విజయాల రారాజు కడెంపల్లి శ్రీరాములు గౌడ్

 యువతకు స్ఫూర్తి దాయకం 

 కసి, పట్టుదలతో అడుగులు ముందుకు.. 

(ఎం.డి. సమీర్ - జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్)

అవగాహన, ఆసక్తితో పాటు తను అనుకున్న తీరాన్ని చేరుకోవాలనే తపన, కసి, పట్టుదల మనసులో బలంగా నాటుకుపోయి ఉంటే 'విజయం' అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుందనేది మహానుభావుల మాట.  ఇది ఎందరో పెద్దలు చెప్పిన మాటే అయినా..  అది మనకు ఓ చద్ది మూటలాంటిది. ఆ మూటలోనే మనం.. మన భవిష్యత్తుని వెతుక్కుంటాం.  మన జీవన ప్రయాణాన్ని సాగిస్తాం. అలా సాగిన ఒడిదుడుకుల ప్రయాణంలో మన గమ్యం ఎటువైపునకు దారి తీస్తుందో.. ఎవరికీ అంతుపట్టదు. లెక్కకు మించి ఆలోచనలు, అంతకుమించి ఏదో అయిపోవాలన్న ఆరాటం.. ఎక్కడికో చేరాలన్న కసి, ఊహకందని గమ్యంవైపునకు మనల్ని నిరంతరం లాక్కెళుతూనే ఉంటుంది. అదే మరి జీవితమంటే!  ఆ జీవితంలో చాలామంది తమ 'గోల్' ఏంటో.. తమ అడుగులు ఎటువైపునకు వేయాలో తెలియకుండానే ప్రయాణాన్ని సాగిస్తుంటారు. ఆ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు.. ఊహించకుండానే బోల్తాపడుతుంటారు. 

కానీ, కొందరే తమ గమ్యం ఏమిటో?  ఏం సాధించాలో, ఎక్కడికి చేరుకోవాలో ఆలోచిస్తూ  ఆచితూచి అడుగులు వేస్తారు. అలా వేసే ప్రతి అడుగు విజయానికి చేరువలోనే ఉంటుంది. ఆ  అడుగుల్లోనే తమ లక్ష్యం కళ్లెదుట కనిపిస్తుంది. ఒక నిర్దిష్ట లక్ష్యం అంటూ ఉంటే మనిషి సాధించలేనిదేదీ ఉండదు అనే దానికి చక్కటి ఉదాహారణ కడెంపల్లి శ్రీరాములు గౌడ్. 'మనం వేసే ప్రతి అడుగులో కసి, పట్టుదల ఉంటే చేరుకోవాలనుకునే గమ్యం పెద్ద దూరం ఏం ఉండదని అంటారు' గౌడ్. అనడమే కాదు.. అక్షరాలా తన గమ్యాన్ని చేరుకొని చూపించారుకూడా.

అతి సాదా సీదాగా కనిపించే కడెంపల్లి శ్రీరాములు గౌడ్ లో విభిన్న వ్యక్తిత్వాలు గోచరిస్తాయి. ఎప్పుడు నవ్వుతూ కనిపించే అతడి మస్తిష్కమ్ లో  జీవనపోరాటమే బుసలుకొడుతుంది. సమాజానికి  ఒక్కొక్కరూ తమకు తోచిన విధంగా మేలు చేస్తుంటారు. తమదైన దారిలో పయనిస్తూ తమ సేవలను విస్తృత పరుస్తుంటారు.  అందులో ఎన్నో రకాల సేవలుంటాయి.  కొందరు గుర్తింపు కోసం తపిస్తూ సేవలందిస్తుంటే.. మరికొంతమంది ఎలాంటి ఫలితం కోరుకోకుండా తమవంతు బాధ్యతగా సమాజహితాన్ని కోరుతారు.  ఇంకోరకం వ్యక్తులు  సమాజ శ్రేయస్సులో భాగంగా  ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ సమాజాభివృద్ధికి బాటలు వేస్తూ దేశ అభ్యున్నతికి కీలక మానవ వనరులను తయారు చేస్తుంటారు.  అందులో భాగంగానే సమాజాభివృద్ధికి విభిన్న మార్గాన్ని అవలంభిస్తున్న అరుదైన వ్యక్తుల్లో  కడెంపల్లి శ్రీరాములు గౌడ్ ఒకరు. అవగాహన ఉంటే చైతన్యం శాకోపశాఖలై విరాజిల్లుతుంది.  ఆ చైతన్యమే అభివృద్దివైపునకు అడుగులు పడేలా చేస్తుంది. దానినే నమ్మి.. ఆ బాటనే ఎంచుకుని ఆచరణలో పెట్టారు కడెంపల్లి శ్రీరాములు గౌడ్. దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటీవ్ (మీడియా జర్నలిస్ట్) గా  వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ, ఆ వృత్తిలోనే తన సేవలను కొనసాగిస్తూ  సంతృప్తి పడుతున్నారు. 

1993లో ఉద్యోగంలో చేరిన గౌడ్ నేటికీ మొక్కవోని ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు.  ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసి ఉద్యోగం చేస్తూ తన పరిధిలో ప్రజలకు అవసరమైన అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆ పథకాలు  లబ్ధిదారులకు అందేలా అవగాహన కల్పించడం తన బాధ్యతగా స్వీకరించారు.  తన వృత్తి ధర్మంలో భాగంగానే వివిధ వర్గాల ప్రజలకు , సమాజానికి సేవ చేశారు.  తను అందిస్తున్న కృషికి, చేస్తున్న పనికి అంతిమంగా ఎన్నో సత్ఫాలితాలు చవిచూశారు. ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ, తరిగిపోతున్న జలాల పరిరక్షణకోసం తీసుకోవలసిన చర్యలు, ఇంకుడు గుంతల ప్రాధాన్యతతోపాటు, సమాజంలో నిరాదరణకు గురవుతున్న మహిళలను చైతన్య పరిచేందుకు తన కృషిని విస్తృత పరిచారు. ఈ కృషిలో ఎన్ని ఆటుపోట్లు , ఒడిదుడుకులు ఎదురైనా ప్రజల్లో చైతన్యం కల్పించడంపైనే దృష్టి సారించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న అనేక పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో  సఫలీకృతులయ్యారు. సంస్కృతీ, సాంప్రదాయాలను, స్థానిక ఆచార వ్యవహారాలను , మరుగున పడిన కళా రూపాలను , కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నానికి పూనుకున్నారు. పనిలో పనిగా ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు.

తెలంగాణాలో ఉన్న చెరువుల పరిస్థితిని, నీటి ఎద్దడితో వ్యవసాయం ఎదుర్కొంటున్న ఇబ్బందులను పాలకుల దృష్టికి తీసుకువచ్చి సమస్యను పరిష్కరించేలా తనవంతు ప్రయత్నాన్ని చేసి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. పల్లెల్లో వ్యవసాయం ఎదుర్కొంటున్న కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు. దాని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 2015-17 కాలంలో 'మిషన్ కాకతీయ మీడియా' అవార్డును  శ్రీరాములు గౌడ్ కు అందజేసి గౌరవించుకుంది. పండుగల గొప్పతనాన్ని, ప్రాంతాల విశిష్టతను  తెలియజేస్తూ చేసిన కార్యక్రమాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ప్లాగ్ షిప్ ప్రోగ్రామ్ లకు ప్రాణం పోసి సమాజ మార్పునకు తనవంతు కృషిచేశారు.

భూకంపం వచ్చినప్పుడు త్వరితగతిన స్పందించి ప్రపంచానికి వార్తను అందించి అప్రమత్తం చేశారు. అలాగే సమ్మక్క - సారాలమ్మ వంటి జాతరల వెనుక చరిత్రను తవ్వితీసి వాటి గొప్పతనాన్ని చాటిచెప్పారు. ఇలా తన పరిధిలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని అటు ప్రభుతానికి, ఇటు ప్రజలకు ఎనలేని ప్రయోజనం కల్పించారు. తెలంగాణాలో బతుకమ్మ వంటి సాంప్రదాయాలకు గొప్ప ప్రచారాన్ని కల్పించారు.  బయో డైవర్సిటీ వంటి ఇంటర్నేషనల్ , లోక్ సభ ఎన్నికలు, జనరల్ ఎన్నికల్లో తనవంతు పాత్రని పోషించారు. స్పూర్తిదాతలుగా  సమాజానికి సేవలందించిన అనేకమంది గొప్ప వ్యక్తుల ఇంటర్వ్యూలను ప్రసారం చేసి ప్రాచుర్యం కలిపించారు.  ప్రధానంగా వ్యవసాయం, కళలపై చేసిన సేవలు  అనేక వర్గాల ప్రశంసలను అందుకున్నాయి. ఆ సేవలే అనేక అవార్డులు దక్కేలా చేశాయి. 

కడెంపల్లి శ్రీరాములు గౌడ్ ది  గ్రామీణ నేపథ్యంతో తొణికిసలాడే వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు దేవయ్య-కిష్టమ్మ. ఆ ఆణిముత్యాలైన దంపతులకు 1963, మార్చి 10న జన్మించారు. తమ  నలుగురు కుమారుల్లో  శ్రీరాములు రెండోవాడు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు గ్రామం ఆయనది. తన తండ్రి నేర్పిన క్రమశిక్షణ, తల్లి కిష్టమ్మ చూపిన మార్గం, వారి మానవత్వపు విలువలు తనను సమాజసేవకు పురికొల్పాయి అంటారు గౌడ్.  ఆయన ప్రాథమిక విద్య 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జడ్చర్లలో , ఇంటర్మీడియట్ - పీజీ హైదరాబాద్ లోసాగింది.

వ్యవసాయంలో తల్లిదండ్రులకు తోడ్పాటు అందిస్తూనే ఎం.ఏ వరకు చదివారు. అంతేకాదు.. జర్నలిజంలో ఎంసీజే పట్టాను పొందిన ఘనత ఆయన సొంతం. 2018-19లో దూరదర్శన్ లో  ప్రసారమైన 'కాంతిరేఖ'  శ్రీ రాములుకు  మంచి పేరుని తెచ్చిపెట్టింది. దాదాపు 40 ఎపిసోడ్సుగా ప్రసారమైన ఈ కార్యక్రమం మహిళా సమస్యలపై సాగి ఆద్యంతం రక్తికట్టించింది. స్త్రీలలో అవగాహన కలిగించడమే గాక, వారిని చైతన్యపరిచింది.  1993-సెప్టెంబర్ 30న సంభవించిన లాతూర్ భూకంపం మనమెరిగిందే. ఎందరో జీవితాలు మట్టిలో కలిసిపోయిన వైనాన్ని 20 రోజులపాటు అక్కడినుంచే అందిస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీరాములు. ఇది తన జీవితంలో చూసిన అత్యంత దురదృష్టకరమైన పెను విషాదం అని శ్రీరాములు కంటతడిపెట్టారు. 2019-20 లో ప్రసారం అయిన  'సైబర్ క్రైమ్ జాగ్రత్త' 30 ఎపిసోడ్సు అందరిలో అవగాహన కలిగించింది. 

కరోనా కష్టాల్లో కూడా  ప్రజలకు అండగా  మేమున్నామంటూ 45 రోజులపాటు ప్రత్యక్ష ప్రసారాలను ప్రసారం చేసి  ప్రజల్లో కరోనా పై అవగాహన కలిగించారు. అలాగే  'ప్లీజ్.. నన్ను వదిలేయండి' అంటూ ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని అందించి అందరి మన్ననలను అందుకున్నారు. ప్రకృతిని మనం రక్షిస్తే.. అది మనల్ని రక్షిస్తుంది అనే కాన్సెప్ట్ తో సాగి,  వాతావరణం ఎలా నాశనమవుతుందో కళ్ళకు కట్టింది. ప్లాస్టిక్ వాడకంపై జాగ్రత్తలు పాటించేలా అవగాహన కలిగిస్తూ 2020లో ప్రసారమైన ఈ  డాక్యుమెంటరీ ప్రతీ ఒక్కరినీ కదిలించి, జాగ్రత్త పడేలా చేసింది. ఓజోన్ పోరపై టైం ఫర్ నేచర్ కూడా ఆసక్తి దాయకంగా సాగింది . మన మాట, మన పాట అబ్బురపరిచింది.   2017లో నీటి పొదుపుపై ఓ డాక్యుమెంటరీ, వై. ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో రైతు ఆత్మహత్యలపై అవగాహన కలిగిస్తూ  'రైతు భరోసా', 2019లో ఆదర్శ రైతు పద్మశ్రీ చింతల వెంకట్ రెడ్డి జీవన నేపథ్యంతో 'మట్టిలో మాణిక్యం' డాక్యుమెంటరీతో పాటు,  విజయ పథంలో నా ప్రయాణం పాలీ హౌస్  డాక్యుమెంటరీల ద్వారా చేపల పెంపకంపై ఆధునిక పద్దతులను వివరించారు. 2018-19 ఆటా-పాటా  ద్వారా ప్రసారమైన టాలెంట్ షో లో ఎందరో తెలంగాణ కళాకారులను వెలుగులోకి తెచ్చారు. మహామహులైన ఏపీజే అబ్దుల్ కలాం, డా. సర్వేపల్లి తదితరులపై స్పెషల్ కార్యక్రమాలను ప్రసారం చేసిన శ్రీరాములు గౌడ్ తెలంగాణ మహిళా గవర్నర్ సౌందర రాజన్ ను జనవరి 1న ఇంటర్వ్యూ చేసి ప్రశంశలందుకున్నారు.

ఇలా ఎన్నో ఎన్నెన్నో మంచి కార్యక్రమాలను అందించిన శ్రీరాములు గౌడ్  ఫిబ్రవరి 11, 1993లో వివాహం చేసుకున్నారు. తన సహధర్మ చారిణి బి. కవిత (ఎంఎస్సీ బీఈడీ),  వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు  కె. సాయి భార్గవ్ (ఎం.ఎస్ యూఎస్ ), కూతురు సాయి అక్షర (ఎం.ఎస్ ఐ.టి  అట్లాంటా),   కూతురుకు వివాహం అయింది. అల్లుడు వి.కిరిటీ గౌడ్  (ఎం.ఎస్ ఐ.టి  అట్లాంటా). ఇదీ  శ్రీరాములు గౌడ్ జీవన నేపథ్యం.  అతడి కృషికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు సత్కారాలను అందజేశాయి. ఈ అవార్డులకు లెక్కేలేదు. ఎన్నో అతడిని వరించాయి.  తాజాగా 'మన ఎం.ఎల్. ఏ' అంటూ  సీరీస్ మొదలు పెట్టారు. ఈ సీరిస్ లో భాగంగా  రాష్ట్రంలోని 118 మంది శాసన సభ్యుల  అంతరంగం, వారు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నమిది. అన్నింటా విజయాలనే చవి చూస్తున్న  శ్రీరాములు గౌడ్ మరిన్ని విజయాలను అందుకొని తెలంగాణకే వన్నె తీసుకురావాలని కోరుకుందాం. ఆ దిశగా శ్రీరాములు గౌడ్ అడుగులు వేస్తారని ఆశిద్దాం.


  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: