ముస్లిమ్ హై... దావత్ దే...

-ఇస్లామోఫోబియాను అడ్డుకునేందుకు ఎస్ఐఓ ప్రచార ఉద్యమం

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

ఇస్లామ్ ధర్మం ఈ లోకానికి కారుణ్యంగా వచ్చింది.. ఇస్లామ్ బోధనలు శాంతిని, ప్రేమను బోధిస్తాయి.. ప్రతీ యువకుడు ఇస్లామ్ ధర్మ బోధనలను ఆచరించి ఖుర్ఆన్ గ్రంథానికి ప్రతిబింబంగా నిలవాలని పలువురు ఉలమాలు ముస్లిమ్ యువతరానికి పిలుపునిచ్చారు. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఓ) తెలంగాణ శాఖ ‘ముస్లిమ్ హై.. దావత్ దే’ (నువ్వు ముస్లిమ్ అయితే సందేశం అందించు) అనే అంశంపై పక్షోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. జమాఅతె ఇస్లామిహింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా హామిద్ ముహమ్మద్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నగరానికి చెందిన ఉలమాలు పాల్గొన్నారు. మౌలానా హామిద్ ముహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ముస్లిమ్ యువత తమ దైనందిన జీవితాన్ని  ఇస్లామ్ ధర్మ బోధనలకనుగుణంగా నడుచుకోవాలని హితవు పలికారు. ఖుర్ఆన్ బోధించే నైతిక నడవడికను అలవర్చుకుంటే  సమాజంలో ఇస్లామ్ స్ఫూర్తిని కలిగించవచ్చని అన్నారు. మనుషులంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే అన్న భావనను ప్రజల్లోకి తీసుకెళితే సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు. ఖుర్ఆన్, ముహమ్మద్ ప్రవక్త బోధనలకనుగుణంగా నడుచుకుంటే ఇస్లామ్ పై ఉన్న అపోహలు, అపార్థాలను తొలగించవచ్చని ఆయన ముస్లిమ్ యువకులకు పిలుపునిచ్చారు.

ఇస్లామోఫోబియాను అడ్డుకునేందుకు ఇలాంటి ప్రచార ఉద్యమాలు మరిన్ని అవసరమని మిల్లతె ఇస్లామియ అధ్యక్షులు  మౌలానా జాఫర్ పాషా అన్నారు. ముస్లిములంతా తమలోని విభేదాలను పక్కనపెట్టి  ఏకతాటిపైకి వచ్చి సమాజ సంస్కరణ కోసం, చెడును తుంచి మంచిని పెంచేందుకు పాటుపడినప్పుడే ఖుర్ఆన్ చెప్పిన ముస్లిమ్ సమాజ లక్ష్యం నెరవేరుతుందని ఎస్ఐఓ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తల్హా అన్నారు. ముహమ్మద్ ప్రవక్త (స) జీవితాంతం మంచికోసం పాటుపడ్డారని ఆయన పలు ఉదాహరణలను ఉటంకిస్తూ చెప్పారు. నేడు ముస్లిములు ఈ బాధ్యతను విస్మరించి సమాజం ఎటుపోతే మాకేంటి అన్న ధోరణి పెరిగిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బాధ్యతను తట్టిలేపి ముస్లిమ్ యువతను చైతన్యం చేసేందుకే ఈ పక్షోత్సవాలను ప్రారంభించామని ఆయన చెప్పారు. ఇస్లామ్ స్ఫూర్తిని పెంపొందించే వీడియోలను సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపడతామని ఆయన చెప్పారు. ఇస్లామ్ పై కమ్ముకున్న అపోహలు, అపార్థాల మబ్బులను దూరం చేస్తూ ఇస్లామ్ జీవన వ్యవస్థను పరిచయం చేసే పలు కార్యక్రమాలు ఈ పక్షోత్సవాల్లో ప్రచారం చేస్తామని ఎస్ఐఓ నగర అధ్యక్షుడు సుహైల్ రిజ్వాన్ అన్నారు. ఈ సమావేశంలో జమిఅత్ అహ్లె హదీస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ ఉమ్రీ, మౌలానా తఖీ రజా ఆబెది, మౌలానా సిరాజుర్రహ్మాన్ ఆబెది, మౌలానా ఫజలుల్లాహ్ మూస్వీ ఖాద్రి, ముఫ్తీ మేరాజుద్దీన్ అబ్రార్, డాక్టర్ జియువుద్దీన్ నయ్యర్, మౌలానా సయ్యద్ నిసారుద్దీన్ హైదర్ తదితరులు పాల్లొన్నారు. 

తెలుగులో ప్రవక్త బోధనల గ్రంథం ‘సహీహ్ బుఖారి’ ఆవిష్కరణ..

ముహమ్మద్ ప్రవక్త బోధనల గ్రంథంలో అత్యంత ప్రామాణిక మైన అరబిక్ గ్రంథం ‘సహీహ్ బుఖారి’ తెలుగు అనువాద గ్రంథాన్ని మౌలానా హామిద్ ముహమ్మద్ ఖాన్ ఆవిష్కరించారు. మంగళవారం ఛత్తాబజార్ లోని జమాఅతె ఇస్లామీహింద్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో  ఈ ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా మౌలానా హామిద్ ముహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ  ప్రవక్త ముహమ్మద్ బోధనలు కులమతాలకతీతంగా అందరికీ అనుసరణీయమని, సత్యమార్గాన్ని, సన్మార్గాన్ని చూపిస్తాయని ఆయన అన్నారు. తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్టు ముద్రించిన ఈ పుస్తకంలోని ప్రవక్త బోధనలు మనిషి దైనందిన జీవితానికి చక్కని దిశానిర్దేశం చేస్తాయని ఆయన చెప్పారు. ఖుర్ఆన్ గ్రంథం తెలుగు అనువాదకులు ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ ఈ గ్రంథాన్ని తెలుగులో అనువదించారు.  ఖుర్ఆన్ తెలుగు అనువాదంతోపాటు ఇస్లామ్ సాహిత్యాన్ని తెలుగులో ప్రచురిస్తున్న తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్టు సేవలను పలువురు ఉలమాలు అభినందించారు. అనంతరం ‘మానవ జగతిపై ముస్లిముల ఉత్థాన పతనాల ప్రభావం’ పుస్తకాన్నికూడా మౌలానా ఆవిష్కరించారు. దివంగత మౌలానా అబుల్ హసన్ అలీ నద్వీ రచించిన ఈ పుస్తకాన్ని అబుల్ ఫౌజాన్ తెలుగులో అనువదించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ పుస్తకం ఎన్నో భాషల్లో అనువాదమైందని ఇక ఇప్పుడు తెలుగు ప్రజలకూ అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్టు డైరెక్టర్ ఇంజనీర్ సలీమ్ అహ్మద్ ఖాన్, జమాఅతె ఇస్లామీహింద్ నాయకులు అబ్దుస్సుభాన్, అబుల్ ఫౌజాన్ తదితరులు పాల్గొన్నారు. 

✍️ రిపోర్టింగ్-ముహమ్మద్ ముజాహిద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: