గోవాలో చతుర్ముఖ పోటీ...విజేత ఎవరు


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డిస్క్)

గోవా రాష్ట్ర ఎన్నికలు ఈ సారి రసకందమయంగా మారానున్నాయి. ఈ రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపే నాలుగు ప్రధాన పార్టీలు బరిలోకి దిగనున్నాయి. దీంతో గోవా రాష్ట్రం ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. చిన్నా, చితక పార్టీలతో సహా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ రంగంలోకి దిగనున్నాయి. గోవా అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమైంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 15తో ప్రస్తుత గోవా అసెంబ్లీ కాల పరిమితి ముగియనుంది. 40 మంది సభ్యులు ఉన్న గోవా అసెంబ్లీ కి ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 14న పోలింగ్... మార్చి 10న కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 31తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. గోవాలో ఇప్పటికే 95 శాతం మంది ప్రజలు వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లుగా ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. 2017లో జరిగిన గోవా ఎన్నికల్లో 17 సీట్లతో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలిచింది. బీజేపీ 13 స్థానాలు గెలిచింది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో స్వతంత్ర అభ్యర్దుల మద్దతుతో బీజేపీ అధికారం దక్కించుకుంది. గోవా ఫార్వర్డ్ పార్టీ.. మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ..ఇద్దరు స్వతంత్రులతో 21 మంది సభ్యుల మద్దతు బీజేపీ దక్కించుకుంది. ప్రస్తుతం బీజేపీకి 27 మంది, కాంగ్రస్ కు 4 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సారి ఎనిమిది పార్టీలు గోవా బరిలో నిలిచాయి. టీఎంసీతో పాటుగా ఆప్ సైతం గోవా ఎన్నికల పైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అక్కడ కేజ్రీవాల్ ప్రచారం సైతం నిర్వహించారు. మేనిఫెస్టో అంశాలను వెల్లడించారు. కాంగ్రెస్ ఎనిమిది మంది అభ్యర్ధులతో తన తొలి జాబితా విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ వసంత్ కామత్ మార్గోవా నుంచి పోటీ చేయనున్నారు. 2017 ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా..అధికారం నిలుపుకోలేక పోయిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్దం అవుతోంది. ఇక, కేజ్రీవాల్ - మమతా బెనర్జీ పార్టీలు ఏ పార్టీకి మేలు చేస్తాయి.. ఏ పార్టీని నష్ట పరుస్తాయనే అంచనాల్లో విశ్లేషకులు బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో.. ఇక్కడ ఆసక్తి పోరులో భాగంగా ఎనిమిది పార్టీలు తమ శక్తి చాటుకొనేందుకు సిద్దం అయ్యాయి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: