వ్యూహ...ప్రతి వ్యూహాలు...

హుజూరాబాద్ లో ఎవరి అస్త్రం పారేనో

ప్రధాన పార్టీల వ్యూహాలు..నినాదాలు ఆ ఎన్నికలతో మూడివేస్తూ

దళిత బంధు, సంక్షేమ పథకాలపైనే ఆశలు

అన్ని సామాజిక వర్గాలకే వలవేసే రీతిలో టీఆర్ఎస్ అస్త్రాలు

కౌంటర్ అస్త్రాలతో బీజేపీ సన్నద్దం

పోటీలో నేనున్నాను అనిపించుకొనేలా కాంగ్రెస్ దూకుడు

హుజూరాబాద్ ఉత్కంఠ భరిత పోరులో...ఎవరూ రాణిస్తారు...?(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ పొలిటికల్ బ్యూరో)

ఉప ఎన్నికలన్నీ అధికార పక్షానికి సహజంగా సవాళ్లే...? కానీ టీఆర్ఎస్ కు మాత్రం ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. ఇక తెలంగాణ రాష్ట్రంలో పాగావేయాలనుకొనే పార్టీలన్నింటికి హుజూరాబాద్ ఉప ఎన్నికలు పెను సవాళ్లే. దీనికి కారణాలు లేకపోలేదు. అధికార టీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు  జీవన్మరణ సమస్యగా మారడానికి కారణం ఆ పార్టీకి చెందిన కీలక నేత  ఈటెల రాజేందర్ ఆ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు  చేసి బయటకు రావడంతో సాగుతున్న ఉప ఎన్నిక. ఈ ఎన్నికల్లో ఓడితే టీఆర్ఎస్ బలహీనపడిందన్న సంకేతం బలంగా వెళ్తుంది. ఇక ఎప్పటినుంచో దక్షిణాధిలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాలుమోపాలంటే  అది తెలంగాణలో బలపడటం ద్వారానే సాధ్యమని భావిస్తోంది. అందుకే తెలంగాణలో బలపడేందుకు ఆ పార్టీ ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. టీఆర్ఎస్ పై తిరుగుబాటు  చేసిన ఈటెల రాజేందర్ బీజేపీ తరఫున హుజూరాబాద్ ఎన్నికల బరిలో ఉండటంతో  కమలం పార్టీకి కూడా ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగానే చెప్పవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా  నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ పోగోట్టుకొన్న చోట్లే  తిరిగి రాబట్టుకోవాలని శతప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పార్టీలో చేరిన కొన్నాళ్లోకే మాస్ ఇమేజ్ ఉన్న రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలను ఆ పార్టీ అది నాయకత్వం అప్పగించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగానే చెప్పవచ్చు. ఇలా హుజూరాబాద్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు పెను సవాల్ గా మారింది.      ఎవరి అస్త్రం పారేనో...?           


      

హుజూరుబాద్ ఎన్నికల  నోటిఫికేషన్ కు ముందే ఆ నియోజకవర్గం చుట్టూ రాజకీయాలు  కొనసాగాయి. నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో అన్నిపార్టీలో గెలుపుకోసం రోజుకో అస్త్రం తెరపైకి తెస్తున్నాయి. హోరాహోరీగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అన్ని సామాజిక వర్గాలకు  వల వేసిన అధికార టీఆర్ఎస్ తన పాచిక పారేలా అస్త్రాలను పదునుపెడుతోంది. అధికార పార్టీ నుండి మంత్రులు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అన్ని వర్గాలనూ గులాబీ నేతలు తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దళిత బంధు పథకాన్ని ప్రకటించి దళిత ఓటు బ్యాంకు తమ ఖాతాలో వేసుకునే పనిలో పడ్డారు .ఇక అభివృద్ధిలోనూ హుజురాబాద్ నియోజకవర్గాన్ని జెట్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి కనీవినీ ఎరుగని విధంగా నిధుల వరద కురిపిస్తున్నారు. అభ్యర్థిగా బీసీ యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ పేరును ప్రకటించి బీసీల ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టారు. అధికార టీఆర్ఎస్ నుండి మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్‌తోపాటు గంగుల కమలాకర్‌లు నియోజకవర్గంలోనే మకాం వేసి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అదనంగా ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకుల మోహరింపు ,కుల సంఘాల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అదనంగా సీఎం కేసీఆర్ సైతం ఎన్నికల ముందే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో పర్యటించారు. సుమారు రెండు వేల కోట్లను కేటాయించి పథకాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని 20వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా దళితబంధును ప్రభుత్వం తీసుకువచ్చింది.లబ్ధిదారుల ఎంపిక కూడ పూర్తయి.. వారి ఖాతాల్లోకి డబ్బులు కూడా చేరాయి. దీంతో కొంతమంది లబ్ధిదారులు వాటి ప్రయోజనాలు కూడ పొందుతున్నారు. అయితే 40వేల ఓట్లు ఉన్న దళిత వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని నేరుగా ప్రభుత్వ పథకం ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు శ్రీకారం చుట్టారు. అభివృద్దితోపాటు నేతలకు పదవులు కూడా ఆ పార్టీ కట్టబెట్టింది. బీసీ అభ్యర్థి అయిన గెల్లు శ్రీనివాస్‌ను రంగంలోకి దింపడంతో పాటు ఎస్సీలను ఆకట్టుకునేందుకు దళితబంధును తీసుకువచ్చింది. జిల్లాకు చెందిన రసమయి బాలకిషన్‌కు సంస్కృతిక సారధి చైర్మన్‌గా మరోసారి పొడిగించారు. నియోజవర్గానికి చెందిన బండ శ్రీనివాస్‌ను ఎస్సి కార్పేరేషన్ చైర్మన్‌గా నియమించారు. దీంతోపాటు ఆయా పార్టీల్లో ఉన్న సీనియర్ నేతలను సైతం టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి, బీసీ వర్గానికి చెందిన టీడిపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణతోపాటు బీజేపీ నుండి ఇతర నేతలను సైతం పార్టీలోకి ఆహ్వానించారు. ఇలా పకడ్భందీ వ్యూహాలతో అధికార టీఆర్ఎస్ జనంలోకి దూసుకెళ్తోంది.

టీఆర్ఎస్ వ్యూహాలను తిప్పికొడుతూ..కమలం

ఇక ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత నియోజవర్గంలోనే మాకం వేశారు. అనంతరం పాదయాత్ర నిర్వహించారు. అయితే అనారోగ్య కారణాలతో దాన్ని విరమించినా... నిత్యం నియోజకవర్గంలోనే ఉంటూ ఆయన భార్య జమునతోపాటు ఈటల రాజేందర్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్ ప్రచారానికి ఆయన చేసిన అభివృద్దితోపాటు ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న దళిత బంధు లాంటి పథకాలు తన రాజీనామా వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీ అగ్రనాయకులతో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. దళిత బంధు పథకంలాంటింది మా నియోజకవర్గాల్లో అమలు చేయండి...మీరు రాజీనామా చేయండి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పలు చోట్ల ఒత్తిడి మొదలైంది. రాజీనామా చేసి ఉప ఎన్నిక జరిగితే మాకు దళిత బంధు పథకకం పెద్దస్థాయిలో అందుతుందని ఆందోళన చేపట్టిన వారి మాట. దీని వెనక బీజేపీ హస్తముందన్న ప్రచారముంది. ఏదీఏమైనా ప్రభుత్వవ వ్యూహాలను వారి రీతిలోనే చెక్ పెట్టే పనిలో కమల దళం నిమగ్నమైంది. తమ పార్టీ అభ్యర్థి అయిన ఈటెల  రాజేందర్ సొంత ఇమేజ్ తోపాటు కేంద్ర ప్రభుత్వం యోక్క అనుకూలత, హిందూ సెంటిమెంటు  ఓ‌టు బ్యాంకుపై కమలం  నాయత్వం ధీమాతో ఉంది. అందుకే ఎన్నికల ప్రచారంలో రామరాజ్యం,  ఎంఐఎంను టార్గెట్ గా చేస్తూ  తాలిబాన్లు అని, ఇతర పేర్లతో బీజేపీ టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్, ఎంఐఎం జోడికట్టి రాష్ట్రాన్ని నాశనంచేస్తున్నారని బీజేపీ విమర్శలుగుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇటీవలే ఆ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల  నిరుద్యోగ సైరన్  పేరుతో ఆ పార్టీ  ఉద్యమం మొదలెట్టిన విషయం తెలిసిందే. కొండా సురేఖను బరిలోకి దించడ ద్వారా మున్నూరు కాపు, పద్మశాలీ సామాజిక వర్గాల ఓట్లను తమ పార్టీ సాంప్రదాయ ఓట్లతో గట్టెక్కాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ పోటీకి కొండా సురేఖ నిరాకరించినట్లు  ప్రచారం  సాగడంతో యువత ఓట్లపై ఆశతో పార్టీ కి చెందిన విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్ ను బరిలోకి దించింది.  కేవలం రెండేళ్లలో  తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో హుజూరాబాద్ ఉప ఎన్నికలు అన్నిపార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: