బ్లూజోన్ ప్రాంతాల్లో నివసించే వారు రోజూ జిమ్ కు వెళ్లి వ్యాయామాలు ఏమీ చేయరు. అయినా వారు ఎంతో చురుగ్గా ఉంటున్నారు. ఎలా సాధ్యం? ఎందుకంటే వారు ఒకే చోట కూర్చోరు. శారీరక కదలికలు ఉన్న పనులను చేస్తూ ఉంటారు. గార్డెనింగ్, నడక, సైక్లింగ్ ఇలా ఏదో ఒక కదలికలతో కూడిన పనితో సమయం గడుపుతుంటారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: