అమెరికా విమానాలపై చైనా కఠిన నిర్ణయం


అమెరికా విమానాలపై చైనా ఏవియేషన్ అథారిటీ కఠిన నిర్ణయాలు తీసుకొంది. అమెరికాలో కరోనా వైరస్ విజృంభించడంతో ఆ దేశం నుంచి వచ్చే విమాన ప్రయాణికులపై చైనా కఠిన ఆంక్షలు విధించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన అమెరికా.. చైనాకు వెళ్లే 44 విమానాలను శుక్రవారం నిలిపివేయాలని నిర్ణయించింది. తమ దేశంలోకి వచ్చిన విదేశీ ప్రయాణికులు భారీ సంఖ్యలో వైరస్ బారినపడుతున్నారని భావిస్తున్న చైనా.. విమానా సర్వీసుల నిలిపివేయడంతో పాటు సరిహద్దుల్లో కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. టేకాఫ్‌కి ముందు కోవిడ్‌ నెగెటివ్‌ వచ్చిన ప్రయాణికులకు చైనా చేరుకున్న తర్వాత పాజిటివ్‌గా తేలడంతో అమెరికన్, డెల్టా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాలను రద్దు చేయడానికి చైనా ఏవియేషన్ అథారిటీ సర్క్యూట్ బ్రేకర్ విధానాన్ని అవలంభించింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అమెరికా.. చైనా చర్యలను తప్పుబట్టింది. దీంతో చైనాకు దిమ్మదిరిగేలా ఝలక్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే చైనాకు విమానాలను నిషేధించింది. దీనిపై అమెరికా ట్రాన్స్‌పోర్టేషన్ విభాగం శుక్రవారం ఉత్తర్వులు జారీచేస్తూ... ‘పైన వివరించిన విధంగా డెల్టా, అమెరికన్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలను దెబ్బతీసే చర్యలు ప్రజా ప్రయోజనాలకు ప్రతికూలమైనవి.. విమాన ప్రయాణానికి ముందు ప్రోటోకాల్‌కు సంబంధించి అన్ని నిబంధనలను అనుసరిస్తున్న అమెరికా ప్రయాణీకులు గమ్యస్థానం చేరిన తర్వాత కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఎటువంటి జరిమానా ఉండదు’ అని పేర్కొంది. ఎయిర్ చైనా, చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్, చైనా సదరన్ ఎయిర్‌లైన్స్, జియామెన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 44 విమానాలు జనవరి 30, మార్చి 29 మధ్య ప్రయాణానికి షెడ్యూల్ చేశాయి. మరో మూడు వారాల్లో చైనాలో వింటర్ ఒలంపిక్స్‌ జరగనుండగా.. ఈ నిర్ణయం వెలువడింది. వింటర్ ఒలంపిక్స్ క్రీడలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చైనా.. బీజింగ్‌లో గతవారం ఒమిక్రాన్ తొలి కమ్యూనిటీ కేసు నమోదుకావడంతో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. వేలాది విమానాలను రద్దుచేసి, కోవిడ్ టెస్టింగ్‌లు భారీగా చేపట్టింది. జీరో కోవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తున్న చైనా.. ఒక్క కేసు బయటపడినా ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేస్తోంది. లాక్‌డౌన్ విధించి, కోవిడ్ అనుమానితులను బలవంతంగా క్యారంటైన్‌కు తరలించడం వంటివి చేస్తున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: