సాంస్కృతిక యోధుడికి ఘన నివాళి!

- ముగిసిన  వైకె సంస్మరణ సప్తాహం

-  సినీ సాంస్కృతిక ప్రవాస సేవామూర్తులు  కళాకారుల కన్నీటి శ్రద్ధాంజలి 

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

సాంస్కృతిక రంగ చరిత్రలో  ఇదొక  సువర్ణ అధ్యాయం ! ఒక సాంస్కృతిక యోధుడికి  ఘన నివాళి అర్పించి గొప్ప స్ఫూర్తిని అందించిన చరిత్ర!  మున్నెన్నడూ ఎవ్వరికి జరగని మహా శ్రద్ధాంజలి! ఏప్రిల్ 14న గుండెపోటుతో హైదరాబాద్ లో కనుమూసిన యువకళావాహిని వ్యవస్థాపకులు చారిత్రాత్మక నటుడు, ఆత్మీయ ఆప్త కళామిత్ర దివంగత లయన్  వై.కె.నాగేశ్వరరావు గారి  సంస్మరణ సప్తాహం జరిగింది. వారం రోజుల పాటు  ప్రముఖులు అంతర్జాల వేదికలో తమ మనసులో వైకె గారిపై వున్న భావాలను అశ్రునయనాలతో  ఆవిష్కరించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని  కన్నీటి శ్రద్ధాంజలి ఘటించారు. సాంస్కృతిక రంగం ఉన్నంత కాలం నాగేశ్వరరావు గారి  సేవలు అజరామరం  అంటూ కొనియాడారు.  

సాంస్కృతిక బంధు శ్రీ సారిపల్లి కొండలరావు ఫౌండేషన్  సారథ్యంలో, కల్చరల్ టివి, తెలుగు ప్రపంచం పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో వైకె సంస్మరణ సప్తాహాన్ని అంతర్జాలంలో నిర్వహించారు. రోజుకో రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ముగింపు  రోజు నిన్న  సినీనటులు పలువురు పాల్గొని నాగేశ్వరరావు తో తమకు వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాగేశ్వరరావు అకాల మృతి సినీ సాంస్కృతిక రంగానికి తీరని లోటు అని అలనాటి నటి, నిర్మాత, మీర్జాపూర్ జమిందార్  శ్రీమతి  కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు. అలనాటి అందాల నటి శ్రీమతి జమున మాట్లాడుతూ వై కె గారు నిర్వహించిన  ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నానని, తన సహస్ర చంద్ర పూర్ణోదయ వేడుక నిర్వహించారంటూ జ్ఞప్తికి  తెచ్చుకుని  అశ్రు నివాళి సమర్పించారు. సినీ దర్శకులు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ, శ్రీ రేలంగి నరసింహారావు, శ్రీ ముప్పలనేని శివ, గేయ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, నిర్మాత శ్రీమతి ఎం.ఆర్. అనురాధ, నటులు శ్రీ  సాయిచంద్, శ్రీ గౌతమ్ రాజు, శ్రీమతి శివపార్వతి, సంగీత దర్శకుడు శ్రీ  కోటి, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ మహ్మద్ రఫీ, శ్రీ రెంటాల జయదేవ్, కళా పోషకులు శ్రీ వి.వి.రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

తొలుత గాయనీ గాయకుల స్మృత్యంజలి తో ఈ నెల 17న ప్రారంభమయిన  సంస్మరణ సప్తాహం శుక్రవారం ఏప్రిల్ 23న ఘనంగా ముగిసింది. మున్నెన్నడూ ఎవరికీ జరగని రీతిలో వారం రోజుల పాటు జరగడం వై కె నాగేశ్వరరావు గారు  చేసిన సాంస్కృతిక సాహిత్య సేవ కు నిదర్శనమని పలువురు వక్తలు తమ నివాళులు అర్పించారు. గాయనీమణులు శ్రీమతి  విజయలక్ష్మి, శ్రీమతి సురేఖా మూర్తి, శ్రీమతి శశికళా స్వామి, శ్రీమతి పద్మశ్రీ, శ్రీమతి ఆమని, కుమారి సంధ్యావర్షిణి, డాక్టర్ వివి రామారావు, శ్రీ చంద్రతేజ, శ్రీ  ప్రవీణ్ కుమార్  తదితరులు కన్నీటి శ్రద్ధాంజలి సమర్పించారు. అలాగే  సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు డాక్టర్ వంశీ రామరాజు, శ్రీ కిన్నెర రఘురాం, డాక్టర్ రసమయి రాము, డాక్టర్ కె.ధర్మారావు, ఆకృతి  శ్రీ సుధాకర్, సమైక్య శ్రీ  సత్యనారాయణ, రాగసప్తస్వరమ్ శ్రీమతి  రాజ్యలక్ష్మి,  తెలంగాణ జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు శ్రీ  వంగా శ్రీనివాస్ గౌడ్, నృత్య గురువులు  శ్రీ  పండిట్ అంజుబాబు, శ్రీమతి నిర్మల ప్రభాకర్, ప్రవాస తెలుగు ప్రముఖులు అమెరికా నుంచి శ్రీ రవి కొండబోలు, శ్రీమతి ఆకునూరి శారద,  శ్రీ  తోటకూర ప్రసాద్, శ్రీ మహేష్ సలాది, శ్రీ దాము, శ్రీమతి మణి శాస్త్రి తదితరులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

వై కె సేవలు చిరస్మరణీయం అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి, సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ  మామిడి హరికృష్ణ, సంగీత నాటక అకాడమీ చైర్మన్ శ్రీ  బి.శివకుమార్, మాజీ మంత్రివర్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, లయన్ డాక్టర్ ఎ.విజయకుమార్, దూరదర్శన్ పూర్వ డైరెక్టర్ డాక్టర్ పాలకుర్తి మధుసూధనరావు, ఆంధ్రప్రదేశ్ పూర్వ నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ, సీనీ విశ్లేషకులు డాక్టర్  ఎస్వి.రామారావు నివాళులు అర్పించారు. అలాగే సాహిత్య సాంస్కృతిక రంగ ప్రముఖులు డాక్టర్ ఆవుల  మంజులత, జస్టిస్ శ్రీ రామలింగేశ్వరరావు,  డాక్టర్ కెవి కృష్ణకుమారి, డాక్టర్ ఓలేటి పార్వతీశం, డాక్టర్ జె.చెన్నయ్య, డాక్టర్ ఎస్.శంకరనారాయణ, చిన్ననాటి మిత్రులు శ్రీ లోకం  కృష్ణయ్య, శ్రీ కె.నాగేశ్వరరావు, శ్రీ శంకరరావు తదితరులు పాల్గొన్నారు. సప్తాహం లో వంద మందికి పైగా వై కె ఆత్మీయులు పాల్గొని తమ జ్ఞాపకాలు పంచుకున్నారు.

 యువకళావాహిని నూతన అధ్యక్షులుగా శ్రీ లంకా లక్ష్మినారాయణ  పదవీ బాధ్యతలు స్వీకరించారు. వైకె స్ఫూర్తిని కొనసాగిస్తానని, యువకళావాహిని వారసత్వాన్ని నిలబెట్టి వై కె గారిని కళారంగం లో  సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తానని అయన హామీ ఇచ్చారు.  యువకళావాహినికి ఇన్నాళ్లు అండగా నిలిచిన సాంస్కృతిక బంధు శ్రీ సారిపల్లి కొండల రావు మాట్లాడుతూ  వైకె స్మృతిలో అదే చైతన్యంతో తన హార్ధిక ఆర్థిక సౌజన్యాలను అందిస్తానని, కార్యక్రమాలు భవిష్యత్ లోను  కొనసాగుతాయని ప్రకటించారు. 

ఒక నటుడిగా రంగస్థల ,జానపద కళాకారులకు కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఆదుకున్న సౌజన్యశీలి వై కె నాగేశ్వరరావు అని పలువురు కళాకారులు కీర్తించారు.  సమాజం మరచి మరుగున పడ్డ  ప్రముఖుల జయంతులు, వర్ధంతులు నిర్వహించి వారిని మళ్ళీ మన మధ్య నిలిపారని, అమర గాయకుల పాటలను అజరామరం చేశారని, లబ్ద ప్రతిష్టులకు, వర్ధమాన కళాకారులకు రచయితలకు  సమాంతర వేదిక కల్పించి ప్రోత్సహించారని, యువకళావాహిని వేదిక ఎక్కని కళాకారుడు లేరని నివాళులర్పించారు. గతం లో ఎవరికీ జరగని రీతిలో ఈ సంతాప సంస్మరణ సప్తాహం నిర్వహించిన శ్రీ సారిపల్లి కొండలరావు, కల్చరల్ టివి సిఈవో శ్రీ ఎన్.పురుషోత్తం, శ్రీ లంకా లక్ష్మీనారాయణ, శ్రీ బొప్పన నరసింహారావు, శ్రీ జి.మల్లికార్జున్, జనాబ్ ఎం.ఎ.హమీద్, శ్రీ భాగీశాస్త్రి, శ్రీ పి.త్యాగరాజు, శ్రీ అక్కినేని శ్రీధర్, శ్రీ ఇ.ఎన్.ఎస్.మూర్తి   తదితరులు  ఒక కొత్త ఒరవడికి తెర లేపారని పలువురు ప్రముఖులు అభినందించారు. వారం రోజులు స్వయంగా  శ్రీ  సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించి పర్యవేక్షించి తన ఆత్మీయ మిత్రులు  వై కె నాగేశ్వరావు గారికి  ఘన శ్రద్ధాంజలి ఘటించడం  చిరస్మరణీయం అని పలువురు కొనియాడారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: