సురవరం జీవితం స్ఫూర్తిదాయకం

మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్ -హైదరాబాద్ బ్యూరో)

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి త్యాగపూరితమైన జీవితం సమాజానికి స్పూర్తి దాయకమని రాష్ట్ర మంత్రులు కె.శ్రీనివాస్ గౌడ్, ఎస్.నిరంజన్ రెడ్డిలు అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం నాడు రవీంద్రభారతీ ప్రివ్యూ థియేటర్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్(మెఫి), తెలంగాణ సారస్వత పరిషత్, జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన "తెలుగుజాతి వికాసం-జర్నలిజం పాత్ర" అనే అంశంపై జరిగిన సదస్సులో పలువురు వక్తలు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డిదేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బహుముఖలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అభినంద నీయమన్నారు. ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాలను తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. 

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతాపరెడ్డి లాంటి మహనీయుడు తెలంగాణ గడ్డపై పుట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. సమాజ హితం, ప్రజల మేలుకోసం ప్రతాపరెడ్డి పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. సురవరం ఆదర్శ జీవితంపై ప్రతి పౌరుడికి స్పూర్తి  కలిగించేందుకే తాను గ్రంధాన్ని రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ పాత్రికేయులు గోవిందరాజుల చక్రధర్ మాట్లాడుతూ పత్రికా సంపాదకుడిగా, పరిశోధకుడిగా, పండితుడిగా, కవిగా, రచయితగా ప్రతాపరెడ్డి సాగించిన అక్షరపోరాటం తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం అని ఆయన కొనియాడారు.

సీనియర్ పాత్రికేయులు ఆర్.దిలీప్ రెడ్డి ప్రసంగిస్తూ నిజాం నిరంకుశ పాలనలో తెలుగువారి అణచివేతను వ్యతిరేకిస్తూ, ప్రజలను చైతన్య పర్చడానికి తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు ప్రతాపరెడ్డి అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్ చెన్నయ్య, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ఉత్సవాల కమిటీ బాధ్యులు సురవరం కపిల్ తదితరులు పాల్గొన్నారు.
 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: