లక్ష్య సాధనలో ఆశించిన విజయ తీరాలకు.. 

 సృజనశీలి జర్నలిస్ట్ ఎం.డి అబ్దుల్

''నువ్వు విజయం సాధించాలి..  అని  అనుకోవడమే విజయానికి  తొలి మెట్టు. ఎలా సాధించాలి?  అని ఆలోచించిన నాడు నువ్వు వేసింది రెండో మెట్టు. ఈ ఒడి దుడుకుల జీవన ప్రయాణంలో అలుపెరగక.. వెనుదిరగక.. ఒక్కో మెట్టు ఎక్కుతూ పోతే ఎవరితరం నిన్ను ఆపడం?  ఆ విజయ లక్ష్మి నీ కైవసం తథ్యం''  అన్న మాటలు  సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి అబ్దుల్ కు అక్షరాలా వర్తిస్తాయి.  ప్రస్తుతం  ఆంధ్రభూమి దినపత్రికలో చీఫ్ సబ్ ఎడిటర్ గా  ఉన్నత ప్రమాణాలతో విధులు నిర్వహిస్తున్న అబ్దుల్  అతి నిరుపేద కుటుంబంలో పుట్టి లక్ష్య సాధనలో ఆశించిన విజయ తీరాలకు  ఆటుపోట్లను ఎదుర్కొంటూ  ధైర్యంగా ముందుకు సాగిన తీరు  ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది.. కలత పడేలా చేస్తుంది. 

 


కన్నీళ్లు  సైతం పెట్టిస్తుంది.  అది అబ్దుల్ జీవన ప్రయాణం.  అతడి జీవితం తెలిసిన  ప్రతి ఒక్కరూ  ఆలోచనలో మునిగిపోతారు. దినసరి కూలీగా  ఉన్న తన తండ్రి వెంట చిన్ననాడే  అడుగులు వేసి బతుకు విలువ తెలుసుకుని  సంసార చదరంగంలో కుటుంబానికి ఆసరాగా  నిలిచిన వైనం..  తను అనుకున్నది సాధించే క్రమంలో  చేరుకున్న లక్ష్యం ప్రతీ ఒక్కరికీ,  ముఖ్యంగా  యువతకు  స్ఫూర్తిదాయకంగా  నిలుస్తుంది. తన ఇంటా వంటా లేని కొత్త రంగమైన పత్రికా  రంగాన్ని ఎంచుకొని  రాణించాలంటే మాటలు కాదు.. చేతలు కావాలి!  అలాంటి చేతల్ని తన  ప్రతిభతో అందరూ మెచ్చేలా 'వాహ్.. అబ్దుల్'  అనిపించుకునేలా చేసింది.  'విజయ ఫలం కాదు ఒక  ప్రయాణం నీ దృక్పథమే నిన్ను విజేతగా నిలిపేది. ఎవరో వచ్చి విజయాల్ని దోసిట్లో  పోయరు.. మనకి మనమే  స్వజయ సారధులై విజేతలుగా నిలవాలి' అని వ్యక్తిత్వ వికాస నిపుణులు అన్నమాటలకు మార్గదర్శకంగా కనిపించే  సృజనశీలి అబ్దుల్. 

ఎం.డి అబ్దుల్  అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా, నేటి తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మహ్మద్ హుస్సేన్, రూకీజాబీ దంపతులకు 1970 ఫిబ్రవరి 6న జన్మించారు.  ప్రాథమికోన్నత పాఠశాల, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలేరులో ప్రాథమిక విద్యను అభ్యసించి,  ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆలేరులో ఇంటర్మీడియట్, సికింద్రాబాద్ లోని  సర్ధార్ పటేల్ కాలేజీలో బీఎస్సీ డిగ్రీ,  అటు తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధమైన  డి.ఎన్.ఫ్ కాలేజీలో జర్నలిజంలో డిప్లొమా (పీజీడీసీజే) పట్టాను పొందారు. 1991 నుంచి 1994 వరకూ  గ్రామీణ ప్రాంత విలేకరిగా  కృష్ణాపత్రిక, ఆంధ్రభూమి దినపత్రికలో ఆలేరు, రాజాపేట మండలాల విలేకరిగా  వార్తలను అందిస్తూ జర్నలిజంలోకి  అడుగుపెట్టారు. పాత్రికేయునిగా తన పాత్రను సమర్ధవంతంగా  పోషిస్తూ సినిమా, సాహిత్యం, కళ, సాంస్కృతిక, మహిళ, యువత, పిల్లల పేజీల్లో రాజీలేని తేజోవంతమైన విశ్లేషణాత్మక  రచనలు చేస్తున్న  అబ్దుల్ ను గుర్తించిన ఆంధ్రభూమి యాజమాన్యం 1995 జనవరిలో  ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో ఉప సంపాదకునిగా  అవకాశాన్ని కల్పించింది. 

ఆ  సమయంలోనే ఆర్టీసీతో పాటు, ఆరోగ్య శాఖలో  హెల్త్  అసిస్టెంట్ గా ప్రభుత్వ ఉద్యోగాలు లభించినా, జర్నలిజంపై ఉన్న మక్కువతో అటుగా  ప్రయాణాన్ని సాగించాలనే  ధృఢ సంకల్పంతో వాటిని చేజేతులారా వదులుకున్నారు.  ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న తరుణంలోనే  కథలు రాయడం, రచనలు చేయడం  అలవాటు చేసుకున్నారు.  ఆ  అలవాటుతోనే 1984-85లో ఆకాశవాణి, దూరదర్శన్ లకు పరిచయమయ్యారు  ఆకాశవాణిలో  ప్రసారమైన  'ఫలించిన స్వప్నం' తొలి  కథానిక,  సైనిక సమాచార్ లో ప్రచురితమైన 'పగ తీరింది'  కథ అబ్దుల్ కు విశేష ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టాయి.  ఆకాశవాణిలో విజ్ఞాన విషయాలు,  కథానికలు, వివిధ అంశాలపై సుదీర్ఘ   ప్రసంగాలు చేశారు,  హైద్రాబాద్ -ఎ,  హైద్రాబాద్ -బి ద్వారా లెక్కకు మించి చేసిన  ప్రసంగాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. దూరదర్శన్ లో ప్రసారమైన  'చారిత్రాత్మక ప్రదేశము  కొలనుపాక'  అనే  డాక్యుమెంటరీ  అబ్దుల్ కు మంచి పేరును తెచ్చిపెట్టింది. అదే సమయంలో ఎంతో చారిత్రక ప్రాముఖ్యం కలిగిన ప్రాంతాలైన  కొలనుపాక  జైనాలయం,  రాజాపేట కోటల గురించి అందించిన ప్రత్యేక కథనాలు,  ఒగ్గు కథకులు,  చిందు భాగవతం కళాకారుల జీవన స్థితి గతులపై  సమగ్ర  సమాచారాన్ని పరిశోధించి అందించిన రచనలు పాఠకులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా  ఆంధ్రభూమిలో  ప్రచురితమైన 'సంస్థానాధీశుల కోట   రాజాపేట' అనే రచన ఆ ప్రాంత ఔన్నత్యాన్ని, ఆ కోటకు ఉన్న చారిత్రక ప్రాముఖ్యాన్ని తొలిసారిగా  కళ్లకు కట్టింది. ఆ కోటలోని రాజుల పోరాట పటిమను తెలియజేస్తూ వారి స్థావరాలను, వారి జీవన విధానాన్ని విపులంగా పరిశోధించి అందించిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కదిలించింది. అబ్దుల్ ప్రతిభను తేటతెల్లం చేసింది.

 


జర్నలిస్ట్ గా తన కెరీర్ కు పునాది వేసిన  ఆంధ్రభూమి సినిమా అనుబంధం 'వెన్నెల' లో గడిచిన రెండున్నర దశాబ్దాలుగా  చిత్ర సమీక్షలు, సినిమా రంగంపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేస్తున్నారు. ఎంతో ప్రాచుర్యం కలిగిన  ఆంధ్రభూమి 'వెన్నెల'  సినిమా అనుబంధం  ఇన్ చార్జిగా,  చిత్ర విశ్లేషకుడిగా అందించిన సేవలు మరచిపోలేనివి.  ఆ విశ్లేషణలకు గుర్తింపుగానే  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర  ప్రభుత్వం ఉత్తమ సినీ విమర్శకుడిగా 2004లో నంది అవార్డు ను ప్రకటించింది. బుధవారం 26, అక్టోబర్ 2005 లో హైద్రాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ఎంతో కన్నుల పండువగా జరిగిన ఈ  '2004 చలన చిత్ర నంది బహుమతుల ప్రదానోత్సవం'లో  అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా  ఉత్తమ సినీ విమర్శకుడిగా  అబ్దుల్  'నంది'  అవార్డును అందుకున్నారు. 'ఈ నంది అవార్డు నా జీవిత లక్ష్యం'  అని ఆ సమయంలో ముఖ్యమంత్రి  వై.ఎస్. రాజశేఖర రెడ్డి,  ప్రఖ్యాత దర్శకుడు డా. దాసరి నారాయణరావుతో  అబ్దుల్ చెప్పడం గమనార్హం. ముఖ్యంగా  'దక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి'  సంస్థలకు తమ 75 ఏళ్ల  చరిత్రలో వచ్చిన తొలి  నంది అవార్డు అబ్దుల్ దే కావడం విశేషం.  తెలంగాణ ప్రాంతం నుంచి నంది అవార్డు అందుకున్న జర్నలిస్ట్ గా  అబ్దుల్  పేరు దశ  దిశలా  మరు మోగిపోయింది. నంది అవార్డును అందుకుని ఆలేరు పట్టణానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టిన  అబ్దుల్ ను ఆలేరు గ్రామ పంచాయతీ 2005 నవంబర్ 24న పౌర సన్మానం చేసి తమ అభిమానాన్ని చాటుకుంది. ప్రఖ్యాత ప్రభుత్వ నంది అవార్డుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలేరు పేరును మారుమోగేలా చేసిన  అబ్దుల్ ను అందరూ కొనియాడారు.

ఆలేరు చరిత్రలో రెండు సార్లు మాత్రమే పౌర సన్మానం జరిగింది.  ఒకటి.. తొలి సారిగా  ఆలేరు ఎమ్మెల్యే గా శాసన సభకు  ఎన్నికైన  పొన్నారెడ్డికి  అయితే,  రెండోది   జర్నలిస్ట్  అబ్దుల్ కు ఈ అరుదైన అవకాశం దక్కడం విశేషం.  జర్నలిజంలో అడుగు పెట్టిన నాటి నుండి  అబ్దుల్ కు అవార్డుల పరంపర కొనసాగుతూనే వచ్చింది. 1999 నవంబర్ 9న బెస్ట్ జర్నలిస్ట్ గా  హైదరాబాద్ కు చెందిన జ్యోత్స్నా కళా పీఠం నగదు పురస్కారంతో అప్పటి మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి చేతులమీదుగా  అవార్డును  అందజేసింది.  త్యాగరాయ గానసభలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పుష్పలీల,  ప్రఖ్యాత కవి డా. ఎన్. గోపి అబ్దుల్ ను అభినందించారు. ఈ అవార్డుతో ప్రారంభమైన  అతడి  జైత్రయాత్ర నిర్విరామంగా కొనసాగుతూనే వచ్చింది. ఏప్రిల్ 25, 2014లో సూర్య చంద్ర ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఎక్స్ లెన్సీ అవార్డు, ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు  జన్మదిన వేడుకల సందర్బంగా  సెప్టెంబర్ 3, 2014లో హైద్రాబాద్ లోని రవీంద్రభారతి లో శృతిలయ ఆర్ట్స్ అండ్ షి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన 2014  అక్కినేని మీడియా అవార్డును నాటి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య చేతుల మీదుగా అందుకున్నారు. 2005లో సికింద్రాబాద్ లోని హరి హర కళాభావన్ లో జరిగిన కార్యక్రమంలో  ప్రఖ్యాత హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య పేరు మీద ఇచ్చే 'రేలంగి' అవార్డుతో పాటు, 8 సెప్టెంబర్ 2007న తేజ ఆర్ట్ క్రియేషన్స్ బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు,   ఫిలింఛాంబర్ లో  జరిగిన కార్యక్రమంలో  అప్పటి రవాణా శాఖ మంత్రి  మహేందర్ రెడ్డి చేతుల మీదుగా  తెలంగాణ ప్రొడ్యూసర్ గిల్డ్ అవార్డు,  2016 సంవత్సారానికి గాను ఉత్తమ జర్నలిస్ట్ గా  మాజీ వైస్ ఛాన్స్ లర్ ఎల్లూరి శివారెడ్డి చేతుల మీదుగా  ఆరాధన పురస్కారం అందుకున్న అబ్దుల్,   మాతృ భాషా దినోత్సవం సందర్బంగా అస్తిత్వం అవార్డుతో పాటు,  2018 సంవత్చరానికిగాను డిసెంబర్ 1 నుంచి 5 వరకు  హైద్రాబాద్ లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో కన్నుల పండువగా జరిగిన ప్రతిష్టాత్మక  ఇండీవుడ్ నేషనల్ మీడియా ఎక్స్ లెన్సీ అవార్డును అందుకున్నారు.

ఇలా .. సినీ జర్నలిజంలో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్న అబ్దుల్  సమాజ సేవలోనూ పాలు పంచుకున్నారు. సేవా దృక్పథంతో ముందుకు సాగే సంకల్పంతో  సుమాంజలి అనే స్వచ్ఛంద సంస్థ ను స్థాపించి తద్వారా తనవంతు సేవలను విస్తృతం చేశారు.  సుమాంజలి వ్యవస్థాపక  అధ్యక్షుడిగా  కళా , సాహిత్య, సాంఘీక, క్రీడా, సేవా  రంగాల్లో తనదైన శైలిలో ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రఖ్యాత సినీ నటులు నట ప్రపూర్ణ టి.ఎల్. కాంతారావు, డా. ఎం. ప్రభాకర్ రెడ్డితో పాటు హాస్య నటులు సారధిని నాడు ఆలేరుకు రప్పించి ఘనంగా సత్కరించారు. ఆ ప్రఖ్యాత నటులను తన ఆలేరు ప్రజలకు పరిచయం చేసిన ఘనత దక్కించుకున్నారు. ఇప్పుడు తన లక్ష్యం.. ఓ పుస్తకం వైపు.. తన సినీ విశ్లేషణలను పుస్తక రూపంలో చూడాలన్నదే తపన.  ఆ దిశగా  ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. ఆ 'కల' ఎంతో దూరం లేదు. అతి త్వరలోనే పుస్తక రూపంలో మన ముందుకు వస్తాడని ఆశిద్దాం.. రావాలని కోరుకుందాం

అబ్దుల్ విజయాల  జైత్ర యాత్ర సాగిందిలా..!  

- 1999  బెస్ట్ జర్నలిస్ట్ గా  జ్యోత్స్నా కళా పీఠం నగదు  పురస్కారం 

- 2004 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు 

- 2005  'రేలంగి' అవార్డు

- 2007  తేజ ఆర్ట్ క్రియేషన్స్ బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు, 

- 2014  సూర్య చంద్ర ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఎక్స్ లెన్సీ అవార్డు

- 2014  శృతిలయ  అక్కినేని మీడియా అవార్డు

-2015  తెలంగాణ ప్రొడ్యూసర్ గిల్డ్ అవార్డు

 -2016  ఉత్తమ జర్నలిస్ట్ గా  ఆరాధన పురస్కారం 

-2017 అస్తిత్వం అవార్డు

-2018  ప్రతిష్టాత్మక  ఇండీవుడ్ నేషనల్ మీడియా ఎక్స్ లెన్సీ అవార్డు

-2021  తునికి ఫౌండేషన్ పురస్కారం 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: