మైనారిటీ సంక్షేమానికి 5వేల కోట్లు కేటాయించాలి

ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ బ్యూరో)

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2022-23 లో మైనారిటీ సంక్షేమానికి 5వేల కోట్ల రూపాయలు కేటాయించాలని, చిన్న చిన్న వృత్తులు చేసుకుని జీవిస్తున్నవారికి, వీధి వ్యాపారులకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించాలని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేసారు. ఆవాజ్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2021-22 రెండున్నరలక్ష కోట్ల రూపాయలు అని ఘనంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి కేటాయించింది 1602 కోట్ల రూపాయలు మాత్రమే. 2020-21 బడ్జెట్లో 1973 కోట్లు కేటాయించి 1523 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. 2021-22 బడ్జెట్లో గత ఏడాది కేటాయింపుల కంటే 370 కోట్లు కోత విధించి 1602 కోట్లే కేటాయించారు. అందులో మూడవ క్వార్టర్ నాటికి 600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్స్ నామమాత్రంగా ఉన్నాయి.


మల్టీ సెక్టోరల్ అభివృద్ధి కోసం కేటాయింపులు గతం కంటే 30 కోట్లు తగ్గించారు. దానివల్ల మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్థిక సహాయం నిలిచిపోయిందని విమర్శించారు. 2016-17 సంవత్సరంలో చిరు వ్యాపారులకు, నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించాలని లక్షా డెబ్బై ఆరువేల మంది దరఖాస్తులు చేసుకున్నారని,6  సంవత్సరాల కాలంలో కేవలం 8వేల మందికి మాత్రమే ఆర్థిక సహాయం అందిందన్నారు. తెలంగాణ
 రాష్ట్రం ఏర్పడిన ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో 12లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో  15 శాతం జనాభా కలిగిన ఉన్న మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది 6500 కోట్లకు మించిలేదు. ఇది చాలా అన్యాయమన్నారు. స్కాలర్ షిప్ లు, మైనారిటీ గురుకులాలు మినహా మైనారిటీ సంక్షేమానికి పెద్ద కేటాయింపులు లేవని అన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ ఆస్తులు ఆక్రమణలకు గురవుతుంటే నిధులు లేక, ప్రభుత్వ విధానం సరిగా లేక వక్ఫ్ భూముల సర్వే ఆగిపోయిందన్నారు. డ్రైవర్ సాధికారత పథకం, డ్రైవర్ కమ్ ఓనర్ పథకాలు ఆరంభించి ఆపేశారు. 

ఆర్థికంగా చితికిపోయిన, విద్య, ఉద్యోగాలలో వెనుకబడిన మైనారిటీలు అభివృద్ధి చెందాలంటే బడ్జెట్ పెంచకుండా సాధ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సుధీర్ కమీషన్ నివేదిక ఇదే విషయాన్ని చెప్పింది. ప్రభుత్వం ఉత్తిత్తి హామీలతో  మభ్యపెట్టడం మాని మైనారిటీల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలని, 2022-23 బడ్జెట్లో 5వేలకోట్లు కేటాయించాలి. మైనారిటీ బంధు లాంటి స్కీం ప్రవేశపెట్టి యువతకు, మహిళలకు, చిరు వ్యాపారులకు ఉపాధి కల్పన కోసం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేసారు. ఈ ధర్నా లో ఆవాజ్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి మహమ్మద్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: