రోజువారీగా తాగడానికి నీళ్ళు ఇవ్వండి - కార్పొరేటర్లు

తాగునీటికి  ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు- కర్నూల్ మేయర్ బివై రామయ్య

తాగునీటి కి ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నాం-- కమిషనర్ డీకే బాలాజీ

తాగునీటి సమస్యపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి-- ఎమ్మెల్యే కాటసాని

హిస్టారికల్ నగరంగా కర్నూలును తీర్చిదిద్దాలి -- ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

మాట్లాడుతున్న మేయర్ బి వై రామయ్య
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రోజు మరిచి రోజు, కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులకు ఒకసారి మరికొన్ని ప్రాంతాల్లో తాగు నీటిని వదులుతున్నారని, ఇచ్చే తాగు నీటిని కూడా సమయపాలన లేకుండా రాత్రి 12 గంటలనుంచి 3 గంటల మధ్య నీళ్లు ఇస్తున్నారని, ఏలాంటి సమయపాలన పాటించకపోవడం వల్ల ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెజార్టీ కార్పొరేటర్లు తమ ఆవేదన వెలిబుచ్చారు. బుధవారం కర్నూల్  నగరపాలక సమావేశ భవనంలో  తొలి పాలక మండలి సమావేశం నగర మేయర్ బి వై రామయ్య అధ్యక్షతన జరిగింది. మేయర్ తాగునీటిపై తొలి అజెండాను చర్చకు పెట్టగా సభ్యులు తమ తమ వార్డులోని తాగునీటి కష్టాలను సభ ముందుకు తీసుకొచ్చారు. రెండో సమ్మర్ స్టోరేజ్ తో పాటు తుంగభద్ర నదిపై రెండు లేదా మూడు అడుగులు నీటి నిల్వలు చేసుకునే విధంగా ఆనకట్ట  నిర్మాణం చేపడితే నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కార్పొరేటర్ మోనితా రెడ్డి సూచించగా అందుకు ఎస్ఈ సురేంద్రబాబు సమాధానమిస్తూ ఇదివరకే ఈ రెండింటిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అవి కార్యరూపం దాల్చలేదని సమాధానమిచ్చారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

చేతిపంపులు మరమ్మతులు గురయ్యాయని వాటిని రిపేర్ చేయిస్తే కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుందని కార్పొరేటర్లు సూచించారు. పేదల నివాసముండే ప్రాంతాల్లో అర్ధరాత్రి పూట నీళ్లు ఇచ్చి ఏం ప్రయోజనమని, పేద వారిని దృష్టిలో ఉంచుకొని పగటిపూట నీళ్లు ఇవ్వాలని కార్పొరేటర్లు సూచించారు. ఎస్ఈ సమాధానమిస్తూ వార్డుల వారీగా ఎక్కడెక్కడ నీళ్లు ఏ సమయానికి ఇస్తున్నామో వాటిపై చర్చించి అనంతరం సమయపాలనలో మార్పులు తెస్తామని సమాధానమిచ్చారు. పాణ్యం అర్బన్  ప్రాంతంలోని 16 వార్డుల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. తాగునీటిని నాలుగు రోజుల కొకసారి ఇవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వీలైనంత ఎక్కువగా ఓవర్ హెడ్ ట్యాంకులు, చేతిపంపులు నిర్మాణం చేపట్టి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎస్ఈ సమాధానమిస్తూ నగరపాలక సంస్థ పరిధిలో 33 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయని వీటిలో కర్నూల్ టౌన్ పరిధిలోనే అధికంగా 22 ట్యాంకులు ఉన్నాయని కల్లూరు అర్బన్ ప్రాంతంలో 8 ఓవర్ హెడ్ ట్యాంకులు మాత్రమే ఉండడం వల్ల తాగునీటి సమస్య ఉత్పన్నమవుతుందని సమాధానమిచ్చారు. ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణానికి ప్రతిపాదనలు టెండర్లు పిలిచామని, వీలైనంతగా త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఒకప్పటి రాజధాని కర్నూలు నగరాన్ని హిస్టారికల్ నగరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కోరారు. కొండారెడ్డి బురుజు, గోలుగుమ్మజ్ వద్ద ఫొటోస్ స్పాట్లు ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నారు.

సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు

సభ్యులు అడిగిన సమస్యలన్నింటినీ అధ్యయనం చేసి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ బి వై రామయ్య అధికారులకు సూచించారు. తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ అధికారులకు సూచించారు. రెండో ప్రాధాన్యతగా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా కర్నూలును అభివృద్ధి చేసేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్త చర్యగా చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ పీకే బాలాజీ వివరించారు. సుంకేసుల డ్యాం లో 1.01 టీఎంసి, గాజులదిన్నె లో 2.9టీఎంసీ వాటర్ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ వేసవిలో తాగునీటి కి ఎలాంటి ఇబ్బందులు లేవని కమిషనర్ వివరించారు. నగరంలో వార్డుల వారీగా నిలిచే సమయాల్లో మాత్రమే తేడాలు ఉన్నాయని వాటిని సరిచేసి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఈ సమావేశంలో నగరపాలక అదనపు కమిషనర్ పివీ రామలింగేశ్వర్, జలమండలి ఎస్ఈ శ్రీరామచంద్ర మూర్తి, నగరపాలక సంస్థ ఇంజనీర్లు ఇతర అధికారులు, ఆర్అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మేయర్ రామయ్యకు మొక్క ఇచ్చి అభినందనలు తెలుపుతున్న కమిషనర్ బాలాజీ

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: