ఉద్రిక్తత పరిస్థితుల్లో ఉక్రెయిన్ లో మార్షల్ లా అమలు


ఉక్రెయిన్ లో మార్షల్ లా అవుతోంది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఈ మార్షల్ లాను విధించారు. ఈ మేరకు ఇవాళ ఉదయం ఆ దేశాధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ప్రకటన చేశారు. మార్షల్ లా గురించి ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అంతా శాంతంగా ఉండాలని సూచించారు. ‘‘ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ మనపై దాడికి ఉపక్రమిస్తున్నట్టు ప్రకటించారు. మన దేశ సైనిక మౌలిక వసతులు, సరిహద్దు దళాలపై దాడులు చేశారు. దేశంలోని చాలా నగరాల్లోనూ బాంబుల మోతలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అంతటా మార్షల్ లా విధిస్తున్నాం. ఇప్పటికే ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మాట్లాడాను. అంతర్జాతీయ సమాజం మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పట్నుంచి ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నా. వీలైతే అందరూ ఇళ్లలోనే ఉండండి. దేశాన్ని కాపాడేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. మొత్తం సైన్యం, మొత్తం రక్షణ శాఖ రంగంలోకి దిగింది. భయపడవద్దు. మనం దృఢంగా ఉండాలి. దేనికైనా సిద్ధంగా ఉండాలి. మనం ఎవరిమీదైనా గెలవగలం’’ అంటూ ప్రకటన చేశారు.  

ఈ ఐదూ వెంటనే చేయాలి: ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి

రష్యా దాడులపై ప్రపంచ దేశాలు వెంటనే స్పందించాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు. రష్యా దాడులతో యూరప్, ప్రపంచ భవితవ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ముప్పును తప్పించాలంటే వెంటనే స్పందించాలన్నారు. ప్రపంచ దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాలని పేర్కొంటూ ఐదు డిమాండ్లను ముందుంచారు.

1. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీ కమ్యూనికేషన్స్ (స్విఫ్ట్)తో పాటు మరిన్ని ఆర్థిక ఆంక్షలను రష్యాపై వెనువెంటనే విధించాలి.

2. అన్ని విధాలుగా రష్యాను ఒంటరిని చేయాలి.

3. ఉక్రెయిన్ కు ఆయుధాలు, ఇతర సామగ్రిని వెంటనే సమకూర్చాలి.

4. ఉక్రెయిన్ కు ఆర్థిక సాయం అందించాలి.

5. మానవతా దృక్పథంతో సాయం చేయాలి.

బెలారస్, క్రిమియా సరిహద్దుల నుంచి దాడులు: ఉక్రెయిన్

 కాగా, పలు సరిహద్దుల నుంచి రష్యా తమపై దాడులు చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. బెలారస్, క్రిమియా సరిహద్దుల నుంచి రష్యా బలగాలు చొరబడి దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ సరిహద్దు భద్రతా విభాగం వెల్లడించింది. బెలారస్ సైన్యం మద్దతుతో బెలారస్ సరిహద్దుల ద్వారా రష్యా సైన్యం దాడులకు తెగబడిందని పేర్కొంది. లుహాన్స్క్, స్యూమీ, ఖార్కివ్, చెర్నిహివ్, ఝైటోమిర్ రీజియన్లలో దాడులు జరిగాయని తెలిపింది. సరిహద్దు భద్రతా బలగాలు, బార్డర్ పెట్రోలింగ్, చెక్ పాయింట్లపై భారీ ఆర్టిలరీలతో దాడులు చేశారని చెప్పింది. ఇటు క్రిమియా నుంచి కూడా దాడులు జరిగాయని వెల్లడించింది. కాగా, రష్యా బలగాలకు దీటుగా ఉక్రెయిన్ నేషనల్ గార్డ్స్, సాయుధ బలగాలు కూడా ఎదురు దాడిని చేస్తున్నాయని పేర్కొంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: