జనవరి 2022

 గడివేముల మండలంను నంద్యాలలో కలపండి...

టిడిపి ఆధ్వర్యంలో ర్యాలీ 

(జానో జాగో వెబ్ న్యూస్-  గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం,గడివేముల మండల పరిధిలోని టిడిపి నాయకులు,అభిమానులు మహా ర్యాలీ నిర్వహించి స్థానిక గడివేముల మండలం లోని ఎమ్మార్వో కార్యాలయంలో వారి యొక్క వినతి పత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే .... ర్యాలీ  సందర్భంగా గడివేముల మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు 26 ఏర్పాటు చేయడం మాకు సంతోషంగా ఉందని, కానీ  మా గడివేముల మండలం ను కర్నూలు జిల్లాలో చేర్చడం వల్ల గడివేముల మండలం లోని ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతారని, 

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న. గడివేముల టిడిపి  మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి 
కర్నూలు జిల్లా 60 కిలోమీటర్ల దూరంలో ఉందని కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉండే నంద్యాల ప్రాంతాన్ని వదిలిపెట్టి 60 కిలోమీటర్లు ఉండే కర్నూలు జిల్లాలో గడివేముల మండలం ను ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమని దీన్ని ప్రభుత్వ అధికారులు దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ గారు తెలిపారు.S Scసెల్ అధ్యక్షులు నాగ శేషులు గాారు మాట్లాడుతూ

ఎస్సి సెల్ అధ్యక్షులు నాగ శేషులు

గడివేముల మండలంలోని ప్రజలకు నంద్యాల తో 70 సంవత్సరాల నుండి  అనుబంధం ఉందని అలాంటి గడివేముల ప్రాంతమును 70 కిలోమీటర్ల దూరంలో ఉండే కర్నూలు జిల్లా లో కలవడం ఎంతవరకు సమంజసమని ప్రజా ప్రతినిధులు ఒకసారి ఆలోచన చేసుకోవాలని ప్రజా ప్రతినిధులు ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని గడివేముల మండలం ను నంద్యాల జిల్లాలో కలిపేందుకు ప్రయత్నం చేసి గడివేముల మండల ప్రజలు ఆనందంగా ఉండేందుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు

 నంద్యాల లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు రోడ్డు మంజూరు చేయండి

నంద్యాల సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన న కాంగ్రెస్ నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల ప్రతినిధి)

మహాశివరాత్రినీ పురస్కరించుకొని నంద్యాల లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు రోడ్డు మార్గాలు వెయ్యాలని సబ్ కలెక్టర్ కు ఏపీ పీసీసీ ప్రధాన కార్యదర్శి చింతల మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పి సి సి రాష్ట్ర ప్రధానకార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసు, జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక ) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా పాస్టర్ పాల్ రాజ్ కాంగ్రెస్ సేవాదళం ప్రధాన కార్యదర్శి  మస్తాన్ మాట్లాడుతూ1-3-2022 మహాశివరాత్రి సందర్భంగా


ఓంకార క్షేత్రానికి రోడ్డు మార్గం ఉన్నప్పటికీ ఆ రహదారి అంతా గుంతల మయంగా మారింది అని వచ్చే భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుందని మహాశివరాత్రికి ముసలివాళ్ళు చిన్నపిల్లలు మహిళలు అందరూ వస్తారని రహదారులు సరే లేకపోతే అధిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యార్థం ఈ క్షేత్రానికి రహదారులు తక్షణమే మరమ్మతులు చేయాలని నంద్యాల సబ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది

 యండమూరి వీరేంద్రనాధ్ ...

"అతడు ఆమె ప్రియుడు"కు...అద్భుత విజయం తధ్యం!!

-ప్రి-రిలీజ్ వేడుకలో అతిథులు


(జానో జాగో వెబ్ న్యూస్- సినిమా బ్యూరో)

ప్రఖ్యాత రచయిత  యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహించిన వినూత్న కథా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విభిన్న కథాచిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. 


     నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, రచనా సంచలనం విజయేంద్రప్రసాద్, దర్శకులు దశరథ్, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుకలో... చిత్ర దర్శకుడు యండమూరి, నిర్మాతలు రవి కనగాల,-రామ్ తుమ్మలపల్లి, హీరో భూషణ్, హీరోయిన్ మహేశ్వరి వడ్డి, ఈ చిత్రానికి ఛాయాగ్రహణంతోపాటు ఎడిటింగ్ చేసిన మీర్ పాలుపంచుకున్నారు. రచయితగా ఎన్నో సంచలనాలు సృష్టించిన యండమూరి.... దర్శకుడిగాను "అతడు ఆమె ప్రియుడు" చిత్రంతో సంచలనాలకు శ్రీకారం చుట్టాలని అతిధులు ఆకాంక్షించారు. 

     "అతడు ఆమె ప్రియుడు" చిత్రం కోసం యండమూరి ఎంతో శ్రమించారని, సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారని నిర్మాతలు రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి పేర్కొన్నారు. యండమూరితో మరికొన్ని చిత్రాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. "అతడు ఆమె ప్రియుడు" చిత్రాన్ని ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తున్నామని అన్నారు.

     ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా & కూర్పు: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్, సమర్పణ: శ్రీమతి కూనం కృష్ణకుమారి, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్!!

 గత బాసలు మరవకండి.. కేంద్రానికి కేటీఆర్ సూచన

గత హామీలు గుర్తు తెచ్చుకోండి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ప్రశ్నించారు. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఎల్లుండి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నానని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారని, ప్రతి భారతీయుడికి ఇల్లు నిర్మించి ఇస్తామన్నారని కేటీఆర్ ప్రస్తావించారు. అలాగే ఇంటింటికీ నీరు, విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారని వివరించారు. విభజన చట్టంలోని హామీలన్నింటిని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. హామీలకు న్యాయం చేసేలా బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. నీతి ఆయోగ్ పేర్కొన్న మేరకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు అందజేయాలని కోరారు. 2022 బడ్జెట్ లో కేటాయింపులు వాస్తవికతను ప్రతిబింబించేలా ఉంటాయని భావిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.

 వారి గైర్హాజరు క్షమించరాని నేరం

తెలంగాణ కాంగ్రెస్ నేతల విమర్శ

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ బ్యూరో)

మహాత్మా గాంధీ వర్ధంతి రోజున బాపూఘాట్ వద్ద నివాళి అర్పించడానికి గవర్నర్ సి.ఎం డుమ్మా కొట్టడము క్షమించరానిది అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అడ్డురాని కరోనా, గాంధీజీ కి నివాళు లర్పించడానికే అడ్డు వచ్చిందా? హైదరాబాద్ లంగర్ హౌజ్ బాపూ ఘాట్ వద్ద మహాత్మాగాంధీ 74వ వర్ధంతి రోజైన నేడు కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ పి.సి.సి అధ్యక్షులు వీ. హనుమంత్ రావు, జాతీయ విపత్తుల నివారణ సంస్థ మాజీ ఉపాధ్యక్షులు మర్రి శశిధర్ రెడ్డి, పి.సి.సి సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ తదితరులు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కల్సి మహాత్మా గాంధీ కి ఘనమైన నివాళులర్పించారు.


రెండు నిముషాలు మౌనము పాటించి శ్రద్దాంజలి ఘటించారు. రాష్ట్ర ప్రభుత్వము లక్షలాది రూపాయలు ఏర్పాట్లకు వెచ్చించినా, గాంధీజి ఆస్తికలు, చితాభస్మాన్ని ఉంచిన చారిత్రాత్మకమైన , పవిత్రమైన ఈ గాంధీజీ స్మృతి వద్ద జరిగే కార్యక్రమానికి గవర్నర్ , సి.ఎమ్ హాజరు కాకపో వడము, హుందాగా నిర్వహించక పోవడము జాతి పిత పట్ల అమర్యాదగా ప్రవర్తించడమేనని వారు ధ్వజమెత్తారు. గవర్నర్, సి.ఎమ్ ల ధోరణికి నిరసనగా 15 నిముషాల పాటు మౌనదీక్ష చేసి, భవిష్యత్తులో ఇలా జరుగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపూ స్మృతి కమిటీ సభ్యులు పరమానందము. కార్వాన్ బ్లాక్ కాంగ్రెసు అధ్యక్షులు చంటిబాబు, క్రిష్ణ, చంద్రశేఖర్, శోభా పాండే,యూసుఫ్ జాహి, రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 నారి సంకల్ప దీక్ష చేయడమా... టిడిపి పై రోజా ధ్వజం

విజయవాడలో బాలిక ఆత్మహత్య ఘటనపై వైసిపి ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ టిడిపి పై తీవ్రంగా మండిపడ్డారు. స్త్రీలపై వేధింపులకు పాల్పడే టీడీపీ నేతలు నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని రోజా ప్రశ్నించారు. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. బాలిక ఆత్మహత్యపై టీడీపీ నేతలు ఏంచెబుతారని నిలదీశారు. బాలిక బలవన్మరణానికి పాల్పడడం బాధాకరమని అన్నారు. స్త్రీలపై వేధింపులకు పాల్పడే టీడీపీ నేతలు నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని రోజా ప్రశ్నించారు. 60 ఏళ్ల వ్యక్తి బాలికను తండ్రిలా చూసుకోవాల్సింది పోయి, ఎలా వేధించాడో ఆ బాలిక పుస్తకంలో రాసుకున్న దాన్నిబట్టి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. తప్పుడు పనులు చేసేది టీడీపీ నేతలే అని, దాన్ని ఇతరులపైకి నెడుతుంటారని ఆరోపించారు. అటు, ఆసుపత్రి మార్చురీ వద్ద బాలిక మృతదేహాన్ని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. ఆమె తల్లిదండ్రులను ఓదార్చారు.

 మతోన్మాదంపై గాంధీ స్ఫూర్తితో పోరాడాలి 

ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ బ్యూరో)

మతోన్మాదంపై పోరాటంలో గాంధీ తన ప్రాణాన్ని కోల్పోయాడని, గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని మతోన్మాదంపై పోరాడాలని, దేశంలో లౌకిక, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ పిలుపునిచ్చారు. ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గాంధీజి 74 వ వర్ధంతి సభ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ గాంధీజీ దేశంలో మతసామరస్యం, లౌకికవాదం, శాంతియుత సహజీవనం తో వివిధ మతాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షించాడు.  దానిని సహించలేని సంఘ్ పరివార్, మతోన్మాద శక్తులు ఆయనని దారుణంగా హత్య చేసాయని అన్నాడు. దేశంలో నేడు మతోన్మాద శక్తులు బలం పుంజుకుని ప్రశ్నించిన వారిని వ్యక్తిగతంగా హత్య చేయడం ద్వారా భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నాయని అన్నారు. గోవింద్ పన్సారే దబోల్కర్, కల్బుర్గి, గౌరీ లంకేష్ ఇలాంటి హేతువాదులను దారుణంగా హతమార్చేయడం. దేశంలో శాస్త్రీయమైన, హేతుబద్దమైన ఆలోచనలు రాకుండా ప్రజలను మౌఢ్యంలో ఉంచాలని మతోన్మాద శక్తులు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను మతం,  సంప్రదాయాల పేరుతో బలవంతంగా అణిచి వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో మత రాజ్యాన్ని స్థాపించి వివిధ  సామాజిక తరగతులు పొందుతున్న స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను హరించి వేయాలని తన కాళ్ళ కింద అణిగిమనిగి ఉండేలాగా చేయాలని ప్రజల యొక్క స్వేచ్ఛను హరించడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. దేశ సంపద ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు ఒకవైపు చెబుతూ రెండో వైపు దేశభక్తి, దైవభక్తి పేరుతో ప్రజలని మభ్యపెడుతున్నారు. ఈ మతోన్మాద శక్తులను ఎదిరించడానికి గాంధీజీ స్ఫూర్తితో ఉద్యమించాలి. లౌకిక, ప్రజాస్వామిక విలువల పరిరక్షణకు పోరాటం మరింత ఉధృతం చేయాలని ఆయన ఆవాజ్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్ అధ్యక్షత వహించగా, గాంధీజీ చిత్రపటానికి పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నరసింహారావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కేంద్రం కన్వీనర్ జి రాములు, హిమబిందు, ఆవాజ్ రాష్ట్ర కోశాధికారి షేక్ అబ్దుల్ సత్తార్ ప్రసంగించారు. ఆవాజ్  నాయకులు యాకూబ్, ఇబ్రహీం, అంజుమ్, సుల్తానా, అలీ, ఖాజా గరీబ్ తదితరులు పాల్గొన్నారు.

 మహీంద్రా ఎస్ యూవీలో ఓ సూపర్ స్టార్ పాట పాడారు

సమాజంలో జరిగే తాజా ఘటన పైనే కాదు పాత ఘటనపై కూడా ఆనంద్ మహీంద్రా స్పందిస్తుంటారు. బాలీవుడ్ లో 1969లో వచ్చిన ఆరాధన చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయింది. అందులోని 'మేరే సప్నోంకీ రాణీ' పాట ఇప్పటికీ సంగీత ప్రియుల మదిలో నిలిచి ఉంది. ఆ పాటపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర అంశం వెల్లడించారు. "1969లో బాలీవుడ్ మొట్టమొదటి సూపర్ స్టార్ మహీంద్రా ఎస్ యూవీలో కూర్చునే తన ప్రేయసి కోసం 'మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీ తూ' అని పాడాడు. దాదాపు అర్ధశతాబ్దం తర్వాత అదే ఎస్ యూవీ కొత్త అవతారం దాల్చింది. ఆనాటి ప్రణయం ఇంకా నిలిచే ఉంది" అంటూ ట్వీట్ చేశారు. కొత్త థార్ వాహనం తాలూకు యాడ్ ను కూడా పంచుకున్నారు. అప్పట్లో వచ్చిన ఆరాధన చిత్రంలో రాజేశ్ ఖన్నా, షర్మిలా టాగోర్ నటించారు. హిందీ చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదు పొందిన మొదటి హీరో రాజేశ్ ఖన్నానే. ఆ సినిమాలో హీరో మహీంద్రా జీపులో వెళుతుండగా,  రైలులో హీరోయిన్ ప్రయాణిస్తుంటుంది. ఆమెను చూస్తూ హీరో తన ప్రేమను తెలిపే సమయంలో మేరే సప్నోంకీ రాణీ పాట పాడతాడు.

 బాలిక ఆత్మహత్య పై బాబు సమాధానం చెప్పాలి

బాలిక ఆత్మహత్యపై చంద్రబాబు సమాధానం చెప్పాలని రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్డిమాండ్ చేశారు. విజయవాడలో 9వ తరగతి బాలిక ఆత్మహత్య వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. బాలిక ఆత్మహత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత వినోద్ జైన్ ను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. దీనిపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో స్పందించారు. వినోద్ జైన్ తనను ఎలా ఇబ్బందిపెట్టాడో ఆ బాలిక మూడు పేజీల సూసైడ్ నోట్ రాసిందని వెల్లడించారు. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సరిపోదని, బాలిక ఆత్మహత్యపై చంద్రబాబు సమాధానం చెప్పాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. అసలు, అంత వయసున్న వ్యక్తికి ఈ బుద్ధి ఎలా వచ్చిందోనని అన్నారు. ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని, వినోద్ జైన్ ను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. వినోద్ జైన్ ఎంపీ కేశినేని నానికి ముఖ్య అనుచరుడు అని, ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అతడి కోసం చంద్రబాబు కూడా ప్రచారం చేశాడని వెల్లంపల్లి ఆరోపించారు. ఇలాంటి నీచులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నాడని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

 కేసీఆర్ కు... నేటి కేసీఆర్ కు చాలా తేడా

ఉద్యమనాయకుడు కేసీఆర్ కు, సీఎం కేసీఆర్ కు చాలా వ్యత్యాసం ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. నిరుద్యోగుల ఆత్మహత్యల నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై  బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను సీఎం అయ్యాక అమలు చేయడంలేదని, తద్వారా నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. లక్ష ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తానని 2014లో అసెంబ్లీలో కేసీఆర్ చెప్పలేదా? అని నిలదీశారు. గత ఏడున్నరేళ్లుగా ఒక్క గ్రూప్-1 రిక్రూట్ మెంట్ లేదని, మూడేళ్లుగా ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని బండి సంజయ్ ఆరోపించారు. ఇచ్చిన హామీలు విస్మరించడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని, నిరుద్యోగుల ఆత్మహత్యలు ముఖ్యమంత్రి చేసిన హత్యలుగానే తాము భావిస్తామని స్పష్టం చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 1.90 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ చెబుతోందని, నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి అమలు కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బండి సంజయ్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగానే కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఉద్యోగాల భర్తీ కోసం తదుపరి అసెంబ్లీ సమావేశాల సమయంలో మిలియన్ మార్చ్ చేపడతామని వెల్లడించారు.

 గాంధీజీ ఇష్టమైన గీతంం బీటింగ్ రీట్రిట్ లోనూ తొలగింపు


మోదీ ప్రభుత్వంపై ప్రత్యర్థులు  ఎన్ని విమర్శలు చేసినా బీజేపీ ప్రభుత్వం తన చర్యల విషయంలో ముందుకే పోతోంది. గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకల్లో భాగంగా బీటింగ్ రీట్రిట్ సైన్యం నిర్వహిస్తోంది. ఈ సారి కూడా జరిగింది. గాంధీజీ ఇష్టమైన గీతం లేకున్నా.. డిఫరెంట్‌గా సాగింది. విజయ్ చౌక్ వద్ద సైనికులు బీటింగ్ రీట్రిట్ జరిగింది. ఆకాశంలో వేయ్యి డ్రోన్లను మొహరింపజేశారు. ఆ డ్రోన్లతో భారతదేశ ప్రతీమను చూపించారు. ఢిల్లీకి చెందిన ఐఐటీలో బోట్‌లాబ్ డైనమిక్స్ వారు డ్రోన్లను ఎగిరేశారు. ఈ సారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతితో గణతంత్ర దినోత్సవ వేడుకలను స్టార్ట్ చేశారు. శనివారం జరిగిన బీటింగ్ రీ ట్రిట్‌కు ప్రధాని మోడీ హాజరయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. తొలిసారి ఆకాశంలో వెయ్యి డ్రోన్లను ప్రయోగించారు. ప్రపంచంలో ఇంతకుముందు బ్రిటన్, రష్యా, చైనా కూడా డ్రోన్ల ఎగిరేశాయి. ఆ తర్వాత స్థానంలో ఇండియా చేరింది. ఒక ఫేమస్ బీట్ తొలగించారు. అదీ కూడా జాతి పిత మహాత్మా గాంధీకి ఇష్టమైన గీతం అదీ. బీటింగ్ రీట్రీట్‌ ముగింపు వేడుకల్లో ఇదివరకు అబిడ్ విత్ మి గంభీరమైన శ్లోకం వినిపించేంది. ఇదీ శతాబ్దాల నాటి సైనిక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇండియా గేట్ వద్ద గల అమర్ జవాన్ జ్యోతిని సమీపంలో గల నేషనల్ వార్ మెమోరియల్‌కు తరలించారు. దీనిపై దుమారం చెలరేగింది. ఆ వెంటనే మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి ప్రపంచ యుద్దం, ఆంగ్లో ఆప్ఘన్ యుద్దంలో బ్రిటిష్ వారి కోసం పోరాడిన కొందరు అమరవీరుల పేర్లు అక్కడ చెక్కబడ్డాయి. ఇదీ వారి త్యాగానికి చిహ్నాం.. 74 వేల మంది సైనికులు మొదటి ప్రపంచ యుద్దంలో పోరాడి చనిపోయారు. బెల్జియం, ప్రాన్స్‌ జరిగిన గొప్ప యుద్దాలలో పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్దంలో 87 వేల మంది సైనికులు ప్రాణ త్యాగం చేశారు. వారు కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ ద్వారా గౌరవించబడ్డారు. వాస్తవానికి బీటింగ్ రీట్రిట్ పాశ్చాత్య ధోరణితో ఉన్న.. దానికి సంబంధించి ట్యూన్ మాత్రం భారతీయ ట్యూన్ కలిగి ఉన్నాయి.

 ఇరు దేశాల మధ్య బంధం కొనసాగుతుంది: ప్రధాని నరేంద్ర మోడీ


భారత్, ఇజ్రాయిల్ ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధం కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంచేశారు. ఇదిలావుంటే పెగాసస్ స్పై వేర్ మరోసారి చర్చకు దారితీసింది. న్యూ యార్క్ టైమ్స్ కథనంలో రావడంతో డిస్కషన్ జరుగుతుంది. పెగాసస్ స్పై వేర్‌ను రక్షణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ నుంచి భారత్ కొనుగోలు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో భారత ప్రధాని మోడీ స్పందించారు. ఇరు దేశాల అభివృద్దిలో దూసుకెళ్తున్నాయని మోడీ చెప్పారు. గత 30 ఏళ్ల నుంచి ఇరు దేశాల ధ్వైపాక్షిక సంబంధాలు బలంగా కొనసాగుతున్నాయని వివరించారు. ఈ సమయం రెండు దేశాలకు చాలా ముఖ్యం అని మోడీ చెప్పారు. ఇరు దేశాలు మంచి సంబంధాలను కలిగి ఉన్నాయని మోడీ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధం కొనసాగుతోందని వివరించారు. శతాబ్దాలుగా దేశంలో వివక్ష లేకుండా.. సామరస్య వాతావరణంలో నెలకొందని తెలిపింది. తమ ప్రయాణంలో డెవలప్ జరుగుతుందని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని చెప్పారు. పెగాసస్ స్పైవేర్‌ సాయంతో చట్టవిరుద్ధంగా నిఘా ఉంచి దేశద్రోహానికి పాల్పడిందని ప్రతిపక్షాలు దాడి చేశాయి. ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసింది.. ప్రభుత్వ వ్యవస్థలు, ప్రతిపక్ష నాయకులు, సాయుధ బలగాలు, న్యాయవ్యవస్థ.. ఇలా అందరూ ఫోన్‌ ట్యాపింగ్‌ దాడికి గురయ్యారు.. ఇది దేశద్రోహం.. మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. స్పైవేర్‌ను రక్షణ పరంగా కాకుండా.. ప్రతిపక్షాలు, పాత్రికేయులపై నిఘా పెట్టడానికి ఉపయోగించారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. బీజేపీనే అది సాధ్యం. వారు దేశాన్ని బిగ్‌ బాస్‌ షోగా మార్చారని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా మోడీ ప్రభుత్వం స్పందించాలని అన్నారు.

 రెబ్బల్స్ ను ఎధుర్కొనేదెలా: గోవా బీజేపీకి సరికొత్త తలనొప్పి


గోవాలో మళ్లీ పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి పార్టీ రెబల్స్ రూపంలో శాపం వెంటాడుతోంది. గోవా ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ రెబెల్స్ బెడద ను ఎదుర్కోనుంది. గోవా అసెంబ్లీ ఎన్నికలలో విజయకేతనం ఎగురవేసి మళ్లీ గోవాను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి, టికెట్ నిరాకరించడంతో పార్టీని వీడి వెళ్లిన నేతలు రెబెల్స్ గా ఎన్నికల బరిలోకి దిగడంతో తలనొప్పి మొదలైంది. ఫిబ్రవరి 14న జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేపీ చాలా ప్రాంతాల్లో అసమ్మతిని నియంత్రించగలిగింది. అయితే ప్రతిష్టాత్మకమైన పనాజీ నియోజకవర్గంతో సహా నాలుగు స్థానాలు మాత్రం బీజేపీకి ఆందోళన కలిగిస్తున్నాయి. పనాజీలో మాజీ ముఖ్యమంత్రి , దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. 2019లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన అధికార పార్టీలో చేరిన, కాంగ్రెస్ పార్టీ నేతల పార్టీ ఫిరాయింపులలో కీలక భూమిక పోషించిన అటానాసియో మోన్సెరట్టెను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించటంతో ఆయనపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఉత్పల్ పారికర్ తన హృదయం బిజెపితో కొనసాగుతుందని పేర్కొన్నాడు. అయితే అతను ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తిని అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్నానని అందుకే ఎన్నికల బరిలోకి దిగుతున్నానని వెల్లడించారు. మాండ్రెమ్‌లో ఇండిపెండెంట్ గా మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ బరిలో దిగారు. సంగెంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవ్లేకర్ భార్య సావిత్రి కవ్లేకర్ తిరుగుబాటు చేసి అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుభాష్ ఫాల్దేశాయ్‌పై పోటీ చేశారు. చంద్రకాంత్ కవ్లేకర్ బిజెపి అభ్యర్థిగా ఉన్న క్యూపెమ్ అసెంబ్లీ స్థానానికి సమీపంలో ఉన్న నియోజకవర్గం సంగేమ్. ప్రస్తుత సభలో స్వతంత్ర శాసనసభ్యుడు ప్రసాద్ గాంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు.

 సోమవారంనాడు కేంద్ర బడ్జెట్...ఈ సారి ప్రత్యేకత  ఇదే


కేంద్ర ప్రభుత్వం వచ్చే సోమవారంనాడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టున్నట్లు సమాచారం. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. అనంతరం ఎకనమిక్ సర్వేను టేబుల్ చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు ఆమె 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగాన్ని ఆరంభిస్తారు. తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం.. రెండోరోజు బడ్జెట్ ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని కీలకమైన రెండు సెషన్స్‌ను పార్లమెంట్ సెక్రెటేరియట్ రద్దు చేసింది. అవే- జీరో అవర్, క్వశ్చన్ అవర్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రెండు రోజుల్లో ఈ రెండు సెషన్లను నిర్వహించట్లేదని వెల్లడించింది. ఈ మేరకు ఓ బులెటిన్ విడుదల చేసింది. జనవరి 31, ఫిబ్రవరి 1 అంటే - సోమ, మంగళవారాల్లో రాజ్యసభ, లోక్‌సభల్లో జీరో అవర్, క్వశ్చన్ అవర్ ఉండబోవని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 2వ తేదీ బుధవారం నుంచి ఈ రెండు సెషన్లను పునరుద్ధరిస్తామని సెక్రెటేరియట్ పేర్కొంది. తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించదలిచిన సభ్యులకు ఆన్‌లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించింది. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇ-పోర్టల్ ద్వారా గానీ లేదా పార్లమెంటరీ నోటీస్ ఆఫీస్‌లో వ్యక్తిగతంగా గానీ- తాము ప్రస్తావించదలిచిన అంశాల గురించిన సమాచారాన్ని తెలియజేయవచ్చని సూచించింది. పార్లమెంట్ రూల్స్, ప్రొసీజర్ల ప్రకారం.. సమావేశాలను నిర్వహించిన ప్రతీసారీ.. ప్రతీరోజు జీరో అవర్, క్వశ్చన్ అవర్ కోసం 60 నిమిషాలను కేటాయించాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో తొలుత క్వశ్చన్ అవర్ మొదలవుతుంది. ఆ తరువాత జీరో అవర్‌ను షెడ్యూల్ చేస్తుంది సెక్రెటేరియట్. ఇది పార్లమెంట్ ఆనవాయితీ. రాజ్యసభలో తొలుత జీరో అవర్ ఆరంభమౌతుంది. దాని తరువాత క్వశ్చన్ అవర్‌ను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌ ప్రతిపాదనల తెరమీదికి రానున్నాయి. గత సంవత్సరం నిర్మల సీతారామన్..పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సంప్రదాయానికి భిన్నంగా బహీ ఖాతాను సమర్పించారామె. దీనికోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ పేరుతో రూపొందించిన ఈ యాప్‌లో బడ్జెట్ ప్రతిపాదనలన్నింటినీ ఉంచారు. ఈ సారి కూడా అదే తరహాలో పేపర్‌లెస్ బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ బడ్జెట్ కాపీలను యాప్‌లో అందుబాటులో ఉంచుతామని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై స్మార్ట్‌ఫోన్లను వినియోగించే వారు ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది హల్వా లెస్ బడ్జెట్. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి హల్వా సంప్రదాయానికి కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. దానికి బదులుగా స్వీట్లను పంచి పెట్టింది.


 మహాత్మా గాంధీ వర్ధంతిని మతసామరస్య దినంగా జరపండి

తెలంగాణ ఆవాజ్ రాష్ట్ర కమిటీ పిలుపు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

మతసామరస్యం, లౌకికవాదం, దేశ సమైక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహాత్మా గాంధీ వర్ధంతి రోజును (జనవరి 30ని) 'మతసామరస్య దినం'గా జరపాలని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది. ఈ మేరకు ఆవాజ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ ఓ‌ ప్రకటన విడుదల చేశారు.  జనవరి 30, 1948 లో నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని మత విద్వేషంతో దారుణంగా హత్య చేశాడు. గాంధీజీ దేశ స్వాతంత్రం కోసం అకుంఠిత దీక్షతో ఉద్యమం నడిపి స్వాతంత్ర్య సమరంలో కీలక భూమిక పోషించారు.  దేశంలో ప్రజలంతా మతవిశ్వాసాలకు అతీతంగా కలిసి మెలిసి జీవించాలని కలలు కన్నాడు. మత రాజ్యం కాకుండా సర్వమతాల సమాహారంగా ఉండే లౌకిక దేశంగా భారత్ ఉండాలని కోరుకున్నారు. మతోన్మాద సిద్ధాంతంతో స్ఫూర్తి పొందిన గాడ్సే దేశానికి గాంధీజీ చేసిన సేవలను విస్మరించి ఆయనను  దారుణంగా హతమార్చాడు.  గాంధీజీ హత్యకు మత రాజకీయాలే కారణం. దేశంలో ప్రస్తుతం మత రాజకీయాలు ఉచ్చస్థితికి చేరాయి. రాజ్యాంగ బద్ద పదవులలో ఉన్నవారే రాజకీయ ప్రయోజనాల కోసం బాధ్యతారాహిత్యంగా మత విద్వేషం, అసహనంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.  లౌకిక  ప్రజాస్వామిక విలువలను, రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆచరించిన లౌకికవాదం, ప్రదర్శించిన మతసామరస్యం దేశానికి ఎంతో అవసరం. ఆయన వర్థంతి రోజును మత సామరస్య దినంగా జరపండం ద్వారా   మతోన్మాదాన్ని ఎదిరించాలని, ప్రజలలో మత సామరస్యం గురించి ప్రచారం చేయాలని కోరుతున్నాం. అని వారు ఆ ప్రకటనలో కోరారు.

 మొక్కను పీకాడని...సహచర బాలుడిని హత్య చేసిన మైనర్


నేరాల ప్రభావం చిన్నపిల్లలపై కూడా చూపుతోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ మొక్కను పీకేసినందుకు ఓ బాలుడు.. ఇంకో పిల్లవాడి ప్రాణం తీశాడు. జనవరి 26వ తేదీన బుర్హాన్ పుర్ జిల్లా షేక్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో తన వ్యవసాయ పొలాన్ని పర్యవేక్షిస్తుండగా ఏడేళ్ల బాలుడు ఓ మొక్కను పెకిలించడాన్ని 12 ఏళ్ల బాలుడు చూశాడు. అది చూడగానే కోపంతో రగిలిపోయిన ఆ బాలుడు.. పిల్లవాడిపై దూసుకెళ్లాడు. విపరీతంగా కొట్టాడు. అలా కొట్టి తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ దెబ్బలకు ఏడేళ్ల బాలుడు అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. తర్వాత నిందితుడు వెళ్లి చూడగా అక్కడే పడి ఉండడం, ఆ పిల్లవాడిలో ఏ కదలికలు లేకపోవడాన్ని గమనించాడు. అలా అచేతనంగా పడి ఉన్న పిల్లవాడిని లేపడానికి ప్రయత్నించగా పలితం లేకపోయింది. దాంతో వెంటనే జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్లు పోలీసులకు తెలియజేశారు. జరిగిన సంఘటనను వివరించి చెప్పారు. అయితే పోస్ట్మార్టంలో గొంతు నులిమి చంపడం వల్లే చనిపోయిపోనట్టు వైద్యులు నిర్ధరించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. తదుపరి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇలా క్షణికావేశానికి ఓ బాలుడు ప్రాణం పోయింది.

 రైల్లో మంటలు..ప్రయాణికులు దూకేశారు...అయినా అంతా సేఫ్


రైలులో అగ్నిప్రమాదం జరగ్గా అధికార్ల అప్రమత్తంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాలలోకి వెళ్లితే గాంధీధామ్-పూరీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాలేదు. మహారాష్ట్ర నందుర్భార్ రైల్వే స్టేషన్‌కి ట్రైన్ రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలు ప్యాంట్రీ కారులో మంటలు అంటుకుని దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు జరిగినట్టు పోలీసులు తెలిపారు. అయితే ట్రైన్‌లో మంటలను గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురై… కొంతమంది రైలు నుంచి దూకేశారు. దాంతో అధికారులు ట్రైన్‌ వెంటనే ఆపేశారు. సంబంధిత అధికారుల సమాచారంతో స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే మంటలు అంటుకున్న బోగీ నుంచి మిగిలిన బోగీలను వేరు చేశారు. వైద్య బృందం, ఇతర పారామెడికల్ సిబ్బంది కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని వెల్లడించారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, వారిని సురక్షితంగా తరలించామని రైల్వే మంత్రిత్వ శాఖ కూడా తెలిపింది. ఈ రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉండగా ప్యాంట్రీ కారు 13వ కోచ్‌గా ఉంది. కాగా మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా ముంబైకి 450 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకోరావాలి

న్యాయవాది మహమ్మద్ నిజాముద్దీన్ రషీద్ డిమాండ్


(జానో జాగో వెబ్ న్యూస్-సంగారెడ్డి ప్రతినిధి)

న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకోరావాలని ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది మహమ్మద్ నిజాముద్దీన్ రషీద్ డిమాండ్ చేశారు. ఆయన సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి ములస్తంభల్లో ఒకటైన న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర చాలా ప్రధానమైనది.  నాటి స్వాతంత్ర ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ మరియు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ లు కూడా న్యాయవాద వృత్తి నుండి వచ్చిన వారే.  ప్రస్తుత చట్ట సభల్లో కూడా చాలా మంది న్యాయవాద వృత్తి నుండి వచ్చిన వారు ఉన్నారు. కానీ నేడు కొన్ని దుష్టశక్తులు న్యాయవాదులపై బెదిరింపులకు మరియు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ తరహా దాడులను ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు పలు సామాజిక మాధ్యమాల్లో రోజు చూస్తూనే ఉన్నాము. బాదితుల తరపున న్యాయం కొరకు నిలబడి పోరాడే న్యాయవాదులకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల సంగతి దేవుడెరుగు.  కావున  తేది.31-01-2022  సోమవారం నాటి నుండి ప్రారంభం అయ్యే పార్లమెంట్ సమావేశాల్లో  న్యాయవాదుల రక్షణ చట్టం (Advocates Protection Act) ఏర్పాటు కొరకు న్యాయవాదుల తరపున వాణిని వినిపించల్సిందిగా, కేంద్ర న్యాయశాఖ మంత్రివర్యులు గౌ. శ్రీ. కిరెన్ రిజిజు గారికి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు గౌ. శ్రీ. జి. కిషన్ రెడ్డి గారికి మరియు మన రాష్ట్రం నుండి పార్లమెంట్ ఉభయసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ & లోక్ సభ సభ్యులందరికీ వినతి పత్రంతో కూడిన లేఖలను వ్రాయడం జరిగింది.  త్వరలో న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పడుతుంది అని ఆశిస్తున్నట్లు తెలిపారు.


 బ్రిడ్జ్ పై నుంచి కిందపడ్డ కారు...ఏడుగురు విద్యార్థుల మరణం


కారు ప్రయాణం అప్రమత్తంగా చేయకుంటే ఘోర ప్రమాదంతప్పదని మరో ఘటన రుజువు చేసింది. మహారాష్ట్రలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృతిచెందారు. వీరిలో బీజేపీ ఎమ్మెల్యే తనయుడు కూడా ఉన్నాడు. మ‌హారాష్ట్రలోని డియోలీ నుంచి వార్ధాకు వెళుతోన్న స‌మ‌యంలో ఎస్‌యూవీ వాహనం సెల్సురా స‌మీపంలో అదుపు త‌ప్పి బ్రిడ్జిపై నుంచి కింద ప‌డింది. సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి కారు ప‌డిపోవ‌డంతో కారులోని ఏడుగురు అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించారు. వీరంతా వైద్య విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. ఏడుగురు మృతుల్లో భండారు జిల్లాల‌కు చెందిన తిరోడా ఎమ్మెల్లే విజ‌య్ ర‌హంగ్‌డేల్ కుమారుడు అవిష్కార్ రహంగ్‌డేల్ ఉన్నట్టు గుర్తించారు. సోమవారం అర్థ‌రాత్రి 11.30 ప్రాంతంలో జ‌రిగిన ఈ ప్ర‌మాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేపట్టారు. మృతి చెందిన ఏడుగురిలో ఒక‌రు బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అవిష్కార్ రహంగ్‌డేల్ కాగా.. మిగతావారు నితీశ్ సింగ్, నీరజ్ చౌహన్, వివేక్ నందన్, ప్రత్యూష్ సింగ్, శుభమ్ జైస్వాల్‌గా గుర్తించారు. నితీశ్ సింగ్ హౌస్ సర్జన్ కాగా.. మిగిలిన ఆరుగురు వార్దాలోని శవాంగి మెడికల్ కాలేజీలో చివరి ఏడాది చదువుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఇటీవ‌ల ప‌రీక్ష‌లు ముగియ‌డంతో విద్యార్థులంతా వార్ధాకు వెళుతున్నార‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఎంతో బంగారు భ‌విష్య‌త్తు ఉన్న‌ వైద్య విద్యార్థులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

 మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం...కోవిడ్ రోగి మరణం


ఆసుపత్రులకు అగ్ని ప్రమాదాల సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. అందరూ నిద్రిస్తునన సమయంలో అకస్మాత్తుగా కోవిడ్ వార్డులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో కోవిడ్‌‌ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మరణించారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న పేషంట్లు, వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. కోవిడ్ వార్డులోని ఆరో బ్లాక్‌లో శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అది గమనించిన ఆస్పత్రి సిబ్బంది మంటలు ఆపడానికి ప్రయత్నించారు. అదే సమయంలో రోగులు భయంతో పరుగులు తీశారు. ఆస్పత్రిలో ఉన్నవారిని సిబ్బంది జాగ్రత్తగా బయటకు తరలించారు. దీనిపై సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. దాదాపుగా గంట తర్వాత మంటలు అదపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి ఘల్సీలోని బరమురియా గ్రామానికి చెందిన సంధ్య మండల్ (60)గా గుర్తించారు. ఈ ఘటనలో ఇంకెవరికి ఎటువంటి హాని జరగలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఈ యాక్సిడెంట్‌కు కారణాలు తెలియరాలేదు. దీనిపై విచారణ జరపడానికి ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ 24 గంటల్లో నివేదిక ఇవ్వనుంది. దీనిపై ఫోరెన్సిక్ బృందానికి సమాచారం అందించామని బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రబీర్ సేన్ గుప్తా తెలిపారు. ఆ కమిటీ సభ్యులు కూడా ఆస్పత్రిని సందర్శిస్తారని చెప్పారు.

 70 ఏళ్లుగా..డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపాడు


కొన్ని ఘటనలు షాక్ ఇచ్చేలా ఉంటాయి. అలాంటి ఘటనే బ్రిటన్ పోలీసులకు ఎదురైంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే నేరం. అందుకే వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడూ చెక్ చేస్తుంటారు. లైసెన్స్ లేకుండా దొరికిన వారికి జరిమానా విధిస్తుంటారు. అదెంత ప్రమాదమో వివరిస్తూ కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తారు. అలాంటిది ఓ వ్యక్తి లైసెన్స్ లేకుండా 70 సంవత్సరాలకుపైగా డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇన్నేళ్లకు పోలీసులకు పట్టుబడడంతో ఆ విషయం తానే స్వయంగా చెప్పాడు. బ్రిటన్‌లోని నాటింగ్ హామ్‌లో పోలీసులు రోటీన్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ సూపర్ మార్కెట్ కార్ పార్కింగ్‌లో 80 ఏళ్ల వయస్సులో ఉన్న డ్రైవర్‌ను లైసెన్స్ చూపించమని అడిగారు. అయితే అతని దగ్గర డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కూడా లేవని చెప్పాడు. 1938లో జన్మించిన ఆయన తనకు 12 ఏళ్ల నుంచి లైసెన్స్ లేకుండానే కారు నడుపుతున్నట్టు చెప్పాడు. దాంతో పోలీసులు చాలా ఆశ్చర్యపోయారు. పైగా తననెప్పుడు పోలీసులు అడ్డుకోలేదని, ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదం కూడా జరగలేదని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని ఆ పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తాము పట్టుకున్న ఓ వ్యక్తి 12 ఏళ్ల వయస్సు నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే నడుపుతున్నాడని, ఇది నమ్మలేకపోతున్నామని పేర్కొన్నారు. అలాగే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే నేరమని, శిక్షపడే అవకాశం ఉందని పోస్ట్‌లో వెల్లడించారు. ఇక డ్రైవర్‌కు బీమా లేకపోతే జరిమానా ఎంతైనా పడే ప్రమాదం ఉందని, వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ఆ వ్యక్తికి ఎలాంటి శిక్ష విధించారో అధికారులు చెప్పలేదు. కానీ ఆ కారుకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు.

 పట్టాలపై మంటలు పెట్టి మరీ రైళ్లను నడుపుతున్నారు


పట్టాలపై మంటలు పెడితే ఎవరైనా అక్కడ రైళ్లను నడుపుతారా...కానీ అమెరికాలోని చికాగోలో రైలు పట్టాలపై మంటలు చెలరేగుతున్నాయి. కణకణ మండే అగ్ని జ్వాలల మీదుగానే రైళ్లు దూసుకెళ్తున్నాయి. ఇదేదో ప్రమాదం వల్ల జరగలేదు.. అక్కడి అధికారులే ఇలా చేస్తున్నారు. విపరీతమైన చలి ఉండడంతో పట్టాలపై అగ్గి రాజేసి.. రైళ్ల రాకపోకల్లో ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా చూస్తున్నారు. ఆ దేశంలో ఉత్తర రాష్ట్రాల్లో డిసెంబర్ నుంచి విపరీతమైన చలి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం అక్కడ నగరాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. రోడ్లపై మోకాలు లోతు మంచుతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడబడితే అక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. అలా రైలు పట్టాలపై కూడా మంచు పడుతోంది. అలాంటి సమయంలో రైళ్లు నడిస్తే పట్టాలు విరిగిపోవడమో, లేదా పట్టాలు దూరంగా జరిగిపోయే ప్రమాదమో ఉంటుంది. కానీ పట్టాలపై మంచును తొలగించడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే రైల్వే సిబ్బంది ట్రాక్‌లపై మంటలు పెడుతున్నారు. ఆ వేడికి రైలు పట్టాలపై మంచు కరిగిపోవడమే కాకుండా రైళ్ల రాకపోకలు సాఫీగా సాగుతాయి. ఇలా మంటలు పెట్టేటప్పుడు సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా అతి శీతల వాతావరణం అగ్రరాజ్యాన్ని వణికిస్తోంది. చికాగో, మిచిగాన్, ఇండియానా పోలీస్, వాషింగ్టన్, న్యూయార్క్ ప్రాంతాలలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

 ఏపీ డబ్ల్యూ ఎఫ్..సభ్యత్వ నిర్వహణ సమావేశంలో ...

పాల్గొన్న గడివేముల మండల విలేకరులు

సభ్యత్వ నమోదు చేయిస్తున్న నాయకులు

( జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా,పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండలం లోని విలేకరులు ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా కర్నూలు జిల్లాకు చెందిన ఏపీ డబ్ల్యూ ఎఫ్ మౌలాలి మరియు సత్యనారాయణ మాట్లాడుతూ విలేకరులపై జరుగుతున్న అన్యాయాలను దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని,  వారికి రావాల్సిన ఇల్ల స్థలాలపై ప్రజా ప్రతినిధలు నిర్లక్ష్యంగా ఉన్నారాని ,


విలేకరులు చేస్తున్న పని పదిమందికి ఉపయోగపడే విధంగా ప్రజలకు తెలియజేయడాని ప్రయత్నిస్తున్నామని, ప్రజలకు విషయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని,మేము ప్రభుత్వానికి మరియు పేదలకు ప్రజా  ప్రతి నిధులుగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు, మా విలేకర్ల లక్ష్యం పదిమందికి పేదలకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని ఈ సందర్భంగా తెలియజేశారు.

 హిందూపురంకేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ప్రకటించాలి


హిందూపురంను కేంద్రంగా చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలని ప్రభుత్వానికి ఆ నియోజెకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.  పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనొక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. హామీ ఇచ్చిన మేరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని జిల్లా ఏర్పాటు చేయాలన్నారు. అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తోందని, వాణిజ్య, పారిశ్రామికంగా ముందంజ వేస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో హిందూపురంను కేంద్రంగా చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హిందూపురం పట్టణం పరిసరాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి, భవిష్యత్ అవసరాల కోసం కావాల్సిన ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నాయని బాలకృష్ణ అన్నారు. జిల్లా ఏర్పాటులో రాజకీయాలు చేయొద్దని స్పష్టం చేశారు. హిందూపురం పట్టణ ప్రజల మనోభావాలను గౌరవించి, వారి చిరకాల కోరిక అయిన హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని కోరారు.

 మార్చి 4వ తేదీన వలిమై విడుదల-యోచిస్తున్న దర్శక నిర్మాతలు


'వలిమై' సినిమా మార్చి 4వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది.  అజిత్ తో ఒక సినిమా చేసిన దర్శక నిర్మాతలు వరుసగా ఆయనతోనే సినిమాలు చేస్తుంటారు. అలాంటి ఒక బాండింగ్ ఆయనతో ఏర్పడిపోతూ ఉంటుంది. అలా ఇప్పుడు అజిత్ .. వినోద్ .. బోనీ కపూర్ కాంబినేషన్లో 'వలిమై' సినిమా రూపొందింది. సంక్రాంతికే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారుగానీ కుదరలేదు. అలాంటి ఈ సినిమాను మార్చి 4వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వచ్చేనెలలో కరోనా తీవ్రత తగ్గనుందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను అదే రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నారు. భారీ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా బాణీలను సమకూర్చగా, గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు.  అజిత్ సరసన నాయికగా హుమా ఖురేషి నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కార్తికేయ కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన దోపిడీ దొంగల నాయకుడిగా కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు. 

 ముదిరాజ్ లను ఏకతాటిపైకి తెచ్చి ఐఖ్యత చాటాలి

ప్రకాశ్ ముదిరాజ్ పిలుపు

(జానో జాగో వెబ్ న్యూస్-చార్మినార్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ సందర్బంగా బహద్దూరు పుర నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల  సమావేశం గురువారం దూద్బౌలి   లో జరిగింది . గ్రేటర్ హైదరాబాద్ ముదిరాజ్ సంఘం  ప్రధాన కార్యదర్శి కట్టా బాలకిషన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన  ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రకాశ్ ముదిరాజ్  పాల్గొని ముదిరాజ్ సంఘం సభ్యులకు సూచనలు సలహాలు అందజేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ   ముదిరాజ్లందరూ ఏకతాటిపైకి వచ్చి ఐక్యత చాటాలన్నారు  ముదిరాజ్లు నెలకొన్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు.


బహదూర్పురా నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా ముదిరాజ్లందరూ  తమ సభ్యత్వ నమోదును చేసుకోవాలని ఆయన కోరారు త్వరలో డివిజన్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన  తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నగర అధ్యక్షులు సురేందర్ ముదిరాజ్  స్టీరింగ్ కమిటీ సభ్యులు నీలం శ్రీనివాస్ ముదిరాజ్  రాష్ట్ర ముదిరాజ్ యువజన విభాగం అధ్యక్షులు శ్రీకాంత్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి ఎం  బాల కిషన్ ముదిరాజు. పాతనగర గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి కట్టా బాలకిషన్ ముదిరాజ్  నాయకులు నర్సింహా రావు ముదిరాజ్ మొర్రా శ్రీనివాస్ ముదిరాజ్ పవన్ ముదిరాజ్ ప్రమోద్న ముదిరాజు.  వెంకటేష్ ముదిరాజ్ దేవీ ముది రాజు తదితరులు పాల్గొన్నారు


 నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటీవ్


రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా సోకింది. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా రోజుకు 3 వేలకు పైబడి కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా ఆయనకు కొవిడ్ టెస్టులు నిర్వహించగా, పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మంత్రి నిరంజన్ రెడ్డి నిన్న కూడా గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు. తనకు కరోనా సోకడంపై స్పందిస్తూ, కొన్నిరోజులుగా తనను కలిసిన వాళ్లందరూ జాగ్రత్తగా ఉండాలని, వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, నిరంజన్ రెడ్డి ఇవాళ కూడా తన నివాసం నుంచి ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. సహచర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి నాబార్డు రాష్ట్ర దృష్టి పత్రాన్ని విడుదల చేశారు.

 కొత్త జిల్లాలపై జనంలోకి...ప్రజా చైతన్య యాత్రలు


నేటి నుంచి ఈ నెల 29 వరకు మూడ్రోజుల పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు తమ పరిధిలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర మంత్రివర్గం కూడా కొత్త జిల్లాలకు ఆమోదం తెలపడంతో, తదుపరి కార్యాచరణ ఊపందుకుంది. కొత్తగా ఏర్పడిన పలు జిల్లాలకు అన్నమయ్య, ఎన్టీఆర్, శ్రీ బాలాజీ, శ్రీ సత్యసాయి జిల్లాల పేరిట నామకరణం చేయడం పట్ల పెద్దఎత్తున సానుకూల స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నూతన జిల్లాల ఏర్పాటుపై మరికొన్ని వివరాలు తెలిపారు. కొత్త జిల్లాల అంశాన్ని ప్రజలకు వివరించేందుకు రాష్ట్రంలో నేటి నుంచి ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆ మేరకు వైసీపీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు మూడ్రోజుల పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు తమ పరిధిలో ప్రజా చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, ఏపీ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టం అని అభివర్ణించారు. ఇప్పుడున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చుతూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ప్రజల ఆకాంక్షలను సీఎం జగన్ గౌరవించారని తెలిపారు.

ఫలించిన దౌత్యం...ఆ బాలుడిని భారత్ కు అప్పగించిన చైనా


తప్పిపోయిన బాలుడి విషయంలో భారత్ జరిపిన దౌత్యం ఫలించింది. తమ ఆధీనంలో ఉన్న భారతదేశానికి చెందిన బాలుడిని చైనా అధికార్లు భారత్ కు అప్పగించారు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మిరామ్ తరోన్ అనే 17 ఏళ్ల బాలుడ్ని చైనా బలగాలు భారత సైన్యానికి అప్పగించాయి. దాంతో తరోన్ మిస్సింగ్ వ్యవహారం సుఖాంతమైంది. ఇటీవల చైనా బలగాలు తరోన్ ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించడం తెలిసిందే. ఎగువ సియాంగ్ జిల్లా వాసి అయిన తరోన్ ఈ నెల 19 నుంచి ఆచూకీ లేకుండా పోయాడు. అయితే అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ దీనిపై స్పందిస్తూ, సరిహద్దు ప్రాంతంలో మూలికల అన్వేషణ కోసం వెళ్లిన తరోన్ ను చైనా బలగాలు అపహరించాయని, మిగతావారు తప్పించుకున్నారని వెల్లడించారు. ఈ ఘటన జరిగిన మూడ్రోజుల తర్వాత తరోన్ తమ అధీనంలో ఉన్నాడంటూ భారత సైన్యానికి చైనా బలగాలు సమాచారం అందించాయి. దాంతో భారత సైన్యం చైనా బలగాలతో పలుమార్లు సంప్రదింపులు జరిపింది. చర్చలు ఫలించడంతో అరుణాచల్ ప్రదేశ్ లోని వాచా-దమై ప్రాంతాల మధ్య ఉన్న ఇంటరాక్షన్ పాయింట్ వద్ద చైనా తరోన్ ను భారత సైన్యానికి అప్పగించింది. తరోన్ అప్పగింతను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో ఎంతో సామరస్యపూర్వకంగా, నేర్పుగా వ్యవహరించి బాలుడి విడుదలకు కృషి చేశారంటూ భారత సైన్యాన్ని మంత్రి అభినందించారు. కాగా, తరోన్ కు భారత సైనికాధికారులు వైద్య పరీక్షలు, ఇతర లాంఛనాలు నిర్వహించనున్నారు. 

 వెబ్ సిరీస్ నిర్మాణంలోకి..నిర్మాత దిల్ రాజు


నిర్మాత దిల్ రాజు మరో కొత్త ఆడుగు వేశారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు తాజాగా వెబ్ సిరీస్ నిర్మాణంలోకి అడుగుపెట్టారు. దర్శకుడు హరీశ్ శంకర్ తో కలిసి 'ఏటీఎమ్ రాబరీ' అనే వెబ్ సరీస్ ను నిర్మించబోతున్నారు. ఈ సిరీస్ కు కథను హరీశ్ శంకరే అందిస్తున్నారు. జీ5 సంస్థతో కలిసి ఈ సిరీస్ ను నిర్మించబోతున్నట్టు ఈరోజు దిల్ రాజు ప్రకటించారు. ఈ సిరీస్ కు చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, హరీశ్ శంకర్ కాంబినేషన్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తన తాజా చిత్రం 'రౌడీ బాయ్స్' ద్వారా తన సోదరుడి కుమారుడు ఆశిష్ ను దిల్ రాజు వెండితెరకు పరిచయం చేశారు. ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా అడుగులు వేయాల్సి ఉంటుందని వెబ్ సిరీస్ గురించి పరోక్షంగా దిల్ రాజు చెప్పారు.

 చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు  సజ్జల పిలుపు


చర్చలకు రావాల్సిందిగా ఉద్యోగ సంఘ నేతలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆహ్వానించారు. పీఆర్సీ, ఇతర డిమాండ్లపై ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. కొత్త పీఆర్సీ అమలుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుండగా, ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యం కాదంటూ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోమారు ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు రారమ్మని పిలిచారు. ఉద్యోగ సంఘాల నేతలు ఈ క్షణమైనా రావొచ్చని, చర్చలు జరిపేందుకు సచివాలయంలో మంత్రుల కమిటీ సిద్ధంగా ఉందని సజ్జల స్పష్టం చేశారు. ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందుకు, ఓ మెట్టు దిగేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరకదని సజ్జల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు సచివాలయంలో మంత్రుల కమిటీ రేపు కూడా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. కాగా, ట్రెజరీ ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడం క్రమశిక్షణ రాహిత్యమని అన్నారు.

 రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమితి అధ్వర్యoలో...

ఘనంగా గణతంత్ర దినోత్సవం


(జానో జాగో వెబ్ న్యూస్ -హైదరాబాద్ బ్యూరో)

చారిత్రాత్మక చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమితి అధ్వర్యoలో జరిగిన 73 వ  గణతంత్ర వేడుకల్లో స్మారక సమితి అధ్యక్షులు జి.నిరంజన్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కేర్ కు ఘన నివాలులర్పించారు. రాజ్యాంగాన్ని అమలు పర్చాల్సిన ప్రభుత్వాలే ధిక్కరించడము, అధికారములో ఉన్నవారి నియంత పోకడలు, సంస్థలు, వ్యక్తులు రాజ్యాంగ నిబంద నలను ఉల్లంఘించడము పరిపాటి కావడము, దేశములో ప్రజాస్వామ్యము ప్రమాదములో పడుతుందనడానికి నిదర్శమన్నారు.


రాజ్యాంగాన్ని గౌరవించి, పరిరక్షించే విధముగా ప్రజలు సంకల్పించి కృషి చేయాలని విఙప్తి చేశారు.  జి రాజారత్నం,  జి. కన్నయ్యలాల్, ఓం ప్రకాష్ శర్మ, పులిపాటి.రాజేష్ కుమార్ ( రాహుల్ ), రాజెందర్ రాజు, సయెద్ షా ముజాహిద్, అబేద్ అలీ, అశోక్ రెడ్డి, మూసా ఖాసిం, జి. దినేశ్, ఎమ్.విజయకుమార్, , భాగెందర్ సింగ్, మామిడి కృష్ణ, మీర్జా ఆస్కర్ ఆలీ బేగ్, సత్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


 చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకునేందుకు..

నలుగురికి ఆదర్శంగా నిలిచే లా వ్యవహరించారు

పాఠశాలకు పూర్వ విద్యార్థి కంప్యూటర్ ..బహుకరణ

(జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)

తాను చదివిన పాఠశాలకు ఏదో ఓ సహాయం చేసి రుణం తీర్చుకోవాలని ఓ పూర్వ విద్యార్థి చేసిన ఆలోచన నలుగురికి ఆదర్శంగా నిలిచింది. తనలాగే భవిష్యత్ తరం కూడా విద్య ఫలాలు పొంది ఉన్నతి సాధించాలన్న తపనతో ఆ పూర్వ విద్యార్థి పాఠశాలకు కంప్యూటర్ ను బహుకరించారు. వివరాలు లోకి వెళితే...కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండల పరిధిలోని గవర్నమెంటు జడ్పిహెచ్ఎస్ స్కూల్లో 1983బ్యాచ్ కి చెందిన హుస్సేన్ రెడ్డి ఆ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. అనంతరం ఆయన ఉన్నత చదువు చదివి పురోగతి సాధించారు. తనను ఇంతటి వాడిని చేసిన ఆ పాఠశాలల రుణం ఎలా తీర్చుకోవాలి అన్న ఆలోచన మొదలైంది.

 హుస్సేన్ రెడ్డి పంపించిన కంప్యూటర్ను పాఠశాలకు అందిస్తున్న ఆయన స్నేహితుడు మహబూబ్ బాషా

ఆలోచన క్రమంలో పాఠశాలలో భవిష్యత్ తరానికి మరింత నైపుణ్య విద్య అందించేందుకు వీలుగా కంప్యూటర్ బహుకరణ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అతనిలో బీజం వేసింది. అనుకున్నదే తడవుగా ఆ పాఠశాలకు కంప్యూటర్ బహూకరణ చేశారు హుస్సేన్ రెడీ. పాఠశాల అభివృద్ధి, పిల్లల ఉన్నతికి కంప్యూటర్ ను చిన్ననాటి స్నేహితుడైన మహబూబ్ భాషా చే పాఠశాలకు అందించారు. ఇలా ఆయన తన ఉదారతను చాటి నలుగురికి ఆదర్శంగా నిలిచారు.


 ఆకట్టుకొంటున్న ‘కొండా’ సినిమా ట్రైలర్ 


బయోగ్రాఫిక్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్న రాంగోపాల్ వర్మ తాజాగా కొండా మురళీ జీవిత గాథ ఆధారంగా రూపొందిస్తు్న ‘కొండా’ సినిమా ట్రైలర్ ఆకట్టుకొంటోంది. రిపబ్లిక్ డే కానుకగా.. కొండా మురళీ, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘కొండా’ సినిమా ట్రైలర్ ను రామ్ గోపాల్ వర్మ వదిలారు. ‘‘అల్ట్రా డైనమిక్ దంపతులు కొండా మురళీ, కొండా సురేఖ జీవిత సమాహారం ‘కొండా’ సినిమా ట్రైలర్ మీకోసం’’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. ‘‘సమాజం గురించి నీతులు చెప్పుడు కాదు.. బాగు చెయ్యాలె.. పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప’’ అంటూ తెలంగాణ యాసలో వర్మ వాయిస్ ఓవర్ తో సాగే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు పుట్టుకొస్తారంటూ 180 ఏళ్ల క్రితం కార్ల్ మార్క్స్ చెప్పారని, సమాజంలోని పరిస్థితుల మధ్య పుట్టిన వ్యక్తి కొండా మురళీ అని చెబుతూ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కొండా మురళీగా త్రిగణ్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. కొండా సురేఖ పాత్రలో ఈరా మోర్ నటించింది. చివర్లో త్రిగణ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ‘నా పేరు కొండా మురళీ.. ఏ మురళీ?’ అన్న డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. మొత్తంగా సినిమాను వర్మ ఆకట్టుకునేలా తీసినట్టు అర్థమవుతోంది.

ఆటలో పాటకు డ్యాన్స్...క్రికెట‌ర్ డ్వెయిన్ బ్రావో స్టెపులు


పుష్ప..పుష్ప ఎక్కడ చూసిన ఇపుడు అదే గోల. 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ వేసిన‌ స్టెప్పులు బాగా పాప్యుల‌ర్ అయ్యాయి. విదేశీ క్రికెట‌ర్లు సైతం ఈ స్టెప్పులు వేస్తున్నారంటే 'పుష్ప' రాజ్ మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ సినిమాలో శ్రీ‌వ‌ల్లి పాట‌కు అల్లు అర్జున్ వేసిన స్టెప్పుల‌ను ఇప్ప‌టికే ప‌లువురు క్రికెట‌ర్లు వేశారు. 'శ్రీవల్లి' సాంగ్‌కు ఇప్పటికే డేవిడ్ వార్న‌ర్, రైనా వంటి వారు డ్యాన్స్ చేసి అల‌రించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే పాటకు వెస్టిండీస్‌ క్రికెట‌ర్ డ్వెయిన్ బ్రావో డ్యాన్స్ చేసి అల‌రించాడు. అది కూడా మైదానంలో మ్యాచ్ జ‌రుగుతోన్న స‌మ‌యంలో చేశాడు. బంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్‌లో వికెట్ తీసిన ఆనందంలో బ్రావో ఈ స్టెప్పులు వేశాడు. కాగా, ఫార్చూన్ బోరిషాల్ త‌ర‌ఫున బ్రావో ఆడుతున్నాడు. ఆ మ్యాచ్‌లో కొమిల్లా విక్టోరియా జ‌ట్టుతో త‌ల‌ప‌డ్డాడు. 

 అవార్డును తిరస్కరించిన మరో గాయని


 

పద్మ అవార్డులు దక్కడం పట్ల  పలువురు ఆనందం వ్యక్తంచేస్తే..ఇంకొందరు అవార్డు గ్రహితలు వాటిని ఏకంగా తిరస్కరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్‌ను పశ్చిమ్ బెంగాల్ మాజీ సీఎం, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజాగా, బెంగాల్‌కు చెందిన మరొకరు పద్మశ్రీ అవార్డును తిరస్కరించారు. ప్రముఖ బెంగాలీ గాయని సంధ్యా ముఖర్జీ (90) పద్మశ్రీ జూనియర్ ఆర్టిస్ట్‌‌కు ఎక్కువ అర్హమైందని, తన స్థాయికి తగదని పేర్కొన్నారు. సంధ్య ముఖర్జీ కుమార్తె సౌమి సేన్‌గుప్తా మాట్లాడుతూ.. పద్మశ్రీ గ్రహీతగా తన పేరును ప్రకటించినా.. తీసుకోడానికి సిద్ధంగా లేనని ఢిల్లీ నుంచి ఫోన్ చేసిన ఉన్నతాధికారులకు నా తల్లి చెప్పారని తెలిపారు. 90 ఏళ్ల వయసులో తనకు పద్మశ్రీకి ఎంపికచేయడం అవమానంగా భావించారని ఆమె అన్నారు. అవార్డుల జాబితాలో పద్మశ్రీగా పేరు పెట్టడానికి ఆమె సమ్మతి కోరుతూ కేంద్ర అధికారులు సంప్రదించిన సమయంలో పై విధంగా స్పందించారు. ‘గాయనిగా దాదాపు ఎనిమిది దశాబ్దాల జీవితంలో 90 ఏళ్ల వయసప్పుడు పద్మశ్రీకి ఎంపిక కావడం గాయకురాలిగా ఆమె స్థాయిని కించపరచడమే’ అని సేన్‌గుప్తా అన్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ నాలుగోది. ‘‘పద్మశ్రీ ఓ జూనియర్ ఆర్టిస్ట్‌కు ఎక్కువ.. గీతాశ్రీ సంధ్య ముఖోపాధ్యాయ్‌కు కాదు.. ఆమె కుటుంబం, అభిమానులు పాటలతో అనుభూతిచెందుతారు’’ అని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రాష్ట్రానికి చెందిన గాయకులు ఎస్డీ బర్మన్, అనిల్ బిస్వాస్, మదన్ మోహన్, రోషన్, సలీల్ చౌదరితో సహా అనేక మంది హిందీ చలనచిత్ర రంగంలో తమదైన ముద్రవేశారు. ఇక, సంధ్యా ముఖర్జీ 2011లో పశ్చిమ బెంగాల్ అత్యున్నత పౌర పురస్కారం ‘బంగా బిభూషణ్’ను అందుకున్నారు. ఈ అవార్డును మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటుచేయగా.. తొలి పురస్కారం గాయనికి దక్కింది. అలాగే, 1970లో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర పురస్కారానికి ఎంపికయ్యారు. ఇదిలావుంటే పద్మ అవార్డులకు ఎంపికైన వ్యక్తులు తిరస్కరించడం చాలా అరుదుగా జరుగుతుంది. గతంలో ప్రముఖ గాయని ఎస్.జానకి, బాలీవుడ్ సినీ రచయిత సలీం ఖాన్‌లకు పద్మ అవార్డులను ప్రకటించగా వారు తిరస్కరించారు. అలాగే, ప్రముఖ చరిత్రకారిణి రోమిల్లా థాపర్ తనకు 1974లో ప్రకటించిన అవార్డును 1984 స్వర్ణ దేవాలయం ఘటనకు నిరసనగా 2005లో తిరిగిచ్చారు. రచయిత కుష్యంత్ సింగ్ ఇదే కారణంతో పద్మ భూషణ్‌ను తిరిగిచ్చేసినా.. 2007లో మళ్లీ పద్మవిభూషణ్‌ను స్వీకరించారు. ఇదిలావుంటే 2013లో తనకు లభించిన పద్మ భూషణ్ అవార్డును ప్రముఖ గాయని ఎస్ జానకి తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇంతకాలం తర్వాత పద్మ భూషణ్ ఇవ్వడం వల్ల లాభం ఏమిటని ప్రశ్నిస్తూ.. భారతరత్న పురస్కారం లభిస్తే స్వీకరిస్తానని తిరస్కరించారు. తనకు అవార్డులు అక్కరలేదని, అభిమానుల ఆదరణ చాలని చెప్పారు.