ప్రసన్న వ్యాఖ్యలపై మండిపడుతున్న నిర్మాతల మండలి


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

ఏపీలో రాజకీయాలన్నీ ఇపుడు సినిమా టిక్కెట్ ధరల చుట్టే తిరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు స్పందించడం, ప్రతీగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ స్పందించడంతో రాజకీయ మరింత వేడెక్కుతోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా టిక్కెట్లపై చేసిన వ్యాఖ్యలపై సినిమా నిర్మాతల మండలి మండిపడుతోంది. సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేత అంశం నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిర్మాతల మండలి ప్రకటన విడుదల చేసింది. "నిర్మాతలు బలిసినవాళ్లు" అని కోవూరు ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం బాధాకరమని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు చేయడం యావత్ చిత్ర పరిశ్రమను అవమానించడమేనని స్పష్టం చేసింది. "తెలుగు సినిమా సక్సెస్ రేటు 2 నుంచి 5 శాతం మాత్రమే. మిగిలిన సినిమాలు నష్టపోతుంటాయి. ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ కు పని కల్పిస్తూ అనేక ఇబ్బందులు పడి, కోట్ల రూపాయల ఖర్చుతో సినిమాలు తీసే నిర్మాతలు చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది. ఇలాంటి కష్టనష్టాల బారినపడిన కొందరు నిర్మాతలు అన్ని విధాలా దెబ్బతిని చలనచిత్ర నిర్మాతల మండలి నుంచి నెలకు రూ.3 వేల పెన్షన్ తీసుకుంటున్నారు. దీన్ని బట్టే నిర్మాతలు ఎంత దారుణ పరిస్థితుల్లో ఉన్నారో తేటతెల్లమవుతోంది. కానీ గౌరవనీయ ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకోకుండా నిర్మాతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తోంది. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి" అంటూ నిర్మాతల మండలి డిమాండ్ చేసింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: