విద్యా విప్లవ జ్యోతి...ఫాతిమా బేగం

సావిత్రీబాయి పూలేకు చేదోడుగా ఉంటూ

నాటి సాంఘిక దురాచారాలపై పోరులో వెన్నంటి నిలిచిన షేక్ ఫాతిమా బేగం


అనాదిగా మహిళలు అన్ని రంగాల్లో వివక్షకు గురౌతూనేవున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వివిధ ఉద్యమాల కారణంగా ఆధునిక కాలంలో వారికి కొన్ని హక్కులు సంక్రమించాయి. భారత దేశంలో ఆడపిల్ల చదువు కోసం పోరాడిన ఇద్దరు తొలి తరం మహిళల్లో మొదటి వ్యక్తి సావిత్రీ బాయి పూలే కాగా,రెండవ వ్యక్తి ఫాతిమా బేగం ఆని చెప్పవచ్చు.170 ఏళ్ల క్రితం మన దేశంలో మహిళల పరిస్థితి దారుణంగా ఉండేది. వారు వంటగదికే పరిమితం అయ్యేవారు.ఇటువంటి సమయంలో ఫాతిమా బేగం పూలే దంపతులతో కల్సి మహిళా సాధికారత కోసం చేసిన కృషి వెలకట్టలేనిది.


ఆధునిక భారత విద్యా రంగం తొలి రోజుల్లో విద్యా బోధనా రంగనా దళిత బహుజన మహిళా సమూహాలకు స్వచ్చందంగా విద్యా బోధన గావించడంలో పూలే దంపతులతో కలసి  కృషి చేసిన ఫాతిమా చిరస్మరణీయురాలు. ఫాతిమా కుటుంబం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి మాహారాష్ట్ర లోని మాలేగావ్ వచ్చి స్థిరపడింది. వారు చేనేత వస్త్ర వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. అయితే వారి వ్యాపారంలో ఏర్పడిన ఒడిదుడుకులు వల్ల మాలేగావ్ నుండి పూణేకు వచ్చారు. చిన్నతనంలోనే తల్లి తండ్రులను కోల్పోయిన ఫాతిమా సోదరుడు షేక్ ఉస్మాన్ పర్యవేక్షణలో పెరిగి పెద్దయింది. వీరికి పూణేలోని గంజ్ పేట నివాసి మున్షీ గఫార్ బేగ్ అన్ని రకాలుగా సహాయం చేశారు. ఈ క్రమంలోనే వీరికి పూలే కుటుంబ సభ్యులతో పరిచయం ఏర్పడింది.

పూలే దంపతులు ఆనాటి సమాజంలో ఉన్న పలు సాంఘిక దురాచారాలని నిర్మూలించేందుకు విశేష కృషి చేశారు. ఇదే క్రమంలో వారు మత పెద్దల నుండి తీవ్ర ప్రతి ఘటనని ఎదుర్కొన్నారు. జ్యోతిరావు పూలే తండ్రి కూడా వివిధ వర్గాల నుండి వచ్చిన ఒత్తిడులను తట్టుకోలేక పూలే దంపతులను తన ఇంటి నుండి బయటకు పంపారు. ఆ సమయంలో ఫాతిమా కుటుంబం పూలే దంపతులకు ఆశ్రయం ఇచ్చింది. అక్కడే పూలే దంపతులు బాలికల కోసం1848లో ఒక పాఠశాలను స్థాపించారు. ఫాతిమా ఉర్ధూతో పాటు, మరాఠీ కూడా నేర్చుకుంది. సావిత్రీ, ఫాతిమాలు అనేక అవరోధాలు అధిగమించి బాలికలకు విద్యాబుద్ధులు నేర్పేవారు. వారు విద్యార్థులకు అర్ధమయ్యే విధంగా బోధించేవారు. ప్రారంభంలో తక్కువమంది విద్యార్థులున్నా తర్వాత విద్యార్థుల సంఖ్య పెరిగింది. తర్వాత అనేక ఇతర ప్రాంతాల్లో వారు పాఠశాలలు స్థాపించారు.


ఫాతిమా తొలుత జ్యోతిరావు పూలే వద్ద శిక్షణ పొంది, తరువాత ఉపాధ్యాయినిగా సేవలు అందించింది. 1856 అక్టోబర్ 10న సావిత్రీ బాయి తన భర్తకు రాసిన లేఖలో ఫాతిమా గురించి ప్రస్తావించారు. ఫాతిమా గురించి బయటి ప్రపంచానికి తెలియడానికి ఈ లేఖే ఆధారం. కొంతమంది చరిత్రకారులు ఫాతిమా 1831 జనవరి 9న జన్మించారని వివరించారు. ఆమె జన్మదినంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.1856 తరువాత ఫాతిమా గురించి వివరాలు తెలియడంలేదు. పూలే దంపతులు స్వయంగా రచయితలు అవడం వల్ల వారి గురించి వివరాలు లభ్యమయ్యాయి. ఫాతిమా కేవలం బాలికలకు చదువు చెప్పడం పైనే దృష్టి పెట్టారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఫాతిమా, సావిత్రీ ఇద్దరూ కలసి కూర్చున్న ఛాయా చిత్రం కూడా దొరకడంతో వారిద్దరూ కలసి పనిచేసారనడానికి ఊతం లభించింది. ఫాతిమాకు వివాహం జరిగిందని చరిత్రకారులు నిర్ధారించారు. ఆనాడు పూలే దంపతులతో కలసి ఫాతిమా ఒక బలమైన సాంఘిక ఉద్యమాన్ని నిర్మించారు. వారి స్ఫూర్తితో నేటి బహుజనులు, ముస్లింలు తమ హక్కుల కోసం ఐక్యంగా కల్సి పోరాడవలసి ఉంది.

జనవరి 9 ఫాతిమా జయంతి సందర్భంగా మీ కోసం ఈ ప్రత్యేక వ్యాసం

 

 

రచయిత-యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 


 


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

1 comments: