ఇంకెన్నాళ్లు ఈ రిజర్వేషన్లు...?
దీనిపై కచ్చితంగా చర్చ జరగాలి
అపుడే రిజర్వేషన్లు ఇంకా అవసరమని తెలుస్తుంది
ఇంకెన్నాళ్లు ఈ రేజర్వేషన్లు...అవునండి, ఈ ప్రశ్న వేసింది ఎవరో కాదు...సాక్షాత్తు మన దేశ అత్యున్నత న్యాయస్థానం. అసలు ఈ ప్రశ్నకు కారణమేంటి, ఎందుకు వేయాల్సి వచ్చింది.. మనమందరము, స్వాతంత్రానంతర భారతదేశాన్ని, దాని ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వ రంగ సంస్థలను, కార్పొరేషన్లను, ప్రభుత్వంలో పని చేసే వారిలో ఉన్నత స్థాయి అధికారులను వర్గాల వారీగా గమనిస్తే, దేశ జనాభా రమారమి 130 కోట్లు. వారిలో ఉన్నత వర్గాల వారి శాతం మొత్తం మీద 10 నుండి 15 % ఉండవచ్చు. కానీ భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడచినా, ఇప్పటి వరకు ఒక దళితుడు ప్రధాన మంత్రి అవ్వలేకపోయాడు. మరి ఈ విషయమై ఏ టీవీ ఛానల్ లో కూడా ఏ జర్నలిస్ట్, ఏ వ్యాఖ్యాత కూడా గత 75 సంవత్సరాలలో చర్చలు (డిబేట్) జరపలేదు. కానీ ప్రతి ఒక్కరు, ఇంకా రేజర్వేషన్లు ఎందుకు అనే ప్రశ్నే అడుగుతారు. అంతెందుకు, న్యాయ వ్యవస్థనే ఉదాహరణగా తీసుకుంటే, సబోర్డినేట్ జ్యూడిషరీ లో అయితే 50 % రిజర్వేషన్స్ తీసేస్తే, మిగిలిన 50 % జనరల్ కోటాలో వున్నవారే ప్రమోషన్లు త్వరగా అందుకున్నారు. ఇక పోతే, ఉన్నత న్యాయస్థానాలలో ఎస్ సి, ఎస్ టి న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులైన దాఖలాలు చాలా అరుదు, అది వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఇక మనం స్వాతంత్య్రానంతరం న్యాయస్థానాలను చూస్తే, మనకు పరిస్థితి అర్థం అవుతుంది. స్వాతంత్య్రానికి పూర్వం విద్య ఉన్నత వర్గాలకు మాత్రమే ఉండేది. మను స్మృతి ప్రకారం విద్య ఎస్ సి , ఎస్ టి, బి సి లకు దక్కేది కాదు. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషువారు వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి, సావిత్రిబా పూలే మహాత్మా పూలే, డాక్టర్ అంబెడ్కర్ మరియు పెరియార్ వంటి వారి కృషి వలన అందరికి విద్య అందుబాటులోకి వచ్చింది. మరీ ముఖ్యంగా డాక్టర్ అంబెడ్కర్ గారి కృషి, పట్టుదల, ముందు చూపు వలన సమానత్వం విస్తృతంగా ప్రచారం అయ్యింది. ఆ రోజుల్లో ఆయన అనుభవించిన బాధలు ఆయనను ఒక మార్గ దర్శిగా తాయారు చేసాయి. మరి ఇప్పుడు, అందరికి చదువు అందుబాటులో వుంది, కానీ ఉద్యోగాలు అందుబాటులో లేవు. విద్య అందరికి అందుబాటులో ఉన్నా చదువుకోలేని పరిస్థితులు ఇప్పటికి కొన్ని ఊర్లలో వుంది. అప్పట్లో విద్య ఒకటి లేదా రెండు వర్గాలకు చెందినది కాబట్టి, ఆ వర్గాల వారు స్వాతంత్య్రానికి అనంతరం న్యాయమూర్తులుగా నియమితులయ్యేవారు. ఇక మిగిలిన వర్గాలకు విద్య అందని ద్రాక్షగా ఉండటం వలన మిగిలిన వర్గాలకు చెందిన వారు ఇప్పుడిప్పుడే న్యాయం గురించి తెలుసుకుంటున్నారు. రేజర్వేషన్లు అన్ని రంగాలలో అమలు పరచాల్సి ఉండగా ఉన్నత న్యాయస్థానాలలో దీని అమలు ఎక్కడ కనబడదు. రాజ్యాంగాన్ని కాదని, ఇక్కడ రేజర్వేషన్లు లేవని కల్లబొల్లి కబుర్లు చెప్తారు. అసలు ఉన్నత న్యాయస్థానాలలో రేజర్వేషన్లు అమలు చెయ్యకపోతే, ఇంకెక్కడ అమలు చేసిన దాని వలన జరిగే చెడు ఎక్కువ. రాజ్యంగంలో ఎక్కడ కూడా రేజర్వేషన్లు కొన్ని ప్రభుత్వ స్థానాలలో మాత్రమే అమలు చేయాలి అని రాయలేదు. ఎందుకంటే, అన్ని స్థానాలలో కూడా క్రింది వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. గత 70 సంవత్సరాలు నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నలుగురే షెడ్యూల్డ్ కులాల వారు అయ్యారు. వారిలో 1 . K. రామస్వామి, 2 . KG బాలకృష్ణన్, 3 . BC రే, మరియు 4 .A వరదరాజన్ గారు . నలుగురు మాత్రమే ఎందుకు అయ్యారో ఆలోచించాలి. గత 70 ఏండ్ల కాలంలో షెడ్యుల్డ్ తెగల (ST) కి చెందిన వాళ్ళనుండి ఒక్కరు కూడా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎంపిక కబడలేదు మరియు సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి కాలేకపోయారు కూడా. అలాగే గత 70 ఏండ్ల కాలంలో ఒక మహిళ కూడా ప్రధాన న్యాయమూర్తి కాలేదు మరియు ఎంపిక చేయబడలేదు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమానత్వం అనేది రాజ్యంగంలో తప్ప, అమలులో లేదు. మనం బాగా గమనిస్తే అగ్రవర్ణాలకే పెద్ద పీత మరియు ఒకే కులానికి చెందినవారి ఆధిపత్యం చలామణి అవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీం కోర్టును పరిగణిస్తారు. రాష్ట్రాల మాదిరిగానే హై కోర్టులో మరియు సుప్రీమ్ కోర్టులో రిజర్వేషన్స్ నిబంధలను వర్తింపచేయాలి. SC -ST అట్రాసిటీ చట్టం పై సుప్రీం కోర్టు తీర్పు ఇస్తున్న సమయములో SC, ST BC లకి చెందిన ఒక్క న్యాయమూర్తి కూడా సుప్రీం కోర్టులో లేడు. అణగారిన వర్గాల బాధలు అణగారిన వర్గాల వారికే అర్థం అవుతాయి, ఉన్నత వర్గాలకు ఇవి తెలియవు ఎందుకంటే, వీరికి కులపరంగా అవమానాలు జరగవు. రాజ్యాంగంలోని 312 (1) ఆర్టికల్ ప్రకారం న్యాయమూర్తుల నియామకం కోసం జ్యూడిషల్ అప్పోయింట్మెంట్ కమిషన్ ను నెలకొల్పాలి. రాజ్యాంగ సవరణ చట్టం 1976 యెక్క 42 వ సవరణ ప్రకారం న్యాయమూర్తుల భర్తీ కోసం ఆల్ ఇండియా జ్యూడిషల్ సర్వీస్ ను ఏర్పాటుచేయాలి.
కాని ఈ బిల్లును ఇప్పటివరకు పార్లమెంటులో ప్రవేశ పెట్టనే లేదు. రాజ్యాంగంలోని 229 ఆర్టికల్ ప్రకారం ఉద్యోగులు మరియు అధికారులకు సంబంధించిన విషయాలలో ఉన్నత న్యాయస్థానం తనను రాష్ట్రముగా పరిగణిస్తుంది. ఆర్టికల్ 15 (4) , 16 (4) , 16(4)A ప్రకారం దాన్ని ఎందుకు పాటించలేదో అర్థం కావటంలేదు.ఆనాడు , కేశవానంద భారతి కేసులో కూడా ఆర్టికల్ 12 ప్రకారం హైకోర్టు , సుప్రీం కోర్టులు రాష్ట్రముగ పరిగణించబడినవి. కాబట్టి రాష్ట్రాలకు అన్వయిస్తున్న రిజర్వేషన్ నిబందనను హైకొర్టు మరియు సుప్రీంకోర్టు లకు తప్పనిసరిగా అన్వయించాలి. దళితులు కలెక్టర్ మరియు రాష్ట్ర కార్యదర్శులు కాగలినప్పుడు, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు కాగలిగినప్పుడు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తి కావడానికి ఏ ప్రత్యేకమైన ప్రతిభ అవసరం లేదు. న్యాయవాద వృత్తిలో అనుభవం గడించి తగిన వయసు ఉంటే సరిపోతుంది, అయినప్పటికీ, దళిత మరియు బహుజన న్యాయవాదులకు సరైన స్థానం, ఉన్నత న్యాయస్థానాలలో ఇవ్వటం లేదు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తి కావడానికి మెరిట్ అవసరమయితే ఆల్ ఇండియా జ్యూడిషల్ సర్వీస్ ను ఏర్పాటుచేయడం ద్వారా పోటీ పెట్టాలి. ఎస్ సి, ఎస్ టి, బీసీ లకు ఇచ్చే రిజర్వేషన్ లు 50 శాతం దాటొద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దానికి అనుగుణంగా హైకోర్టు , సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలలో తప్పనిసరిగా రిజర్వేషన్ లను అమలు చేయాలి. జనాభా దామాషాలో చూసుకున్నా, న్యాయవాదులలో ఎక్కువగా వున్నవారు బహుజనులు, కాబట్టి వారిని తప్పనిసరిగా 50 % తక్కువ లేడకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం మరియు కొలిజీయం పై వున్నది. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితులలో మరువకూడదు. ఇప్పుడున్న MOP ని సరిచేసి ఎస్ సి, ఎస్ టి, బి సి న్యాయవాదులను న్యాయమూర్తులుగా ఎంపిక చేసే క్రమంలో కచ్చితంగా 50 % తక్కువ లేకుండా చూడాలి. మనం చరిత్రను పరిశీలిస్తే 75 సంవత్సరాలలో 48 మంది సుప్రీమ్ కోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా నియమింపబడ్డారు. కానీ వారిలో ఒకరు మాత్రమే ఎస్ సి సామాజికవర్గం నుంచి ప్రధాన న్యాయమూర్తి కాగలిగారు. ఇక ఎస్ టి లైతే మర్చిపోవాల్సిందే. మహిళా ప్రధాన న్యాయమూర్తులు కూడా లేరు. మరి మన దేశాన్ని మాటకు ముందు అమెరికా తో, ఇతర దేశాలతో పోల్చడం విడ్డూరమే అవుతుంది. రాజ్యాంగ రచనలో సమానత్వం వుంది కానీ అమలులో శూన్యం. అంతే కాకుండా, రాజ్యాంగాన్ని వక్రీకరించి, బహుజనులకు మేలు జరుగకుండా చేయడం కడు శోచనీయం. బహుజనులు ఉన్నత న్యాయమూర్తులు కాలేక పోతున్నారంటే, పైగా ఉన్నత న్యాయమూర్తులలో 50 % కూడా 75 సంవత్సరాల తర్వాత లేరంటే, రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కులను కాలరాస్తున్నట్టే. అలాగే 2017 లో కేంద్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తుల భర్తీ కోసం రూపొందించిన సూచనలతో ఎక్కడ కూడా బహుజనులకు స్థానం లేదు. మరి ఇది దేనికి సూచిక అనేది ఆలోచించాలి. అంబేద్కరుగారు కన్న కళలు అన్నీ తలకిందులయ్యాయి.
1954 లో హై కోర్టు గుంటూరు వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఒక బీసీ, ఎస్ సి మరియు ఎస్ టి కానీ ఇంతవరకు హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కాలేకపోవడానికి కారణాలు ఏంటో ఎవరికీ అర్థం కాదు. రాజ్యాంగంలో అందరూ సమానమే అనే ప్రాధమిక హక్కు కల్పించారు. మరి అందరూ సమానమే అయితే, ఇంత వరకు బీసీ, ఎస్ సి మరియు ఎస్ టి న్యాయమూర్తులు ఎందుకు ప్రధాన న్యాయమూర్తులు కాలేకపోయారు, ఎందుకు సుప్రీమ్ కోర్టు వరకు వెళ్లలేకపోయారు అనే అంతర్మధనం చేసుకుంటే మంచిది. ప్రభుత్వానికి కూడా కొంత బాధ్యత వుంది. ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు, లా మినిస్టర్ ఎవరైతే వున్నారో వారు, హై కోర్టు వారు సిపారేసు చేసిన పేర్లను పరిశీలించి, 50 % తక్కువ లేకుండా బీసీ, ఎస్ సి మరియు ఎస్ టి న్యాయమూర్తులు ఉండేలా పేర్లను పంపాలని కోరవచ్చు. ఈ విషయాన్నీ కేంద్ర లా మినిస్ట్రీకి కూడా తెలియచేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లా మినిస్టర్ గారు కూడా కొంత చొరవ తీసుకొని హై కోర్టులో ఉన్న న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ చేసే క్రమంలో తప్పకుండ బీసీ, ఎస్ సి మరియు ఎస్ టి లు ఉండేలా చూడాలి. 1954 నుండి హై కోర్టు అమరావతికి వచ్చే వరకు ఉమ్మడి హై కోర్టులో మొత్తం 35 మంది ప్రధాన న్యాయమూర్తులుగా వున్నారు. వారిలో ఇద్దరు ముస్లిములు మిగిలిన వారు అంతా ఉన్నత వర్గాలకు చెందిన వారే కావడం విశేషం. ఇక 2015 నుండి 2018 వరకు ఉమ్మడి హై కోర్టుకు ప్రధాన న్యాయమూర్తి లేకపోవడం తో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులే నడిపించారు. ఇక బీసీ, ఎస్ సి మరియు ఎస్ టి న్యాయవాదులను న్యాయమూర్తులుగా సిపారేసు చేసే క్రమంలో 55 సంవత్సరాల పైబడిన తర్వాతే సిపారసు చేస్తున్నారు, ఉన్నత వర్గాల న్యాయవాదులను 45 సంవత్సరాలకే సిపారసు చేస్తున్నారు. దీని వల్ల వీరు సుప్రీమ్ కోర్టు వరకు వెళ్లలేకపోతున్నారు.బీసీ, ఎస్ సి మరియు ఎస్ టి న్యాయమూర్తులకు 5 నుండి 7 సంవత్సరాలు మాత్రమే సర్వీస్ ఉండగా, ఉన్నత వర్గాల న్యాయమూర్తులకు 10 - 15 సంవత్సరాలు సర్వీస్ ఉంటుంది. ఇక ఈ వ్యత్యాసం వల్ల బీసీ, ఎస్ సి మరియు ఎస్ టి న్యాయమూర్తులు కొల్లేజియం వరకు కూడా చేరలేక, ఈ వ్యవ్యవధిలో పదవి విరమణ పొందుతున్నారు. 1990 వరకు ఉమ్మడి హై కోర్టులో బీసీ, ఎస్ సి మరియు ఎస్ టి న్యాయమూర్తులు లేరు, ఆ తర్వాత చాల మంది న్యాయవాదుల పోరాటాల ఫలితంగా ఒక బీసీ, ఎస్ సి మరియు ముస్లిము న్యాయమూర్తులను ఎంపిక చేయడం ప్రారంభించారు. ఈ సంఖ్యలో ఇంత వరకు పెద్దగా మార్పులు లేవు. ఇప్పటి హై కోర్టులో ఇద్దరు ఎస్ సి న్యాయమూర్తులు వున్నారు, ముస్లిమ్ న్యాయమూర్తి గత రెండు సంవత్సరాలుగా లేరు, హై కోర్టు న్యాయవాదుల నుండి ఎంపికైన బి సి న్యాయమూర్తులు గత 10 సంవత్సరాలుగా లేరు. ఉమ్మడి హై కోర్టులో 2013 తర్వాత ఎంపికైన 2 బి సి జడ్జిలు తెలంగాణ వారు, వారు తెలంగాణాలో ఉండిపోయారు. ఆంధ్ర హై కోర్టు అమరావతికి తరలించే క్రమంలో చాలా మంది న్యాయమూర్తులయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. తద్వారా వీరికి ఇప్పుడు 55 నుండి 58 సంవత్సరాలు వయస్సు పైబడింది. ఇప్పుడు వీరు న్యాయమూర్తులయితే మహా అయితే 4 - 5 సంవత్సరాలు ఉండగలరు. ఇంకా ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి కానీ, ఇప్పటికి మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. ఈ మధ్య కేంద్ర లా మినిస్టరు రవి శంకర్ ప్రసాద్గారు చాలాసార్లు బీసీ, ఎస్ సి మరియు ఎస్ టి న్యాయవాదులు అన్ని అర్హతలు ఉంటే ఖచ్చితంగా వారిని ఎంపిక ప్రక్రియలో పరిశీలించాలని చెప్పారు. అంతే కాకుండా హై కోర్టు, మరియు సుప్రీమ్ కోర్టు కూడా కేశవానంద భారతి కేసులో చెప్పిన విధంగా అధికరణ 12 కింద రాష్ట్రము అనే వివరణలోనికి వస్తాయి కాబట్టి, ఉన్నత న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరము ఎంతైనా వుంది. స్వాతంత్య్రానంతర భారత దేశంలో ఇప్పటి వరకు 10 % శాతం బీసీ, ఎస్ సి మరియు ఎస్ టి లు ప్రధాన న్యాయమూర్తులు కాలేక పోయారు, ఇంతే కాకుండా, ఇప్పటి దేశ వ్యాప్త ఉన్నత న్యాయమూర్తుల శాతాన్ని గమనిస్తే, బహుజన న్యాయమూర్తులు మొత్తం మీద 20 % మించదు. ఇక మన హై కోర్టు విషయానికి వస్తే 19 మంది న్యాయమూర్తులలో ముగ్గురు న్యాయమూర్తులు బి సి లు అంటే 15 % వీరు కూడా జిల్లా జడ్జిలుగా పదోన్నతి పొందినవారు. ఇద్దరు ఎస్ సి లు అంటే 10 %, ఇక మిగిలిన 75 % ఉన్నత వర్గాల వారున్నారు. హై కోర్టు న్యాయమూర్తుల సంఖ్యా 37 వారిలో ఇప్పుడు ఉన్న వారి సంఖ్యా 19 అంటే మిగిలిన 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నమాట. మరి ఈ ఖాళీలను పూరించే క్రమంలో అయినా బీసీ, ఎస్ సి మరియు ఎస్ టి లకు న్యాయం జరిగితే మంచిది, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆయా ఖాళీలు పూరించే క్రమంలో బీసీ, ఎస్ సి మరియు ఎస్ టి ల న్యాయవాదులకు పదోన్నతి కల్పించే క్రమంలో న్యాయం చేయాలి. సంఖ్యలు కొద్దిగా అటు ఇటుగా ఉండవచ్చు, కానీ వాస్తవాలైతే బీసీ, ఎస్ సి మరియు ఎస్ టి లకు న్యాయమూర్తుల పదోన్నతిలో చాలా తక్కువ చోటుంది, దాన్ని సరి చెయ్యాల్సిన బాధ్యత అన్ని విభాగాల పైన వుంది. ఇంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన (MOP) మార్గదర్శకాలలో వయోపరిమితి సడలించి అయినా బీసీ, ఎస్ సి మరియు ఎస్ టి న్యాయవాదులకు రాజ్యాంగ ప్రకారం న్యాయమూర్తులయ్యే అవకాశం ఇవ్వాలి. ఉన్నత వర్గాల న్యాయవాదులను ఎంపిక చేసే క్రమంలో వారిని 45-47 సంవత్సరాలలోపు ఎంపిక చేస్తారు. అదే బహుజను న్యాయవాదుల వరకు వస్తే, వారిని 53 నుండి 55 సంవత్సరాలలో చేస్తారు. దీని వల్ల, బహుజనులు, ప్రధాన న్యాయమూర్తులు కాలేకపోతున్నారు. అలాగే సుప్రీమ్ కోర్టుకు వెళ్లే అవకాశం కూడా కోల్పోతున్నారు. ఇదే కాకుండా, కొలిజియం న్యాయవాదుల పేర్లను సిపారేసు చేసేటప్పుడు, ప్రస్తుత న్యాయమూర్తుల బంధువులను మినహాయించాలి. అలాగే కొలిజియం వ్యవస్థలో ఒక బి సి, ఎస్ సి ఉండేలా చూడాలి, లేకపోతే ఇంకో 100 పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. జ్ఞానము మరియు ప్రతిభ ఎవరి సొత్తు కాదు, అలాంటప్పుడు ప్రతిభ ఉన్నబి సి, ఎస్ సి, ఎస్ టి న్యాయవాదులను తప్పకుండ ప్రోత్సహించి ఎంపిక చేయాలి. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని, న్యాయమూర్తుల ఎంపికలో చొరవ తీసుకొని, 50% తగ్గకుండా బి సి, ఎస్ సి, ఎస్ టి న్యాయవాదుల పేర్లను న్యాయమూర్తులుగా సిపారేసు చేసేలా దృష్టి సారించాలి. న్యాయమూర్తులకు కులాలను అంటగట్టడం కాదు కానీ, న్యాయమూర్తుల ఎంపికలో బి సి, ఎస్ సి, ఎస్ టి లకు అన్యాయం జరుగుతుందని అని తెలియచెప్పడమే. ఇక పై న్యాయమూర్తులు పేర్లు సిపారేసు చేసేటప్పుడు కొలిజియం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చోరవ తీసుకొని న్యాయమూర్తుల ఎంపికలో బి సి, ఎస్ సి, ఎస్ టి న్యాయవాదులకు తగిన గుర్తింపు ఇవ్వాలి.
వ్యాసకర్త-సోల్మన్ రాజు మంచాల
ఫోన్: 8897960016
Post A Comment:
0 comments: