ఎందరో త్యాగాల ఫలితం...నేడు ప్రైవేటు కొరల్లోకి...?

విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం...

ఇది ఆంద్రుల హక్కు అన్నట్లు సాగాలి...రాజకీయ ఉనికి కోసం కాకూడదు

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.... ఈ నానుడి తో మనం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తో దెబ్బలాడి మనం విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసుకున్నాం. అపుడే నేను జన్మించా. నాకు ఉన్న పరిజ్ఞానం తో ఈ వ్యాసం రాస్తున్నాను.1966 నవంబర్ ఒకటో తేదీ.. విశాఖపట్నంలో ప్రదర్శన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ముగ్గురు విద్యార్థులు, మరో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఆ రోజు విశాఖతో పాటు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో మొత్తం 32 మంది చనిపోయారు. అర్ధశతాబ్దం కిందట 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' నినాదంతో చేపట్టిన ఉద్యమంలో జరిగిన ఘటనది. ఆ తర్వాత మూడేళ్లకు కేంద్ర ప్రభుత్వం కర్మాగారం ఏర్పాటును ప్రకటించింది. 1971లో శంకుస్థాపన చేస్తే.. రెండు దశాబ్దాల తర్వాత పూర్తిస్థాయి పని ప్రారంభించింది.

ఇప్పుడు కడప ఉక్కు కర్మాగారం కోసం కూడా మళ్లీ ఆ స్థాయి పోరాటం చేయాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు పిలుపునిస్తున్నాయి. కానీ.. ఈ పిలుపు వెనుక ఉక్కు పరిశ్రమ సాధించటం కన్నా రాజకీయ ప్రయోజనాల మీదే పార్టీలు దృష్టి కేంద్రీకరించాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘‘నాటి ఉద్యమంలో నిజాయితీ ఉంది. నేటి పిలుపు రాజకీయాలతో కూడుకున్నది’’ అని సీపీఎం సీనియర్ నాయకుడు సీహెచ్ నర్సింగరావు వ్యక్తంచేసిన అభిప్రాయం ఈ విమర్శలకు అద్దం పడుతోంది.

 

రాజకీయాలు ఎన్ని ఉన్నా.. ‘‘పోరాడనిదే ఆంధ్రులకు ఏ హక్కులూ రావు’’ అన్న నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి వ్యాఖ్యలనూ మరికొందరు పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. మరి విశాఖ ఉక్కు ఉద్యమం ఎలా సాగింది? అప్పటి రాజకీయాలేమిటి?

దేశంలో దిగజారిన ఆర్థిక పరిస్థితులు

1966 అంటే.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి నిండా ఇరవై ఏళ్లు కూడా కాలేదు. దాదాపు వంద కోట్ల మంది జనాభా ఉన్న దేశం పారిశ్రామికంగా వేగంగా పురోగతి సాధించటం, ఆర్థికాభివృద్ధి చారిత్రక అవసరం. మరోవైపు రాజకీయంగా కూడా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి. మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌నెహ్రూ 1964 మేలో చనిపోయారు. ఆయన తర్వాత ప్రధాని అయిన లాల్‌బహదూర్‌శాస్త్రి 1966 జనవరిలో ఆకస్మాత్తుగా చనిపోయారు. ఆ సందర్భంగా నెలకొన్న రాజకీయ సమీకరణల్లో ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఇందిర హయాంలో మొదట కొన్ని నెలల పాటు ''దేశంలో అశాంతి, అసంతృప్తి, ఆందోళనలు తీవ్రమయ్యాయి. వరుసగా రెండు సీజన్లు దారుణంగా ఉండటంతో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. పెరుగుతున్న ధరలు, ఆహార కొరతతో పాటు.. బిహార్ సహా పలు ప్రాంతాల్లో కరువు లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. బంద్‌లు, ఘెరావ్‌లు, సమ్మెలు, ప్రజల సామూహిక నిరసనలు, మూకుమ్మడి ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి'' అని 'ఇండియన్ పొలిటికల్ సిస్టమ్' రచయిత, అమెరికన్ స్కాలర్ నార్మన్ డి పామర్ పేర్కొన్నారు.

అదీగాక.. అది ఎన్నికల సంవత్సరం. 1967 సాధారణ ఎన్నికల కోసం అన్ని రాజకీయ వర్గాలూ సమాయత్తమవుతున్నాయి. జనంలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో.. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో అటు దిల్లీలోనూ ఇటు రాష్ట్రంలోనూ అంతర్గతంగా ఆధిపత్య పోరు కూడా సాగుతోంది.

మొదటి మూడు ప్రణాళికల్లో ఏపీకి ‘అన్యాయం’

ఇంకోవైపు.. ఆంధ్రప్రదేశ్ కూడా ఒడిదొడుకులతో సాగుతోంది. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత.. మద్రాసు నగరాన్ని ‘కోల్పోయామ’న్న అసంతృప్తి ప్రజల మనసునుంచి చెరిగిపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి అప్పటికి పదేళ్లే అయ్యాయి. పారిశ్రామిక ప్రగతితోనే ఆర్థిక ప్రగతి సాధ్యమని అప్పుడప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. కానీ మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో.. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని, ప్రభుత్వ పెట్టుబడులతో సరైన పరిశ్రమలు ఏవీ దక్కలేదని జనంలో అసంతృప్తి ఉంది. ఈ పరిస్థితుల్లో నాలుగో పంచవర్ష ప్రణాళికలో అదనంగా రెండు ఉక్కు కర్మాగారాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అప్పటికే ఉత్తర భారతదేశంలో రూర్కెలా(ఒడిశా), భిలాయ్(మధ్యప్రదేశ్), అసన్‌సోల్ (పశ్చిమబెంగాల్)లలో మూడు కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. భిలాయ్ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంది.

కొత్తగా స్థాపించే స్టీల్ ప్లాంట్లలో ఒకటి.. అంటే నాలుగోది బొకారో(బిహార్)లో నెలకొల్పాలని నిర్ణయించారు. బొకారో ప్రస్తుతం ఝార్ఖండ్‌లో ఉంది. ఐదో కర్మాగారాన్ని దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలన్నది ఆలోచన.స్టీల్ ప్లాంట్ మీద లాల్‌బహదూర్ హామీ... ఇందిర తిరస్కరణ

ఈ కన్సార్షియం తన నివేదికను పూర్తి చేసే సమయానికే.. ఆంధ్రప్రదేశ్ ప్రజల డిమాండ్లను చాటడానికి తెన్నేటి విశ్వనాథం సారథ్యంలో.. బలమైన అఖిలపక్ష కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది. మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ఐదేళ్లు జైలులో కూడా ఉన్న తెన్నేటి.. విశాఖ స్టీల్ ప్లాంటుకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని నిర్మించటంలో కీలక పాత్ర పోషించారు. అప్పటికే రెండు మూడేళ్ల నుంచి విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై చర్చ జరుగుతుండటంతో ప్రజల్లో దీనిపై అంచనాలు పెరిగాయి. ఒక భారీ కర్మాగారం ఏర్పాటైతే లభించే ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధి గురించిన ఆశలు మొలకెత్తాయి. కన్సార్షియం నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలోనే ఉక్కు కర్మాగారం స్థాపిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహజంగా భావించారు.

ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న లాల్‌బహదూర్‌ శాస్త్రి సైతం విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ప్లాంటు ఏర్పాటు గురించి ప్రకటన చేయటంలో జాప్యం.. ప్రజల్లో అపోహలకు, అసంతృప్తులకు, ఆందోళనలకు దారితీసింది. ఈ పరిణామాల మధ్య 1966 జనవరిలో లాల్‌బహదూర్‌శాస్త్రి ఆకస్మికంగా చనిపోయారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ప్లాంటు ఏర్పాటు విషయం ఎటూ కదలలేదు.

దీంతో.. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1965న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తీర్మానాన్ని సీఎం బ్రహ్మానందరెడ్డి స్వయంగా ప్రవేశపెట్టారు. ‘‘ఐదో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసే ప్రాంతం గురించిన ప్రకటనలో జాప్యం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెలకొన్న తీవ్ర ఆందోళనను అత్యవసరంగా గుర్తించాలి’’ అని అందులో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే.. నాలుగో పంచవర్ష ప్రణాళికలో భాగంగా.. ఐదో ఉక్కు కర్మాగారం నెలకొల్పటం సాధ్యం కాదని ఇందిరాగాంధీ సెప్టెంబరులో పేర్కొన్నారు. ఇందుకు కారణం.. దేశ ఆర్థిక పరిస్థితి ఒడిదొడుకుల్లో ఉండటం, నిధుల కొరత ఒకటైతే.. రాజకీయ అంశాలు మరొకటని పరిశీలకులు మాట. ఎన్నికల ఏడాదిలో ఒక స్టీల్ ప్లాంట్ కోసం పలు రాష్ట్రాలు పట్టుబడుతున్నపుడు ఒకచోట ఏర్పాటు చేస్తున్నట్లు నిర్దిష్టంగా ప్రకటిస్తే.. మిగతా చోట్ల అసంతృప్తి తలెత్తుతుందన్నది కాంగ్రెస్ నాయకత్వం ఆలోచనగానూ కొందరు చెబుతారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఉక్కు కర్మాగారాన్ని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి అయితే.. సేలంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చిందని కూడా అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆందోళన తీవ్రమైంది. ఉక్కు కర్మాగారాన్ని తమిళనాడుకో, కర్ణాటకకో తరలిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోసారి అన్యాయానికి గురవుతున్నామన్న ఆవేదన తలెత్తింది. ఈ క్రమంలో నీలం సంజీవరెడ్డిని ఉక్కు శాఖ నుంచి పర్యాటక, విమానయాన శాఖకు బదిలీ చేశారు ఇందిర. ఉక్కు శాఖ మంత్రిగా టి.ఎన్.సింగ్ నియమితులయ్యారు.

కాంగ్రెస్‌లో నీలం - కాసుఆధిపత్య పోరు

'స్టీల్ ప్లాంట్ ఉద్యమం మూలాలు కూడా కాంగ్రెస్ ముఠాతత్వంలో ఉన్నాయి. ఆ సమయంలో కేంద్రంలో ఉక్కుశాఖ మంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డిని ఇరుకున పెట్టటం లక్ష్యంగా ఈ ఉద్యమం మొదలైంది'' అని ఎస్.డి.జాత్కర్ అభిప్రాయపడ్డారు. అందుకు పూర్వరంగంలో నీలం సంజీవరెడ్డి 1963 డిసెంబర్‌లో రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. తన సన్నిహితుడైన కె.బ్రహ్మానందరెడ్డిని ఆర్థికమంత్రిగా నియమించుకున్నారు. కానీ.. కర్నూలు బస్ ట్రాన్స్‌పోర్ట్ జాతీయీకరణ కేసులో నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పటంతో ఆయన సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో 1964 ఫిబ్రవరిలో బ్రహ్మానందరెడ్డి సీఎం అయ్యారు. 1964 మే నెలలో జవహర్‌లాల్‌నెహ్రూ చనిపోయారు. ఆయన వారసుడిగా లాల్‌బహదూర్‌శాస్త్రిని ఎంపిక చేసిన బృందంలో.. కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడైన నీలం సంజీవరెడ్డి కీలకంగా ఉన్నారు. అలా లాల్‌బహదూర్ ప్రభుత్వంలో సంజీవరెడ్డి ఉక్కుశాఖ మంత్రి అయ్యారు.

అయితే.. 1966 జనవరిలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కావటంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కీలక భూమిక పోషించారు. ఈ క్రమంలో సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు మొదలైందని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని జాత్కర్ తెలిపారు. కాసు, నీలం వర్గం పరస్పరం పైచేయి సాధించటానికి ఎత్తులు పై ఎత్తులతో రాజకీయాలు సాగేవని.. అప్పుడు కేంద్రంలో ఉక్కుశాఖ మంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డికి రాష్ట్రంలో పార్టీ మీద ఉన్న పట్టును దెబ్బతీసేందుకు.. విశాఖ ఉక్కుకు ఆయనే అడ్డమనే అభిప్రాయం కలిగించటానికి ఈ ఉద్యమాన్ని ప్రేరేపించారన్న ప్రచారం జరిగిందని జాత్కర్ పేర్కొన్నారు. ''ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి స్టీల్ ప్లాంట్ అంశంలో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా అశాంతికి ఆజ్యం పోస్తున్నారని ఉక్కుశాఖ మంత్రి సంజీవరెడ్డి ఆరోపించారు. తనను ఇబ్బంది పెట్టటం, అపకీర్తి పాలు చేయటం లక్ష్యంగా ఈ ఉద్యమాన్ని ప్రేరేపిస్తున్నారన్నది ఆయన ఉద్దేశం. బ్రహ్మానందరెడ్డి శిబిరం నాయకులు.. ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ ప్లాంట్ నెలకొల్పటంలో సంజీవరెడ్డి విఫలమయ్యారని బాహాటంగానే విమర్శించారు'' అని ప్రముఖ రాజకీయశాస్త్ర నిపుణుడు కె.సి.సూరి ఒక వ్యాసంలో పేర్కొన్నారు.

నీలం సంజీవరెడ్డి విశాఖపట్నం వచ్చినపుడు ఉక్కు కర్మాగారం కోసం తను చేసిన కృషి గురించి.. విశాఖను ఎంపిక చేసిన నిపుణుల కమిటీని నియమించటంలో తను ఎలా పనిచేసిందీ వివరించారు. ''కొన్ని స్వార్థ శక్తులు రాజకీయ కారణాలతో ప్రజలను తప్పుదోవ పట్టించటానికి ప్రయత్నిస్తున్నాయి'' అని ఆవేదన వ్యక్తం చేశారు.ఆమరణ నిరాహార దీక్ష - పోలీసు కాల్పులు

1966 అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉద్యమం బలపడింది. 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' నినాదంతో ప్రజలు ఉద్యమించారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి.అమృతరావు 1966 అక్టోబరు 15న విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కొద్ది రోజులకే కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చి ముందు వరుసలో నిలుచున్నారు. వారికి రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రారంభించారు. దశల వారీగా తరగతుల బహిష్కరణ, బంద్‌లు, హర్తాళ్లు, సభలు, సమ్మెలు, నిరాహార దీక్షలు సాగాయి. అన్ని రాజకీయ పక్షాలతో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో తెన్నేటి విశ్వనాథం, యం.వి.భద్రం, రావిశాస్త్రి తదితరులు ప్రసంగించారు. 1966 నవంబర్ 1వ తేదీన విశాఖపట్నంలో విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమవటంతో.. పోలీసులు కాల్పులు జరిపారు. తొమ్మిదేళ్ల బాలుడు కె.బాబూరావు సహా తొమ్మిది మంది చనిపోయారు. వారిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. దీంతో ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చింది. ‘‘ఉద్యమం హింసాత్మకంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం పెద్ద ఎత్తున జరిగింది. కొత్తగా ఏర్పడిన దక్షిణ మధ్య రైల్వే డివిజన్ ప్రజాగ్రహానికి ఎక్కువగా గురైనట్లు కనిపించింది. రైల్వే స్టేషన్లు ఎక్కువగా ఆందోళనకారుల లక్ష్యమయ్యాయి. రైల్వేకి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది’’ అని ఎస్.డి.జాత్కర్ ఒక వ్యాసంలో పేర్కొన్నారు.

విజయవాడలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఏలూరు కాలువలో పడేశారు. ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల్లో.. తగరపువలసలో ఒకరు, అదిలాబాద్‌లో ఒకరు, విజయవాడలో ఐదుగురు, విజయనగరంలో ఇద్దరు, కాకినాడలో ఒకరు, వరంగల్‌లో ఒకరు, సీలేరులో ఒకరు, గుంటూరులో ఐదుగురు చనిపోయారు. మొత్తం మీద విశాఖతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు.

✍️ రచయిత-టీ.వీ.గోవిందరావు

న్యాయవాది-సీనియర్ జర్నలిస్ట్

సెల్ నెం-98850-01925

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: