స్త్రీ శక్తి అంటే ఏమిటో నిరూపించినమాళవిక


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డిస్క్)

మాళవిక స్త్రీ శక్తి అంటే ఏమిటో నిరూపించారు. కష్టకాలంలో భయపడే కంటే నిర్భయంగా ముందుకు అడుగులేయాలని ఆమె స్పూర్తినిస్తున్నారు. ఇంతకు మాళవిక ఎవరు అనుకొంటున్నారా...? కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ కూతురు ఈమె. అంతేకాదు కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు దివంగత వీజీ సిద్ధార్థ సతీమణి. భర్త మరణం భార్యకు తీరని లోటు అని చాలా మంది చెబుతుంటారు. కానీ ఆ లోటు ఎంత లోతుగా, భయంకరంగా, బాధగా ఉంటుందో మాళవిక హెగ్డేను చూస్తే అర్థం అవుతుంది. అదే ఆమె ఖ్యాతిని ప్రతికలకు ఎక్కెలా చేసింది. ఇదిలావుంటే భవిష్యత్ వ్యాపార ప్రణాళికల మీద మాళవిక ద ఎకనమిక్ టైమ్స్‌కు తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీన్ని చదివితే ఆమె ఎంత స్పష్టతతో ఉన్నారో.. ఎంత నమ్మకంగా ఉన్నారో.. ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థం అవుతుంది. కష్ట కాలంలో ఉద్యోగులు అండగా ఉన్నారని, బ్యాంకులు ఓపికతో వేచి చూశాయని తెలిపారు. మోదీ ఆత్మనిర్భర్ భారత్‌కు తమల్ని ఉదాహరించుకున్నారు. కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని, భర్త కలల సాకారానికి పాటుపడతాని ఇంటర్వ్యూ ముగించారు.

ఇదిలావుంటే ఒకవైపు భర్త చనిపోయిన (అప్పులు తీర్చే దారి కనిపించక నదిలో దూకి సూసైడ్ చేసుకున్నారు) బాధ.. మరోవైపు రూ. 7 వేల కోట్ల అప్పుల్లో కంపెనీ.. ఇంకొక వైపు వేల మంది ఉద్యోగుల జీవితాలు.. ఇలా ఎన్నో కష్టాలు మాళవిక హెగ్డేను చుట్టుముట్టాయి. అప్పులు ఎగ్గొడితే.. భర్తకు, కుటుంబానికి చెడ్డ పేరు (బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్ల గురించి మనం ఇప్పుడు మాట్లాడకపోవడం ఉత్తమం). కంపెనీని మూసేస్తే వేల మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయి. మరి ఏం చేయాలి? మాళవిక కఠిన నిర్ణయం తీసుకుంది. కంపెనీని తిరిగి నిలబెడతామని, అప్పులు అణాపైసలుతో సహా తీర్చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి బాధను దిగమింగి కంపెనీని ముందుండి నడిపించే బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. కాలం గిర్రున తిరిగింది. అందరి అంచనాలను పటాపంచాలు చేస్తూ.. కంపెనీ అప్పులు సగానికి (రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్‌ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. సిద్దార్థ్ విధికి తల వంచారు. మాళవిక విధికి ఎదిరించి నిలబడ్డారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: