మీ పిల్లలకు ఈ లక్షణాలున్నాయా...


(జానో జాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్మ్)

ప్రస్తుతం సాగుతున్న కరోనా  ఒమిక్రాన్ పిల్లలపైనే తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు  పేర్కొంటున్నారు. మీ పిల్లలలో ఈ లక్షణాలు కనిపిస్తే చాలు వైద్య పరీక్షలు చేయించండి అంటూ వారు సూచిస్తున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకొందాం. కరోనా మహమ్మారి పిల్లలపైనా విరుచుకుపడుతోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేకించి రెండేళ్ల లోపు పిల్లలే ఎక్కువగా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవల అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఇప్పుడొస్తున్న కరోనా కేసుల్లో 17.4 శాతం పిల్లలవే ఉంటున్నాయి. అమెరికాలోని ప్రతి లక్ష మంది పిల్లల్లో 11,255 మంది దాని బారిన పడుతున్నారు. జనవరి 1 నుంచి 6వ తేదీ వరకు నమోదైన మొత్తం కేసుల్లో 5.8 లక్షల మంది పిల్లలున్నారని ఏఏపీ రిపోర్ట్ వెల్లడించింది. అంతకుముందు వారం (గత ఏడాది డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 30)తో పోలిస్తే 78 శాతం ఎక్కువది. ఆ వారంలో 3.25 లక్షల మంది చిన్నారులకు కరోనా సోకింది. 

పెద్దలతో పోలిస్తే చిన్నారులకు ట్రీట్ మెంట్ వేరుగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మామూలుగా రెండేళ్ల లోపు పిల్లలకు కరోనా వస్తే లక్షణాల గురించి చెప్పడం కష్టమంటున్నారు. వారికి వచ్చే లక్షణాలు మామూలు జలుబులాగానే ఉంటాయని, పిల్లలకు జలుబు కామన్ గా వచ్చేదే కాబట్టి.. ఏది మామూలు జలుబో? ఏది కరోనానో? తేల్చడం కష్టమవుతుందని వివరిస్తున్నారు. ఇటు పెద్దల్లోనూ కరోనా కేసులు పెరుగుతుండడం, చాలా మందిలో లక్షణాలు కనిపించకపోతుండడంతో ఇంట్లోని పిల్లలతో గడపడం అనివార్యమవుతోందని, దాని వల్ల కూడా పిల్లలు కరోనా బారిన పడుతున్నారని చెబుతున్నారు. పిల్లలకు చిన్నప్పుడు వేసే టీకాలతో రోగనిరోధక శక్తి స్ట్రాంగ్ గానే ఉన్నా.. కరోనా సోకడాన్ని కొట్టిపారేయలేమని హెచ్చరిస్తున్నారు.

పిల్లల్లో మూడు రోజులకు మించి జ్వరం ఉన్నా, సరిగ్గా తినకపోయినా, తాగకపోయినా, అలసటగా కనిపించినా, శ్వాస ఎక్కువగా తీసుకుంటున్నా, ఆక్సిజన్ స్థాయులు పడిపోయినా వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలని యునిసెఫ్ సూచిస్తోంది. 2 నెలల లోపు పిల్లలకు శ్వాస రేటు 60 కన్నా ఎక్కువగా ఉండకూడదని తెలిపింది. అంతకన్నా ఎక్కువుంటే వైద్యుడిని సంప్రదించాలని సూచించింది. 2–12 నెలల పిల్లల్లో నిమిషానికి శ్వాస రేటు 50, రెండేళ్ల నుంచి ఐదేళ్ల లోపు పిల్లల్లో 40 కన్నా ఎక్కువుంటే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలని పేర్కొంది. పిల్లల ఛాతి లోపలికి కుంచించుకుపోవడం, గురకలాంటి శబ్దం రావడం, పాలిపోవడం, నీలి రంగులోకి మారడం, కళ్లు లోపలికి పోవడం, నోరు పొడిబారడం, మూణ్నాలుగు గంటలకోసారి మూత్రం పోయకపోవడం వంటివీ లక్షణాలేనని యునిసెఫ్ వెల్లడించింది. విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి కూడా లక్షణాలని తెలిపింది. ఒమిక్రాన్ తో పిల్లలకు ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగువ శ్వాసవ్యవస్థపైనే ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని, పెద్దలతో పోలిస్తే పిల్లలకు శ్వాస క్రియ ఎక్కువగా జరగడం ప్రమాదకరమని అంటున్నారు. ఎక్కువ శ్వాస తీసుకోవడం వల్ల గాలిలోని ధూళి, ఇతర కణాలు పిల్లల లోపలికి వెళ్లే ముప్పు ఉంటుందని చెబుతున్నారు. అయితే, అమెరికాలో ఆసుపత్రుల పాలవుతున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నా.. వారిలో తీవ్రత మాత్రం తక్కువగానే ఉందని అంటున్నారు.

పిల్లలపై మహమ్మారి ప్రభావం, తీవ్రత తగ్గాలంటే పరిశుభ్రతను పాటించాలని సూచిస్తున్నారు. మాస్కులు పెట్టడం, వారి చేతులను తరచూ కడగడం వంటివి చేయాలని చెబుతున్నారు. కొంచెం పెద్ద పిల్లలైతే వారికి వాటి గురించి వివరించి చెప్పాలంటున్నారు. తినే ఆహారం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నీళ్లు ఎక్కువ తాగేలా తల్లిదండ్రులు చూడాలంటున్నారు. ఇంట్లోనే వండిన ఆహారం పెట్టాలంటున్నారు. విటమిన్ సీ, విటమిన్ డీ, కాల్షియం, జింక్, ఇతర పోషకాలున్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఇదిలావుంటే కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండడం, పిల్లల్లోనూ కరోనా కేసులు పెరుగుతుండడంతో కొవిడ్ పై జాతీయ స్థాయిలో పిల్లల కోసం ప్రభుత్వం ఓ రిజిస్ట్రీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: