వరుస విజయాలతో ఫ్యాన్ జోరు

తిరుపతిలో వైసీపీ ఘన విజయం

వరుస విజయాలతో అధికార పార్టీలో నూతనోత్సాహం

ప్రతి ఎన్నికలోనూ సత్తాచాటుతున్న వైసీపీ

భవిష్యత్తుపై పార్టీ నేతల్లో ధీమా

కకావికలమవుతున్న ప్రతిపక్షాలు

రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్న సీఎం వై.ఎస్.జగన్

రెండేళ్ల పాలన పూర్తిచేసుకొన్నా పడిపోని జగన్ గ్రాఫ్

(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

కాకలు తీరిన రాజకీయ నేతలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్న యువ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎన్నికల్లోనూ తన పార్టీని విజయపథంలో నడిపి ఏపీలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లోనూ రికార్డు విజయాన్ని వైసీపీ సొంతం చేసుకొంది. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఘనవిజయం సాధించారు. ఆయన 2.31 లక్షలకు పైగా మెజారిటీతో తన సమీప టీడీపీ ప్రత్యర్థి పనబాక లక్ష్మిపై గెలుపొందారు. ఫ్యాన్ ధాటికి టీడీపీ, బీజేపీ-జనసేన రెండు, మూడు స్థానాలకే పరిమితం అయ్యాయి. గురుమూర్తి విజయంతో వైసీపీ శ్రేణుల్లో సంతోషం అంబరాన్నంటుతోంది. తిరుపతి ఉప ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టీడీపీ, బీజేపీల నుంచి వైసీపీకి గట్టి పోటీ ఉంటుందని అందరూ ఊహించినా ఫలితాల్లో ఆ పరిస్థితి కనిపించలేదు. తిరుపతిలో అధికార పార్టీ వైసీపీ విజయం అందరూ ఊహించినా గతంలో వచ్చిన మెజార్టీ ఈ సారి దక్కించుకొంటారా అన్నది ఆసక్తిగా మారింది. అయితే అందుకు అనుగుణంగానే వైసీపీకి భారీ ఆధిక్యం లభించింది. టీడీపీ, బీజేపీ ఎక్కడా తమ సత్తాను చాటలేకపోయాయి.  ఇదిలావుంటే టీడీపీ విషయానికి వస్తే వరుస ఓటముల పరంపర కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన పరాజయం.. తిరుపతి వరకు కొనసాగింది. కానీ అధికార వైసీపీకి వార్ వన్ సైడే అన్నట్లుగా కాలం కలిసొస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ సాధించుకొన్న వైసీపీకి ఆ విజయాల పరంపర కొనసాగుతూనే వస్తోంది. ఏడాది కిందట పంచాయతీ ఎన్నికలు, ఇటీవల మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలు తాజాగా తిరుపతి ఉప ఎన్నిక ఇలా ప్రతి ఎన్నికలో వైసీపీ తన సత్తాను చాటుకొంటూ వస్తోంది. దీంతో వైసీపీ నేతల్లో మరో పాతికేళ్లు తమకు తిరుగులేదన్న ధీమా వారి కనిపిస్తోంది. 


హోరా..హోరి పోరుతో ఫ్యాన్ దే తిరుగులేని హవా

 తిరుపతి దివంగత ఎంపీ బల్లి దుర్గారావు మృతితో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్ 17వ తేదీన జరిగిన ఈ ఉపఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి బరిలో నిలువగా.. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థినిగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రత్నప్రభ పోటీ చేశారు. ఇక మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ తెలుగుదేశం తరపున పోటీచేయగా కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ చింతామోహన్ బరిలోదిగారు. తిరుపతి ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, పోలింగ్ వరకు ఉత్కంఠభరిత వాతావరణం కనిపించింది. విపక్ష పార్టీలు జగన్ ప్రభుత్వంపై అస్త్రాలు సంధించాయి. అయినప్పటికీ ప్రజలు మాత్రం సంక్షేమ పథకాల వైపే మొగ్గుచూపారని ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. ఇక టీడీపీ తరఫున ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాళ్లకు చక్రాలు కట్టుకొన్నట్లుగా తిరిగి ప్రచారం చేశారు. టీడీపీ సీనియర్ నేతలంతా అక్కడికి మోహరించారు. కానీ ఊహించని విధంగా టీడీపీ ఓటమిని చవిచూసింది. కనీసం వైసీపీకి అధిక మెజార్టీ రాకుండా నిలువరించలేకపోయింది. అదే సందర్భంలో బీజేపీ జాతీయ నాయకులు తిరుపతి బాట పట్టారు. ఆ పార్టీకి మద్దతుగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం రంగంలోకి దిగారు. కానీ ఆ పార్టీ పోటీలో ఉందా అన్నట్లుగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 

తగ్గని ఓటింగ్ శాతం...?

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ 73 మున్సిపాలిటీలతో పాటు, 11 కార్పొరేషన్లను సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో వైసీపీ - 52.63కి శాతం ఓట్లు రాగా టీడీపీకి - 30.73 శాతం, జనసేన - 4.67 శాతం, బీజేపీ - 2.41 శాతం ఓట్లు సాధించుకొన్న. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ 52శాతానికి పైగానే ఓట్లు సాధించుకొని తన సత్తాను చాటింది.

కాంగ్రెస్‌ కంచుకోట...ఇపుడు వైసీపీ సొంతమా...?

తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా 12 సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఇందులో చింతా మోహన్‌ అత్యధిక సార్లు ఎంపీగా గెలుపొందారు. తెదేపా నుంచి ఓ సారి, ఐదుసార్లు కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించారు. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌ గెలుపొందారు. తిరుపతి స్థానానికి 1962, 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి సి.దాస్‌, 1971, 1977లో తంబురు బాలకృష్ణయ్య, 1980లో పసల పెంచలయ్య, 1984లో తెదేపా నుంచి డాక్టర్‌ చింతా మోహన్‌ విజయం సాధించారు. తిరిగి 1989, 1991లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. ఈయనకు 1996లో టిక్కెట్‌ రాలేదు. నెలవల సుబ్రమణ్యానికి టికెట్‌ రాగా ఎన్నికయ్యారు. 1998లో తిరిగి చింతా మోహన్‌కు కాంగ్రెస్‌ టిక్కెట్‌ రాగా విజయం సాధించారు. 1999లో తెదేపా పొత్తులో భాగంగా భాజపా అభ్యర్థిగా ఎన్‌.వెంకటస్వామి పోటీ చేసి గెలుపొందారు. 2004, 2009లో తిరిగి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన చింతా మోహన్‌ను విజయం వరించింది. వైకాపా నుంచి 2014లో వరప్రసాదరావు, 2019లో బల్లి దుర్గాప్రసాద్‌రావు విజయం సాధించారు. దుర్గాప్రసాదరావు అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. తాజాగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి తిరుపతిని కంచుకోటగా మల్చుకోనున్నది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: