టీడీపీ నిరసనలకు బ్రేక్

రేణుగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు అడ్డుకొన్న పోలీసులు

విమానాశ్రయంలోనే బైఠాయించిన చంద్రబాబు

టెన్షన్..టెన్షన్ గా మారిన పరిస్థితి

కలెక్టర్..ఎస్పీలను కలవాలని కోరిన చంద్రబాబు

వారినే ఇక్కడికి పిలిపిస్తామని చంద్రబాబును అడ్డుకొన్న పోలీసులు

నిరసన వ్యక్తంచేసిన చంద్రబాబు

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చిత్తూరు టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు

అనుమతి లేదని పోలీసులు తేల్చడంతో వెనుదిరిగి వెళ్లిపోయిన చంద్రబాబు

తీవ్ర ఉత్కంఠకు తెర


(జానోజాగో వెబ్ న్యూస్-పొలిటికల్ బ్యూరో) 

వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తిరుపతిలో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు  చేపట్టనున్న నిరసనలను పోలీసులు ముందస్తుగానే అడ్డుకొన్నారు. నిరసన కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా చంద్రబాబును పోలీసులు రేణిగుంట విమానాశ్రమయంలోనే అడ్డుకొన్నారు. అదే సందర్భంలో టీడీపీ నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్నందున చంద్రబాబు నిరసనలకు అనుమతించటం లేదని ఈస్ట్ డీఎస్పీ తెలిపారు. టీడీపీ అధినేత  తిరుపతిలో సోమవారంనాడు గాంధీ విగ్రహాల వద్ద  నిరసనలు  చేపట్టాలని  నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తిరుపతి గాంధీ విగ్రహం వద్ద నిరసనలకు అనుమతిలేదని  టీడీపీ పార్టీ కార్యాలయానికి, తిరుపతి మాజీ ఎమ్మెలే సుగుణమ్మకు, నరసింహ యాదవ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి అనుమతి కోరుతూ నిన్ననే టీటీడీ నేతలు లేఖ ఇచ్చినా, అర్ధ రాత్రి అనుమతి నిరాకరిస్తున్నట్టు, సోషల్ మీడియాలో తమకు విషయం తెలిసినట్టు టీడీపీ నేతల ఇండ్లకు పోలీసులు నోటీసులు అతికించారు.జిల్లా వ్యాప్తంగా టిడిపి ముఖ్య నాయకుల హౌస్ అరెస్ట్ చేపట్టారు.

పలమనేరులో మాజీ మంత్రి  ఎన్.అమర్నాథరెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ  దొరబాబు, చిత్తూరు టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నాని తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అందర్నీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు లు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రేణిగుంట విమానాశ్రయంలో బైఠాయించిన చంద్రబాబు సాయంత్రం పొద్దుపోయాక చివరి ఫైట్ లో హైదరాబాద్ కు తిరిగివెళ్లిపోయారు. దీంతో  రేణిగుంట ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు తెర పడింది. ఉదయం నుంచి నిరసన కొనసాగించిన చంద్రబాబు నాయుడు తిరిగి హైదరాబాద్‌ బయలుదేరారు. చిత్తూరు రూరల్‌ ఎస్పీతో చంద్రబాబు చర్చించారు. చివరి ఫ్లైట్‌ ఉండటంతో బయల్దేరాల్సిందేనని పోలీసులు తెలిపారు. దీంతో చంద్రబాబు తిరిగి పయనమయ్యారు.

విమానాశ్రయంలో హై టెన్షన్..?

రేణుగుంట ఎయిర్‌పోర్టులో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎయిర్ పోర్టులోనే నిరీక్షిస్తున్నారు. లాంజ్ నుంచి బయటకు వెళ్లనియ్యకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చారు. పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబు ఎయిర్ పోర్టులోనే బైఠాయించారు. కలెక్టర్, ఎస్పీని కలవడానికి తాను వెళతానంటున్నా.. వెళ్లనివ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. వాళ్లను ఇక్కడికే పిలిపిస్తామని పోలీసులు చెప్పగా తానేం అంత గొప్ప వ్యక్తిని కాదని, తనకు తానుగా అక్కడికి వెళతానని అన్నారు. తనదగ్గరకే పిలిపిస్తామని చెప్పడాన్ని ఆయన తోసిపుచ్చారు. ప్రపంచానికి ప్రభుత్వం చేసే అరాచకాలు తెలియాల్సిందేనన్నారు.

మీడియాతో కూడా మాట్లాడించకపోవడాన్ని కూడా ప్రశ్నించారు. ‘‘నేనేమైనా హత్య చేయడానికి వెళుతున్నానా.. 14 ఏళ్లు సీఎంగా ఉన్నాను. ప్రతిపక్ష నేతను నేను. నన్నెందుకు  నిర్బంధించారో చెప్పండి’’ అన్నారు.  రేణిగుంట పోలీసులు చంద్రబాబకు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు టీడీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పలువురు టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో టీడీపీ నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు నిర్బంధించారు.

ఇదిలా ఉంటే చిత్తూరు నగరపాలక సంస్థలో కార్పొరేటర్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచేందుకు సోమవారం జిల్లా పర్యటనకు చంద్రబాబు వచ్చారు. అభ్యర్థులకు వస్తున్న బెదిరింపులకు నిరసనగా ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నగరంలోని గాంధీ కూడలి వద్ద ధర్నా చేయాల్సి ఉంది. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరి పుత్తూరు మీదుగానే తిరుపతి చేరుకుని, సాయంత్రం 5.45 గంటలకు తిరుపతిలో జరిగిన అరాచక పర్వంపైనా ఆర్టీసీ బస్టాండు సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపాల్సిన కార్యక్రమం రూపొందించుకొన్నారు చంద్రబాబు. తర్వాత ఆటోనగర్‌లోని పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమమై. రాత్రి 7.15 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ వెళ్లేలా కార్యక్రమం రూపొందించుకొన్నారు. ఇలా రూపొందించుకొన్న షెడ్యూల్ ప్రకారం చిత్తూరు పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తిరుపతిలోని రేణిగుంట ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఎయిర్‌పోర్టులోనే బాబు బైఠాయించారు. ఈ క్రమంలో చంద్రబాబు దగ్గరున్న మొబైల్‌ను బలవంతంగా పోలీసులు లాక్కున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పీఏ, వైద్య అధికారితో పాటు ఆయన వెంట ఉన్న ఇతరుల నేతల ఫోన్లను కూడా బలవంతంగా పోలీసులు లాక్కోన్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతో ఎయిర్‌పోర్టులో అప్పటికే టెన్షన్ టెన్షన్‌గా ఉన్న పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా కలెక్టర్, తిరుపతి, చిత్తూరు ఎస్పీలకు ఫిర్యాదు చేస్తానని తనను అడ్డుకొన్న పోలీసులకు చంద్రబాబు హెచ్చరించారు. పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. అనుమతి ఇచ్చే వరకు విమానాశ్రయంలోనే తన నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ప్రతిపక్షనేతగా కలెక్టర్, ఎస్పీలను కలిసే హక్కు తనకు లేదా అని నిలదీశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు, పోలీసులకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చంద్రబాబును వేడుకుంటూ.. దండాలు పెడుతూ.. పోలీసులు ఆయన్ను ఆపే ప్రయత్నం చేశారు.  మీకు పర్మిషన్ ఇవ్వలేదు సార్ అని చంద్రబాబుతో పోలీసులు అన్నారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహించి కలెక్టర్, చిత్తూరు, తిరుపతి ఎస్పీలను నేను కలవాలి. ఆ ముగ్గురికి సమాచారం ఇవ్వండి పోలీసులతో అన్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ ఓకే సార్ వారినే ఇక్కడికి పిలిపిస్తాం అన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. నేను ప్రెస్‌తో మాట్లాడాలి. నేనెందుకు వచ్చానో చెప్పాలి కదా. నాకు ప్రాథమిక హక్కులు లేవా... ఇదేం దౌర్జన్యం. నేనేమైనా హత్య చేయడానికి వెళుతున్నానా.. 14 ఏళ్లు సీఎంగా పని చేశానయ్యా.. ప్రతిపక్ష నేతను. తమాషాలు చేస్తున్నారా? మీరు పర్మిషన్ లేదన్నారు. నేను వెళతాను. అని చంద్రబాబు అన్నారు. అయినా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో... నిల్చున్న చోటే ఆయన నిరసనకు దిగారు. అక్కడే బైఠాయించారు. దీంతో కలగజేసుకొన్న పోలీసులు సార్‌, మీరు పెద్దవాళ్లు, ఇక్కడ కూర్చొవడం బాగోదు. వేరేచోట కూర్చొవచ్చు. అక్కడకి వెళదాం అని చంద్రబాబును బతిమిలాడారు. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు మాట్లాడుతూ నేను ఎస్పీ దగ్గరకు పోవాలంటే మీ పర్మిషన్ నాకెందుకు? కావాలంటే వెనకే అనుసరించండి. నేనెక్కడికైనా వెళ్లిపోతానా? కలెక్టర్ దగ్గరకు, చిత్తూరు, తిరుపతి ఎస్పీల దగ్గరకు నేను వెళ్లాలి అని తేల్చిచెప్పారు. దీనికి పోలీసులు బదులిస్తూ సార్ వారిని ఇక్కడికే పిలిపిస్తామన్నారు. కానీ చంద్రబాబు దీనికి నిరాకరించారు. నా దగ్గరకొద్దు. నేనంత గొప్ప వ్యక్తిని కాదు. దీనిపై స్పందించిన పోలీసులు గౌరవసూచకంగా వారిని పిలిపిస్తామని సమాధానమిచ్చారు.

అందుకే చంద్రబాబు ధర్నాకు అనుమతివ్వలేదు’-అర్భన్‌ ఎస్పీ అప్పలనాయుడు

తిరుపతిలో చంద్రబాబు చేపట్టబోయే నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని చిత్తూరు అర్భన్‌ ఎస్పీ అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు నిన్ననే తెలియజేశామని, కానీ ఆయన వినకుండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారని అన్నారు. కాగా తిరుపతిలో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు సోమవరాం హైదరాబాద్‌ నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో పోలీసులు ఆయనను అడ్డుకున్న విషయం తెలిసిందే. నిరసన తెలిపిందుకు అనుమతి లేదంటూ నోటీసులు అందజేశారు. దీంతో ఎయిర్ పోర్ట్ లోనే చంద్రబాబు బైఠాయించారు. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ.. చంద్రబాబు నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని చెప్పినా తిరుపతిలో బస్టాండ్‌ ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహం ఎదుట ధర్నాకు పూనుకున్నారని తెలిపారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌కు సమీపంలో గాంధీ విగ్రహం ఉందని, వారు ఎంపిక చేసుకున్న స్థలం భక్తులతో నిండి ఉంటుందన్నారు. అక్కడ ధర్నా చేస్తే తిరుమలకు వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని చెప్పి టీడీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చామన్నారు. జన సమీకరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అదే విధంగా ధర్నాలు, ర్యాలీలు ఎన్నికల నియమావళికి, కోవిడ్‌ నిబంధనలకు విరుద్ధమని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్‌ తెలిపారు. అందుకే చంద్రబాబు నాయుడి ధర్నాకు అనుమతి ఇవ్వలేదన్నారు. 5 వేల మందితో ధర్నా చేస్తున్నట్లు నిన్న రాత్రి లెటర్ ఇచ్చారని, అనుమతి ఇవ్వమని అప్పుడే చెప్పామని పేర్కొన్నారు.చిత్తూరు నడిబొడ్డులో ధర్నాకు అనుమతి కోరారని, సిటీ బయట అయితే చేసుకోవచ్చని చెప్పినట్లు తెలిపారు.అయినా వినకుండా ఈ రోజు ఉదయం కొందరు టీడీపీ నేతలు ధర్నా చేసేందుకు సిద్ధపడ్డారని వారందరినీ ముందస్తుగా అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అనుమతితో వస్తే అనుమతి ఇస్తామని, పంచాయితీ ఎన్నికల్లో అరాచకాలు జరిగాయని టీడీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.

నన్ను అడ్డుకోలేరు.. నేను తగ్గేది లేదు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తిరుపతిలోని రేణిగుంట ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్ననేపథ్యంలో పోలీసుల తీరును నిరసిస్తూ ఎయిర్‌పోర్టులోనే బాబు బైఠాయించారు. ఈ మొత్తం వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘నన్ను అడ్డుకోలేరు.. నేను తగ్గేది లేదు. నన్ను ప్రజల్ని కలవనీయకుండా ఆపటం తగదు. భయంతో ఎన్ని రోజులు పాలన సాగిస్తావు?. ఇకనైనా జగన్ ఎదగాలి’ అని సీఎంపై ట్విట్టర్‌లో చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే ఎయిర్‌పోర్టు బయట.. ఏపీలో పలు చోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ నేతల ఆందోళనలు..

రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ విజయవాడలోని రెడ్డిగూడెంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. మండల టీడీపీ అధ్యక్షుడు ముప్పిడి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల ఆందోళన నిర్వహించారు. చంద్రబాబును అడ్డుకోవడాన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.

వైసీపీ అరాచకాలు ఎక్కువ రోజులు సాగవు’

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. చంద్రబాబును ఎదుర్కొనే దమ్ములేక నిర్బంధం చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు తిరుపతి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. తిరుపతిలో చంద్రబాబు పర్యటిస్తే మునిసిపల్ ఎన్నికల్లో గెలవడం కష్టమనే జగన్ ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ అరాచకాలు ఎక్కువ రోజులు సాగవని.. త్వరలోనే ప్రభుత్వానికి భంగపాటు తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు

తిరిగి హైదరాబాద్ చేరుకొన్న చంద్రబాబు..

ఇదిలావుంటే విమానాశ్రయంలో నిరసన వ్యక్తంచేసిన చంద్రబాబును హైదరాబాదుకు పంపించేందుకు పోలీసులు విమాన టికెట్లను బుక్ చేశారు. మధ్యాహ్నం 3.10 గంటలకు స్పైస్ జెట్ విమానంలో పంపించేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాను అక్కడి నుంచి కదిలేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో సాయంత్రం 7.15 గంటలకు ఇండిగో విమానంలో పంపించేందుకు మరోసారి పోలీసులు టికెట్లను బుక్  చేశారు. దీంతో  చిత్తూరు రూరల్‌ ఎస్పీతో చంద్రబాబు చర్చించారు. చివరి ఫ్లైట్‌ ఉండటంతో బయల్దేరాల్సిందేనని పోలీసులు తెలిపారు. దీంతో చంద్రబాబు తిరిగి పయనమయ్యారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: